Home » మాస్ జాతరలో మాస్ మహారాజ్ కధేంటి ?

మాస్ జాతరలో మాస్ మహారాజ్ కధేంటి ?

Spread the love

ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలను గమనించారా ? పాత వస్తువులకే కొత్త లేబుల్ వేసి అమ్మేస్తున్నారు . రాన్రానూ తెలుగు సినిమాలకు కధలు కొరత ఎక్కువైపోతోంది . ఎన్టీఆర్ జెనెరేషన్ వరకు కధలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు వచ్చాయి . ఫలానా సినిమాలో ఫలానా కథ గురించి చెప్పుకునేవాళ్ళు . సినిమా ఏ జానర్ అయినా అందుకు తగ్గ కథ రాసుకునేవాళ్ళు . మరీ ఇప్పటిలా హర్రర్ సినిమాలకు కామెడీ కధలు రాసుకోకుండా జానర్ బట్టి కధలను విడగొట్టి రాసుకునేవారు . ఇప్పుడలా కాదు .. కధాంశం ఒకటే ఉంటుంది కానీ కంటికి కనిపించని చిన్న మార్పుతో సరికొత్తగా పెయింటింగ్ వేసేస్తున్నారు . దీంతో చాలావరకు ఈ సినిమా మనం ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు ఉన్నామే అని డైలమాలో పడిపోతాం .

ఉదాహరణకు మాఫియా డాన్ కధలు తీసేటప్పుడు ఒక విలన్ అవయవాలు స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గోల్డ్ వాచీలు స్మగ్లింగ్ చేస్తాడు . ఒకడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు . అలా ఒక్కో సినిమాలో ఒక్కో విలన్ ఒక్కో పదార్దాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడన్నమాట . ఇంతకుముందు చూసిన సిన్మాలోదే వీడూ స్మగ్లింగ్ చేస్తే కాపీ కొట్టాడు అంటారనే ముందుజాగ్రత్తతో ఐటెం చేంజ్ చేస్తారన్నమాట . చివరికి ఈ డాన్ కధల ముగింపులు కూడా ఒకేలా ఉంటాయి .

ఫైనల్ గా విలన్ని హీరో చావబాది జెండా ఎగరవేయడంతో మూడు గంటలు ఉగ్గబట్టి కూర్చున్న ప్రేక్షకులు లేచి బయటికి పరిగెడతారు . ఆ రకంగా అన్ని సినిమాల్లో ఇతివృత్తం ఒకటే ఉంటుంది . పాత సీసాలకే లేబుల్స్ మార్చి ఒకరెంబడి ఒకరు సినిమాలు తీసి జనాల మీదకి వదుల్తుంటారు .
లేటెస్టుగా మనవాళ్ళు స్టోరీ సిట్టింగులలో కూర్చున్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని పిండిని ఎలా కావాలంటే అలా కలుపుకుంటారు . అదెలా ఉంటుందంటే ?

మన హీరో గతంలో ఇదే ఫార్ములాతో సైనికుడి పాత్ర పోషించాడా , మన హీరో గతంలో ఆల్రెడీ పోలీస్ పాత్రలో నటించేసాడా ?

నో ప్రాబ్లమ్

ఇందులో పోలీసుని రైల్వే పోలీస్ చేసేయండి .

విలన్ స్మగ్లింగ్ చేయడానికి అన్ని సరుకులూ అయిపోయాయా ?

నో ప్రాబ్లమ్

ఇందులో గంజాయిని వాడేద్దాం .

ఆల్రెడీ ఘాటీలో గంజాయి వాడేసారుగా
ఆ .. ప్రేక్షకులకు అంత గుర్తుండి ఛస్తుందా ? కానిచ్చేయండి .

సినిమాలో హీరో ఉంటాడు కాబట్టి అతగాడి పక్కన యెగిరి గంతులు వేయడానికి ఓ హీరోయిన్ కావాలి కదా ? ఎవరైతే బాగుంటుంది ?
అలా గెంతులు వేయడానికి శ్రీలీల ను మించి ఎవరున్నారు ? ఆమెకే హీరోయిన్ అవకాశం ఇచ్చేయండి

ఇక రవితేజను ఎలా చూపించాలి ? ఆయన్ని కొత్తగా చూపించేది ఏముంది ? ఎలాగూ మాస్ మహారాజ్ అనే బ్రాండ్ ఉంది కదా? నాలుగు ఎలివేషన్లు , ఆరు పాటలు , పన్నెండు ఫైట్లు చాలవూ ? ఇవి చాలవూ మాస్ జాతరకు ?

ఇంకేముంది సినిమా రెడీ అయిపొయింది.

ఇప్పుడు మాస్ జాతర గురించి మాట్లాడుకుందాం .

కధేంటంటే ?

లక్ష్మణ్ భేరి ( రవి తేజ ) తెలంగాణలోని వరంగల్ పట్టణంలో రైల్వే పోలీస్ ఉద్యోగం చేస్తుంటాడు . పేరుకి రైల్వే పోలీస్ లెక్కనే కానీ అన్యాయం కనిపిస్తే అతడికి హద్దులు తెలియవు . హద్దుల్లేకుండా ఎంతటివాడినైనా చీల్చి చెండాడుతాడు . అలా ఒకసారి మంత్రి గారి కొడుకుతో గొడవ జరిగి కొట్టడంతో లక్ష్మణ్ ని ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తారు .

అక్కడ శివుడు ( నవీన్ చంద్ర ) అనే వ్యక్తి రైళ్ల ద్వారా కలకత్తాకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు ( ఈ గంజాయి వేరు .. ఘాటీ సినిమాలో విలన్ స్మగ్లింగ్ చేసిన గంజాయి వేరులెండి) . ఈ శివుడికి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు అందరి సహకారం ఉంటుంది. సరిగ్గా అలాటిచోటకు వచ్చి పడతాడు లక్ష్మణ్ .

అడవివరంలో అందరి సహకారం ఉన్న శివుడ్ని కొత్తగా వచ్చిన ఈ రైల్వే ఎసై ఎలా ఎదుర్కొంటాడు ?

శివుడి గంజాయి వ్యాపారాన్ని ఎలా అడ్డుకుంటాడు ? అనేది మిగతా కధలో తెలుస్తుంది.

ఎలా ఉంది ?

నిజానికి ఇదేమీ కొత్త జాతర కాదు . ఆల్రెడీ ఇలాంటి చాలా జాతరలు చాలా చూసేసాం . గంజాయి స్మగ్లింగ్ చేసే విలన్ని పట్టుకుని చట్టానికి అప్పగించే పవర్ ఫుల్ పోలీస్ కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . కాబట్టి కధలో కొత్తదనం ఆశించటానికి లేదు . కాస్తో కూస్తో కొత్తదనం ఏంటంటే ఇందులో హీరో రొటీన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ అన్నమాట . కంప్లీట్ డిఫరెంట్ సెక్షన్ .. కనీసం లా అండ్ ఆర్డర్ పోలీస్ అయితే కొంచం పవర్ ఫుల్ గా ఉండేది . అసలే రైల్వే పోలీస్ ..అందులోనూ స్టేషన్లతో సంబంధం లేకుండా అన్ని స్టేషన్లలోనూ వేలు పెడుతుంటాడు . బహుశా విలన్ రైళ్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు కాబట్టి హీరోని రైల్వే పోలీస్ చేసినట్టున్నారు . ఆ పరంగా కధకు అతడి జాబ్ సరిగానే సూట్ అవుతుంది .

ఇక మూవీ విషయానికి వస్తే రవితేజ మార్క్ నటన కోసం చూడొచ్చు . అతడి మేనరిజం , డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది . విక్రమార్కుడు మూవీలో రవితేజ పోషించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎవరూ మర్చిపోలేరు . ఆ సినిమా చూసినవాళ్ళకి రవితేజ నిజంగా పోలీస్ ఆఫీసరేమోనని అనుమానం వస్తుంది . అంతలా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు . ఇందులో కూడా అతడికి ఈ క్యారక్టర్ బాగా సెట్ అయ్యింది . అయితే కధనంలో కొన్ని చోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి . ఆ మాటకొస్తే లాజిక్కులు వెతికితే ఈ సినిమా చాలామందికి నచ్చదు . సినిమా అంతా మాస్ మహారాజ్ స్టైల్లో సాగిపోతుంది .

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్టు అనిపించాయి . శివుడి సరుకును రవితేజ రహస్యంగా వేరేచోట దాచటం , దానికోసం శివుడు రవితేజను వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కు రావడం వంటి సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా ట్రైన్ లో మంటల ఎపిసోడ్లు కొంచం ఓవర్ గా అనిపిస్తాయి . పైగా అంత సీరియస్ సిట్యుయేషన్లోనూ శివుడి మనుషులచేత కామెడీ చేయించాలని చూడటంతో థ్రిల్ మిస్ అయ్యింది . ఓవరాల్ గా రవితేజ మార్క్ స్టైల్ కోసం మూవీని వన్ టైం వాచ్ కింద చూడొచ్చు .

ఎవరెలా చేసారు ?

రవితేజ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు . మాస్ పాత్రలకు అతడు పెట్టింది పేరు . ఫైట్లు , పాటల్లో అభిమానులకు పూనకాలు తెప్పించడంలో మాస్ మహారాజ్ స్పెషలిస్ట్ . అందుకే సామజవరగమన వంటి రొమాంటిక్ కామెడీ సినిమాకి స్టోరీ రాసి మెప్పించిన భాను బోగవరపు కేవలం రవితేజను హీరోగా ఊహించుకుని రాసుకున్న కథతో మాస్ జాతర పేరుతో దర్శకుడిగా లైట్సాన్ యాక్షన్ కెమెరా అంటూ మాస్ జాతర మూవీని తెరకెక్కించాడు .

అయితే ఇక్కడే పొరపాటు జరిగింది . కధలో కొత్తదనం మిస్ అయ్యింది . ఆల్రెడీ మాస్ ముద్ర పడిపోయిన రవితేజను అదే మాస్ ఇమేజ్ తో మరోసారి చూసేసరికి ప్రేక్షకులకు కొత్తగా కనెక్ట్ అయ్యింది ఏమీ లేదు . రవితేజను ఇలాంటి రోల్స్ ల్లో చూసి చూసి ప్రేక్షకుల ముఖం మొత్తిపోయింది . నిజానికి ప్రేక్షకులు రవి తేజను ఇదే స్టైల్ లో.. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పవర్ ఫుల్ స్టైల్ లో విక్రమార్కుడు సినిమాలో ఎప్పుడో చూసేసారు.

కాబట్టి మాస్ జాతర లో రవితేజను చూస్తుంటే కొత్తదనం ఏమీ కనిపించలేదు . దానికి తోడు మాములు పోలీసుని రైల్వే పోలీసుగా మార్చి పాత యూనిఫార్మ్ కి కొత్త రేట్ స్టిక్కర్ వేసి షో రూమ్ లో పెట్టారు . కాకపోతే ఈ సినిమాలో రవితేజ మాస్ అప్పీయరెన్సు , డైలాగులు , ఫైట్లు , పాటలు ఖచ్చితంగా ఆయన అభిమానులకు నచ్చుతుంది .

ఇక కథలో కూడా కొత్తదనం లోపించింది . గతంలో ఇదే తరహా కథలతో చాలా సినిమాలు వచ్చాయి .

ఇక హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పుకోవాలంటే హీరో పక్కన గెంతులు వేయడానికే ఆ అమ్మాయిని తీసుకున్నారా అన్నట్టుంది . అంతకుమించి కొత్తగా ఏమీ లేదు .

ఇక శివుడిగా నవీన్ చంద్ర విలనిజం బాగానే పండించాడు . ఇతడికి ఇటువంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి అయిపొయింది . హీరోగా మెప్పించిన నవీన్ చంద్ర విలన్ పాత్రల్లో కూడా మెప్పిస్తున్నాడు .

ఇక హీరో తాత గా రిటైర్డ్ ఆర్మీ అధికారి హనుమాన్ భేరి పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ నటన మిక్సెడ్ గా ఉంది . అటు రిటైర్డ్ ఆర్మీ పాత్రలో గంభీరత ఒలకపోయాల్సిన సమయంలో మధ్య మధ్యలో కామెడీ ట్రాక్ కూడా ప్రయత్నించడం డిఫరెంట్ గా అనిపిస్తుంది . పైగా ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇక సినిమాల్లో నటించను అని ఆయన ప్రతిజ్ఞ కూడా చేసారు .

ఇక సినిమా నిర్మాణంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు
ఆయన పెట్టిన ఖర్చు మాస్ జాతరలో కనిపిస్తుంది .

భీమ్స్ సంగీతం బావుంది

ఓవరాల్ గా మాస్ జాతర రవితేజ అభిమానులను పెద్దగా నిరుత్సాహపరచదు . అలాగే సామాన్య ప్రేక్షకులను పెద్దగా ఉత్సాహపరచదు .

నటీనటులు : రవితేజ , శ్రీలీల , నవీన్ చంద్ర , రాజేంద్ర ప్రసాద్
రచన , దర్శకత్వం : భాను భోగవరపు
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల తేదీ : 1-11-2025
రేటింగ్ : 2. 5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!