Home » సంజు బ్యాటు ..అక్సర్ క్యాచు..వెరసి థ్రిల్లింగ్ మ్యాచు – మనోళ్లు సెమి ఫైనల్స్ గెలిచారు

సంజు బ్యాటు ..అక్సర్ క్యాచు..వెరసి థ్రిల్లింగ్ మ్యాచు – మనోళ్లు సెమి ఫైనల్స్ గెలిచారు

Spread the love

ఆటలో వార్ వన్ సైడ్ అయితే థ్రిల్ ఉండదు
హోరాహోరీ పోరాడి గెలిస్తే వచ్చే కిక్ వేరు

నిన్న(మార్చి 5 ) ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా , ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన టి 20 ప్రపంచ కప్ సెమి ఫైనల్స్ అటువంటి ఉత్కంఠతనే రేపింది

ఇందులో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు

ఇంగ్లాండ్ టీమ్ లో చూస్తే మైదానంలో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే ఓపెనర్స్ ఉన్నారు

ఇటువైపు ఇండియా టీమ్ చూస్తే బ్యాటు ఎత్తితే సిక్సర్లు బాదే సంజు ఉన్నాడు

బూమ్ బూమ్ అంటూ నేరుగా వికెట్లమీదకు బంతిని విసిరే బుమ్రా ఉన్నాడు
బంతిని వంద కిలోమీటర్ల వేగంతో వికెట్ల మీదకు పరిగెత్తించే హార్దిక్ పాండ్యా ఉన్నాడు

అయినా గెలుపు మీద ఎవరి ధీమా వారిదే

ఇద్దరి లక్ష్యం ఒకటే
సెమి ఫైనల్స్ గెలిచి ఫైనల్స్ చేరాలి

లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు లక్ష్యానికి అనుగుణంగా మైదానంలో ఇరు జట్లు బంతులను రఫ్ఫాడేశారు

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ గురించి చిన్న విశ్లేషణ చేసుకుందాం

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది
ఇక్కడ క్రికెటర్లకు ఇదో సెంటిమెంట్ అనుకుంటా
గతంలో వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీములే ఎక్కువగా గెలిచిన చరిత్ర ఉంది

ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు అందరి దృష్టి సంజు సాంసన్ మీదనే ఉంది

ఎందుకంటే ఇండియా .. ఇంగ్లాండ్ తో సెమి ఫైనల్స్ ఆడటానికి సంజు బ్యాట్ పవరే కారణమని అందరికీ తెలిసిన విషయమే

ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించాలంటే భారీ స్కోర్ చేయడం తప్పనిసరి అని అప్పటికే సూర్య టీమ్ కు అర్థమైంది

పిచ్ పరంగా కానీ , వాంఖడే స్టేడియం విస్తీర్ణం పరంగా కానీ పరుగులకు ఎక్కువగా అవకాశం ఉంది
ఈ అవకాశాన్ని సూర్య జట్టు చక్కగా వాడుకుంది

అందరూ ఊహించినట్టుగానే సంజు మైదానంలో మరోసారి చెలరేగిపోయాడు

కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించి ఎడాపెడా బాదేసాడు
ఇందులో 8 ఫోర్లు , 7 సిక్సులు ఉన్నాయి

పరుగుల వేటలో సంజు కి శివమ్ దూబే , ఇషాన్ కిషన్ లు సపోర్ట్ గా నిలబడ్డారు

శివమ్ దూబే 25 బంతుల్లో 43 పరుగులు చేసాడు ( ఇందులో ఒక ఫోర్ , నాలుగు సిక్సులు ఉన్నాయి )

అలాగే ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు సాధించాడు ( 4 ఫోర్లు , రెండు సిక్సులు )

తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా , తిలక్ వర్మలు కూడా దూకుడుగా ఆడి భారత స్కోర్ పెరగడానికి దోహదపడ్డారు

హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేయగా , తిలక్ వర్మ 21 పరుగులు చేసారు

మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు మీద భారీ లక్ష్యాన్ని పెట్టింది

స్కోర్ టార్గెట్ చూసుకుంటే ఇంగ్లాండ్ గెలుపు అంత తేలికేమీ కాదు

ఒకపక్కన భారత బౌలర్ల ధాటికి వికెట్లు కాపాడుకుంటూ రన్ రేట్ జాగ్రత్తగా పెంచుకోవాలి

ఓపెనింగ్ వికెట్లు కూలితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల మీద వత్తిడి పెరిగి రన్ రేట్ మీద ప్రభావం చూపిస్తుంది

అయినా ఇంగ్లాండ్ జట్టు ఆత్మ విశ్వాసంతోనే మైదానంలోకి దిగింది

అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో బెతేల్ దూకుడుగా ఆడకపోతే వార్ వన్ సైడ్ అయిపోయేది

జట్టు భాగస్వామ్యులు ఒకరొకరుగా పెవిలియన్ బాట పడుతున్నా బెతేల్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడు

కేవలం 48 బంతుల్లో 105 పరుగులు సాధించి భారత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు

దీనితో భారత్ గెలుపు ఊహించినంత తేలిక కాదని టీమ్ ఇండియాకు అర్థమైంది
ఈ పరుగుల ధాటికి బ్రేక్ వెయ్యాలి అని బౌలర్లకు అర్థమైంది

క్యాచులతో పట్టేశారు

ఈ బ్రేక్ బుమ్రా బౌలింగులో అక్సర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ద్వారా ఏర్పడింది

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కనుక క్రీజులో సెటిల్ అయితే అతన్ని పెవిలియన్ కి పంపటం ఎవరి వల్ల కూడా కాదు

అందుకే బుమ్రా తెలివిగా బ్రూక్ వైపు స్లోగా వేసిన బంతి గాల్లోకి లేచింది
ఈ అవకాశాన్ని అక్సర్ చేజార్చుకోదల్చుకోలేదు
షుమారు 24 మీటర్లు వెనక్కి పరిగెత్తి మరీ బంతిని ఒడిసిపట్టుకున్నాడు

దాంతో ఇంగ్లాండ్ పరుగుల ధాటికి చిన్న బ్రేక్ పడింది

రెండో క్యాచ్ కూడా అద్భుతంగా పట్టిన అక్సర్

ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ మెల్లి మెల్లిగా క్రీజులో సెటిల్ అవుతున్నాడు

అతడ్ని కూడా భారత బౌలర్లు తెలివిగా పెవిలియన్ బాట పట్టించారు

13 వ ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ తెలివిగా ఫుల్ టాస్ వేసాడు
విల్ జాక్స్ బౌలర్ ట్రాప్ లో పడి సిక్స్ బాదటం కోసం బంతిని గాల్లోకి లేపాడు

బాల్ బౌండరీ లైన్ దాటిందనే అతను అనుకున్నాడు

కానీ అక్సర్ మెరుపులా ఆ బంతిని క్యాచ్ చేయడానికి బౌండరీ లైన్ వైపు పరుగులు తీసాడు
బంతి చేతిలో పడింది కానీ లైన్ దాటుతున్నా అని అతడికి అర్థమైంది

అంతే , క్షణం ఆలస్యం చేయకుండా లైన్ లోపల ఉన్న శివమ్ దూబే చేతిలోకి విసిరాడు
దూబే ఆ బంతిని పట్టుకోవడంతో విల్ జాక్స్ అవుట్ అయ్యాడు

ఇది ఈ టోర్నమెంట్ లోనే అత్యుత్తమ క్యాచ్ అవుతుంది

తిలక్ వర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్

ఇంగ్లాండ్ ప్లేయర్ బెతేల్ షాట్ల మీద షాట్లు బాదుతూ స్కోరును పెంచుకుంటూ పోతున్నాడు
అదే ఊపులో సిక్స్ బాదాడు

బాల్ గాల్లో సరిగ్గా బౌండరీ లైన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ఇంచ్ కూడా లైన్ టచ్ కాకుండా తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు

దీనికి తోడు చివరి ఓవర్లలో బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ పరుగులను కట్టడి చేసారు

అంతిమంగా 7 వికెట్ల నష్టానికి 246 పరుగుల వద్దనే ఇంగ్లాండ్ ఓటమిని భారత జట్టు ఖాయం చేసేసింది

మ్యాచ్ చూడటం కోసం తరలి వచ్చిన సెలెబ్రిటీలు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా మ్యాచ్ చూడటానికి వాంఖడే స్టేడియానికి వచ్చారు

ముఖేష్ శ్రీమతి నీతా అంబానీ అయితే మ్యాచ్ ఆసాంతం భారత్ జెండా పట్టుకుని సందడి చేసారు

క్రికెట్ ప్రేమికుల హీరో ధోనీ కూడా ఫ్యామిలీతో కబుర్లు చెబుతూ మ్యాచ్ ఎంజాయ్ చేసారు
బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ భారత జట్టును ఎంకరేజ్ చేస్తూ విజిల్స్ కూడా కొట్టారు

ముగింపు – సూర్య కంగారు

శతమానం భవతి సినిమాలో కంగార్రాజు అని నరేష్ పాత్ర ఉంటుంది . ప్రతి విషయానికీ కంగారు పడటం ఆ పాత్ర స్వభావం అన్నమాట . నిన్నటి సెమి ఫైనల్స్ లో ఇండియన్ టీమ్ కెప్టెన్ సూర్య హడావుడి చూస్తే ఆ సినిమాలో నరేష్ పాత్ర గుర్తుకొస్తుంది . ఒక దశలో బెతేల్ బంతులను ఎడాపెడా బాదేస్తుండటంతో కంగారు పడిపోయిన సూర్య తరచూ ఫీల్డర్ల డైరెక్షన్లు మార్చటం చేసాడు . జట్టు సభ్యుల మీద బాహాటంగా అసహనం ప్రదర్శించటం టీవీల్లో స్పృష్టంగా కనిపించింది . విశేషం ఏంటంటే ఈ మ్యాచ్ లో సూర్య 11 పరుగులకే అవుటవడమే కాకుండా ఫీల్డింగ్ లో కూడా తడబడి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ బాదిన బంతిని బౌండరీ లైను దాటించాడు. గతంలో కెప్టెన్ గా చేసిన మిస్టర్ కూల్ ధోనీ నుంచి సూర్య పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది . నిన్నటి సెమి ఫైనల్లో ఇండియా గెలుపు వెనుక అతడి హడావుడికన్నా జట్టు సమిష్టి కృషి ఉంది . ఫైనల్లో అయినా సూర్య జట్టును కంగారు పెట్టకుండా , తాను కంగారు పడకుండా సమిష్టి కృషితో భారత్ కు ప్రపంచ కప్ సాధించిపెడతాడని ఆశిద్దాం


Spread the love

2 thoughts on “సంజు బ్యాటు ..అక్సర్ క్యాచు..వెరసి థ్రిల్లింగ్ మ్యాచు – మనోళ్లు సెమి ఫైనల్స్ గెలిచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!