Home » బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

Spread the love

ఆరడుగుల ఆజానుబాహుడు బెల్లం కొండ శ్రీను యాక్షన్ హీరోగా హండ్రెడ్ పెర్సెంట్ సెట్ అవుతాడు . గతంలో ఎన్టీఆర్ , ఎఎన్ఆర్ , కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబులు మంచి హైట్ ఉండటంతో అన్ని రకాల జానర్లకు సెట్ అయ్యేవారు . ఇటు క్లాస్ ఆడియన్సును ,అటు మాస్ ఆడియన్సును తమ నటనతో మెప్పించేవారు . తర్వాత చిరంజీవి ,బాలకృష్ణ తదితర నటుల జెనెరేషన్ నడిచింది . ఈ జెనెరేషన్ నటులలో మంచి హైట్ ఉన్న ప్రభాస్ , బెల్లంకొండ శ్రీను తదితర అతికొద్దిమంది నటులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు . అందుకే నేటి హీరోల్లో యాక్షన్ హీరోగా బెల్లంకొండ శ్రీను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు .

యాక్షన్ సినిమాల్లో నటించి మెప్పించిన బెల్లంకొండ ఇప్పుడు కిష్కింధపూరి పేరుతో హర్రర్ ,సస్పెన్స్ ,థ్రిల్లర్ జానర్లో మనముందుకు వచ్చాడు . అసలు కిష్కింధపురి అనే టైటిల్ చూడగానే ఇదేదో రామాయణ కాలం నాటి డివోషనల్ ఇతివృత్తంతో కూడుకున్నది అనుకుంటాం . కానీ ఫక్తు దయ్యం సినిమా .

కధనం ప్రారంభం అవడం మాత్రం రాముడి గుడిలో వానర సైన్యం యుద్ధం జరిగిన కిష్కింధపురి పోలికను టచ్ చేస్తూ మొదలౌతుంది . సినిమా దయ్యాలు , దుష్ట శక్తులకు సంబంధించింది కాబట్టి హీరో చేతికి రాముడి కంకణం ధరింపచేయడం కథ స్పూర్తిలో భాగమే అయ్యుంటుంది . దుష్ట శక్తులు ఒకవైపు , దైవ శక్తి మరొకవైపు అన్నది సింబాలిక్ గా చూపించే ప్రయత్నం కథ మొదట్లోనే దర్శకుడు ఎన్నుకున్నాడు .

కథ మొత్తం పూర్తి హర్రర్ జానర్లోనే మలచకుండా దైవశక్తిని కూడా కలిపే ప్రయత్నం చేసాడు. అలా డివోషనల్ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ కథను హర్రర్ థ్రిల్లర్ వైపు వేగంగా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు .

బెల్లం కొండ శ్రీను , అనుపమ పరమేశ్వరన్ జంటగా గతంలో రాక్షసుడు సినిమా వచ్చింది .వీళ్ళ కాంబో మంచి ఫలితాలు సాధించడంతో ఇండస్ట్రీలో మంచి టాక్ వచ్చింది . మళ్ళీ వాళ్లిద్దరూ పెయిర్ గా హర్రర్ జానర్ లో కిష్కింధపురి సినిమా రావడంతో ప్రేక్షకులలో సహజంగా కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి .

ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సినిమా మీద నమ్మకంతో ఒక్కో హీరో ఒక్కోరకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు . హీరోలే కాదు తన సినిమా బాగోలేకపోతే ఇక సినిమాలు చేయనని కొంతమంది దర్శకులు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఛాలెంజ్ చేస్తున్నారు . బహుశా మూవీ ప్రమోషన్ లో ఇలా ప్రకటనలు ఇవ్వడం కూడా ఒక భాగం అయినట్టుంది . అలాగే బెల్లంకొండ శ్రీను కూడా ఒక ఛాలెంజ్ విసిరారు . కిష్కింధపూరి సినిమా మొదలైన పదినిమిషాల తర్వాత ఎవరన్నా మొబైల్ ఫోన్ పట్టుకుంటే తాను సినిమాలు చేయడం మానేస్తానని బెల్లంకొండ శ్రీను కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది . సినిమా చూసే ప్రేక్షకుడు అంతగా థ్రిల్ అయి ఫోన్ కూడా చూడరని ఛాలెంజ్ చేసారు .

మరి కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే అంతగా థ్రిల్ చేసిందా ? అంతగా భయపెట్టిందో ? లేదో ? ఇప్పుడు చూద్దాం .

కథ విషయానికి వస్తే ,

ఈ టైపు దయ్యం కథలతో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చినప్పటికీ దర్శకుడు కౌశిక్ కిష్కింధపురిని వినూత్నంగా తెరకెక్కించి ప్రేక్షకులను థ్రిల్లింగ్ లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు . కొన్ని కధలు మనం గతంలో చాలా సినిమాల్లో చూసినా కూడా ఆ పోలిక బయటపడకుండా కొంతమంది దర్శకులు తమదైన స్టైల్ లో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ తో తీసి ప్రేక్షకులను మెప్పించగలరు .

ఇక ఈ మూవీ విషయానికి వస్తే 1989 లో ఓ రేడియో స్టేషన్లో జరిగిన కధే కిష్కింధపురి .
మీరు గమనించారా ? ఇప్పటికీ పెద్ద పెద్ద మాల్స్ లోనూ , ఎగ్జిబిషన్స్ లోనూ దయ్యాల కొంప అని చీకటి హట్ లు ఉంటాయి . డెవిల్స్ డెన్ అని ఏవేవో పుర్రె బొమ్మలతో బోర్డులు కూడా పెడతారు . టికెట్లు తీసుకుంటే చీకటి గుహలోకి పంపిస్తారు. తీరా లోపలికి వెళ్తే చుట్టూ చిమ్మచీకటి తప్ప ఏమీ కనిపించదు . ఆ చీకట్లోనే అస్థిపంజరాల బొమ్మలను ఏర్పాటు చేసి భయపెట్టడానికి ప్రయత్నిస్తారు . లోపల సెట్టింగ్స్ చూస్తే చాలామంది థ్రిల్ అవుతారు .. కొంతమంది భయపడతారు .

ఈ సినిమా కోసం దర్శకుడు కూడా అలాంటి కాన్సెప్ట్ నే ఎన్నుకున్నాడు . ఘోస్ట్ వాకింగ్ టూర్ పేరిట థ్రిల్లింగ్ అస్సైన్మెంట్లు చేస్తుంటారు రాఘవ ( బెల్లంకొండ ) మైధిలి ( అనుపమ)
దయ్యాలు , ప్రేతాత్మల ఎక్స్పీరియన్స్ సభ్యులకు కలిగేలా టూర్ కండక్ట్ చేయడం వీరి పని. నిజానికి నిజ జీవితంలో ఇలాంటి ఘోస్ట్ వేకింగ్ టూర్లు ఉండవనుకుంటా .. సినిమాటిక్ లిబర్టీ కోసం దర్శకుడు ఛాయిస్ తీసుకున్నాడు .

అలా ఓ 11 మందిని కిష్కింధపురి లో ఉన్న సువర్ణ మాయ అనే రేడియో స్టేషన్ కు తీసుకెళ్తారు . ఎప్పుడో మూతపడి పాడుబడ్డ ఆ రేడియో స్టేషన్లోకి తలుపులు బద్దలు కొట్టుకుని మరీ ప్రవేశిస్తారు . అయితే అక్కడే వీరికి ఊహించని అనుభవం ఎదురౌతుంది .

లోపల వేదవతి అనే దయ్యం వీరిలో ఒకరొకర్ని చంపేస్తూ ఉంటుంది . ఊహించని ఈ పరిణామానికి రాఘవ ముందు భయపడతాడు .. ఆ తర్వాత ధైర్యంగా ఎదుర్కొంటాడు .

అసలు సువర్ణమాయ రేడియో స్టేషన్ ఎందుకు మూత పడింది ?

వేదవతి అనే రేడియో ఆర్టిస్ట్ దయ్యంగా ఎందుకు మారింది ?

ఈ 11 మందిని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తుంది ?

సువర్ణమాయలో ఉన్న రాక్షస శక్తి విశ్వవపుత్ర( శాండీ మాస్టర్ ) ఎవరు ?

రాఘవ విశ్వవ పుత్రను ఎలా ఎదుర్కొంటాడు ?
అనేవి మిగతా కధలో తెలుస్తాయి .

ఎలా ఉంది ?

సాధారణంగా హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీల్లో లాజిక్కులు మిస్ అవుతూ ఉంటాయి . కిష్కింధపూరి కూడా లాజిక్కులజోలికి పోకుండా చూస్తే నచ్చుతుంది . మరీ ముఖ్యంగా ఆ జానర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి నచ్చే అవకాశం ఉంది . ఫస్టాఫ్ లో కధనం కొంత సాగతీత ధోరణిలో సాగుతుంది . ఎప్పుడైతే ఈ బృందం రేడియో స్టేషన్లో అడుగుపెడుతుందో , అప్పట్నుంచి కధనంలో వేగం పెరుగుతుంది . అక్కడ ఎదురయ్యే కొన్ని సన్నివేశాలు థ్రిల్ పంచుతాయి . సెకండాఫ్ దర్శకుడు పూర్తిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు . క్లైమాక్స్ సన్నివేశాలు బాగుంటాయి .

ఎవరెలా చేసారు ?

హర్రర్ జానర్ కు తగినట్టుగా చక్కటి హావభావాలు ప్రదర్శించి తనకు ఇది కొట్టిన పిండి అనిపించుకున్నాడు బెల్లంకొండ . గతంలో యితడు రాక్షసుడు సినిమాలో కూడా చక్కటి పెర్ఫార్మన్స్ చూపించి ప్రేక్షకుల మెప్పు పొందాడు . కిష్కింధపురి క్లైమాక్సులో తనతో తానే పోట్లాడుకునే సన్నివేశంలో గూస్ బంప్స్ తెప్పించాడు . అలాగే సినిమాలో బెల్లంకొండకు మంచి డైలాగులు పడ్డాయ్

.ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా నటన పరంగా చక్కటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించింది
ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు దయ్యం ఆవహించే సీన్ లో భయపెట్టింది .

సినిమాని అనుకున్న విధంగా థ్రిల్లింగ్ గా మలచడంలో చాలావరకు దర్శకుడు కౌశిక్ విజయం సాధించాడు . అవసరమైన చోట ట్విస్టులతో కథను రకరకాల మలుపులు తిప్పాడు.

సువర్ణమాయ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యేవరకు ప్రేక్షకులు అదే థ్రిల్ పొందుతారు . ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుందో కథ ప్రేక్షకులకు అర్దమైపోయి రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది .

ఈ సినిమాలో ఇంకో కీలకమైన పాత్ర విశ్వవపుత్ర . మంచి పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర . శాండీ మాస్టర్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.

సాంకేతికత

ఇటువంటి దయ్యం సినిమాలకు ప్రాణం పోసేవి విజువల్స్ అండ్ బీజీఎమ్
ఆ రెండూ సరిగా లేకపోతే ప్రేక్షకులకు థ్రిల్ రాదు .

విజువల్స్ పరంగా చిన్మయ్ సలాస్కర్ చక్కటి సినిమాటోగ్రఫిని ప్రదర్శించగా , చైతన్య భరధ్వాజ్ బీజీఎమ్ స్కోర్ తో హైప్ తీసుకొచ్చారు .నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి .

విశ్లేషణ

బెల్లంకొండ శ్రీను ఛాలెంజ్ చేసినట్టుగా సినిమా ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది . అయితే దర్శకుడు చెప్పినట్టుగా భయపెట్టడం అయితే జరగలేదు . అక్కడక్కడా కొన్ని సాగతీత సన్నివేశాలు కూడా ఉండటం మైనస్ అవుతుంది . ఎప్పుడైతే కధనాన్ని దైవశక్తికి , దుష్ట శక్తికి మధ్య పోరాటంగా మలిచారో అప్పుడే రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది . కొన్నిచోట్ల దర్శకత్వ లోపాలు ఉన్నప్పటికీ బెల్లంకొండ శ్రీను ,అనుపమ నటనల ముందు కవర్ అయిపోయాయి . ఓవరాల్ గా సినిమా బోర్ అయితే కొట్టదు . అలా అని సూపర్ హిట్ బొమ్మ కూడా కాదు . హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి నచ్చుతుంది .

నటీనటులు : బెల్లంకొండ శ్రీను , అనుపమ పరమేశ్వరన్ , తనికెళ్ళ భరణి , హైపర్ ఆది , శ్రీకాంత్ అయ్యంగార్ , శాండీ మాస్టర్
నిర్మాత సాహు గారపాటి
దర్శకుడు : కౌశిక్ పెగళ్ళపాటి
సెప్టెంబర్ 12 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!