ఓసారి బీహార్ లోని మారుమూల గ్రామమైన బేల్చి లో కులాల కుమ్ములాటలో ఊరంతా తగలబడిపోయింది
అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనం కలిగించింది
దళితులపై దారుణకాండ జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి
విషయంఅప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలిసి ఆ గ్రామానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించింది
దళితులను పరామర్శించటానికి ఇందిర బీహార్ లోని బేల్చి గ్రామానికి బయలుదేరారని రేడియో వార్తల్లో కూడా వచ్చింది
అయితే ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఇందిరా గాంధీ బీహార్ నుంచి కారులో ఆ గ్రామానికి బయలుదేరారు
కొంతదూరం వెళ్ళాక కారు కూడా వెళ్ళని ఇరుకు మార్గం ఎదురవడంతో అధికారులు అప్పటికప్పుడు ఇందిర ఆదేశం మేరకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసారు
బేల్చి గ్రామం కొండ ప్రాంతంలో ఉండటంతో ట్రాక్టర్లు కూడా కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి
గ్రామస్తులు ఆ గ్రామం నుంచి పట్నం రావాలంటే నడక ద్వారానో , డోలీల ద్వారానో రావాల్సిందే
ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత కార్యదర్శి ఇందిర వద్దకు వచ్చి ” మేడం ! ఇక్కడ్నించి మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేము .. అటవీ మార్గం కాబట్టి జంతువులు కూడా సంచరించే అవకాశం ఉంది ” అని మెల్లిగా చెప్పాడు
అతడి ఉద్దేశ్యంలో ఇందిరను ఎలాగైనా సేఫ్ గా వెనక్కి పంపాలని
కానీ అక్కడున్నది ఉక్కు మహిళ అని ఆ క్షణాన కూడా ఆ అధికారికి కూడా తెలీదు
ఇందిర ఒక్క క్షణం ఆలోచించి ” కొంతమంది గ్రామస్తులు ఈ మార్గంలో ఏనుగుల ద్వారా వెళ్తారని విన్నాను .. ఏర్పాట్లు చూడండి ” అంది
ఇందిర మాటలకు ఆ అధికారి ఆశ్చర్యం తో నోరు తెరిచాడు
అప్పటికప్పుడు అక్కడి గ్రామస్తులు ఏనుగును సిద్ధం చేయడంతో ఇందిర దానిపై కూర్చుని ఆ గ్రామం చేరి బాధితులను పరామర్శించారట
ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు
ధైర్య సాహసాలకు ఇందిర పెట్టిన పేరని , అందుకే ఆమెను ఉక్కు మహిళగా పిలిచుకుంటామని చెప్పారు
అంతేకాదు ఆ గ్రామ పర్యటన తర్వాత రాజకీయాల్లో తనకు బద్ద శత్రువైన జయప్రకాశ్ నారాయణ్ ను పాట్నాలో కలిసి గంటకు పైగా ఆమె దేశ రాజకీయాలను చర్చించారని ఆయన చెప్పారు
1984 లో సరిగ్గా ఇదే రోజున అంగరక్షకులే ఇందిరను దారుణంగా కాల్చి చంపారు అని చెప్తూ ఈ రోజు ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా అయన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు !
