తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?
తెలంగాణా ప్రభుత్వానికీ .. తెలుగు సినీ పరిశ్రమకు వైరంగా మొదలైన పరిణామాలు స్నేహంగా మారటం వెనుక ఎవరున్నారు ?
ఎవరి మధ్యవర్తిత్వంతో పరిస్థితులు సద్దుమణిగాయి ?
అసలు తెలుగు సినీ పరిశ్రమకూ .. తెలంగాణా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా రీలు మాదిరి కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలినాళ్లలో తెలంగాణా అభివృద్ధికి .. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణాను నిలపటానికీ అన్ని రంగాల ప్రముఖులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు
కానీ ముఖ్యమంత్రి పిలుపుకు ఇండస్ట్రీ పెద్దల నుంచి నామమాత్ర స్పందన మాత్రమే వచ్చింది
పైగా అప్పట్లో రిలీజ్ అయిన సినిమాల టికెట్ల రేట్లు పెంచుకోవటానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేసుకున్నారు
ఈ పరిణామాలు సహజంగా సీఎం కు ఆగ్రహం తెప్పించింది
తెలంగాణా అభివృద్ధిలోనూ .. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణాను తీర్చిదిద్దటంలో సినీ స్టార్లు క్యాంపైన్ చేయకపోగా టికెట్ల రేట్ల పెంపు కొరకు రాయబారాలు చేస్తారా ? అని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసారు
దెబ్బకు పరిశ్రమలో పెద్దలు దిగొచ్చి అప్పటికప్పుడు హడావుడిగా విజయ్ దేవరకొండ .. రాజమౌళి వంటి వారితో డ్రగ్స్ కు .. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో యాడ్లు చేసి చేతులు దులుపుకున్నారు
అంతేకానీ సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలవలేదు
దానితో సీఎం మొదటిదెబ్బ హైడ్రా రూపంలో అక్కినేని నాగార్జున మీద పడింది
చెరువు స్థలం కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమ నిర్మాణం కింద తేల్చి నాగార్జునకు న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లే వీలు .. అవకాశం ఇవ్వకుండా హైడ్రా అధికారులు తక్షణం కూలగొట్టేసారు
నిజానికి సెలెబ్రిటీ హోదా ఉన్న నాగార్జున తల్చుకుంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ను ఆపటం పెద్ద కష్టం కాదు
కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ముఖ్యమంత్రికి తెలిసే జరిగింది కాబట్టి దానిని ఆపే సాహసం ఎవరూ చేయలేదు
గతంలో అన్నపూర్ణా స్టూడియో వివాదంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎవరి మాటనూ లక్ష్య పెట్టకుండా అక్కినేనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు
చివరికి కొందరి పెద్దల మధ్యవర్తిత్వంతో రాజీ అయ్యింది
ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగార్జున కూడా ఏమీ చేయలేకపోయారు
సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు గాయాల పాలై అపస్మారక స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు
ఈ వివాదంలో పోలీసులు ముందుగా థియేటర్ మేనేజర్ ను .. యాజమాన్యాన్ని అరెస్ట్ చేసింది
అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ వచ్చినప్పటికీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు
తెలుగు సినీ పరిశ్రమను శాసించే కెపాసిటీ ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అర్జున్ తండ్రి కావడం ఒక కారణం కాగా పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కు ఉన్న ఇమేజ్ .. చిరంజీవి .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం మూలాన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయట్లేదని చాలామంది భావించారు
కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు
ఇది అల్లు కాంపౌండ్ ఊహించని మెగా షాక్
అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ నేరుగా స్పందిస్తూ ‘ అరెస్ట్ చేయకపోవడానికి ఆయనేమన్నా దేశం కోసం పనిచేసిన సైనికుడా ? సినిమా స్టార్ ? అంతేగా ?’ అంటూ అల్లు అర్జున్ అరెస్టు ను సమర్దించి నేరుగా యుద్ధం ప్రకటించారు
ఈ పరిణామాలు అల్లు అరవింద్ కు మింగుడు పడలేదు
తనకున్న పలుకుబడి .. హోదా ఏవీ అల్లు అర్జున్ అరెస్టు ను ఆపలేకపోయాయని తెలుసుకున్నాడు
హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుని అదే రోజు బెయిల్ మీద అల్లు అర్జున్ బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు
కానీ కథ ఇంతటితో అయిపోలేదు
సీఎం కు కోపం వస్తే సినిమా ఎలా ఉంటుందో ఓపెన్ ఎయిర్ థియేటర్లో చూసారు
పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి
ఈ పరిస్థితుల్లో దిల్ రాజు రంగ ప్రవేశం చేసారు
సినీ పరిశ్రమకు చెందిన హీరోలు , నిర్మాతలు , దర్శకులు , ఇతర పెద్దలను పిలిచి సీఎం రేవంత్ తో మీటింగ్ ఏర్పాటు చేసాడు
ఈ మీటింగ్ కు బాధితులు అక్కినేని నాగార్జున .. అల్లు అరవింద్ లు కూడా హాజరు అయ్యారు
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి సీఎం కు చెప్పుకుని తెలంగాణా అభివృద్ధికి పరిశ్రమ తరపున అండగా నిలబడతామని హామీ ఇచ్చారు
సీఎం రేవంత్ రెడ్డి ఆశించిన సమాధానం రావడంతో చర్చలు విజయవంతంగా ముగిసాయి
దరిమిలా దిల్ రాజు తెలంగాణా ఫిలిం డెవెలప్మెంట్ ఛైర్మన్ కావడం .. పదేళ్ళబట్టి పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ను గద్దర్ అవార్డ్స్ పేరుతొ ప్రకటించడం .. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో సీఎం చేతుల మీదుగా అల్లు అర్జున్ కు కూడా అవార్డు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి
రెండ్రోజుల క్రితం హైద్రాబాదులో విజయ దేవర కొండ .. రామ్ చరణ్ వంటి స్టార్లతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైన్ నిర్వహించారు సీఎం రేవంత్
తాజాగా ఎన్ కన్వెన్షన్ స్థలంలో రెండెకరాలు ప్రభుత్వానికి ఇస్తూ అక్కినేని నాగార్జున చేసిన ప్రకటనకు సీఎం రేవంత్ స్పందిస్తూ ‘ నాగార్జున రియల్ హీరో ‘ అని మెచ్చుకున్నారు
ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే సీఎం రేవంత్ తెలుగు సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని అర్ధం అవట్లేదూ ?
అదీ సంగతి
పరేష్ తుర్లపాటి
Ikkada Revanth Reddy akkada Jagan Mohan Reddy cine parishrama vaallani thama cheppu chethalloki thechukunnaru. Inka Chandrababu purthi drushti cinema vaalla meeda pettaledu. Karanam Pavan Kalyan, Balakrishna, Nara Rohith and NTR kavochu.