Home » అసలు శివాజీ ‘సామాన్ల’ గోల ఏంటి ?

అసలు శివాజీ ‘సామాన్ల’ గోల ఏంటి ?

Spread the love

శివాజీ పెద్ద హీరో కాదు అలా అని మరీ చిన్న యాక్టర్ కూడా కాదు

హీరోగా ఇతడి చేతిలో మంచి సినిమాలు పడ్డాయి
అలాగే క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని మంచి సినిమాలు పడ్డాయి

చిన్నచిన్న సినిమాల్లో హీరోగా మొదలెట్టిన ఇతడి కెరీర్ క్యారక్టర్ నటుడిగా కొనసాగుతూనే ఉంది

మధ్యలో కొన్నాళ్ళు ఓ రాజకీయ పార్టీ తరపున కూడా పనిచేసాడు
అప్పట్లో గరుడ పురాణం అంటూ ఇతడు చెప్పిన పుక్కిట పురాణాలు వివాదాస్పదం అయ్యాయి

సోషల్ మీడియాలో ట్రోల్ అవడమే కాదు కేసులదాకా వెళ్ళింది వ్యవహారం
దాంతో ఈ తలనొప్పులవీ ఎందుకనుకున్నాడో ఏమో మళ్ళీ సినిమాల్లో కుదురుకున్నాడు

కుదురుకున్నాడు అంటే పూర్తిగా సెటిలయ్యాడని కాదు
మధ్యలో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్ళొచ్చాడు

ఈ మధ్య కాలంలో కోర్ట్ మూవీలో మంగపతి పాత్రతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు

హాయిగా నాలుగు పాత్రలు , ఆరు డైలాగులతో నడిచిపోతున్న సినీ కెరీర్ లో రెండే రెండు తప్పుడు మాటలు దొర్లి గింగిరాలు తిరుగుతున్నాడు

సోషల్ మీడియా సంగతి అలా ఉంచితే సినీమహిళలు పెద్దఎత్తున రచ్చ చేస్తున్నారు

పాలిటిక్స్ లో నోరుజారి గరుడపురాణాలు చెప్పి కేసులపాలైన శివాజీ , సినిమాల్లో కూడా అదే నోరుజారి మహిళా కమిషన్ నోటీసులు అందుకున్నాడు

సినిమాల్లో రకరకాల పాత్రల్లో అనుభవాలను ధైర్యంగా ఎదుర్కునే ఈ నటులు నిజ జీవితంలో మాత్రం విపత్కర పరిస్థితులు ఎదురైతే డీలా పడిపోతారు

అందుకే మాటల తొందరలో దొర్లిన తప్పును తెలుసుకుని క్షమాపణ చెప్పాడు

ఇంతకీ అసలు శివాజీ సామాన్ల గోల ఏంటి ?

ఎంతటి గొప్ప ప్రవచనాకారుడైనా పురాణ ప్రవచనం బ్రహ్మాండంగా చెప్పి ఆఖర్లో ఓ తుపుక్ పదం వదిలితే జనాలు గంటలుగంటలు వాగిన ఆయన పురాణం సంగతి పట్టించుకోరు ..ఆఖరి సెకన్లలో మాట్లాడిన ఓ చిన్న అసభ్యకరమైన మాటనే పట్టుకుంటారు

అందుకే వేదికల మీద మాట్లాడేవాళ్ళకి నాలుక నిగ్రహం అవసరం

అది ఎటుపడితే అటు తిరుగుతుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే జనాలు మడత పెట్టేస్తారు

చూసారా ..సినిమాల ప్రభావం ఎంతలా ఉందో
నాక్కూడా సినిమా భాష వచ్చేస్తుంది

సరే మళ్ళీ ఇప్పుడు శివాజీ విషయానికి వస్తే దండోరా అనబడే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈయన చేతికి మైకు వచ్చింది

మైకు చేతిలోకి రాగానే చాలామందికి మైకం రావడం సహజమే కదా
అలా శివాజీకి కూడా మైకం వచ్చింది

మొదట్లో అతడి ఉపన్యాసం చాగంటివారి ప్రవచనంలా హాయిగా సాగింది

హైదరాబాదీ బిర్యానీలా ఘుమఘుమలాడుతూ ముక్కు , చెవులను తాకింది
ఇంతలో అనుకోకుండా ఖల్ అనే శబ్దంతో పంటికింది రాయి వచ్చింది

దాంతో మొత్తం ఫ్లేవర్ పోయింది
టోటల్ గా బిర్యానీ పాడైపోయింది

కష్టమర్లు బూతులు అందుకున్నారు

చూసారా గుండిగ బిర్యానీలో ఒక్క రాయి ఎంతపనిచేసిందో ?
ఆ రాయి పేరే ‘సామాన్లు’

ఇంతకీ శివాజీ ఏమన్నాడు ?

“నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా.. అమ్మాయిలు , హీరోయిన్లు ఇట్లాంటి బట్టలు వేసుకుని బయటికి వెళ్తే దరిద్రం చూడాల్సివస్తోంది .. ఇది హీరోయిన్లను అంటున్నా .. మీ అందం చక్కటి చీరకట్టులో ఉంటుంది కానీ సామాన్లు కనిపించే బట్టల్లో ఏమీ ఉండదు .. నిజంగా అలాంటి బట్టల్లో వాళ్ళని చూసినప్పుడు దరిద్రపు ము అని పైకి తిట్టకపోయినా లోపల అనుకుంటాం .. ఇలా చెప్పగానే చాలామంది పెద్ద పెద్దోళ్ళు , మహిళా సంఘాలు నా మీద ఇంతెత్తున వస్తారు ..కానీ నన్నేమీ పీకేదిలేదు కానీ ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకోండి .. స్త్రీలు ప్రకృతి లాంటి వాళ్ళు .. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారు .. స్త్రీలు నిండుగా చీర కట్టుకుంటే ఆ అందం రెట్టింపు అవుతుంది .. గౌరవం కూడా పెరుగుతుంది ..ఇప్పటికీ చక్కగా మా అమ్మని గుండెల్లో చూసుకుంటా .. అలాగే సావిత్రమ్మ .. సౌందర్యమ్మ..వీళ్ళని చూస్తే ఎంత గౌరవం కలుగుతుంది.. వేషభాషలు మన గౌరవాన్ని పెంచేలా ఉండాలి ..మెడ వరకు పర్లేదు ఇంకా కిందకి బట్టలు కట్టుకుంటే అస్సలు బాగోదు .. ప్రపంచ సుందరి కూడా చీరలోనే గెలిచింది అని గుర్తుపెట్టుకోండి “

ఇవీ ఆయనన్న మాటలు

ప్రకృతి , స్త్రీ అంటూ చక్కటి పోలికలతోనే మొదలెట్టిన శివాజీ సడెన్గా సోషల్ మీడియా భాషలోకి వచ్చేసాడు

పైగా ఈ డైలాగులకు ఈవెంట్ కి వచ్చిన మహిళల నుంచి చప్పట్లు బాగానే వచ్చాయి

వేదికమీదే అనిల్ రావిపూడి , బండ్ల గణేష్ , నవదీప్ తదితరులు కూడా ఉన్నారు
అందరూ శివాజీ మాటలను ఎంజాయ్ చేశారే కానీ ఏ ఒక్కరూ అభ్యంతరపెట్టలేదు

అయితే శివాజీ సడెన్గా హీరోయిన్ల బట్టల గురించి ఎందుకు కామెంట్ చేసాడు ?

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన హీరోయిన్లు కూడా చీరలోనే రావడం కాకతాళీయమా ? యాదృచ్ఛికమా ?

లేకపోతే సినిమా ప్రమోషన్లో ఇది కూడా ఒక భాగమా ?

ఈ మధ్య ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ లు కూడా చేస్తున్నారు

ఆ మధ్య విష్వక్సేన్ అనే నటుడు సరిగ్గా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఓ న్యూస్ ఛానెల్ స్టూడియోకి వెళ్లి తిట్టించుని మరీ బయటికి వచ్చాడు
అది పెద్ద పబ్లిసిటీ అయ్యింది

రిక్షా బండ్లలో మైకుల్లో చెప్పడం , పాంప్లెట్లు పంచిపెట్టడం , పోస్టర్లు అతికించడం , డిజిటల్ ప్రచారాలు పోయి కొత్తగా నెగిటివ్ క్యాంపైన్ తో సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు

మాములు ఈవెంట్ అయితే దండోరా సినిమా గురించి ఎంతమందికి తెలుస్తుంది ?

శివాజీ మాట్లాడిన రెండు మాటలవల్ల డప్పు కొట్టకుండానే దండోరా సోషల్ మీడియా అంతా పాకింది

ఎస్ .. ఈమధ్య ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ లు కూడా చేస్తున్నారు?

లేదూ.. దండోరా మూవీలో మహిళల వస్త్రధారణ మీద ఏమన్నా సందేశం ఇచ్చారా దర్శకులవారు?

అసలు సినిమా ఈవెంట్లో సంబంధం లేకుండా శివాజీ బట్టల టాపిక్ ఎత్తటానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి కదా ?

సరే సినిమా కోసమే అన్నాడో , ఉద్దేశ్యపూర్వకంగానే అన్నాడో రెండు తప్పుడు మాటలు దొర్లాడు

ఆ విషయం శివాజీనే ఒప్పుకున్నాడు

తన ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ నేను తొందరపాటుతో ఆ రెండు పదాలు అనకుండా ఉండాల్సింది అని ఇంకో వీడియోలో క్షమాపణలు చెప్పాడు

కానీ అప్పటికే అవ్వాల్సిన రచ్చ అయ్యింది

శివాజీకి కౌంటర్ ఇచ్చిన చిన్మయి , అనసూయ

మహిళల వస్త్రధారణ గురించి సలహాలు ఇవ్వడానికి శివాజీ ఎవరు ? అని సింగర్ చిన్మయి విరుచుకుపడింది

అనసూయ అయితే ఇంకో అడుగు ముందుకేసి ‘ నా బాడీ నా ఇష్టమోయ్..మధ్యలో నీకేంటి నొప్పి?’ అని సోషల్ మీడియాలో సెటైరిక్ గా పోస్ట్ పెట్టింది

అంతేకాదు నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది పాపం అవకాశలు లేక ఇన్ సెక్యూరిటీలో ఉన్నట్టున్నావ్ ? అని జాలికూడా పడింది

పుండుమీద కారంలా అనసూయ మాటలు శివాజీకి మంటపుట్టించాయి
అందుకే ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనసూయకు కౌంటర్ వేసాడు

‘నేను హీరోయిన్లను అంటే మీకెందుకమ్మా నొప్పి ? అసలు మధ్యలో మీరెందుకొచ్చారు ? నేను మిమ్మల్ని అన్నానా ? మీ పేరే కాదు ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు ? హీరోయిన్లను మాత్రమే అన్నానని’ చెప్పుకొచ్చాడు

మంచు పంచ్ , వర్మ దంచు

ఈ గొడవలో అందరికన్నా ముందు స్పందించినవాడు మంచు మనోజ్ .. ‘శివాజీ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినా తప్పు మాట్లాడాడు .. అందుకు నేను క్షమాపణలు చెప్తున్నా’ అంటూ పెద్దమనిషి తరహాగా స్పందించాడు

ఈయన ట్వీట్ కి థాంక్స్ చెప్తూ మంచులక్ష్మి రీ ట్వీట్ చేసింది

ఇంతమంది ట్వీట్లు పెడుతున్నప్పుడు ఆర్జీవీ ఊరుకుంటాడా ?

చాలా సెటైరిక్ గా ” నీ పూర్తి పేరేంటో కూడా నాకు తెలీదు.. హేయ్ శివాజీ .. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో మురికిమనిషివి నీతో చెప్పించుకోవాలా ?” అని ఘాటుగా ఫైర్ అయ్యాడు

‘మా’ కు చేరిన సామాన్ల పంచాయతీ

ఓ పక్క ట్వీట్ల వార్ నడుస్తూ ఉండగానే శివాజీ సామాన్ల పంచాయతీ మా అసోసియేషన్ కు చేరింది

నందినిరెడ్డి , స్వప్నదత్ , మంచు లక్ష్మి లతో కలిపి ఓ వందమంది సంతకాలు పెట్టి మా లో కంప్లైంట్ చేసారు

హీరోయిన్ల మీద అసభ్యకరంగా మాట్లాడిన శివాజీతో క్షమాపణలు చెప్పించి అతడి మీద చర్యలు తీసుకోవాలని ఓ లెటర్ ఇచ్చారు

ఇది కాకుండా శివాజీ వాఖ్యల మీద సీరియస్ అయిన మహిళా కమిషన్ ఈనెల 27 ఉదయం కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది

విశ్లేషణ

క్షమాపణలు చెప్పినప్పటికీ తానన్నమాటల్లో ఇప్పటికీ ఆ రెండు పదాలు మినహా మిగిలిన అభిప్రాయం సరైనదేనని శివాజీ అంటున్నాడు

హీరోయిన్ల దుస్తుల మీద తాను మంచి ఉద్దేశ్యంతోనే కామెంట్లు చేసానని అంటున్నాడు

సరైన బట్టల్లేకుండా బయటికి వస్తున్న హీరోయిన్లను ఎలాంటి మాటలు అంటారో తనకి తెలుసునని ఆయన చెప్తున్నారు

అయితే హీరోయిన్ల దుస్తుల మీద వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు

గతంలో మంచు లక్ష్మిని ఓ విలేఖరి ఇంటర్వ్యూ చేస్తూ పొట్టి దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి

ఆఖరికి ఆయన క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది

బహుశా ఈ విషయం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా శివాజీకి కూడా తెలిసే ఉంటుంది
అయినా ఆయన తిరిగి అదే టాపిక్ ఎత్తుకుని మాట్లాడాడు

పైగా అలా మాట్లాడితే ఏం జరుగుతుందో ముందే ఉహించి కూడా మాట్లాడాడు
తాను ఇలా మాట్లాడితే మహిళా సంఘాలు పెద్దఎత్తున గోల చేస్తారని కూడా చెప్పాడు

అయినా అనాల్సింది అనేశాడు
ఆయన అనుకున్నట్టుగానే విషయం కాంట్రవర్సీ అయ్యింది

సరే , తన మాటలకు రియాక్షన్ వస్తుందని తెలిసినవాడు అందుకు ప్రిపేర్ అయి ఉండకుండా ఇప్పుడు క్షమాపణలు అంటూ యూ టర్న్ ఎందుకు తీసుకున్నాడు ?అనేది ప్రశ్నార్ధకం

మరోపక్క శివాజీ వాఖ్యల మీద సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా ఒక వర్గం వాదనలు చేస్తుంటే , వ్యతిరేకంగా ఇంకో వర్గం దుమ్మెత్తిపోస్తుంది

ఆ రెండు పదాలు మినహా శివాజీ వ్యాఖ్యల్లో తప్పేముందని కొందరు అతన్ని వెనకేసుకొస్తున్నారు

తన తల్లితో సమానంగా స్త్రీకి గౌరవం ఇస్తూ మాట్లాడాడు

పొట్టి బట్టలు వేసుకుని బయటికి వచ్చే హీరోయిన్లను ఎలాంటి మాటలు అంటారో తెలుసు కాబట్టి హితవు చెప్పాడు అంటున్నారు

ఈ మధ్య హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇటువంటి అనుభవమే ఎదురైందని వారు గుర్తుచేస్తున్నారు

ఆమె పొట్టి బట్టలు వేసుకుని ఓ కార్యక్రమానికి రావడంతో జనం తొక్కిసలాటలో నలిగిపోయి వంటిమీద బట్టలు కూడా చెదిరిపోయాయని అంటున్నారు

ఇలాంటి అనుభవాలే గతంలో అనసూయ భరద్వాజ్ కి కూడా జరిగితే అక్కడి జనాలకు ‘ మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు లేరా ? చెప్పు తీసుకుని కొడతా ?’ అని వార్నింగ్ ఇచ్చింది

మరోపక్క అనసూయ సోషల్ మీడియాలో బికినీ ఫోటోషూట్ పిక్ లను షేర్ చేస్తూ ఉంటుంది

అర్ధనగ్న దుస్తులు వేసుకోవడం , అలాగే బహిరంగ ప్రదేశాలకు రావడం , బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జనాలకు అనే అవకాశం వాళ్లే ఇస్తున్నారని కొందరి వాదన

నా దుస్తులు నా ఇష్టం అనుకునేటప్పుడు ప్రైవేటులో ఎలాగైనా ఉండండి .. పబ్లిక్ లోకొస్తే మాత్రం వంద అంటాం అంటున్నారు

కుటుంబంలో నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ప్రపంచానికి అవసరం లేదని , అదే పబ్లిక్ లోకి వస్తే మాత్రం స్పందన కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందని వారంటున్నారు

శివాజీ చెప్పింది కూడా అదే

హీరోయిన్లు బయటికి వచ్చేటప్పుడు కట్టే బట్టల మీద శ్రద్ద పెట్టి గౌరవం పొందమని చెప్పాడు .. అది కూడా తప్పా ? అంటూ శివాజీకి మద్దతుగా బయలుదేరినవాళ్లు ప్రశ్నిస్తున్నారు

మరోపక్క మహిళలను గౌరవిస్తాను అంటూనే సామాన్లు అని అతను ఎగతాళి చేయడం ఏ గౌరవం కిందికి వస్తుందని సోషల్ మీడియాలో మహిళలు ప్రశ్నిస్తున్నారు

మహిళలు చీర కట్టుకోవాలని చెప్పిన శివాజీ పంచె కట్టుకున్నాడా ? అని దుమ్మెత్తిపోస్తున్నారు

హీరోయిన్లు ఏ దుస్తులు వేసుకోవాలో , ఏ దుస్తులు వేసుకోకూడదో డిసైడ్ చేయడానికి ఆయనెవరు ?

మా శరీరం , మా దుస్తులు , మాకు సౌకర్యంగా అనిపించిన దుస్తులనే వేసుకుంటాం కానీ ఆయన చెప్పినట్టుగా వేసుకోలేము కదా ? అని రివర్స్ పంచులు ఇస్తున్నారు

ముగింపు

కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు మహిళల వస్త్ర ధారణ విషయంలో వాదనలకు రెండువైపులా బలం ఉంటుంది

అయితే చూసే ధృక్కోణం బట్టి , ఆలోచనలబట్టి ,అభిప్రాయాలు మారుతూ ఉంటాయి

సంప్రదాయాలు , సంస్కృతుల గురించి మాట్లాడుకునేటప్పుడు వస్త్రధారణ వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి

స్వేచ్ఛ , సమానత్వం , స్వతంత్రం వంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఆధునిక పోకడలు కూడా ఆమోదయోగ్యం అవుతాయి

మారుతున్న జనరేషన్ కు తగ్గట్టుగా అప్డేట్ అవ్వాలన్న నేటి తరం ఆలోచనలు ఒకరకంగా ఉంటాయి

ఈ రోజుల్లో కూడా సనాతన భావాలు వల్లెవేసే వారి ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి

ఈ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది
అందుకే ఇలాంటి చర్చలు కూడా ఎప్పుడూ ఉంటాయి

దీంట్లో వాదనలు ఉంటాయే కానీ తీర్పులు ఉండవు
ఎందుకంటే ఏ ఒక్కడూ సరైన జడ్జిమెంట్ ఇవ్వలేడు

కొసమెరుపు

అసలు ఈ శివాజీ ‘సామాన్లు’ అనే పదం ఎక్కడ్నించి పట్టుకొచ్చాడా అని గూగుల్ వెతికితే ఆర్టీసీ బస్సుల్లో మీ సామాన్లకు మీరే బాధ్యులు అని చూపించింది

అదికాదు ఇంకేమన్నా సామాన్లు ఉన్నాయేమో అని వెతికితే సామాన్లు భద్రపరుచు లాకర్లు అని ఇంకో బోర్డు చూపించింది

అప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే రామ్ చరణ్ పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగులో సరుకు , సామాన్లు అంటూ పల్లవి కనిపించింది

అదీ సంగతి
శివాజీ సామాన్లను అక్కడ్నుంచి పట్టుకొచ్చాడు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!