రెండేళ్లుగా ఆక్టివ్ రాజకీయాలు చేయకుండా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ అకస్మాత్తుగా జనంలోకి రావడం వెనుక కారణాలు ఏంటి ?

Spread the love

తెలంగాణాలో ఓటమి తర్వాత ఈ రెండేళ్లలో అరుదుగా మినహా కేసిఆర్ ఫార్మ్ హౌస్ విడిచిపెట్టి పార్టీ కార్యక్రమాలకు రాలేదు . కానీ ఆదివారం అకస్మాత్తుగా ఆయన తెలంగాణా భవన్ కు వచ్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు . ఇప్పటిదాకా ఒక లెక్క , ఇకపై ఒక లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు . ఇకపై జనంలో ఉంటానని ప్రకటించారు .

కేసిఆర్ లో అకస్మాత్తుగా ఈ మార్పు రావడానికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషణ చేసుకుందాం .

రాజకీయాల్లో పటిష్టమైన వ్యూహకర్తగా కేసీఆర్ కు మంచి పేరుంది .
అందుకే దశాబ్దాల తరబడి మహామహులు సాధించలేని ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సాధించారు.

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది . డెబ్భైయ్యవ దశకంలో చాలామందికి రాజకీయ పునరావాసం కల్పించిన పార్టీ కాంగ్రెసే . మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదన్ మోహన్ ను తన గురువుగా భావించి ఆయన తరపున పనిచేసాడు . తరువాయి కాలంలో తన గురువు మీదే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు .

83 లో ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందులో చేరాడు . 1985 లో తెలుగుదేశం పార్టీ తరపున సిద్ధిపేట నుంచి పోటీ చేసిమొదటిసారి శాసన సభలో అడుగుపెట్టారు . ఆ తర్వాత 87 -88 లో కేసీఆర్ కు క్యాబినెట్లో బెర్త్ దొరికింది .

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో ఈయన గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ . మిగిలిన మంత్రుల మాదిరి క్యాబినెట్లో కేసీఆర్ కూడా ఒక మంత్రి అంతే
అంతకుమించి ప్రత్యేక ఐడెంటిటీ ఏమీ లేదు .

1983 – 84 ఎన్టీఆర్ మొదటి క్యాబినెట్లో అసలు కేసీఆర్ లేడు . రెండోసారి ఏర్పడిన క్యాబినెట్లో మాత్రమే కేసీఆర్ కు చోటు దక్కింది . ఆ క్యాబినెట్లో కూడా ఆయన జూనియర్ కోటాలోనే గుర్తించబడ్డాడు.

ఇంకోరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ క్యాబినెట్లో ప్రాధాన్యతా క్రమంలో చంద్రబాబు , దగ్గుబాటి వెంకటేశ్వర రావు ,యనమల రామకృష్ణుడు , పూసపాటి అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ మంత్రులు ముందు వరుసలో ఉంటే , చివరి వరుసలో కేసీఆర్ తదితరులు ఉండేవారు .

అప్పటికి కేసీఆర్ లో ప్రత్యేక తెలంగాణా ఊసులు లేవు . సమైక్య రాష్ట్రంలో మంత్రిగా తన పనులు తాను చేసుకుంటూ పోయాడు .

1999 లో చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో బయటికి వచ్చేసారు .
2001 లో టిడిపికి , శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణా నినాదంతో టీఆరెస్ పార్టీని స్థాపించాడు .

ఒకపక్కన ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూనే కేంద్రంలో కూడా తన గళాన్ని వినిపించడానికి కరీమ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు .

అప్పట్లో యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చి కేసీఆర్ కేంద్రమంత్రి కూడా అయ్యారు . తర్వాత రెండేళ్లలోనే తన పదవులకు రాజీనామా చేసి తిరిగి తెలంగాణాలో ఆక్టివ్ ఉద్యమాలు చేసాడు . 2009 డిసెంబరులో నిరాహార దీక్షకు కూర్చుని కేంద్రంతో ప్రత్యేక తెలంగాణా కు ఓకే చెప్పించుకున్నారు . 2014 లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసారు . 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు .

అలా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ 2023 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు . గజ్వేల్ , కామారెడ్డిల నుంచి పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు .

తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రిగా తననితాను ప్రకటించుకున్న కేసీఆర్ ఓడిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ?

రెండోసారి కూడా తనని ముఖ్యమంత్రి పదవి వరించడంతో కేసీఆర్ దృష్టిజాతీయ రాజకీయాలవైపు మళ్లింది . కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికట్టి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసాడు .

ఇంతవరకు బాగానే ఉంది ,

కానీ అంతటి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ ఉత్సాహంలో , ఉద్రేకంలో అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు . తెలంగాణాలో ప్రజలు తనకు పట్టంకట్టింది ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని చూసే అన్న సంగతి మర్చిపోయాడు .

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ప్రాంతీయభావంతో నిండిఉన్న పార్టీపేరు పనికిరాదని భావించాడు . అందుకే పార్టీ పేరులో తెలంగాణాని తీసేసి భారత్ ను చేర్చాడు . కానీ తన నిర్ణయం పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆ క్షణాన ఆయన ఊహించలేకపోయారు .

ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణాని తీసేసాడో అప్పుడే ప్రజలు తెలంగాణ నుంచి ఆయన్ని తీసేసారు . దీంతో కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది . కొండనాలుక్కి మందు వేస్తె ఉన్న నాలుక ఊడినట్టు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అత్యాశతో ఆయన చేసిన ఆలోచన వల్ల , దేశం సంగతి అటుంచితే తెలంగాణాలో కూడా గెలవలేకపోయాడు .

ఈ పరిణామాలు కేసీఆర్ ఊహించనివి . ఘోర ఓటమితో కేసీఆర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. దాంతో తాత్కాలికంగా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఎర్రవల్లిలోని తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు . ఎంతలా అంటే తొలినాళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ సైతం ప్రకటనలు చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా సభకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్ కి పదేపదే విజ్ఞాపనలు చేసేంతదాకా వెళ్ళింది .

అయినా కేసీఆర్ లో చలనం లేదు . అసెంబ్లీకి తప్పనిసరి హాజరు నిబంధన ఉండటంతో ఒకసారి మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు . ఇంకోసారి వరంగల్ సభకు బయటికి వచ్చారు .
మిగిలిన రెండుమూడు సార్లు హెల్త్ చెకప్ ల కోసం బయటికి వచ్చారు మినహా ఫార్మ్ హౌస్ గడప దాటలేదు .

కేసీఆర్ రాజకీయ వైరాగ్యానికి కారణాలు ఏంటి ?

కేసీఆర్ మంచి వ్యూహకర్త అని జనాలు నమ్మడమే కాదు ఆయన కూడా నమ్ముతారు . తన వ్యూహం ఫలించే తెలంగాణా దక్కినప్పుడు అదే వ్యూహంతో ముందుకెళితే భారత్ ఎందుకు దక్కదు ? అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచన చేసారు ఆయన .

దానికి తగ్గట్టుగానే కేసీఆర్ మాట్లాడేవారు . అనేక సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించారు . సరే , రాజకీయాల్లో విమర్శలు ఎటూ ఉండేవే . కానీ కేసీఆర్ ఒక దశలో ఆ లిమిట్ దాటేసి మోడీ బోడి అంటూ వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు .

రాజకీయాల్లో మరింత దూకుడు పెంచారు . దేశ రాజకీయాలను మలుపు తిప్పుతానని చెప్తూ రాష్ట్రాలు తిరిగారు .

ఎందుకైనా మంచిదని ఇతర ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ తో ఆచితూచి వ్యవహరించాయి
కర్ణాటక నుంచి ఒక్క కుమార స్వామి మినహా ఇంకెవరూ ఆక్టివ్ సపోర్ట్ ఇచ్చినట్టు కనిపించలేదు .

మోడీని ఢీకొట్టడం మహామహులకే సాధ్యం కావడం లేదు . కేసిఆర్ కన్నా ముందే గతంలో అన్ని పార్టీలు కూటమి కట్టి ప్రయతించినప్పటికీ మోడీని ఓడించలేకపోయారు . అప్పుడైనా కేసీఆర్ పునరాలోచించుకుంటే పరిస్థితి ఎట్లా ఉండేదో తెలీదు కానీ ముందువెనుకలు చూసుకోకుండా దూకుడుగా వెళ్లిపోయారు .

ఫలితం తెలంగాణలోనే ఘోర ఓటమి . దరిమిలా కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుపాలవడం ఆయన్ని మానసికంగా కృంగదీసింది . ఒకపక్కన పార్టీ ఓటమి , ఇంకోపక్కన బిడ్డ జైలుకెళ్లడంతో ఆయనపై ముప్పేట దాడి చేసినట్లయింది .

ఈ పరిస్థితుల్లో కిందపడి తుంటి ఫ్రాక్చర్ అవడంతో బయట కదల్లేని పరిస్థితులు వచ్చి ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయారు . దాంతో ఆయనకి రాజకీయ వైరాగ్యం వచ్చింది .

కవిత ఎపిసోడ్

బీజేపీ మీద కేసీఆర్ దూకుడు తగ్గటానికి కవిత ఎపిసోడ్ కూడా ఒక కారణం . ఒకప్పుడు మోడీ మీద , బీజేపీ మీద ఒంటికాలుమీద లేచిన కేసిఆర్ ఓటమి తర్వాత మౌనవ్రతం పాటించడం వెనుక కవిత ఉదంతం కూడా ఉంది .

ఆఖరికి కవిత కూడా బీజేపీ మీద ఎందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని తండ్రికి లేఖ రాసేదాకా వెళ్ళింది . అయినా కేసిఆర్ నోరు విప్పలేదు . దరిమిలా కవిత పార్టీనుంచి బయటికి వచ్చేసి సొంత కుంపటి పెట్టుకుంది .

ఇది కూడా కేసిఆర్ వ్యూహమేనా ?

కేసిఆర్ ను కాదని కవిత బయటికి రావడం చాలామంది ఊహించలేకపొతున్నారు . కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులలో మాత్రం ఇదంతా కేసిఆర్ వ్యూహం అనే అనుమానాలు కూడా ఉన్నాయి .

కేసిఆర్ గతంలోలాగా బీజేపీ మీద దూకుడుగా వెళ్లాలంటే కవిత ఇష్యూ ఆయనకి పంటికింది రాయిలా తగులుతుంది . కవిత వల్ల ఆయనకి రెండు రకాల అప్రతిష్ఠలు వచ్చాయి . లిక్కర్ స్కాం లో అవినీతికి పాల్పడిందని ఆమె మీద కేసులు నమోదు అవడంతో తండ్రిగా తనకు అప్రతిష్ట రావడం అటుంచి పార్టీ పరంగా కూడా కేసిఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి .

దాంతో బీజేపీతో రాజకీయ పోరాటానికి సిద్దమైనప్పుడల్లా వాళ్ళు లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న కూతురి చిట్టా బయటికి తీస్తున్నారు . కేసిఆర్ కూతురిగా కవిత పేరు చెప్పుకున్నన్నాళ్లు ఆయనకి ఈ ఇబ్బందులు తప్పవు . అదే కూతురితో తండ్రికి కుటుంబ బాంధవ్యాలు లేవని తెలిసినప్పుడు శత్రువుల టార్గెట్ కూడా మారుతుంది . దృష్టి కవిత మీదనుంచి ఇంకోవైపు మళ్లుతుంది .

ఈ వ్యూహంలో భాగంగానే కవిత తాత్కాలికంగా బయటికి వచ్చి ఉంటుందనే అనుమానాలు కూడా కొన్ని పార్టీ వర్గాల్లో ఉన్నాయి .

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసిఆర్ ఇప్పుడెందుకు బయటికి వస్తున్నారు ?

ఇందాక కేసిఆర్ రాజకీయ వైరాగ్యం గురించి చెప్పుకున్నాం కదా
అందులో కూడా ఒక వ్యూహం ఉందని టాకు .

కేసిఆర్ అంతిమ గోల్ ఏంటి ?
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం

ఎప్పట్నుంచో ఈ ఆలోచన ఉందికాబట్టి ప్రధాని మోడీని కూడా తన బిడ్డను ఆశీర్వదించమని అడిగారు కదా .

అంతా సక్రమంగా జరిగిఉంటే 2023 లో కేటీఆర్ ను తెలంగాణా సీఎం చేసి తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఢిల్లీలో సెటిలైపోదామని కేసిఆర్ భావించారు . భావించడమే కాదు , ఢిల్లీలో బ్రహ్మాండమైన పార్టీ ఆఫీసును కూడా కట్టుకున్నారు .

ఫలితాలు తారుమారు అయి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే మిగిలిపోవడంతో ఆయన మరింత నిరాశలో మునిగిపోయాడు .

అయినా కేసిఆర్ లోని నాయకుడు మేలుకునే ఉన్నాడు
ఈ దశలో ఆయన కేటీఆర్ నాయకత్వానికి ఒక పరీక్ష పెట్టారు . ఓటమి తర్వాత పార్టీ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ మీదే పెట్టి బిఆర్ఎస్ ను తిరిగి గెలిపించే టాస్క్ కూడా అప్పగించారు .

కేటీఆర్ కూడా అదెంత పనిలే అనుకున్నారు . మొదట్లో అంతర్గత తగాదాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరునెలల్లోనే కూలిపోయి ఎన్నికలు వస్తాయని భావించారు . ఆరునెలలు పోయి రెండేళ్లు అవుతున్నా రేవంత్ ప్రభుత్వం అంగుళం కూడా కదలకపోవడంతో ఉప ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు .

పార్టీకి కంచుకోటలా ఉన్న జూబిలీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఓడిపోవడంతో ఖంగు తిన్నారు . అక్కడా పరాభవమే ఎదురవడంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదాం అనుకున్నారు . ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యం పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకత్వానికి అర్థమైపోయింది . వాళ్ళకే కాదు కేటీఆర్ కు కూడా అసలు విషయం అర్థమైంది .

రెండేళ్లుగా దాదాపు ప్రతి ఎన్నికలో ఓటమి ఎదురవుతూ ఉందంటే అది నాయకత్వ లోపంగానే భావిస్తారు . ఇదే ఏ జాతీయపార్టీలోనో అయితే పదవి ఎప్పుడో పోయేది .

దాంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మునిగిపోతున్న నావలా ఉన్న పార్టీని రక్షించి ఒడ్డున చేర్చగల నాయకత్వ సామర్థ్యం బిఆర్ఎస్ లో ఒక్క కేసిఆర్ కు మినహా మరెవరికీ లేవని అందరికీ అర్థమైంది .

దాంతో ఆరోగ్యం సహకరించినా , సహకరించకపోయినా ప్రజల్లోకి కేసిఆర్ రంగప్రవేశం అనివార్యమైపోయింది .

కేసిఆర్ వస్తే ఏమౌతుంది ?

నిస్తేజంగా ఉన్న పార్టీకి ఖచ్చితంగా జవసత్వాలు వస్తాయి.
ద్వితీయశ్రేణి నాయకత్వంలో కూడా జోష్ వస్తుంది . కేసిఆర్ నాయకత్వ సామర్థ్యం , అనుభవం పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి .

నిద్రాణంగా ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి కదనరంగం వైపు నడిపించడం కేసిఆర్ కు తెలుసు . జాతీయ రాజకీయాల సంగతి ఏమో కానీ తెలంగాణాలో తిరిగి పాత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ప్రజల్లో కదలికలు తీసుకురాగలడు .

అందుకే నిజంగా అన్నాడో , కాకతాళీయంగా అన్నాడో తెలీదు కానీ మొన్నటి మీటింగులో కేసిఆర్ తమ పార్టీపేరును టీఆరెస్ అనే పలికారు . ఒకరకంగా బిఆర్ఎస్ శ్రేణులు అందరూ కేటీఆర్ నాయకత్వంకన్నా ఇప్పటికీ కేసిఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు .

చూద్దాం
కేసిఆర్ రాకతో తెలంగాణా రాజకీయాలు ఏ రకమైన మలుపు తీసుకుంటాయో చూద్దాం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!