కరీం నగర్ జిల్లా జగిత్యాలకు చెందిన తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు
ఆరుసార్లు ఎమ్మెల్యేగా , రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా , ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది
ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా సీఎం మీదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్న మొట్టమొదటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అవుతారు
అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు అని ఆయన చెప్తున్నప్పటికీ , బిఆర్ఎస్ చేరే అవకాశాలు ఉన్నాయని అనధికార సమాచారం
బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతో అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది
ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిస్థితులను సృష్టిస్తుంది ?
జీవన్ రెడ్డి రాజీనామా వ్యక్తిగతంగా రేవంత్ నాయకత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
జీవన్ రెడ్డి చేరిక వల్ల ఇతర పార్టీలకు ఒనగూరే లాభం ఏంటి ? అనే అంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం
జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
1983 లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్పూర్తితో జీవన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు
అంతకుముందు 1981 లోనే ఆయన ఇండిపెండెంట్ గా మలియాల పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
1983-84 సంవత్సరాలలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎక్సయిజ్ మినిష్టర్ గా విధులు నిర్వహించారు
అయితే ఆయన రాజకీయ జీవితంలో మొదటిసారిగా పార్టీ మార్పు నిర్ణయం తీసుకుని ఎన్టీఆర్ టిడిపి నుంచి నాదెండ్ల వర్గంలోకి వచ్చారు
తిరిగి 1984 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు
తదనంతరం వైఎస్ క్యాబినెట్లో కూడా రోడ్లు ,భవనాల శాఖా మంత్రిగా విధులు నిర్వహించారు
అప్పటినుంచి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు
ఏ రకంగా చూసుకున్నా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు
కరీం నగర్ జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు
గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటాడని ఈయనకు నియోజక వర్గంలో పేరుంది
అసంతృప్తి ఎప్పుడు మొదలైంది ?
2014 లో రాష్ట్రమంతా వీచిన బిఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ జగిత్యాల నియోజక వర్గం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు
ఈయనపై బిఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ పోటీ చేసి ఓడిపోయారు
అంత కేసీఆర్ ప్రభంజనంలో కూడా జీవన్ రెడ్డి గెలవడం కేవలం ఆయన వ్యక్తిగత చరిష్మా వల్లనే సాధ్యమైందని అప్పట్లోనే రాజకీయ పండితులు విశ్లేషణలు చేసారు
తిరిగి 2018 లో జరిగిన ఎన్నికలలో అదే బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు
దాంతో 2019 లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు
తిరిగి 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో రెండోసారి ఓడిపోయారు
2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ స్థానంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు
జీవన్ రెడ్డి కెరీర్ లో వరుస ఓటములు మొదలయ్యాయి
జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి వరుసగా అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూడటంతో పార్టీలో కొంత పలుచన అయిన మాట వాస్తవం
ఈ పరిణామాలు సహజంగా సీనియర్ నేతకు చిరాకులు తెప్పించాయి
జిల్లాలోనూ ,పార్టీలోనూ కోల్పోతున్న తన నాయకత్వ పటిమను తిరిగి సాధించాలనే కసి ఆయనలో మొదలైంది
ఇన్నేళ్లు తాను కష్టపడి పనిచేసిన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోనే తన రాజకీయ ప్రస్థానానికి బీటలు పడటం ఆయనను కలవరపెట్టాయి
దానికి తోడు తన రాజకీయ ప్రత్యర్థి బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను రేవంత్ చేరతీయడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది
మారిన పరిణామాలు ,రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తన పట్టు జారిపోతుంది అని ఆయన గ్రహించారు
పార్టీలో సీనియర్ అయిన తనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చి సీఎం అయిన ఒక జూనియర్ నాయకుడు జిల్లా రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ఆయన ఆగ్రహం చెందారు
అంతిమంగా తన రాజకీయ మనుగడకు చెక్ పెట్టే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారని ఆయన భావించారు
ఆ భావనను తన అసంతృప్తి రూపంలో ఆయన కొద్ది నెలలకిందే బాహాటంగా వ్యక్తపరిచారు
నేరుగా సీఎం మీదే విమర్శలు చేసారు
రేవంత్ ఏం చేసారు ?
జీవన్ రెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా స్పందించకపోయినా , ఆయన్ని పార్టీ వీడకుండా చేయడానికి చకచకా పావులు కదిపారు
ఇద్దరు క్యాబినెట్ మంత్రులను జీవన్ రెడ్డి ఇంటికి పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసారు
మరోపక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో రాయబారాలు నడిపించారు
అయినా జీవన్ రెడ్డి అలక వీడలేదు
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేయాలనేది రేవంత్ టార్గెట్
ఆ టార్గెట్ లో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయమే ఎమ్మెల్యే సంజయ్ ను దగ్గరికి తీయడం
అందుకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీఎం నేరుగా అప్పాయింట్మెంట్ ఇచ్చి తన ఇంటికి పిలిపించి మాట్లాడారు
రాజకీయ వ్యూహాల్లో భాగంగా రేవంత్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అయ్యింది
అయితే రేవంత్ కూడా ఎటువంటి ఈగోలకు పోకుండా సీనియర్ నేత స్థాయిని గౌరవించి స్వయంగా పిలిపించుకుని మాట్లాడి ఉంటే సమస్య కొంతవరకు సద్దుమణిగేది
లేదా అధిష్టానం పెద్దల వద్ద జీవన్ రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడించి ఉంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి
మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు అన్న చందాన తన మీద పోటీ చేసి గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు రేవంత్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డికి నచ్చలేదు
తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా , తనను సంప్రదించకుండా నేరుగా ప్రభుత్వ అండతో ఎమ్మెల్యే పనులు చేసుకుంటూ వెళ్లడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది
ఇటువంటి పరిణామాలు సహజంగా ఏ సీనియర్ నాయకుడికైనా ఈగో సమస్యలు సృష్టిస్తుంది
జీవన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది
జగ్గారెడ్డి , రాజగోపాల్ రెడ్డి ల విషయంలో ఏం జరిగింది ?
సీఎం రేవంత్ నాయకత్వం మీద గతంలో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డిలు కూడా ఉన్నారు
పార్టీలో సీనియర్ను అయిన తనకు ప్రాధాన్యత దక్కటం లేదని మొదట్లో జగ్గారెడ్డి కూడా అలిగారు
కానీ ఆయన చేసిన తెలివైన పనేంటంటే రేవంత్ తో గొడవ పెట్టుకోకుండా నేరుగా అధిష్టానంతో మాట్లాడుకుని తన సమస్యని పరిష్కరించుకున్నారు
రాహుల్ గాంధీ చొరవతో జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కుదురుకున్నాడు
ప్రస్తుతానికి రేవంత్ నాయకత్వానికి జై కొట్టారు
పదేళ్ల తర్వాత తెలంగాణకు తానే సీఎం అవుతానని ప్రకటించుకున్నారు
కాబట్టి ఈయనతో ప్రస్తుతానికి రేవంత్ కు సమస్యలు లేనట్టే
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ విషయానికి వస్తే నల్లగొండ జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడు
కాకపోతే ఈయన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం
ఈ నిర్ణయం రాజకీయకంగా ఆయనకు మేలు చేయకపోగా కీడు చేసింది
తర్వాత తన తప్పు తెలుసుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కూడా అయ్యాడు
కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది
ఆయన తప్పుడు నిర్ణయం వల్ల ఈయన అన్నకు మంత్రి పదవి దక్కగా రాజగోపాల్ ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వచ్చింది
రాజగోపాల్ కూడా రేవంత్ మీద బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసాడు కానీ ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది
అటు అధికారంలో ఉన్న పార్టీని వీడిపోలేడు
ఇటు మంత్రి వర్గంలో చోటు తెచ్చుకోలేడు
కాబట్టి రాజగోపాల్ వల్ల ప్రస్తుతానికి రేవంత్ కొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు
అంతగా ఏమన్నా ఇబ్బందులు వస్తే సర్దడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎటూ ఉన్నాడు
జీవన్ రెడ్డి పార్టీని వీడితే రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటి ?
జీవన్ రెడ్డి పార్టీని వీడటం వల్ల వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం దగ్గర్నుంచి ఇప్పటివరకు గత రెండున్నరేళ్లుగా రేవంత్ పార్టీలో బలమైన నాయకుడిగా తయారయ్యారు
ఆయన మాటకు ఎదురు చెప్పలేక , ఢిల్లీ పైరవీలు కూడా నడవక చాలామంది నాయకులు గమ్మున ఉంటున్నారు
ఇలాంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ నేత రేవంత్ మీద బాహాటంగా తిరుగుబాటు చేయడం నిశ్శబ్దంగా ఉన్న తేనెతుట్టను కదిలించడం లాంటిది
ఈ పరిస్థితులను పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు
జీవన్ రెడ్డి దారిలో వెళ్లేలా మరికొంతమంది నేతలను ప్రోత్సహిస్తారు
ఒకరకంగా పార్టీలో ముసలం సృష్టిస్తారు
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదు
కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్నవాళ్ళు కూడా సీఎం పదవి మీద కన్నేశారు
మరి తమకన్నా జూనియర్ అయిన రేవంత్ కింద ఎందుకు పనిచేయాలనే ఈగో ఇప్పటికే చాలామందిలో ఉంది
కేసీఆర్ సైతం రేవంత్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని ఆశలు పెట్టుకున్నారు
కానీ మూడు నెలలు కాదు కదా నేటికి రేవంత్ తెలంగాణాలో బలమైన నాయకుడిగా పాతుకుపోయాడు
సరే ,ఇంతకీ రేవంత్ స్పెషాలిటీ ఏంటి ?
పార్టీలో రేవంత్ మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితులకు కారణం ఏంటి ?
అధిష్టానం సైతం రేవంత్ వైపే ఎందుకు మొగ్గు చూపుతుంది ?
అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే
గెలుపు
పార్టీని గెలిపించి తన నాయకత్వ సామర్ధ్యాన్ని చూపించాడు
ఇప్పటికీ గెలిపిస్తూ చూపిస్తున్నాడు
అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి , పంచాయతీ ఎన్నికలు కానివ్వండి , మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి , ఆఖరికి ఉప ఎన్నికలు కానివ్వండి పార్టీని విజయ పధం వైపు నడిపిస్తున్నాడు
ఏ అధిష్ఠానమైనా ఇటువంటి నాయకుడి కోసమే ఎదురుచూస్తుంది
అందుకే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి పార్టీలో కానీ ,పాలనలో కానీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది
రెండేళ్లుగా రేవంత్ మీద చాడీలు చెప్పడానికి ఢిల్లీకి క్యూ కట్టిన సీనియర్ నేతలకు ఈ విషయం అర్థమైంది
గతంలోలా అధిష్టానం చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈపాటికి రేవంత్ పదవి ఎప్పుడో ఊడిపోయేది
కర్ణాటకలో అయినా , తెలంగాణాలో అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సుస్థిరంగా పాలిస్తున్నారు అంటే అధిష్టానంలో వచ్చిన ఈ మార్పే ప్రధాన కారణం
రేవంత్ రెడ్డి పార్టీని గెలిపిస్తూ పనిచేసుకుంటూ పోతున్నాడు ,జీవన్ రెడ్డి ఓడిపోయి మాట్లాడుతున్నారు
అదీ తేడా
జీవన్ రెడ్డి నిర్ణయం సరైనదేనా ?
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతే
అందులో అనుమానం లేదు
రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది
పార్టీలో తనకు అవమానం జరుగుతుంది అనిపించినప్పుడు నేరుగా అధిష్టానంతో మాట్లాడుకోవాల్సింది
ఆ చొరవ కూడా ఆయనకు ఉంది
కానీ ఆయన ఇంతవరకు రాహుల్ గాంధీని కలిసినట్టు లేదు
జగ్గారెడ్డి మాదిరి ఈయన కూడా రాహుల్ గాంధీని కలిసి తన సమస్య చెప్పుకుని ఉంటే ఏదో ఒక పరిష్కారం దొరికేదేమో ?
కానీ రేవంత్ మీద అలకతో పార్టీని వీడాలని ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు
పైగా బిఆర్ఎస్ చేరతారని వార్తలు వస్తున్నాయి
ఇదే నిజమైతే అది ఇంకో పొరపాటు అవుతుంది
బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు ,సంతోష్ ల తర్వాతే ఎవరైనా
అలాంటిది అక్కడ జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛ ఉంటుందా ?
ఈటెల రాజేందర్ , కె కేశవరావు లాంటి సీనియర్ నేతలు అక్కడ ఇమడలేకే కదా బయటకు వచ్చారు ?
ఎవరైనా ప్రతిపక్షములోనుంచి అధికార పక్షములోకి జంప్ అవుతారు
కానీ జీవన్ రెడ్డి అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లాలని తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు
పైగా లోక్ సభ ఎన్నికల్లో సిద్ధాంతపరంగా కేసీఆర్ తోనే విభేదించి ఆయన మీదే పోటీచేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి తిరిగి అదే గూటికి ఎలా చేరగలరు ?
ఈ నిర్ణయాన్ని ఆయన్ని నమ్ముకున్న కార్యకర్తలు ఆమోదించగలరా ?
పోనీ జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి కాకుండా బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది ?
కొంతవరకు నయం
ఎందుకంటే ఈసారి ఎలాగైనా తెలంగాణాలో కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది
అందుకు సమర్థులైన నాయకుల కోసం వెతుకుతుంది
కాబట్టి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలకు ఆ పార్టీలో సముచిత స్థానం దక్కవచ్చు
కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జీవన్ రెడ్డికి అన్నివిధాలా అండగా ఉంటుంది
అయితే ఇక్కడా జీవన్ రెడ్డికి చిన్న ఇబ్బంది ఉంది
2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు
కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందని బయటకు వస్తున్న జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి పార్టీలలో చేరి ఎలా ఇమడగలుగుతారో తెలియాలంటే వేచి చూడాలి!
