సంగీతంలో అత్యంత ఉత్తమ సంగీతవేత్త ఎవరు అంటే హనుమ అంటారు
దాని వెనుక ఓ పురాణం కథ ఉంది
ఒక సందర్భంలో నారద , తుంబురు మధ్య సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది.
సరే ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు.
“అయ్యా! సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం మా ఇరువురి మధ్య చోటు చేసుకుంది… కాబట్టి మాలో ఎవరు గొప్పవారో మీరు తేల్చాలని” బ్రహ్మను తుంబురుడు అడిగాడు.
“సంగీత శాస్త్రంలో ఎవరు విద్యాంసులో చెప్పాలంటే, ముందు ఆ న్యాయ నిర్ణేతకు సంగీతం గురించి పరిజ్ఞానం ఉండాలి…. కాబట్టి అలాంటి అర్హుడు ఒక్కడే ఉన్నాడు. అతడే గంధమాధన పర్వతం మీద ఉండే ఆంజనేయుడు. ఆతడి దగ్గరకు వెళితే మీ సమస్యను పరిష్కరిస్తాడని” బ్రహ్మదేవుడు అంటాడు
దీంతో నారద, తుంబురులు అక్కడ నుంచి ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్లారు.
“మా వివాదం గురించి చెబితే బ్రహ్మ మీ దగ్గరకు పంపించారు. మాలో ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో మీరే తేల్చిచెప్పాలని” కోరారు.
హనుమ గొప్ప వినయసంపన్నుడు. గొప్పలు, అసత్యాలు పలికేవాడు కాదు.
“నేను రామ సేవకుడిని తప్ప, సంగీత విద్వాంసుడిని కాదు…. కానీ మీరు వచ్చారు కాబట్టి బ్రహ్మ వాక్కు ప్రకారం నేను కాదనలేనని ఆంజనేయుడు అంటూ ముందు నా స్వామిని కీర్తిస్తాను. మీ ఇద్దరి చిడతలు, తంబురలను ఎదురుగా ఉన్న కొండ మీద పెట్టండి” అన్నాడు.
హనుమ గుండ క్రియాగానం ప్రారంభించగానే ఆ శిల కరిగిపోయి, అక్కడ వీణలు, చిడతలు అందులో ఇమిడిపోయాయి.
హనుమ గానం ఆపగానే ఆ శిల ఘనీభవించింది.
ఆ తర్వాత శిలలో ఉన్న చిడతలను, వీణను స్వీకరించండి అని ఆంజనేయుడు అన్నాడు.
నారద, తుంబురులు తమ ప్రావీణ్యాన్ని అంతా ఉపయోగించినా చెమటలు పట్టాయి తప్ప శిల మాత్రం కరగలేదు.
తమ అజ్ఞానాన్ని తెలుసుకుని నీకు మించిన సంగీత విద్వాంసులం కాదంటూ ఆంజనేయుడికి నమస్కరించారు.
మా గర్వం అణిగిపోయింది….మా వీణలను ఇప్పించండి చాలు అని ప్రార్థించారు.
అప్పుడు హనుమ మళ్లీ గుండ క్రియా గానం చేసి వాటిని తీసుకునే అవకాశం ఇచ్చాడు.
ఇంతటి హనుమ మీద సంగీత తత్వజ్ఞ అంటూ Dr. బాల మురళి కృష్ణ గారు రసికప్రియ రాగంలో ఒక కీర్తన వ్రాశారు.
కృతి:
ప/ పవనతనయ పాలయమాం|
పావన భక్తజనావన||
అ ప/ తవచరణ యుగళమనిశం
భవహరణం మేశరణం|| పవనతనయ||
చ/ సామజ సప్తస్వరయుత|
సంగీత తత్వజ్ఞ||
సుధామయ మురళీరవహిత|
రామనామ రసికప్రియ||పవనతనయ||
భావం:
సామవేదజనిత సప్తస్వరమిళితమైన సంగీతతత్వమెరిగినవాడవు
సుధామయ మురళీనాదహితుడవు, రామనామ రసాస్వాదనాప్రియుడవునైన పవనపుత్ర హనుమా! పవిత్ర భక్తజన సమూహమును రక్షింపుమా.. జన్మ రాహిత్యము కొరకు సతతము నీ పాదద్వయమంటి శరణువేడుటయే సరైన విధానము కదా!
ఇవ్వాళ రేవతీ నక్షత్రం
రేవతీ నక్షత్రానికి ఈ రాగానికి సంబంధం ఎందుకు అంటే చండిక వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లో సాంబశివ రావు గారు చెప్పినట్టు ప్రతి నక్షత్రానికి ఒక రాగం ఉంటుంది అని, మన నక్షత్రమునకు లింక్ ఉన్న రాగాలు వినటం అనేది ఒక రెమెడీ గా చెబుతున్నారు.
ఈ రాగాలకు మనలోని షట్చక్రాలకు కూడా సంబంధం ఉంటుంది అని కొందరి ఉవాచ.
ఇలా రేవతి కి, రసిక ప్రియ రాగానికి , సంగీతానికీ , హనుమకు రామనామానికి లింక్ పడ్డది అన్నమాట
అనిల్ కుమార్ పురాణం