“ఏంటి నాయనా వెతుకుతున్నావ్?”
“దేవుడి కోసం”
“ఓహో మరి కనిపించాడా?”
“కనిపించలేదు “
“అలాగా దేవుడి కోసం ఎక్కడెక్కడ వెతికావు?”
“ఎక్కడని వెతకాలి? అప్పటికి అన్ని గుళ్ళలో వెతికా స్వామీ”
“మరి అక్కడైనా కనిపించాడా?”
“ఆ..ఆ.. ఉన్నాడు కానీ శిలలో చలనం లేకుండా ఉన్నాడు.. నేనేమడిగినా బదులివ్వడే “
“సరే ఇప్పుడు నీకు దేవుడు కనిపించాలి అంతేగా?”
“అవును స్వామి “
“అయితే నాతో రా.. దేవుడ్ని చూపిస్తా “
…
“అదిగో ఆ దేవుడి గుడి బయట అమ్మా ఆకలి అయ్యా ఆకలి అంటూ ఆకలికి అల్లాడిపోతూ యాచన చేస్తున్నాడు చూడూ ముసలాయన.. ముందు వెళ్ళి ఆయనకు పట్టెడన్నం పెట్టిరా.. ఆనక దేవుడ్ని వెతుకుదాం “
…
“స్వామీ మీరు చెప్పినట్టే ఆ వృద్ధుడికి అన్నం పెట్టాను”
“మంచిది నాయనా అన్నం తిని ఆ వృద్దుడు ఏమన్నాడు?”
“సమయానికి దేవుడిలా వచ్చి నా ఆకలి తీర్చావు.. నువ్వే నాపాలిట దేవుడివి బాబూ “అని దీవించాడు
“నాయనా ఆ వృద్దుడికి కనిపించిన దేవుడు ఇంతకాలం నీకెందుకు కనిపించలేదు?”
“అదేంటి స్వామీ ఆయన నన్ను దేవుడు అంటున్నాడు.. ఏదో ఆకలి మీదున్నాడు కదా అని పట్టెడన్నం పెట్టాను..అంతమాత్రాన నేను దేవుడ్ని ఎలా అవుతాను?”
“దేవుడంటే ఎక్కడో ఆకాశంలో ఉండడు నాయనా..మనుషుల్లోనే ఉంటాడు.. మనసుల్లోనే ఉంటాడు.. జీవాత్మలో ఉన్న పరమాత్మను గుర్తించక ఎక్కడెక్కడో వెతుకుతాం..అసలు దేవుడ్ని మనం ఎందుకు నమ్ముతాం ? ఆపదలొస్తే కాపాడతాడనే కదా ? కష్టాల్లో సాయం చేసి మనల్ని ఆదుకుంటాడనే కదా? మరి దేవుడ్ని నమ్మే నువ్వు సాటివాడికి సాయం చెయ్యాలని ఎందుకు అనుకోవు? కొన్ని ఏళ్ళ బట్టి ఆ వృద్దుడు ఆ గుడి ముందే యాచన చేస్తున్నాడు.. నువ్ గుడిలో దేవుడి కోసం వెతుకుతున్నావ్?ఆ వృద్దుడు తన కడుపు నింపిన వారిలో దేవుడ్ని చూసుకుంటున్నాడు .. ఇప్పుడు చెప్పు.. దేవుడు ఎక్కడుంటాడో అర్థమైందా?”
“అర్ధమైంది స్వామీ”
“ఏమర్దమైంది?”
“సాయం చేసేవారిలో ఉంటాడు.. ఆపదలో ఆదుకునేవారిలో ఉంటాడు.. కష్టంలో నీ పక్కన నిలబడేవారిలో ఉంటాడు..తల్లి తండ్రులలో ఉంటాడు.. సన్మార్గంలో వెళ్ళడానికి మార్గ బోధన చేసే మీలాంటి గురువుల్లో ఉంటారు”
“మంచిది నాయనా”
పరేష్ తుర్లపాటి ✍️