“అమ్మగారూ ! ఇదిగో పాల ప్యాకెట్లు .. మీ చేత్తో కొద్దిగా ఏడిగా అంత కాఫీ కలిపి పొయ్యండమ్మా”
తెల్లారి ఐదు గంటలకే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టి కింద కూర్చుంది మా పాలమ్మి సింహాచలం
అప్పటికే లేచి వంటిల్లు శుభ్రం చేసుకుని పాల ప్యాకెట్ల కోసం ఎదురు చేస్తుండేది అమ్మ
పొద్దున్నే ఐదు గంటలకు ఫ్రెష్ గా నాడార్స్ కాఫీ పొడి ఫిల్టర్లో వేసుకుని వేడి వేడిగా దిగే డికాషన్ తో మొదటి కాఫీ కలుపుకుని తాగడం అమ్మకు , నాన్నకు అలవాటు
ఆమె చేతి ఫిల్టర్ కాఫీ తాగిన తర్వాతే మిగిలిన ఇళ్లకు ప్యాకెట్లు వేయడానికి వెళ్లడం సింహాచలానికి అలవాటు
ఇక అక్కడ్నించి వంటింట్లో పొయ్యి మీద ఉన్న వేడి వేడి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ గ్లాసుల్లోకి చేరేది
అప్పుడొచ్చేదీ
కమ్మటి డికాషన్ వాసన
ఎంతలా అంటే గాఢ నిద్రలో ఉన్న మా ముక్కుపుటాలు కమ్మని వాసనను ఆస్వాదిస్తూ మరింత నిద్రలోకి జారుకునేంత
అమ్మ కాఫీ కలుపుతుందని నిద్రలోనే మాకర్థమయ్యేది
వాళ్ళు కాఫీలు తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నంతలోనే’ అమ్మగారూ’ అంటూ పనమ్మాయి సన్యాసమ్మ ఎంటర్ అయ్యేది
పనమ్మాయి చేతిలో కూడా కాఫీ గ్లాసు పడిన తర్వాత కొద్దిసేపు లోకాభిరామాయణం నడిచేది
పొద్దున్నే వేడి వేడి ఫిల్టర్ కాఫీలు తాగుతూ అలా ముచ్చట్లు చెప్పుకోవడం అప్పట్లో అదో తుత్తి
ఉదయం 6. 30 గంటలు కావస్తుండగా’అయ్యగోరూ’ అంటూ పెద్దగా అరుస్తూ ఇంట్లోకి ఎంటర్ అయ్యేవాడు పెంచలయ్య
మనిషి చూస్తే ఆరడుగుల ఆజానుబాహుడు
వయసు చూస్తే 70 పైనే
బంగారం రంగు కుర్తా , కింద తెల్లటి గ్లాస్కో పంచె , చేతికి రాగి కడియం , నోట్లో బంగారపు పన్ను.. టోటల్ గా అద్దిరిపోయే క్యాస్టూమ్స్ తో ఎవర్ గ్రీన్ గా ఉండేవాడు
నేరుగా పాకీదొడ్ల వైపు వెళ్లి చీపురుతో చకచకా శుభ్రం చేసి వెళ్లిపోయేవాడు
పెంచలయ్య గెటప్ చూసి మాకు ఆశ్యర్యం వేసేది
మనిషి చూస్తే పాత సినిమాల్లో జమీందారులా ఉన్నాడు .. మరి ఈ పాకీ పనేంటి ? అనుకునేవాళ్లం
అదే మాట నాన్నను అడిగితే ‘ అది వాళ్ళ కులవృత్తి . తరతరాలుగా వాళ్ళ వంశీకులందరూ ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు
అలా అని వాళ్ళేమీ రూపాయికి లేనోళ్ళు కాదు . అయినా చేస్తారు . అదంతే ‘ అన్నారు
అలా పొద్దున్నే పనివాళ్ళ హడావుడి ఉండేది మా ఇంట్లో
ఇక ఇంట్లోకి కావాల్సిన పచారీ సరుకుల కోసం సత్యనారాయణ పురంలో ఉన్న రాజా కొట్టుకి నన్ను కూడా తీసుకెళ్లేవారు
నాన్న ఇచ్చిన పట్టీ ప్రకారం సరుకులు కడుతూనే నాకో బెల్లం ముక్క ఇచ్చి నాన్నతో కబుర్లు చెప్పేవాడు కొట్టాయన
అలా మాటల్లోనే పట్టీ మొత్తం కట్టేసి కారులో పెట్టేవాడు
అట్నుంచి బ్యాంక్ కు వెళ్లి డబ్బులు డ్రా చేసేవాళ్ళు నాన్న
విత్ డ్రాయల్ ఫారం నింపి కౌంటర్లో ఇవ్వడం , కౌంటర్లో ఉన్నాయన నాన్నని గుర్తుపట్టి’ ఎలా ఉన్నారు సార్ ? ‘ అంటూ యోగ క్షేమాలు కనుక్కుంటూనే పాస్ బుక్ మీద పెన్నుతో బాలన్స్ వివరాలు నోట్ చేసి డబ్బులూ , బుక్కు చేతిలో పెట్టేవాడు
ఆగండాగండి ,
ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నాను అనేగా మీ డౌట్ ,
అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో దూరమైపోతున్న మానవ సంబంధాలను తల్చుకుంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చింది
సాధారణంగా నేను మానవ సంబంధాలకే విలువిస్తాను
ఎందుకంటే నాన్నతో తిరగడం వల్లనూ , చిన్నప్పట్నుంచి ఇంట్లో కూరగాయలు , పచారీ సరుకులు తెచ్చిన అనుభవం ఉండటంతోనూ అలా అలవాటు అయిపొయింది
అందుకే ఇప్పటికీ కూరగాయలు బజార్లోనే తీసుకుంటాను . సూపర్ మార్కెట్ లో కొనను
పచారీ షాపులు చాలావరకు కనుమరుగు అయిపోయాయి కాబట్టి సూపర్ మార్కెట్ కు వెళ్ళక తప్పడం లేదు
అలాగే పొద్దున్నే పాల ప్యాకెట్లు ఇంటికొచ్చి వేసేందుకు దగ్గర్లోనే ఉన్న చిన్న బడ్డీ దుకాణం ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ప్యాకెట్లు వేయించుకుంటున్నా
ఆయన వయసు కూడా 70 పైనే
హోమ్ గార్డ్ గా చేసి రిటైర్ అయ్యాడట
పాలు వేసినందుకు నెలకు 50 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు
అలాగే అన్నా
మూడు వారాలబట్టి పొద్దున్నే ఆరు గంటలకు ఇంటికొచ్చి ప్యాకెట్లు వేసి పోతున్నాడు
మొత్తం డెబ్భై ఫ్లాట్స్ లో నేనొక్కడినే ఆయన దగ్గర పాల ప్యాకెట్లు తెప్పిస్తున్న
మిగిలినవాళ్ళందరూ యాప్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు
వేరేవాళ్ళెవరూ ప్యాకెట్లు వేయించుకోకపోవడంతో నా ఒక్కడికే వేయాల్సి రావడంతో ఆయన కూడా చేతులెత్తేశాడు
సరిగ్గా ఇదే సమయంలో రిలయన్స్ వారి మిల్క్ బాస్కెట్ యాప్ ద్వారా ఆఫర్లతో మిల్క్ డోర్ డెలివరీ చేస్తామంటూ మా అపార్టుమెంట్లో స్టాల్ పెట్టారు
ఈ యాప్ లో ఆర్డర్ పెట్టుకుంటే 90 రోజులపాటు మిల్క్ డెలివరీ ఫ్రీ , వారం పాటు ఆర్డర్ మీద డిస్కౌంట్
ఇంకేముంది పొలోమంటూ అందరూ రిలయన్స్ యాప్ మీద పడ్డారు
వారిలో నేనూ ఉన్నాను
వ్యాపారాలను కార్పొరేట్ ప్రపంచం తమ చేతుల్లోకి తీసుకుని మార్కెట్ ను శాసిస్తున్నప్పుడు నాలాంటి కొంతమంది కస్టమర్లు అయిష్టంగా అయినా సరే లొంగక తప్పడం లేదు
ఇప్పుడు పొద్దున్నే ఇళ్లకు వచ్చి పాల ప్యాకెట్లు వేసే సింహాచలాలు , దొడ్లు కడిగే పెంచలయ్యలు కానరారు
అన్నీ యాప్ లోనే
పొద్దున్నే డెలివరీ బాయ్ ప్యాకెట్లు గుమ్మంలో పడేసి వెళ్ళిపోతాడు
పనమ్మాయి ఒప్పుకున్న మిగతా ఫ్లాట్స్ కు వెళ్లే హడావుడిలో ఆదరాబాదరాగా వచ్చి పని చేసి వెళ్ళిపోతుంది
నిశబ్దంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు
అదీ సంగతి
పరేష్ తుర్లపాటి