‘అప్పుడు నా వెంట ఎవరూ లేరు .. ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు’ అని జూనియర్ ఎన్టీఆర్ ఎవరిమీద బాణాన్ని గురిపెట్టి అన్నాడు ?
బాలీవుడ్ లో ప్రముఖ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా వార్ సినిమాకి సీక్వెల్ గా వార్ 2 నిర్మిస్తున్నారు
వార్ 2 లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ , టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు
ఆగస్టు 14 న సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
ఈ సందర్భంగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడా స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు
ఒంటరిగా మొదలైన తన సినీ ప్రయాణంలో మొదట్లో తోడుగా నిలిచింది తల్లితండ్రులతో పాటు ఆదోనికి చెందిన అభిమాని ముజీబ్ అని ఆయన గుర్తు చేసుకున్నారు
25 సంవత్సరాల క్రితం రామోజీరావు తనను చిత్రరంగంలోకి పరిచయం చేసే సందర్భంలో నా పక్కన తల్లితండ్రులు , ఒక అభిమాని మినహా మరెవరూ లేరని అన్నారు
నీకోసం చచ్చిపోతాను బాబూ అంటూ ముజీబ్ అప్పట్లోనే నన్ను అభిమానించాడు
ఆరోజు నుంచి ఈరోజు వరకు 25 సంవత్సరాలు గడిచిపోయినా ముజీబ్ నన్ను అభిమానిస్తూనే ఉన్నాడు
ఇటువంటి అభిమానులను పొందగలగడం తన పూర్వ జన్మ సుకృతం అని ఎమోషనల్ అయ్యారు
జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ కొనసాగిస్తూ ‘పాతిక సంవత్సరాల సినీ ప్రస్థానంలో తనకు చేదోడువాదోడుగా నిలిచిన కుటుంబ సభ్యులు తండ్రి హరికృష్ణకు , తల్లి శాలిని , సోదరులు జానకిరామ్ , కళ్యాణ్ రామ్ , కుమారులకు , భార్యకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పాడు
చివరగా తాతగారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు తన మీద ఉన్నంతకాలం ఎవరూ తనని ఆపలేరు అని ఆవేశంగా చెప్పినప్పుడు అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది
ఒక దశలో ఈవెంట్ లో జై బాలయ్య , జై ఎన్టీఆర్, కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు పోటాపోటీగా సాగాయి
జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ లో ఎక్కడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కానీ , ప్రత్యేకంగా బాలయ్య పేరుగానీ చెప్పకుండా పరోక్షముగా అందరికీ ఈవెంట్లో గట్టి వార్నింగ్ ఇచ్చాడని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ లలో ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం తక్కువ
మాట్లాడిన కాసేపు సినిమా గురించే కానీ ఇతర విషయాలు మాట్లాడేవాడు కాదు
కానీ మొదటిసారిగా ఆయన నోటినుంచి పంచ్ డైలాగులు వచ్చాయి
‘అప్పుడు నా వెంట ఎవరూ లేరు .. ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు’ అని కాన్ఫిడెంట్ డైలాగ్ పేల్చాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకున్నారు
జూనియర్ కూడా తన సినిమాలను సైతం పక్కనబెట్టి ఏపీలో ఊరూరా తిరిగి టిడిపికి ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాడు
కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ తదనంతర కాలంలో జూనియర్ని పక్కనబెట్టారు
హరికృష్ణ మరణంతో బాలయ్య బహిరంగంగానే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టాడు
గతంలో తాతగారి స్మృతి వనం వద్దకు నివాళులు అర్పించటానికి జూనియర్ వచ్చినప్పుడు ఆయన అభిమానులు కట్టిన ఫ్లెక్షీలు బాలయ్య దగ్గరుండి మరీ తీయించేసాడు
అయినా జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ లో ఎక్కడా కుటుంబ గొడవల గురించి స్పందించలేదు
తిరిగి సినిమాల మీదే తన దృష్టిని సారించాడు
ఈ పరిస్థితుల్లో చాలాకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పంచ్ డైలాగ్ పేల్చాడు
తననెవరూ ఆపలేరు అనే మాట టిడిపి పార్టీని , బాలయ్యను ఉద్దేశించే అన్నాడని అయన అభిమానులు కేరింతలు కొడుతున్నారు
బాలయ్య నాయకత్వంలో నందమూరి కుటుంబమంతా ఒక్కటై తారక్ ను తొక్కేయాలని చూస్తున్నారని , అందుకే వార్ 2 పాన్ ఇండియా సినిమా ద్వారా తమ హీరో వాళ్లకు సవాల్ విసిరాడని అభిమానులు అంటున్నారు
ఏదిఏమైనా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో నన్నెవరూ ఆపలేరు అనే జూనియర్ మాట అటు బాలయ్య అభిమానుల్లోనూ , ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది !
పరేష్ తుర్లపాటి