గంధపు చెక్కల స్మగ్లింగ్ పుష్ప నుంచి గంజాయి స్మగ్లింగ్ ఘాటీ దాకా అదే రొడ్డకోట్టుడు !
దాదాపు పదిహేనేళ్ల క్రితం క్రిష్ , అనుష్కల కాంబినేషన్లో వచ్చిన వేదం తర్వాత వచ్చిన ఘాటీ సినిమా మీద రిలీజుకు ముందే ప్రేక్షకులు కొన్ని అంచనాలు పెట్టేసుకున్నారు
ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వేదం , వన్డే జగద్గురుమ్ , కంచె , గమ్యం వంటి సినిమాలు రావడంతో ఆయన సినిమాల మీద కొన్ని అంచనాలు ఉంటాయి
అలాగే అనుష్క శెట్టి
నటిగా కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం ఘాటీ
ఈ రెంటి అంచనాలు ఘటీకి కొంత హైప్ తీసుకొచ్చాయి
అయితే ప్రేక్షకుల అంచనాలను ఘాటీ అందుకుందా ?
క్రిష్ దర్శకత్వం ఎలా ఉంది ?
అనుష్క పోషించిన పాత్ర ఏంటి ?
అనేవి ఇప్పుడు చూద్దాం
కథ విషయానికి వస్తే ఘాటీ అనే టైటిల్ వెనుక ఉన్న నేపధ్యాన్ని గమనిస్తే వెంటనే అర్థమైపోతుంది
తూర్పు కనుమల్లో ఆంధ్రా ఒడిస్సా బోర్డర్లో గంజాయి పండించేవారిని ఘాటీలు అంటారు
ఆ కనుమల్లో గంజాయి పండించి ఘాట్ లు దాటించడం వీళ్ళ పని
ఇప్పుడు స్టోరీ లైన్ మీకు అర్థమైపోయింది అనుకుంటా
ఎస్ .. గంజాయి స్మగ్లింగ్ ప్రధాన అంశంగా రాసుకున్న స్టోరీనే ఘాటీ
ఈ మధ్య మాఫియా నేపధ్యం ఉన్న సినిమాల్లో తలా ఒక దర్శకుడు తలా ఒక ఐటెం ను స్మగ్లింగ్ కు వాడుకుంటున్నారు
పుష్పాలో గంధపు చెక్కలను వాడుకుంటే , కూలీలో గోల్డ్ వాచ్ లను వాడుకున్నారు
అంచేత ఘాటీలో గంజాయి వాడుకున్నారన్నమాట
కూలీ సినిమాలో కూలీల చేత పోర్టులో అడ్డమైన చాకిరీ చేయించుకుని గోల్డ్ వాచ్ లను స్మగ్లింగ్ చేస్తాడు సైమన్ నాగార్జున
అలాగే ఘాటీలో శీలావతి ( అనుష్క ) , దేశిరాజు లచేత ఘాట్స్ లో గంజాయి పండించుకుని కూలీ ఇస్తుంటారు నాయుడు బ్రదర్స్ ( రవీంద్ర విజయ్ అండ్ చైతన్య రావు )
కస్టపడి గంజాయి పండించేది తామైతే బంగ్లాల్లో కూర్చుని లాభాలు సంపాదిస్తుంది నాయుడు బ్రదర్స్ కాబట్టి లాభాల్లో తమకూ వాటాలు ఇవ్వాలని పట్టుబడుతోంది శీలావతి
ఇక అక్కడ్నుంచి స్టోరీ మీకు తెలిసిందే
శీలావతి , దేశిరాజులు ఒకవైపు , నాయుడు బ్రదర్స్ మరోవైపు నాలుగు ఫైటింగులు .. ఆరు డైలాగులతో నడుస్తుంది
కధంతా గంజాయి స్మగ్లింగ్ ట్రాక్ నేపథ్యంలోనే నడుస్తుంది
ఇంటర్వెల్ వరకు పాత్రల పరిచయంతో రీళ్ళన్నీ ఖర్చుపెట్టేసారు కాబట్టి అసలు స్టోరీ ఏంటా అని ప్రేక్షకుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు
ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు అనుష్క విలన్ల మీద రివెంజ్ తీసుకోబోతుంది అని ప్రేక్షకులకు తెలిసిపోయింది కాబట్టి సెకండాఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు
క్రిష్ ఈ సినిమా మీద పెద్దగా వర్క్ చేయలేదని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడే ప్రేక్షకులకు అర్థమైపోతుంది
ముఖ్యంగా తూర్పు కనుమల్లో ఆంధ్రా ఒడిస్సా బోర్డర్లో యాసను ఒడిసిపట్టుకుని సినిమాలో వాడుకునే ప్రయత్నం చేయలేదు
పుష్పాలో అల్లు అర్జున్ చేత చిత్తూరు యాసలో డైలాగులు పలికించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు కాబట్టే ఆ సినిమా కూడా హిట్
అయ్యింది
క్రిష్ అటువంటి జాగ్రత్తలు ఘాటీలో తీసుకోలేదు
కథ , ప్రాంతం బట్టి యాస మీద కూడా శ్రద్ద తీసుకోవాలనేది గత సినిమాలు నేర్పిన పాఠాన్ని క్రిష్ పట్టించుకోలేదు
ఒకట్రెండు సన్నివేశాల్లో తూర్పు యాసను పలికించినా అవి సందర్బాన్ని తగినట్టు కాకుండా తనకు గుర్తుకొచ్చినప్పుడు చెప్పించినట్టు ఉంది
స్మగ్లింగ్ నేపధ్యం ఉన్న సినిమాల్లో బీజీఎమ్ కు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది
ఘాటీ లో బీజీఎమ్ కూడా చెప్పుకోదగినంత లేదు
ఎవరెలా చేసారు ?
అనుష్క నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు
హీరోలతో సమానంగా , ఒక్కోసారి హీరోలకన్నా ఎక్కువగా నటించడంలో ఆమెకు ఇప్పటికే పేరుంది
షరామామూలుగా ఘాటీ లో కూడా అనుష్క నటన బావుంది
అనుష్క సరసన విక్రమ్ ప్రభు నటించినా డామినేషన్ మొత్తం అనుష్కదే కనిపిస్తుంది .. అయినా అతడు తన పాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి
విలన్ పాత్రలు వేసిన రవీంద్ర విజయ్ , చైతన్యా రావుల నటన పర్వాలేదు
ఇక ఘాటీ లో కాప్ పాత్ర పోషించిన జగపతి బాబు నుంచి నిజానికి ఇంకాస్త ఎక్కువ నటన రాబట్టుకోవచ్చు
దర్శకుడు జగపతి బాబును పూర్తిస్థాయిలో వాడుకోవడంలో విఫలం అయినట్టు కనిపిస్తుంది
పైగా జగపతి బాబుకి తిండి మేనరిజం పెట్టి కొద్దిగా అతిగా చేయించినట్టు అనిపిస్తుంది
ముగింపు : గంజాయి ప్రధాన అంశంగా కథ రాసుకుని హీరో , హీరోయిన్ , విలన్లు అందరినీ ఆ గంజాయి వ్యాపారంలో భాగస్వాములను చేసి క్లైమాక్సులో హీరో ధర్మం వైపే నిలబడాలన్న కొటేషన్ గుర్తొచ్చి గంజాయికి వ్యతిరేకంగా హీరో ఇచ్చే సందేశంతో సినిమాని ముగించాడు దర్శకుడు క్రిష్
అనుష్క , విక్రమ్ ప్రభు , రవీంద్ర విజయ్ , చైతన్య రావు , జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటించిన ఘాటీ సినిమాకు ఎదుగురు రాజీవ్ రెడ్డి , సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు కాగా క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు
సెప్టెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది
రేటింగ్ : 2. 5 / 5
పరేష్ తుర్లపాటి