మనీ సినిమాలో పచ్చనోటు ప్రాముఖ్యత గురించి పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రెండు లైన్లలో చక్రవర్తికీ .. వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ అని అద్భుతంగా రాసారు
రాన్రానూ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న తరుణంలో పచ్చనోటు ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తుందో ఆ పాటలో ఆయన వివరించారు
అదేవిధంగా మానవ జీవితాలు మనీ తో ఎలా ముడిపడి ఉన్నాయో , దానివల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడుతాయి అనే అంశాలను గాంధీ టాక్స్ మూవీ ద్వారా దర్శకుడు రెండు విభిన్న కోణాల్లో టచ్ చేసారు
విచిత్రం ఏంటంటే ఈ మూవీలో తరాలకు సరిపడా తరగని సంపద ఉన్న వ్యక్తీ , మొబైల్ ఫోను రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బుల్లేని వ్యక్తీ , ఇద్దరూ అదే డబ్బులకోసం ఇబ్బందులు పడతారు
ఎవరి ఇబ్బందులు వారివి
సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఒకరు , పొట్టకూటి కోసం మరొకరు కష్టాలు పడుతూనే ఉంటారు
దూరపు కొండలు నునుపు అన్నట్టుగా దూరం నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది
కానీ ఈ మనీ అనేది ఉన్నోడికీ , లేనోడికీ బంధువవుతానని అంటుంది
అన్నట్టు గాంధీ గారి బొమ్మ లేకుండా మనదగ్గర పచ్చనోటే లేదు
ఈ సినిమాలో మాటలు లేకపోయినా గాంధీ గారి బొమ్మ ఉన్న పచ్చనోటే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అనే కోణంలో మూవీకి గాంధీ టాక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టున్నారు
చలనచిత్ర రంగం మూకీ సినిమాలతో మొదలై టాకీ సినిమాలుగా రూపాంతరం చెందిన తర్వాత అదే ఒరవడిలో అన్ని సినిమాలు కొనసాగాయి
కానీ మధ్యలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాత్రమే రిస్క్ తీసుకుని కమలహాసన్ హీరోగా పుష్పక విమానం అనే మూకీ సినిమా తీసి హిట్ కొట్టాడు
పుష్పక విమానం మూవీలో కూడా మాటలు ఉండవు
ఇలాంటి ప్రయోగం చేయాలంటే చాలా ధైర్యం , సినిమా మీద నమ్మకం ఉండాలి
ఇన్నేళ్లకు మళ్ళీ అదే ప్రయోగం తమిళ దర్శకుడు కిషోర్ పాండురంగ చేసారు
విజయ్ సేతుపతి ,అరవింద్ స్వామి లు ప్రధాన పాత్రల్లో గాంధీటాక్స్ మూవీ తీశారు
షుమారు రెండుగంటల నిడివి ఉన్న ఈ మూవీలో ఒక్కటంటే ఒక్క మాట కూడా ఉండదు
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో మాటలను పలికించాడు
గాంధీటాక్స్ కధేంటి ?
కథ మొత్తం ఉన్నోడికీ ,లేనోడికీ పచ్చనోటు ఎటువంటి పరిస్థితులను సృష్టించింది అన్న ప్రధాన అంశంగా సాగుతుంది
ముంబైలోని స్లమ్ ఏరియాలో మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి ) అనే నిరుపేద నిరుద్యోగి ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటాడు
అనారోగ్యంతో ఉన్న తల్లి ఆలనాపాలనా చూసే బాధ్యత కూడా ఇతడి మీదే పడుతుంది
విష్ణు ఉంటున్న ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అదితీ హైదర్ రావుతో ప్రేమలో ఉంటాడు
ఇలాంటి పరిస్థితుల్లో అదితీ కి ఉద్యోగం చేసుకుంటున్న సంబంధం వస్తుంది
దానితో ఉద్యోగం లేకపోవడం వల్లనే అదితీ తనకు దూరం అవుతుందన్న సంగతి గ్రహించి మున్సిపాలిటీలో ఉద్యోగం చేయడానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు
అక్కడ అధికారి 50 వేలు లంచం అడగటంతో అవాక్కు అయి ఎలాగైనా సరే ఆ డబ్బులు సంపాదించి ఉద్యోగం పొందాలని తప్పుడు మార్గం ఎంచుకుంటాడు
ఇతడి కథ ఇలా ఉండగా ,
ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఓనర్ మోహన బోస్ మ్యాన్ అనుకోకుండా అకస్మాత్తుగా నష్టాల్లో కూరుకుపోతాడు
ఇతడి బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులు తమ సొమ్ములకోసం కోర్టుకు ఎక్కడంతో బోస్ మ్యాన్ బజారున పడే పరిస్థితి వస్తుంది
అప్పటికే బోస్ మ్యాన్ భార్యా ,కూతురు విమాన ప్రమాదంలో మరణించడం ,తల్లి గుండెపోటుతో మరణించడంతో అతడు వంటరివాడు అవుతాడు
అతడు ఉంటున్న ఖరీదైన బంగ్లా కూడా వేలానికి రావడంతో బోస్ మ్యాన్ కూడా వీటినుంచి బయటపడటానికి తప్పుడు మార్గం ఎంచుకుంటాడు
మనీ కోసం తప్పుడు దారిలో వెళ్లాలన్న వీరి నిర్ణయం పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపించింది ?
ఈ ప్రయత్నంలో విష్ణు అనుకున్నది సాధిస్తాడా ?
ఆర్థిక నష్టాల నుంచి బోస్ మ్యాన్ బయటపడతాడా ? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
ఇందులో సంభాషణలు లేవన్న మాటే కానీ కళ్ళతోనే భావాలు పలికించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి
మౌనంగా హృదయాలను తడిమే సన్నివేశాలు మరిన్ని ఉన్నాయి
రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం విష్ణుది
ఎదురింటి అమ్మాయి అదితీని ప్రేమించడం అయితే ప్రేమించాడు కానీ ఫోనులో మాట్లాడటానికి కూడా బాలన్స్ ఉండదు
పోనీలే అతడు రీఛార్జ్ చేసుకోలేదేమో అనుకుని ప్రియురాలు అతడికి ఫోన్ చేస్తే ఇన్ కమింగ్ సదుపాయం కూడా తొలగించినట్టు తెలుస్తుంది
అయినా ఆ అమ్మాయి అతడిని లోకువగా చూడదు
మంచి ఉద్యోగం సంపాదించుకో అని ఎంకరేజ్ చేస్తుంది
ఇద్దరి మధ్య నడిచే ఈ సన్నివేశాలు బాగుంటాయి
అంతేకాదు ఈ విష్ణుకి తల్లి అంటే కూడా తరగని ప్రేమ
అనారోగ్యంతో ఉన్న తల్లి నోటికి ఆహారం అందించి సేవలు చేస్తూ ఉంటాడు
ఓరోజు తల్లికి ఆహారం రాకపోవడంతో బాక్స్ పట్టుకుని కిందికి వచ్చి చుట్టుపక్కల చూస్తాడు
రోడ్డు మీద ఎవరో పడేసిన ఆహారాన్ని ఓ కుక్క తింటుండటం చూస్తాడు
మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో పక్క వాటాలో అద్దెకు ఉంటున్న ఓ ముసలాయన ప్లేటులో ఆహారాన్ని దొంగిలించి తల్లికి పెట్టిన సన్నివేశం చూసినప్పుడు మనసు కలుక్కుమంటుంది
అలాగే తల్లి పక్కన అతడు చిన్నపిల్లాడిలా పడుకునే సన్నివేశం మదిని టచ్ చేస్తుంది
తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని బోస్ మ్యాన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జిలో దొరికిన ఆహారం సంతృప్తిగా కడుపునిండా తింటుంటే తల్లి అతడి ఎదురుగా కూర్చుని సంతోషంగా తిను నాయనా అంటూ సైగలు చేయడం , అతడి ఇంట్లో నోట్లకట్టలు ఉన్నప్పటికీ కేవలం తనకు కావాల్సిన డబ్బులు ,చిల్లర నాణేల్ని తీసుకోవడం విష్ణు నిజాయితీని ప్రతిబింబించే విధంగా ఉన్న సన్నివేశాలు బాగున్నాయి
మూవీలో అరవింద్ స్వామి , విజయ్ సేతుపతి పాత్రలు సమాంతరంగా ప్రయాణించినా ముఖంలో భావాలు పలికించడంలో విజయ్ సేతుపతి పూర్తి న్యాయం చేసాడు
ఈ మూవీలో అంతోఇంతో సాగతీత అనిపించేది క్లైమాక్స్ మాత్రమే
ఒకపక్కన జేబుదొంగ , మరొపక్కన విజయ్ సేతుపతి ఆ ఇంట్లో దొంగతనానికి దూరిన సన్నివేశాలు మరీ ఎక్కువసేపు చూపించినట్టు అనిపిస్తుంది
విజయ్ ,అరవింద్ రెండు పాత్రల ధృక్కోణంలో చూపించిన ముగింపు కూడా బాగానే ఉంది
ఎవరెలా చేసారు ?
మూవీలో అరవింద్ స్వామికీ , విజయ్ సేతుపతికీ సమానమైన స్కోప్ ఉంది . అయితే ఇద్దరిలో నటన పరంగా విజయ్ సేతుపతికి ఎక్కువ మార్కులు పడతాయి. ఉద్యోగం లేకపోయినా ప్రియురాలి దగ్గర , సంపాదన లేకపోయినా తల్లి దగ్గర బాధ్యతగా ఉండే అతడి తీరు అందరికీ నచ్చుతుంది . ప్రియురాలి మాట మన్నించి తప్పుడు మార్గంలో సంపాదించిన సొమ్మును బోస్ మ్యాన్ కి , దొంగిలించిన సైకిల్ ను టీ అమ్మేవాడికి తిరిగిస్తూ విజయ్ ప్రదర్శించిన హావభావాలు గుండెలను తడుముతాయి
ఇక అరవింద్ స్వామి చాలా బాలన్సుడ్ గా నటించాడు
వ్యాపారంలో నష్టాలు ఏర్పడి ,కుటుంబ సభ్యులను కోల్పోయి ఖరీదైన బంగ్లాలో వంటరిగా అతడు పడే వేదనను కళ్ళకు కట్టాడు
ఇక అదితీ రావు లేకపోయినా సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ , విష్ణు ధనంలో బీదవాడు అయినా గుణంలో కాదు అని నమ్మి ప్రేమించిన సన్నివేశాలు రక్తి కట్టాయి
సాంకేతికత
సాంకేతికత విషయానికి వస్తే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ పెద్ద అస్సెట్
ఎందుకంటే మాటలు చెప్పలేని భావాలను అతడు సంగీతంతో పలికించాడు
సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి
దర్శకుడు కిషోర్ పాండురంగ రిస్క్ తీసుకుని ఒక మంచి ప్రయత్నమే చేసారు
విశ్లేషణ
గాంధీటాక్స్ మూవీలో మాటలు ఉండవు అని తెలిసిన తర్వాత చూడగలమా ? అర్థమౌతుందా ? అని మొదలు మనం సందేహపడతాం . కానీ మూవీలోకి ఎంటర్ అయినతరువాత విజయ్ సేతుపతి కళ్ళతోనే భావాలు పలికించడం చూసిన తర్వాత ఈ ప్రయోగం ఏదో బాగానే ఉందే అనుకుంటాం . నిజానికి అనవసరమైన సంభాషణల కన్నా ఇదే బాగుంది . చెప్పదల్చుకున్న విషయాన్ని సైగలతో చాలా క్లుప్తంగా చెప్పిన విధానం బాగుంది . స్ట్రైట్ తమిళ్ సినిమా అయినప్పటికీ జీ 5 ఓటిటీ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది . మూవీలో అసలు సంభాషణలే లేవు కాబట్టి మనకు భాషతో ఇబ్బంది లేదు . చూడాలనుకున్న వారు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి నిక్షేపంగా చూడొచ్చు
నటీనటులు : విజయ్ సేతుపతి , అరవింద్ స్వామి , అదితీ హైదర్ రావు
సంగీతం : ఏఆర్ రెహమాన్
నిర్మాణం : జీ స్టూడియోస్
దర్శకత్వం : కిషోర్ పాండురంగ
విడుదల : జీ 5 ఓటిటీ
రేటింగ్ : 2.75 / 5
