Home » తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ‘హస్త’ వాసి కలిసొస్తుందా ? – హస్తసాముద్రికం ఏం చెప్తుంది ?

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ‘హస్త’ వాసి కలిసొస్తుందా ? – హస్తసాముద్రికం ఏం చెప్తుంది ?

Spread the love

టైటిల్ చూసి ఇదేదో రేవంత్ చేతి రేఖలు చూసి జాతకాల గురించి చెప్పే ఆర్టికల్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే .. ఆ హస్త రేఖలు వేరు.. ఈ హస్త సాముద్రికం వేరు . అవును తెలంగాణాలో కారును జోరుకు బ్రేక్ వేసి హస్తం గ్రాఫ్ పెరగడానికి రేవంత్ చేతి రేఖలు బాగా ఉపయోగపడుతున్నాయి.

తాజాగా తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జోరుగా విజయం వైపు దూసుకుపోయింది .

ఒకటికాదు రెండు కాదు.. తెలంగాణాలో రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రథమ స్థానంలో నిలుపుతున్నాడు . ప్రత్యర్థి పార్టీ ఆషామాషీ పిల్ల కాకి కాదు..
కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ పార్టీగా అవతరించి మహామహులకే సాధ్యం కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీ .

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడమే కాదు రెండు పర్యాయాలు తిరుగులేని ప్రజల మద్దతుతో తెలంగాణాలో అధికారాన్ని దక్కించుకుని పాలించిన పార్టీ అది . రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అనేది లేకుండా చేసి బలమైన పార్టీగా అవతరించిన నాయకత్వం అది . అలాంటి బలమైన పార్టీని టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ అనే నాయకుడు ఢీకొట్టి అనూహ్యంగా ఉద్యమ పార్టీ పదేళ్ల ప్రస్థానానికి చెక్ పెట్టాడు .

ఈ గెలుపు , ఈ మలుపు బీఆరెస్ నాయకత్వం కూడా ఊహించనిది.. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని కేసీఆర్ కూడా సీరియస్ గా తీసుకోలేదు . ఎక్కడో ఓటింగ్ విధానంలో పొరపాటు జరిగి ఉండొచ్చని సర్ది చెప్పుకున్నారు . తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండే సహజ ముఠా తగాదాల నేపథ్యంలో మూడు నెలల్లో ఆ పార్టీ తనంతట అదే కూలిపోతుందని ఆశలు పెట్టుకున్నారు . మొదట్లో పార్టీ మీటింగుల్లో కేసీఆర్ కూడా అదే చెప్పారు .

కానీ కేసీఆర్ ఊహించిన విధంగా రేవంత్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోలేదు .. పైపెచ్చు మరింత బలాన్ని పెంచుకుంది . గతంలో బీఆరెస్ పార్టీ అనుసరించిన ఫార్ములానే కాంగ్రెస్ పార్టీ కూడా ఫాలో అయ్యింది . ఫలితంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి దూకారు .

ఇవన్నీ కేసీఆర్ ఊహించని పరిణామాలు .. దాంతో ఆయన ఆక్టివ్ పాలిటిక్స్ కు తాత్కాలిక విరామం ప్రకటించి ఎర్రవల్లిలోని ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారు . కేవలం అసెంబ్లీ హాజరు నిమిత్తమో , హెల్త్ చెకప్ ల నిమిత్తమో ఫార్మ్ హౌస్ బయటికి రావడం జరిగింది . దీనికి తోడు కూతురు కవిత వ్యవహారం ఆయనకు రాజకీయంగా తలనొప్పులు తెచ్చిపెట్టింది . ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆక్టివ్ పాలిటిక్స్ ను నడిపే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించి ఆయన ఫార్మ్ హౌస్ లో ఉండిపోయారు.

కేటీఆర్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోగా మరింత అధ్వాన్నంగా మారింది . దీంతో జూబిలీ బై ఎలక్షన్స్ లో అయినా తమ పార్టీ సత్తా చాటుతుందని ఆయన భావించారు . కానీ అక్కడా ఆయనకు ఆశాభంగమే ఎదురైంది .

సిట్టింగ్ స్థానం అయిన జూబిలీ హిల్స్ ఉపఎన్నికలో గెలిచి రేవంత్ దూకుడికి చెక్ పెడదామని కేటీఆర్ , హరీష్ రావుల నేతృత్వంలో పార్టీ నాయకులు కష్టపడ్డారు . అక్కడా ప్రతికూల ఫలితాలు రావడంతో షాక్ అయ్యారు .

నిజానికి మొదట్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఆ స్థానంలో బీఆరెస్ గెలుపును అంచనా వేశారు
సింపతీ ఓటింగ్ ఆ పార్టీ అభ్యర్థిని గట్టెక్కిస్తుందని అందరూ భావించారు .

కానీ రేవంత్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో గేమ్ చేంజ్ అయ్యింది.. ఇది కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ లు ఊహించని పరిణామమే .

తెలంగాణాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి గులాబీ జెండాను ఎగరేయాలని కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ , హరీష్ రావ్ తదితర నాయకులు ప్రజల్లోకి వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది . పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో బీఆరెస్ నాయకత్వం ఖంగు తిన్నది .

తాజాగా తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆరెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణాలో జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ను కూడా దక్కించుకోక చతికిల పడింది . మొత్తం ఏడులో కాంగ్రెస్ పార్టీ నాలుగు కార్పొరేషన్లు దక్కించుకోగా ఒక కార్పొరేషన్ బీజేపీ గెల్చుకుంది . కేంద్రమంత్రి బండి సంజయ్ సొంత నియోజకవర్గమైన కరీం నగర్లో బీజేపీ పాగా ఎగరవేసింది . ఇంకో రెండు స్థానాల్లో ఎవరికీ స్పృష్టమైన మెజారిటీ రాక హంగ్ దిశగా ఆగిపోయింది .

అలాగే మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు గెల్చుకోగా , బీఆరెస్ పార్టీ కేవలం 12 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2581 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగగా 1346 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా , 723 స్థానాలను బీఆరెస్ గెల్చుకుంది .

ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన ఫలితాలను సాధించింది అని హరీష్ రావ్ చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే . గతంలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పార్టీ ఓటమిని సరిగా విశ్లేషించుకోక ఎలా పొరపాటు చేసారో ఇప్పటికీ అదే పొరపాటు చేస్తున్నారు .

ఇప్పటికైనా కేసీఆర్ , కేటీఆర్ ,హరీష్ రావ్ తదితర నాయకులు వరుస ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఎదురౌతున్న అసలు కారణాలను నిజాయితీగా విశ్లేషించుకుంటే భవిషత్తులో బీఆరెస్ వ్యూహం ఎలా ఉండాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది . ఇప్పటికే పార్టీలో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యం గురించి ద్వితీయ శ్రేణి నాయకులకు అర్థమైంది .

అదే సమయంలో పైకి ఎలా మాట్లాడుతున్నా రేవంత్ నాయకత్వ సామర్థ్యం గురించి బీఆరెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా అంచనాలు వచ్చేసాయి . ఇప్పటికే వరుస ఓటములతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి . ఈ పరంపర ఇదే విధంగా కొనసాగితే రేవంత్ చెప్పినట్టు తెలంగాణాలో బీఆరెస్ పార్టీ కనుమరుగు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి .

ప్రస్తుత రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ బలంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి . ఇందుకు ఉదాహరణ కరీం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ గెల్చుకోవడమే . ఒకపక్క తెలంగాణాలో బీజేపీ దూకుడు రోజు రోజుకీ పెరుగుతుండగా , కారు స్పీడు రోజు రోజుకీ తగ్గుతుండటం కనిపిస్తుంది . ఇదే ఒరవడి ముందు ముందు కూడా కొనసాగితే తెలంగాణాలో బీఆరెస్ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు .

కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు ఆత్మవంచన చేసుకోకుండా నిజాయితీగా సమీక్షించుకుంటే పార్టీ పరాజయాలకు అసలు కారణాలు తెలుస్తాయి .. భవిష్యత్తులో పార్టీని విజయ పధంలో నడిపించటానికి మార్గం దొరుకుతుంది .

ఇదిలా ఉండగా రేవంత్ గురించి చెప్పుకోవాల్సి ఉంటే
ఇప్పటిదాకా,

ప్రత్యేక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే రేవంత్ కి ముందు రేవంత్ తర్వాత అని చెప్పుకునే స్థాయికి పార్టీని తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు .

ఒకరకంగా కేసీఆర్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణాలో తిరిగి అధికారంలోకి తెచ్చిన రేవంత్ ఆ పార్టీకి సరైన సమయంలో దొరికిన నాయకత్వం.. అందుకే ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వం కూడా గతంలో మాదిరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రేవంత్ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది . సోనియా , రాహుల్ గాంధీ తదితరులు రేవంత్ నాయకత్వం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు .

ప్రస్తుతానికి రేవంత్ బలం అదే .. రేవంత్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా నోరు విప్పపోవటానికి కారణం కూడా అదే . రాష్ట్రంలో తన మార్కును పదిలం చేసుకోవడానికి ప్రస్తుతానికి రేవంత్ కు ఆ పవరే ఉపయోగపడుతుంది.. ఒకరకంగా చెప్పాలంటే రేవంత్ హస్త వాసిలో అసలు రహస్యం ఇదే !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!