Home » తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

Spread the love

చిత్ర పరిశ్రమకు ,ప్రభుత్వాలకు మధ్య బయటికి కనపడని సంబంధాలు కొన్ని ఉంటాయి . ఉభయుల అవసరాల దృష్ట్యా సత్సంబంధాల కోసమే ఇరువురు ప్రయత్నిస్తూ ఉంటారు . ఎందుకంటే ప్రభుత్వాలకు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ముడిపడి ఉంటుంది . చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది . తద్వారా ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయి . చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలకు ప్రభుత్వాలు ఉదారంగా నామమాత్రం ధరలకు భూములు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఇదే .

మరోపక్క చిత్ర పరిశ్రమకు కూడా ప్రభుత్వాలతో అంతే అవసరం ఉంటుంది . చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైద్రాబాదుకు షిఫ్ట్ అయిన తర్వాత ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ గణనీయంగా పెట్టుబడులు పెట్టి స్టూడియోల స్థాపన చేసారు . ఇటీవల కాలంలో రామోజీ ఫిలిం సిటీ కూడా ఆ జాబితాలో చేరింది . అయితే సాంకేతికత పెరిగి పైరసీ మహమ్మారి విజృంభించడంతో సినీ పరిశ్రమ కూడా ఇబ్బందుల్లో పడింది . ఈ పైరసీ బెడదను అరికట్టడానికి వారికి ప్రభుత్వ సహకారం తప్పనిసరి . అందులోనూ ఓటిటీలు వచ్చిన తర్వాత గతంలో మాదిరి సినిమాలు థియేటర్లలో వంద రోజులు ఆడే పరిస్థితి లేకుండా పోయింది . అందుకే భారీ చిత్ర నిర్మాతలు మొదటి వారం కలెక్షన్ల మీద ఆధారపడి తమ పెట్టుబడులకు లాభాలు వస్తే చాలనుకుని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు . అందులో భాగమే బెనిఫిట్ షోలకు అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవడానికి ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకోవడం .

ప్రస్తుతం ఈ విధానం భారీ చిత్ర నిర్మాతలకు వరం అయి కూర్చుంది . మొదటి వారం అధిక ధరలకు టికెట్లు అమ్ముకున్న సొమ్ముతో లాభాలతో బయటపడుతున్నారు . ప్రభుత్వాలకు కూడా అదనపు సెస్ ద్వారా అదనపు ఆదాయాలు సమకూరుతూ ఉన్నాయి . కానీ మొత్తంగా చూస్తే ప్రభుత్వాలకంటే సినీ పరిశ్రమకే ప్రభుత్వంతో ఎక్కువ అవసరం ఉంటుంది . అందుకే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాల మాట వినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమ తమ చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటుంది. రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా కోరుకుంటుంది . అలాకాకుండా తమను తాము సుప్రీం అనుకుని చిత్ర పరిశ్రమ భావించుకుంటే లేనిపోని కష్టాలు తప్పవు .

బిఆర్ఎస్ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన కొన్ని ప్రోటోకాల్ పరిణామాలు ఇరువుల మధ్య దూరం పెంచింది . సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ముఖ్యమంత్రిని , సినిమాటోగ్రఫీ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం ఆనవాయితీగా వస్తుంది .కానీ రేవంత్ విషయంలో ఈ ఆనవాయితీ ఆలస్యం అయ్యింది .

పైపెచ్చు తెలంగాణా అభివృద్ధికి , డ్రగ్స్ ఫ్రీ స్టేట్ లక్ష్యంగా తెలంగాణాలో యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ నిర్వహించాలని చిత్ర పరిశ్రమకు ఆయన విజ్ఞాపన చేసినా వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు . ఈ పరిణామాలు సహజంగా రాష్ట్ర అధినేతకు ఆగ్రహం తెప్పించాయి .
దాంతో చిత్ర పరిశ్రమ పెద్దల మీద రేవంత్ తనదైన మార్క్ చూపించాడు . డ్రగ్స్ ఫ్రీ క్యాంపైన్ చేయమంటే చేయకపోగా టికెట్ రేట్ల పెంపుదలకు మాత్రం ఎగేసుకుంటూ వస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేసారు . దరిమిలా ఇకపై ఏ సినిమాకీ టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రకటన కూడా చేసేసారు .

అప్పటికి గానీ తాము చేసిన పొరపాటు ఏంటో సినీ పెద్దలకు అర్ధం కాలేదు . వెంటనే తమ తప్పును సరిదిద్దుకోవడానికి రంగంలోకి దిగారు .

దెబ్బకు పరిశ్రమలో పెద్దలు దిగొచ్చి అప్పటికప్పుడు హడావుడిగా విజయ్ దేవరకొండ .. రాజమౌళి వంటి వారితో డ్రగ్స్ కు .. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో యాడ్లు చేసి చేతులు దులుపుకున్నారు . అంతేకానీ సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలవలేదు.

పరిశ్రమ పెద్దలు చేసిన ఈ మొక్కుబడి తంతు కూడా సీఎం ను మెప్పించలేకపోయాయి. దానితో సీఎం మొదటిదెబ్బ హైడ్రా రూపంలో అక్కినేని నాగార్జున మీద పడింది. పాత ఫైలు దుమ్ముదులుపుకుని టేబుల్ మీదకు వచ్చింది . అప్పటికప్పుడు అధికారులు రంగంలోకి దిగారు .

ఎప్పుడో చెరువు స్థలం కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమ నిర్మాణం కింద తేల్చి నాగార్జునకు న్యాయపరమైన చర్యలకు కూడా వెళ్లే వీలు .. అవకాశం ఇవ్వకుండా హైడ్రా అధికారులు తక్షణం కూలగొట్టేసారు .నిజానికి సెలెబ్రిటీ హోదా ఉన్న నాగార్జున తల్చుకుంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ను ఆపటం పెద్ద కష్టం కాదు . కానీ ఆయన ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా ఈ కూల్చివేతను ఆపలేకపోయారు .

అదీకాకుండా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ముఖ్యమంత్రికి తెలిసే జరిగింది కాబట్టి దానిని ఆపే సాహసం ఎవరూ చేయలేదు .

గతంలో అన్నపూర్ణా స్టూడియో వివాదంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎవరి మాటనూ లక్ష్య పెట్టకుండా అక్కినేనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు .చివరికి కొందరి పెద్దల మధ్యవర్తిత్వంతో రాజీ అయ్యింది . కానీ ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగార్జున కూడా ఏమీ చేయలేకపోయారు .

సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు గాయాల పాలై అపస్మారక స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు . ఈ వివాదంలో పోలీసులు ముందుగా థియేటర్ మేనేజర్ ను .. యాజమాన్యాన్ని అరెస్ట్ చేసింది . అప్పటికి అల్లు అర్జున్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ వచ్చినప్పటికీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేదు .

తెలుగు సినీ పరిశ్రమను శాసించే కెపాసిటీ ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అర్జున్ తండ్రి కావడం ఒక కారణం కాగా , పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కు ఉన్న ఇమేజ్ .. చిరంజీవి .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం మూలాన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయట్లేదని చాలామంది భావించారు . కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు . ఈ అరెస్ట్ ఎవరూ ఊహించనిది . మరీ ముఖ్యంగా ఇది అల్లు కాంపౌండ్ ఊహించని మెగా షాక్ .

ఈ విషయంలో సీఎం రేవంత్ నేరుగా స్పందిస్తూ ‘ అరెస్ట్ చేయకపోవడానికి ఆయనేమన్నా దేశం కోసం పనిచేసిన సైనికుడా ? సినిమా స్టార్ ? అంతేగా ?’ అంటూ అల్లు అర్జున్ అరెస్టు ను సమర్దించి నేరుగా యుద్ధం ప్రకటించారు . నిజంగా రేవంత్ చాలా గట్స్ తో తీసుకున్న నిర్ణయం ఇది . సినీ పరిశ్రమలో పెద్దతలకాయ అయిన తండ్రి అల్లు అరవింద్ పలుకుబడి , అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ , అర్జున్ కి చిరంజీవి , పవన్ కళ్యాణ్ లతో ఉన్న బంధుత్వం .. ఇవేమీ అతడి అరెస్టును ఆపలేకపోయాయి . ఈ ఒక్క సంఘటనతోనే తనతో ఎట్లుంటదో సినీ పరిశ్రమకు తేల్చి చెప్పేసాడు సీఎం రేవంత్ .

ఈ పరిణామాలు అల్లు అరవింద్ కు మింగుడు పడలేదు. తనకున్న పలుకుబడి .. హోదా ఏవీ అల్లు అర్జున్ అరెస్టు ను ఆపలేకపోయాయని తెలుసుకున్నాడు . చివరికి హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుని అదే రోజు బెయిల్ మీద అల్లు అర్జున్ బయటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు . కానీ కథ ఇంతటితో అయిపోలేదు

సీఎం కు కోపం వస్తే సినిమా ఎలా ఉంటుందో ఓపెన్ ఎయిర్ థియేటర్లో చూసారు. పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో దిల్ రాజు రంగ ప్రవేశం చేసారు

సినీ పరిశ్రమకు చెందిన హీరోలు , నిర్మాతలు , దర్శకులు , ఇతర పెద్దలను పిలిచి సీఎం రేవంత్ తో మీటింగ్ ఏర్పాటు చేసాడు. ఈ మీటింగ్ కు బాధితులు అక్కినేని నాగార్జున .. అల్లు అరవింద్ లు కూడా హాజరు అయ్యారు .

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి సీఎం కు చెప్పుకుని బేషరతుగా తెలంగాణా అభివృద్ధికి పరిశ్రమ తరపున అండగా నిలబడతామని హామీ ఇచ్చారు . సీఎం రేవంత్ రెడ్డి ఆశించిన సమాధానం వారినుంచి రావడంతో చర్చలు విజయవంతంగా ముగిసాయి .

దరిమిలా దిల్ రాజు తెలంగాణా ఫిలిం డెవెలప్మెంట్ ఛైర్మన్ కావడం .. పదేళ్ళబట్టి పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను గద్దర్ అవార్డ్స్ పేరుతొ ప్రకటించడం .. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో సీఎం చేతుల మీదుగా అల్లు అర్జున్ కు కూడా అవార్డు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి .

రెండ్రోజుల క్రితం హైద్రాబాదులో విజయ దేవర కొండ .. రామ్ చరణ్ వంటి స్టార్లతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైన్ నిర్వహించారు సీఎం రేవంత్ . తాజాగా ఎన్ కన్వెన్షన్ స్థలంలో రెండెకరాలు ప్రభుత్వానికి ఇస్తూ అక్కినేని నాగార్జున చేసిన ప్రకటనకు సీఎం రేవంత్ స్పందిస్తూ ‘ నాగార్జున రియల్ హీరో ‘ అని మెచ్చుకున్నారు .

ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే సీఎం రేవంత్ తెలుగు సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని అర్ధం అవట్లేదూ ?

అదీ సంగతి


Spread the love

One thought on “తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

  1. Ikkada Revanth Reddy akkada Jagan Mohan Reddy cine parishrama vaallani thama cheppu chethalloki thechukunnaru. Inka Chandrababu purthi drushti cinema vaalla meeda pettaledu. Karanam Pavan Kalyan, Balakrishna, Nara Rohith and NTR kavochu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!