Home » స్టీరింగ్ కంట్రోల్ తప్పిన డ్రైవ్ – ఆది పినిశెట్టి డ్రైవ్ మూవీ రివ్యూ

స్టీరింగ్ కంట్రోల్ తప్పిన డ్రైవ్ – ఆది పినిశెట్టి డ్రైవ్ మూవీ రివ్యూ

Spread the love

అమెజాన్ ప్రైమ్ లో ఆది పినిశెట్టి నటించిన డ్రైవ్ మూవీ స్ట్రీమింగులోకి వచ్చిందని తెలిసి ఓ లుక్కేసా

ఇలా లుక్కేయడానికి ఒక కారణం ఉంది
ఆ కారణం కూడా ఆది పినిశెట్టియే

ఎందుకంటే అతడిలో ఓ మాంచి నటుడు ఉన్నాడు

హీరోయిజంలో మెప్పించగలడు
అవసరమైతే విలనిజంలో భయపెట్టగలడు
ఈ రెండూ కాక క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆల్ రౌండ్ ప్రతిభ చూపించగలడు

ఒకే వ్యక్తి అన్ని షేడ్స్ లోనూ సెట్ అయితే పర్ఫెక్ట్ నటుడు అనిపించుకోగలడు
ఆది పినిశెట్టిలో ఆ లక్షణాలు ఉన్నాయి

ఇతడి గత సినిమాలు చూస్తే ఆ విషయం మనకు అర్ధమౌతుంది

ఆ ధైర్యంతో మూవీ మీద లుక్కేసా
కానీ మూవీ చూసాక నాకో కొత్త విషయం అర్థమైంది

ఏ మూవీకి అయినా పర్ఫెక్ట్ నటుడు ఎంత అవసరమో , ఆ నటుడి నుంచి పర్ఫెక్ట్ నటన రాబట్టుకునే దర్శకుడు కూడా అంతే అవసరం

డ్రైవ్ లో జరిగిన పొరపాటు అదే

సాధారణంగా ఎవరైనా సరే ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే డెస్టినేషన్ నిర్దేశించుకునే బయలుదేరుతారు

కానీ అదేదో సినిమాలో జేసుదాసు పాడినట్టు తీరమెక్కడో , గమ్యమేమిటో తెలియదు పాపం అన్నట్టు ప్రయాణం ఉంటే పాపం అని జాలిపడటం మినహా మరేమీ చేయలేము

డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి స్టీరింగ్ ఇష్టమొచ్చినట్టు తిప్పుతానంటే ఆక్సిడెంట్లు అవుతాయి మినహా ప్రయోజనం లేదు

సస్పెన్స్ థ్రిల్లర్ కథలు రాసుకునేటప్పుడు ప్రేక్షకుల్ని ఎంతవరకు సస్పెన్సులో ఉంచగలం అనేది కాటాలో వేసుకుని కొల్చుకున్న తర్వాతనే తెరకెక్కించాలి

ఎలాగైనా సరే ప్రేక్షకుడ్ని థ్రిల్ చేయాలని అర్ధం కాని ప్రయోగాలు చేస్తే థ్రిల్ సంగతేమో కానీ వాళ్ళ సహనం మాత్రం కిల్ అవుతుంది

ఆది పినిశెట్టి వంటి మంచి నటుడ్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి దర్శకులవారు స్టీరింగ్ కంట్రోల్ చేయడంలో విఫలమైన మూవీ పేరే డ్రైవ్

ఇప్పుడు ఈ డ్రైవ్ కధేంటో చూద్దాం

సంజీవరెడ్డి అనే ఆయన పెద్ద బిజినెస్ మాగ్నెట్

ప్రజా మీడియా కార్పొరేషన్ పేరుతో వ్యాపారాలు చేసి కోట్ల కొద్దీ ఆస్తులు సంపాదిస్తాడు

ఆయన కొడుకే ఈ సినిమాలో కథానాయకుడు
సంజీవరెడ్డి ఆస్తులకు వారసుడు జయదేవ్ రెడ్డి ( ఆది పినిశెట్టి )

తండ్రి వారసత్వంగా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత జయదేవ్ రెడ్డి మీద పడుతుంది

కానీ ఈ జయదేవ్ రెడ్డి ఆలోచన వేరు

తండ్రి సంపాదించిన ఆస్తులను అమ్మేసి భార్యా పిల్లలతో సుబ్బరంగా ఇంగ్లాండ్ లో సెటిల్ అయి విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకుంటాడు

అయితే ఆ ప్రకారం ఆస్తులు అమ్మేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోతే ఇంక కథేముంటుంది ?

అందుకే ఆ వెళ్ళేదేదో గుట్టుచప్పుడు కాకుండా వెళదాం అనుకుంటాడు

ఫలానా ఆయన కొడుకు ఆస్తులు అమ్మేసుకుని విదేశాలకు పోతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు గంగలో కలుస్తుందని భావిస్తాడు

అంతేకాదు వ్యాపార లొసుగులు పదిమందికీ తెలిసి రచ్చ అవుతుందని అనుకుంటాడు

అందుచేత గుట్టుచప్పుడు కాకుండా మూడో కంటివాడికి తెలీకుండా లండన్ వెళ్లిపోవాలని ఏర్పాట్లు చేసుకుంటాడు

అయితే మూడోకంటివాడికి తెలియకూడదని జయదేవ్ రెడ్డి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇతడు చెక్కేస్తున్న సంగతి బయటికి వచ్చేసింది

ఈ క్రమంలో తన మీద ఎవరో నిఘా పెట్టినట్టు గమనిస్తాడు

అంతేకాదు తన సిస్టం హ్యాక్ అయినట్టు గుర్తిస్తాడు

బహుశా అతడి గుట్టు అంతా పెన్ డ్రైవ్ లో ఉండి ఉంటుంది

ఇంతకీ జయదేవ్ రెడ్డి మీద నిఘా పెట్టింది ఎవరు ?

అతడి సిస్టం నిజంగా హ్యాక్ అయ్యిందా ?

జయదేవ్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఎవరన్నా హ్యాకర్ ప్రయత్నం చేస్తున్నాడా ?

అయితే ఆ పని ఎవరు చేస్తున్నారు ?
అనేవి మిగిలిన కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

ముందే చెప్పాను కదా మూవీ పేరు డ్రైవ్ అని

ఎంతసేపూ ఆ డ్రైవ్ కనిపిస్తుంది కానీ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ? ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు ? ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నారు అనేది కొంత అయోమయంగా అనిపిస్తుంది

అసలు డ్రైవ్ వేరే అని తర్వాత కొద్దిగా అర్ధమౌతుంది కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అయ్యింది

డ్రైవ్ లో స్టీరింగ్ అదుపుతప్పడంతో దర్శకుడు చెప్పాలనుకున్నది ఒకటి అయితే ప్రేక్షకులకు అర్థమైంది మరొకటి అయ్యింది

ప్రేక్షకుల్ని సస్పెన్సులో ముంచేయ్యాలనే తొందరలో సినిమాని ముంచేశారు

జయదేవ్ రెడ్డి ఇంగ్లాండ్ ప్రయాణానికి బలమైన కారణం కనిపించదు
పైగా ఆ జయదేవ్ రెడ్డిని ఎవరో హ్యాకర్ ఎందుకు తగులుకున్నాడో తెలీదు

ఈయనెందుకు భయపడుతున్నాడు ?
ఎవరికి భయపడుతున్నాడు ?
క్లారిటీ లేదు

విలన్ హీరోని బెదిరించడం , భయపెట్టడం కొత్త కాన్సెప్ట్
అన్ని సినిమాల్లో హీరో విలన్ని భయపెడతాడు

ఇందులో విలనే హీరోని చీటికిమాటికి బెదిరిస్తున్నాడు కాబట్టి ఇదేదో వెరైటీగా ఉంది అనుకుందాం

అలాంటప్పుడు సహజంగా మనకేమనిపిస్తుంది ?

ఓహో మూవీలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అనుకుంటూ కళ్ళు చింతకాయల్లా చేసుకుని చూస్తాం

ఈ సందర్భంగా ఓ సామెతని గుర్తు చేసుకోవాలి

ఓ ఏనుగు హడావుడిగా ఊరవతల కొండపక్కకు వెళ్లిందని గమనించి అది ఏం చేస్తుందో అని ఊరి జనం ఊపిరి బిగపట్టుకుని చూస్తున్నారట

అది కాస్తా తుస్సుమని తనదోవన తాను వెళ్లిపోయిందట

డ్రైవ్ లో హీరోకి , హ్యాకర్ కి మధ్య జరిగిన గొడవ వెనుక అసలు ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రేక్షకుల పరిస్థితి కూడా అలా తయారయ్యింది

ఇంత వీక్ పాయింటు గురించా ఇంతసేపు ఎదురు చూసింది అంటూ నీరసాలు వచ్చేస్తాయి

అరె ఈ సన్నివేశంలో ఏమీ లేకపోయినా నెక్స్ట్ సీన్ లో మాత్రం ఏదో కొత్త విషయం చెప్తారని ఆశతో ఎదురుచూసిన ప్రేక్షకుల పెనం మీద నీళ్లు చల్లేశారు

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల్లో ట్విస్టులు ఖచ్చితంగా ఉండాలి

ఆ ట్విస్టులు కూడా ఎలా ఉండాలి ?
ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉండాలి ?

వావ్ అనుకుని ఆశ్చర్యంగా కళ్ళు ఇంత చేసుకోవాలి
అంతేకాని కళ్ళలో నలక పడినట్టు ఎరుపెక్కించకూడదు

బలహీనమైన కథకు మరింత బలహీనమైన స్క్రీన్ ప్లే తోడయితే ప్రేక్షకుల విటమిన్స్ కూడా బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి

డ్రైవ్ లో జరిగిన పొరపాటు అదే

పైగా దీనికి కొనసాగింపుగా రెండో డ్రైవ్ కూడా ఉందని తెలుస్తుంది
ఆ రెండో డ్రైవ్ లో సత్యదేవ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి

ఎవరెలా చేసారు ?

ఎవరెవరు ఎలా చేసారు అంటే ఆది పినిశెట్టి ఒక్కడి గురించే చెప్పాల్సి ఉంటుంది
డ్రైవ్ కోసం ఆది పినిశెట్టి కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు

నిజానికి అతడి నటనలో మార్కులే కానీ రిమార్కులు పెట్టేంత విషయమేమీ లేదు
ఏవన్నా వంకలు పెడితే దర్శకుడి వైఫల్యం మీదే పెట్టొచ్చు

ఫోటోగ్రఫీ పర్లేదు
బీజీఎమ్ , నిర్మాణ విలువలు యావరేజ్

విశ్లేషణ :

నాలాగే చాలామంది ఆది పినిశెట్టి మీద నమ్మకంతో డ్రైవ్ కు వెళ్తారేమో ? ఓటిటిలోకి వచ్చింది కాబట్టి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రీగా ఉన్న టైములో చూడండి.నచ్చితే నచ్చొచ్చు ..నచ్చకపోయినా నచ్చకపోవచ్చు ..ఓవరాల్ గా రెండో దానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి

నటీనటులు : ఆది పినిశెట్టి , మడోన్నా సెబాస్టియన్
దర్శకుడు : మహమ్మద్
విడుదల : 2-01-2026 ( అమెజాన్ ప్రైమ్ )
రేటింగ్ : 1.75 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!