ఇప్పటిదాకా సౌబిన్ సాహిర్ లో హీరోయిజం చూసాం , విలనిజమూ చూసాము. కానీ అంబిలి మూవీలో అతడిలో ఓ కొత్త కోణం చూస్తాం. కమలహాసన్ ,రాజ్ కపూర్ లాంటి అతికొద్దిమంది చేయగలిగిన ఇలాంటి పాత్రలను సౌబిన్ సాహిర్ కూడా చేసి చూపించాడు.
కళ్యాణరాముడు సినిమా తీసుకున్నా , స్వాతి ముత్యం సినిమా తీసుకున్నా ఇన్నోసెన్స్ క్యారెక్టర్లలో కమలహాసన్ నట విశ్వరూపం కనిపిస్తుంది. తనని అన్యాయంగా చంపేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అన్నయ్య సాయం తీసుకున్న అమాయకపు కమల్ హాసన్ నటన కళ్యాణరాముడు మూవీ లో ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ నటన కూడా ఎవరూ మర్చిపోలేరు.
కొన్ని పాత్రలు చేయాలంటే కొంతమందికే సాధ్యం. నిజానికి ఇటువంటి ఇన్నోసెన్స్ పాత్రలు చేయాలంటే నటన మీద చాలా డెడికేషన్ ఉండాలి. ఒకే ఇమేజ్ చట్రంలో కూరుకుపోకుండా ఎటువంటి పాత్రలనైనా చేయగలననే కాన్ఫిడెన్స్ ఉండాలి. అంబిలి సినిమాలో మళయాళ నటుడు సౌబిన్ సాహిర్ పోషించిన విలక్షణ పాత్ర అతడి కెరీర్ ను మరోమెట్టు పైకి చేర్చింది.
2019 లో మళయాళంలో విడుదలైన అంబిలి మూవీ (Ambili Movie) మంచి వసూళ్లను రాబట్టుకుంది. తర్వాత సన్ నెక్స్ట్ ( తెలుగు డబ్బింగ్ వెర్షన్ ) అమెజాన్ ప్రైమ్ ( తెలుగు సబ్ టైటిల్స్ తో ) ఓటిటిల్లో అందుబాటులోకి వచ్చింది
ఈ సినిమా చాలామంది చూసే ఉంటారు. ఇప్పటికీ చూడని వారికోసం ఈ ఫీల్ గుడ్ మూవీ అంబిలి రివ్యూ. అంబిలి ఖచ్చితంగా మీ హృదయాలను టచ్ చేస్తాడు ..చూడండి
కధేంటి ?
అంబిలి (సౌబిన్ సాహిర్ ) జమ్మూకాశ్మీర్ రెజిమెంట్లో పనిచేస్తున్న ఓ సైనికుడి కొడుకు. జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల తెలివితేటలు అబ్బక అమాయకత్వంగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి చనిపోయిన తర్వాత పెరిగి పెద్దవాడు అయి కేరళలోని స్వగ్రామంలో సెటిల్ అవుతాడు. అతడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఊరిలో కొంతమంది అతడిని తమ పనులకు వాడుకుంటూ ఉంటారు.
అతడి షాపుల్లో అద్దెకు ఉన్నవాళ్లు ఏదో మాయమాటలు చెప్పి అతడికి అద్దె కట్టకుండా ఎగవేస్తుంటారు. అయినా అంబి ఇవేమీ పట్టించుకోడు. ఊళ్ళో ఎవరికి ఏ అవసరం వచ్చినా తలలో నాలుకలా ఉంటాడు. కల్మషం లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాడు. అందుకే అంబి అంటే ఆ విలేజ్ లో అందరికీ ఇష్టం.

ఇతడికి చిన్ననాటి స్నేహితుడు బాబీ (నవీన్ నజీమ్ ) పెద్ద సైక్లిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. బాబీ సైక్లిస్ట్ గా ఎదగడం వెనుక అంబి సాయం , ప్రోత్సాహం కూడా ఉంటాయి. కానీ అమాయకుడైన అంబి అంటే బాబీకి లోకువ. అందుకే అతడిని దూరం పెడుతూ ఉంటాడు
కానీ అదే అమాయకత్వం , స్వచ్ఛమైన ప్రేమను చూసి బాబీ సోదరి టీనా అంబిలిని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ బాబీకి ఇష్టం ఉండదు. అందుకే అంబిని రక్తం కారేలా కొట్టి ముందుగా అనుకున్న ప్రకారం కాశ్మీర్ దాకా సైకిల్ యాత్ర చేయడానికి వెళ్ళిపోతాడు.
చిన్ననాటి స్నేహితుడు తనని రక్తం కారేలా కొట్టడంతో మనసు గాయపడిన ఆ అమాయకుడు ఏం చేస్తాడు ? తనని ప్రేమించిన టీనా కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ? చివరికి తన చిన్ననాటి స్నేహితుడి కోసం బాబీ మనసు మార్చుకుంటాడా ? లేదా ? అనేది మిగిలిన కధనంలో తెలుస్తుంది.
ఎలా ఉంది ?
పెరిగి పెద్దవాడు అయినా చిన్నపిల్లవాడి మనస్తత్వంతో నటించాలంటే అంత తేలికైన పని కాదు. మొదటినుంచి చివరిదాకా ఒకే మానరిజంతో కనిపించాలి. నడక కానీ , మాట కానీ , ముఖంలో పలికించే భావాలు కానీ ఖచ్చితంగా సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఏ మాత్రం లైన్ దాటినా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
తాగుబోతు పాత్రలకూ , చైల్డిష్ మెంటాలిటీ పాత్రలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. తాగుబోతు పాత్ర అంటే పూనకాలు వచ్చినట్టు అటూఇటూ ఊగిపోవడం కాదు. కళ్ళలో ఆ మత్తు కనిపించాలి. మాటలో ఆ తడబాటు కనిపించాలి. చాలా సహజంగా భావాలను పలికించాలి.
ఇటువంటి వాటిలో అక్కినేని సిద్ధహస్తుడు. దేవదాస్ సినిమాలో తన క్యారక్టర్ లో సహజత్వం కోసం ఆయన దర్శకుడ్ని రాత్రివేళలోనే షూటింగ్ చేయమనేవారట. అదీ నటన పట్ల అక్కినేని డెడికేషన్.
అంబిలి చూస్తే సౌబిన్ సాహిర్ లో కూడా అదే డెడికేషన్ కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ చైల్డిష్ మెంటాలిటీని కళ్ళకు కట్టాడు. పరిగెత్తుతున్నట్టుగా నడవడంలో కానీ , అటూఇటూ ఊపుతూ సైకిల్ తొక్కడం కానీ , శరీరాన్ని అష్టవంకరలు తిప్పడంలో కానీ గట్టిగా సాధన చేసినట్టున్నాడు. పర్ఫెక్ట్ గా చేసాడు.
చిన్ననాటి స్నేహితుడు బాబీ తనను కొట్టినప్పటికీ మనసులో పెట్టుకోకుండా సైకిల్ మీద అతడి వెంటపడటం , దారిలో ఓ గ్రామంలో ఆగినప్పుడు అందరి అభిమానం చూరగొనడం లాంటివి టచ్ చేస్తాయి. కాకపోతే ఈ సైకిల్ రేస్ ఎక్కువ అవడంతో ద్వితీయార్థంలో మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది.
మరీ కేరళలో మొదలెట్టిన సైకిల్ యాత్ర కాశ్మీర్ చేరేదాకా రీళ్ళకు రీళ్లు చూపించాల్సిన అవసరం లేదు. దానికన్నా ఈ ప్రయాణంలో దారిలోని మరిన్ని గ్రామాల ప్రజలతో అంబిలి మమేకం అవడం చూపించి ఉంటే బాగుండేది.
అదీకాకపోతే అంబిలి లవ్ స్టోరీకి ఇంకొంచం స్పేస్ ఇచ్చి ఉండాల్సింది . ఎంతసేపూ బాబీతో పోటీ పడి సైకిల్ తొక్కడంతోనే సరిపోయింది. మధ్యలో ఒకట్రెండు సన్నివేశాలు మాత్రమే ఎమోషనల్ టచ్ ఇస్తాయి.
బాబీకి మోషన్స్ అవుతున్నాయని ఓ గ్రామంలో వైద్యుడికి చూపించుకుంటే ఆయన మందులిచ్చి ఓ రెండ్రోజులు తనింట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వీళ్ళని కోరతాడు. అప్పుడు అంబిలి మిత్రుడి ఆరోగ్యం కోసం సేవలు చేయడం , కంజి వండి ఇవ్వడం ,గ్రామస్తుల పిల్లలకు కూడా ఇవ్వడం లాంటి సన్నివేశాలు బాగున్నాయి.
ఆఖర్లో తిరుగు ప్రయాణం అవుతూ అంబి ఆగి గ్రామస్తులకు నమస్కారం పెట్టడం మనసులను కదిలిస్తుంది. క్లైమాక్సులో కాశ్మీర్ లోని తన చిన్ననాటి ఇంటికి చేరుకొని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అంబి కంటతడి పెట్టే సన్నివేశం ప్రేక్షకుల చేత కూడా కంటతడి పెట్టిస్తుంది. ముగింపు ట్రాజెడీ చేయకుండా సుఖాంతం చేయడం బాగుంది.
ఎవరెలా చేసారు ?
సినిమా మొత్తాన్ని సౌబిన్ సాహిర్ ఒక్కడే భుజాన వేసుకుని నడిపించాడు. ప్రథమార్థంలో తన అమాయకత్వంతో అల్లరి చేస్తూ సరదాగా కనిపిస్తాడు. ద్వితీయార్థంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చి అందర్నీ కదిలిస్తాడు.
ఇతడి తర్వాత అంబి ప్రియురాలిగా నటించిన టీనా (తన్వి రామ్ ) నటన బాగుంది. ఎక్కువ భాగం అంబితో ఆన్లైన్లో చాట్ చేస్తూ కనిపించినా భావాలు చక్కగా పలికించింది.
సాంకేతికత
అసలుకే కేరళ అందాలకు పెట్టింది పేరు. ఆ అందాలను తన కెమెరా పనితనంతో శరన్ వేలాయుధన్ మరింత అందంగా చూపించాడు. అంబి , బాబీలు కేరళనుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు దారిపొడవునా చక్కటి లొకేషన్లు కళ్లకుకట్టినట్టు చూపించారు.
తర్వాత చక్కటి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మనల్ని ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా విష్ణు విజయ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి దర్శకుడు జాన్ పాల్ జార్జి అంబిలిని ఓ ఫీల్ గుడ్ మూవీగా తీర్చిదిద్దాడు.
విశ్లేషణ
అంబిలి క్యారక్టర్ను చూస్తున్న కొద్దీ మనం కూడా అతడంటే ఇష్టం పెంచుకుంటాం . వయసు పెరిగి అతి తెలివి తేటలతో పెద్దమనుషులుగా చలామణీ అయ్యేవాళ్ళకన్నా కల్మషం లేని , కల్లాకపటం ఎరుగని అంబిలి ఎంతో గొప్పగా అనిపిస్తాడు . అతడు ఎవరినీ ద్వేషించడు. అందర్నీ ప్రేమిస్తాడు . మనిషిగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి ? అందులోనూ సౌబిన్ సాహిర్ తన నటనతో అంబిలిని మన ముందు ఆవిష్కరించాడు . సినిమా అయిపోయినా కూడా చాలాసేపటివరకు అంబిలి మనకు గుర్తుండిపోతాడు . ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకున్నవాళ్ళు ఇంట్లోనే హాయిగా చూడొచ్చు.
నటీనటులు : సౌబిన్ సాహిర్ , నవీన్ నజీమ్ , తన్వి రామ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : శరన్ వేలాయుధన్
సంగీతం : విష్ణు విజయ్
దర్శకత్వం : జాన్ పాల్ జార్జ్
విడుదల : సన్ నెక్స్ట్ ( తెలుగు ) అమెజాన్ ప్రైమ్
రేటింగ్ : 4 / 5
