వాణిశ్రీకి తప్పని సినిమా కష్టాలు !

Spread the love

తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో భానుమతి , సావిత్రి లాంటి నటీమణులు దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలగా , వారి తర్వాత వచ్చిన వాణిశ్రీ కూడా నలభై ఏళ్లపాటు ఏకధాటిగా సినిమాల్లో నటించి అంతే స్టార్ డమ్ సంపాదించుకున్నారు

1970-80 లలో వాణిశ్రీ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు .. ఈవిడ దాదాపు దక్షిణాది హీరోలందరితోనూ నటించింది .. అంతేకాదు తెలుగులో ఎక్కువ ద్విపాత్రాభినయం పాత్రలు పోషించిన నటిగా వాణిశ్రీ పేరు సంపాదించుకుంది

ఏపీలోని నెల్లూరుకు చెందిన వాణిశ్రీ రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోలేదు
ముందు చాలా స్టేజి నాటకాలు వేసింది

సినిమాల్లో కూడా ఆమెకు ముందు వ్యాంప్ క్యారక్టర్లే వచ్చాయి .. అయినా నిరాశ పడకుండా పరిశ్రమలో నటిగా ఎదిగి తనను తానూ నిరూపించుకోవాలని పట్టుదలగా ప్రయత్నించింది

ఆమె ప్రయత్నం ఫలించి సినిమాల్లో చక్కటి అవకాశాలు వచ్చాయి

కట్టూ బొట్టూ వంటి విషయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకుంది . ఆ రోజుల్లో వాణిశ్రీ ఇమేజ్ ఎంత సంచలనం సృష్టించింది అంటే మార్కెట్లోకి వాణిశ్రీ కొప్పులు , వాణిశ్రీ బ్లౌజులు , శారీలు అంటూ రకరకాల డిజైన్లు వచ్చేసాయి

అప్పట్లో ఆమె అభిమానులైన మహిళలు చాలామంది ఆ స్టైలును అనుకరించటానికి ప్రయత్నించేవారు

ముఖ్యంగా నవలా నాయికగా వాణిశ్రీ నటించిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి .. ఆత్మీయులు , ప్రేమనగర్ , జీవన తరంగాలు , విచిత్ర బంధం , చక్రవాకం , సెక్రటరీ వంటి చిత్రాలన్నీ నవలల ఆధారంగా రూపొందినవే

ఇంతకీ వాణిశ్రీ అసలు పేరు ఏంటో తెలుసా ?
రత్నకుమారి

సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కూడా ఆమె ఆ పేరుతోనే నటించారు

అయితే ఒకసారి ఆమె నాదీ ఆడ జన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు ఆమె పేరును వాణిశ్రీ గా మార్చారు

అప్పట్నుంచి ఆమె వాణిశ్రీ పేరుతొ సూపర్ హిట్లు కొట్టి రఘుపతి వెంకయ్య అవార్డు , నంది అవార్డులతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా సాధించింది .. అలా షుమారు నలభై సంవత్సరాలు నటిగా సినీ పరిశ్రమను అప్రతిహంగా ఏలిన వాణిశ్రీ 1978 లో డాక్టర్ కరుణాకర్ ను వివాహం చేసుకోవడంతో ఆమె సినీ పరుగుకు బ్రేక్ పడింది

పెళ్ళై పిల్లలు పుట్టాక కొంతకాలం అడపాదడపా అత్త పాత్రల్లో , తల్లి పాత్రల్లో చేసిన వాణిశ్రీకి 36 ఏళ్ళ కుమారుడి హఠాన్మరణం షాక్ ఇచ్చింది

దానికి తోడు అంతకుముందు సినిమాల్లో సంపాదించిన సొమ్మంతా భూముల మీద పెట్టిన వాణిశ్రీకి అవి కబ్జా కావడంతో ఇంకో షాక్ తగిలింది

దాంతో ఆ భూములను కాపాడుకోవడానికి 12 ఏళ్ళ పాటు కోర్టుల చుట్టూ తిరగడానికి .. లాయర్ల చుట్టూ తిరగడానికి సరిపోయింది
అలా వాణిశ్రీ సినిమా కస్టాలు చాలా పడింది

ఈ మధ్యనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆమె స్థలాన్ని ఆమెకు ఇప్పించారు

ఇప్పుడు వాణిశ్రీ వయసు 77 ఏళ్ళు
ప్రస్తుతం వాణిశ్రీ చెన్నైలో మనవడు మనవరాలి దగ్గర విశ్రాంత జీవనం గడుపుతుంది
ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో వాణిశ్రీది ఒక ప్రత్యేకమైన స్టైల్ .. అది ఎన్నేళ్లయినా చెరిగిపోదు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!