ఇంతకీ ఆ హత్యలు చేసింది స్టీఫెనా ? కాదా ? – స్టీఫెన్ మూవీ రివ్యూ

Spread the love

ఒకటికాదు రెండుకాదు వరుసగా తొమ్మిది హత్యలు జరిగాయి .. రేపు ఎవరి వంతు వస్తుందో అని జనం బిక్కు బిక్కుమంటూ భయాందోళనలతో ఉంటారు.. అసలు హంతకుడు ఎవరో తెలీదు.. హత్యలు ఎందుకు చేస్తున్నాడో తెలీదు .

డబ్బుల కోసమా ? ఇంకేదన్నా కారణం ఉందా ? అది కూడా తెలీదు .. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తారు ? హంతకుడి కోసం నలుమూలలా గాలిస్తారు.. అవసరమైతే ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించుతారు . హంతకుడి ఆచూకీ తెలియచేసినవారికి నగదు బహుమానం ప్రకటిస్తారు.

కానీ ఇవేమీ అవసరం లేకుండా హంతకుడే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోతే ఏమౌతుంది. షాకింగ్ న్యూస్ అవుతుంది . ఏదో క్షణికావేశంలో ఒక హత్య చేసిన నిందితుడు లొంగిపోవడం కొన్ని కేసుల్లో చూసే ఉంటాం . కానీ వరుస హత్యలు చేసేవాళ్ళని క్షణికావేశంలో చేసినట్టుగా పోలీసులు భావించలేరు .

పోలీస్ భాషలో చెప్పాలంటే అటువంటి వాళ్ళని సైకో కిల్లర్ గా భావిస్తారు.. మెంటల్ డిజార్డర్ కేసుల్లోనే సీరియల్ హత్యలు జరుగుతుంటాయి . అయితే ఇక్కడ హత్యలు తానే చేసానని ఎవరైనా వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినంతమాత్రాన కేసు క్లోజ్ అయినట్టు కాదు . నిందితుడికి శిక్ష వేయాలంటే న్యాయస్థానానికి తగిన ఆధారాలు కావాలి . అప్పుడు పోలీసులు ఆ హత్యలు అతడే చేసాడని న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది .

అలాంటి కేసుల్లో మళ్ళీ మొదటినుంచి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే
స్టీఫెన్ మూవీలో జరిగింది అదే .

ఇప్పుడు’ స్టీఫెన్ ‘కధేంటో తెలుసుకుందాం

స్టీఫెన్ (గోమతి శంకర్ ) అనే యువకుడు సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తొమ్మిది మంది అమ్మాయిలను హత్య చేస్తాడు . దీంతో జనం భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు .

పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారుతుంది.. ఎలాగైనా హంతకుడిని పట్టుకోవాలని గాలిస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఆ తొమ్మిది మంది అమ్మాయిలను తానే హత్య చేసానని చెప్తూ స్టీఫెన్ పోలీసుల ఎదుట లొంగిపోతాడు .

హత్యలు జరిగాయి
హంతకుడు లొంగిపోయాడు
ఇక కధేం ఉంటుంది అనుకుంటున్నారా ?

కాదు

అసలు కథ ఇక్కడే మొదలౌతుంది .

అదేదో సినిమాలో వేర్ ఈజ్ డెడ్ బాడీస్ అని అడిగినట్టు, హత్యలు చేసావు సరే మరి ఇంతకీ వేర్ ఈజ్ డెడ్ బాడీస్ అని ఇతడ్ని అడుగుతారు . . వాళ్ళని చంపేసి అడవిలో పడేసా అని చెప్తాడు . నిజమేనేమో అనుకుని పోలీసులు అడవిలో గాలిస్తే ఎండుపుల్లలు తప్ప డెడ్ బాడీలు దొరకవు .

అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది . వీడు నిజమే చెప్తున్నాడా ? లేకపోతే మెంటల్ కేసా ? అని.. దాంతో సీమ ( స్మృతి వెంకట్ ) అనే ఓ సైకాలజిస్టును పిలిపించి వీడు నిజాలే చెప్తున్నాడా ? అబద్దాలు చెప్తున్నాడా ? తేల్చమంటారు .

ఇంకోపక్క ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని మైఖేల్ ( మైఖేల్ తంగదురై ) అనే పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు . స్టీఫెన్ ను పరీక్ష చేసిన సైక్రియాట్రిస్టు సీమ అతడు అబద్దాలు చెప్తున్నట్టు గమనిస్తుంది . అతడి చిన్ననాడు జరిగిన సంఘటనల వల్ల అతడు సైకోగా మారాడని తెలుసుకుంటుంది .

ఇంకోపక్క స్టీఫెన్ గురించి దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి మైఖేల్ కు స్టీఫెన్ తల్లితండ్రుల గతం గురించి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి . అంతేకాదు గతంలో స్టీఫెన్ కొన్నాళ్ళు చెన్నైలో కృతిక అనే అమ్మాయితో కలిసి ఉన్నట్టు తెలుసుకుంటాడు .

కథ గురించి ఇంతకన్నా ఎక్కువ చెబితే సస్పెన్స్ వీడిపోతుంది . కాబట్టి ఇక్కడితో ఆపి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం .

ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి .

అసలు ఈ తొమ్మిది హత్యలు స్టీఫెనే చేశాడా ? చేస్తే డెడ్ బాడీలు ఎక్కడ దాచాడు ? తొమ్మిదిమందిని చంపినవాడు పదో అమ్మాయిని ఎందుకు చంపలేదు ? లేకపోతే స్టీఫెన్ కావాలనే ఈ హత్యలు తానే చేసానని నమ్మిస్తున్నాడా ? చెన్నైలో స్టీఫెన్ తో కలిసి ఉన్న కృతిక ఎవరు ?

స్టీఫెన్ ను పరీక్షలు చేసిన సైక్రియాట్రిస్టు అతడి మెంటల్ కండిషన్ గురించి ఏమని తేల్చింది ? అనేవి మిగిలిన కధనంలో తెలుస్తుంది .

ఎలా ఉంది ?

ముందే చెప్పినట్టు హత్యలు జరగడం , హంతకుడు లొంగిపోవడంతో కథ అయిపోలేదు
అసలు కథ అప్పుడే మొదలైంది . క్రైమ్ సినిమాల్లో ఒక్కో దర్శకుడిది ఒక్కో రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది . నిజానికి సీరియల్ హత్యల నేపథ్యంలో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి . సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీలకు ఉన్న డిమాండ్ అటువంటిది .

ఇటువంటి సినిమాలు తీయడంలో మళయాళ దర్శకులది కొట్టిన పిండి . ఇటీవలే కలంకావాల్ సినిమాలో సైకో పాత్రలో మమ్ముట్టి సీరియల్ హత్యలు చేయడం చూపించారు . కొన్ని సినిమాలు సైకో కిల్లర్ హత్యలు చేయడంతో మొదలై , పోలీసుల ఇన్వెస్టిగేషన్తో క్లైమాక్సులో హంతకుడ్ని రివీల్ చేయడం చూపిస్తారు .

ఎవరెలా తీసినా పాడిందే పాడరా అన్నట్టు కాకుండా డిఫరెంట్ యాంగిల్లో స్టోరీని ప్రెజెంట్ చేసినప్పుడే జనాలకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కుతాయి .

సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకులను మెల్లిమెల్లిగా కథలోకి తీసుకుపోతూ ,’ ఓహో క్లైమాక్స్ ఏంటో మాకు తెలిసిపోయిందిలే’ అనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా వారు ఊహించని ట్విస్ట్ ఇచ్చినప్పుడే మంచి గ్రిప్పింగ్ వచ్చినట్టు లెక్క .

అలాంటి సినిమాలకు మంచి మైలేజీ ఉంటుంది . ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఆ ఫార్ములా కంపల్సరీ

ఈ సినిమాకు కూడా క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది కానీ కేవలం అదొక్కటే స్టీఫెన్ ను నిలబెట్టలేవు కదా ?

సినిమా ప్రారంభం నుంచి ట్విస్టులతో ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచాలి . స్టీఫెన్ లో అది లోపించింది .

మొదట్లో మూవీ చూస్తుంటే ఇదేదో ఇప్పటివరకు మనం చూసిన తెలుగు , మళయాళ , హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల మాదిరే రొటీన్ సినిమానే కదా అనిపించింది . సీరియల్ హత్యలు అనేది కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు.. అదే సిలబస్ తో ఇప్పటికి కొన్ని వందల సినిమాలు వచ్చాయి .

క్లైమాక్స్ ట్విస్ట్ దొరికింది కదా అని సినిమా మొత్తాన్ని భరించే ఓపిక జనాలకు లేదు .. పోలీసుల ఇన్వెస్టుగేషన్లో కానీ , సైక్రియాట్రిస్టు పరీక్షల్లో కానీ ఇంకొంచెం డెప్త్ పెంచి మ్యాజిక్కులు చేయాల్సింది. నెక్స్ట్ ఏమి జరగబోతుంది ? అని ప్రేక్షకులు టెన్షన్ పడి గోళ్లు కొరుక్కునేలా సన్నివేశాలలో పట్టు ఉండాలి .

రీలు రీలుకీ చూస్తున్న ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరగాలి.. ఈ సినిమాలో అవి కొద్దిగా లోపించాయి …బట్ పర్లేదు .

పాత రోజుల్లో 35 మార్కులతో పాస్ అయినట్టు స్టీఫెన్ ను కూడా స్టాంప్ మార్కులతో పాస్ చేయించొచ్చు
అంతకంటే ఫస్ట్ క్లాసులు , గోల్డ్ మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు . ఓవరాల్ గా మూవీకి ఆఖర్లో ఇచ్చిన అడిషినల్ పేపర్ వల్లనే స్టీఫెన్ కు పాస్ మార్కులు వేయడమైనది .

ఎలా చేసారు ?

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఏ భాషలో ఉన్నా చూడటానికి ఇష్టపడేవాళ్లు కొంతమంది ఉంటారు . అటువంటివాళ్లలో నేనూ ఒకడ్ని .

ఇందులో హీరో ఎవరో ఇతర నటీనటులు ఎవరో ఈ సినిమా చూసేదాకా తెలీదు . అయితేనేమి ఈ స్టీఫెన్ పాత్ర పోషించిన గోమతి శంకర్ నటన బావుంది . సైకో పాత్రలో డిఫరెంట్ షేడ్స్ చూపించాల్సి ఉంటుంది . సన్నివేశాలకు తగ్గట్టుగా రకరకాల హావభావాలను ప్రదర్శించాల్సి ఉంటుంది . ఆ పని ఈ గోమతి శంకర్ బాగానే చేసాడు అనిపించింది .

మిగిలినవాళ్ల నటన పర్లేదు .

సాంకేతికత :

ఇలాంటి సినిమాలకు ముందుగా మనం బీజీఎమ్ గురించే కదా చెప్పుకోవాల్సింది
ఆ పరంగా పర్లేదు.. ఇంకాస్త ఇంప్రూవ్ చేసుంటే బాగుండేది .

ఇక క్రైమ్ సినిమాల్లో రెండో ప్రాధాన్యం ఫోటోగ్రఫీకి ఉంటుంది
అది కూడా పర్లేదు .

నిర్మాణ విలువలు కూడా యావరేజీనే
బహుశా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అయ్యుంటాయి .. అందుకే సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినట్టున్నారు .

విశ్లేషణ :

ఓటిటీల్లో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఏరికోరి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు . అందుకే భాషతో సంబంధం లేకుండా అవి మంచి రేటింగులను సాధిస్తున్నాయి . లేటెస్ట్ రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ లలో కూడా పదికి ఆరు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లోనే రిలీజ్ అవుతున్నాయి . స్టీఫెన్ మూవీ కూడా నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రావడంతో యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్ లో ఇది చూస్తే మీరు షాక్ అవుతారు . ఈ మూవీ చూస్తే మీరు గుండె చేతిలో పెట్టుకోవాల్సిందే అంటూ ఏవేవో చెప్తూ ఊదరగొట్టారు . అంతలేదు కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే పర్లేదు అనుకుంటారు . అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే తుపుక్ అంటారు . అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ జానర్లో సినిమాలని ఇష్టపడేవారికి మాత్రం పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు . పెంచిన రేట్లతో టికెట్లు కొనుక్కుని సినిమా చూసి వస్తూ వస్తూ అదనంగా తలనొప్పికి జండూ బామ్ కొనుక్కునేబదులు ఇంట్లోనే ఒకసారి చూస్తే పోయేదేమీ లేదు .

నటీనటులు : గోమతి శంకర్
దర్శకత్వం : మిధున్
విడుదల : డిసెంబర్ 5, 2025 ( నెట్ ఫ్లిక్స్ )
రేటింగ్ : 2.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!