దమ్ముంటే నన్ను పట్టుకోండి చూద్దాం అని పోలీసులకే సవాల్ విసిరి దొరికిపోయిన ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలో విచారిస్తుంటే ఒకటొకటి విషయాలు బయటికి వస్తున్నాయి
తాను చేసేది అక్రమ పైరసీ వ్యాపారం అని తెలిసి కూడా ఇమ్మడి రవి ఎవరికీ భయపడలేదు
ఎవరికీ దొరక్కుండా పెద్ద పెద్ద నిర్మాతలను , పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు
అసలు ఐ బొమ్మ ఓనర్ ఎవరో ? ఎలా ఉంటాడో ? ఎక్కడ ఉంటాడో లాంటి వివరాలు ఒక్కటి కూడా బయటికి రాకుండా కొన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు కునుకు లేకుండా చేసాడు
సినిమా ఇలా థియేటర్లలో విడుదలైన మరుక్షణమే ఐ బొమ్మ సైట్లో కూడా ప్రత్యక్షము అయ్యేది
పోనీ నాసిరకం క్వాలిటీయా అంటే అదీ కాదు
చక్కటి HD క్వాలిటీతో పైసా ఖర్చులేకుండా సినిమాలు అందించాడు
దీనితో చాలామంది దిగువ మధ్య తరగతి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడమే మానేశారు
పైపెచ్చు ఫలానా సైట్లో బొమ్మ చూసాం . క్వాలిటీ బాగుంది . మీరు కూడా చూడండి అంటూ సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ కూడా ఇచ్చారు
దానితో ఆ సైట్ కు గణనీయంగా వ్యూయర్షిప్ పెరిగింది
అతడి ధాటికి తట్టుకోలేక బడా నిర్మాతలు కట్టకట్టుకుని పోలీసుల దగ్గరికి వెళ్లి పైరసీ నుంచి తమని కాపాడమని మొరపెట్టుకున్నారు
అప్పటికి హైదరాబాద్ సీపీ గా ఉన్న సివి ఆనంద్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని త్వరలో పైరసీ నిర్వాహకుడిని పట్టుకుని తీరతాం అని బహిరంగ ప్రకటన చేసారు
కానీ పోలీసులు కూడా ఊహించని రీతిలో దమ్ముంటే తనను పట్టుకోమని తన సైట్ ద్వారా నిర్వాహకుడు ఛాలెంజ్ చేసాడు
సరే ఎలాగైతేనేమి చివరకు ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకు దొరికాడు
కస్టడీలో పోలీస్ విచారణ సందర్భంగా గుర్తు లేదు , మర్చిపోయా , తెలియదు లాంటి వంకరటింకర సమాధానాలు ఇచ్చిన రవి ఆఖరి రోజున మాత్రం గతంలో తాను విజయ్ దేవర కొండకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు
రవి ఆయనకు వార్నింగ్ ఇవ్వడం వెనుక చిన్న నేపధ్యం కూడా ఉంది
ఐ బొమ్మ పైరసీ సైట్ తో చిత్ర పరిశ్రమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన విజయ్ దేవరకొండ కూడా పోలీసుల మాదిరే గతంలో ఈ నిర్వాహకుడిని హెచ్చరించాడు
అంతేకాదు ఈ సైట్ ను ఎలాగైనా క్లోజ్ చేయించాలని యాంటీ పైరసీ సైట్ ఏజెన్సీలకు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాడు
ఈ సందర్భంగానే రవి ఆయన్ని హెచ్చరిస్తూ సైట్ లో ఓ ప్రకటన ఉంచాడు
ఇంతకీ ఆ హెచ్చరిక ఏంటి ?
” మా టీమ్ ముందే చెప్పింది . అయినా మీరు మా మాట వినటం లేదు . మీరు మా మీద ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది . ఎలాగైనా మా సైట్ ను తొక్కేయాలని మీరు కొందరు ప్రైవేట్ ఏజెన్సీలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు . కానీ మీకు తెలియంది ఒకటుంది . వాళ్ళు మమ్మల్ని తొక్కుతున్న పేరుతొ ఐ బొమ్మ ఎఫ్ ఎఫ్ డాట్ ఇన్ పేరుతొ డూప్లికేట్ సైట్ రన్ చేస్తున్నారు . అత్యుత్సాహంతో మీరు చేస్తున్న పనికి ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది . మీ కింగ్డమ్ సినిమాని విడుదలకు ముందే సైట్లో ఉంచుతాను . దమ్ముంటే ఆపుకోండి ” అని విజయ్ దేవరకొండకే సవాల్ విసిరాడు
రవి తన సైట్ కి ఐ బొమ్మ అని , బప్పం అని పేర్లు పెట్టడం వెనుక అసలు రహస్యం ఏంటి ?
పోలీస్ విచారణలో పైరసీ సైట్ కి ఆ పేరు పెట్టడం వెనుక అసలు కారణాలను కూడా రవి వెల్లడించాడు
విశాఖ వాసి అయిన రవి తరచూ స్థానిక థియేటర్లలో సినిమాలు చూసేవాడు . అక్కడ థియేటర్లలో బొమ్మ పడింది అనే మాట తరచూ వినటంతో తన సైట్ కి ఐ బొమ్మ అనే పేరు పెట్టినట్టు చెప్పారు .
అడ్మిన్ బప్పం నేమ్ అని పెట్టడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు
బప్పం అంటే సుప్రీం అని తన సైట్ కు తానే సుప్రీం కాబట్టి ఆ పేరు పెట్టినట్టు చెప్పాడు
రవి తన సైట్ కి ఏదో తోచిన పేర్లు పెట్టకుండా బాగా ఆలోచించే పెట్టాడని తెలిసి పోలీసులు ఆశర్యపోయారు
నేనే రాజు .. నేనే మంత్రి
ఐ బొమ్మ వెనుక నువ్వు కాకుండా ఇంకెందరున్నారని పోలీసులు ప్రశ్నించినప్పుడు రవి నేనే రాజు .. నేనే మంత్రి టైపులో సమాధానం చెప్పాడట .
ఈ సైట్ నిర్వహణ బాధ్యతంతా తాను ఒక్కడినే చూసుకునేవాడినని చెప్పారు . తనకింద పనివాళ్ళు ఎవరూ లేరని చెప్తూ , కరీబియన్ , యూకే లలో కొంతమంది అవుట్ సోర్చింగ్ ఉద్యోగుల ద్వారా డిజైనింగ్ ,మరియు , ఇతర నిర్వహణా పనులు చేయించుకునేవాడినని చెప్పాడు
డొమైన్లలో అప్లోడ్ చేసిన తెలుగు సినిమాలను కొన్ని టెలిగ్రామ్ యాప్ ల ద్వారా కొనుగోలు చేసినట్టు చెప్పాడు
ఐ బొమ్మ సైట్ వెనుక ఎవరూ లేరు . కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పైరసీ మార్గాన్ని ఎంచుకున్నట్టు విచారణలో రవి ఒప్పుకున్నాడు !
