ఆ మధ్య రిలీజ్ అయిన త్రిభాణధారి బర్బరీక్ సినిమా బాలేదన్నారని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స తన చెప్పుతో కొట్టుకుని ఏడవడం వైరల్ అయ్యింది
సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు
బాగోలేకపోతే ఆ క్షణానే తిరస్కరిస్తారు
అన్న విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు
అయినా జనం తన సినిమా చూడటం లేదని ఇలా చెప్పుతో కొట్టుకుని ఏడ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడమేంటని ఆ దర్శకుడి మీద నెటిజన్లు ఫైర్ అయ్యారు
ఈ సంఘటన మరిచిపోకముందే తన సినిమాకు రేటింగ్ ఇవ్వలేదని ఓ వెబ్ సైట్ మీద బూతులతో విరుచుకు పడ్డాడు నిర్మాత
ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం మూవీ కె ర్యాంప్ గురించి ఓ వెబ్ సైట్ రివ్యూ రాసి రేటింగ్ ఇచ్చింది
సదరు రేటింగ్ ఆ చిత్ర నిర్మాత రాజేష్ దండా కి నచ్చలేదు
తమిళ డబ్బింగ్ సినిమాకి ఎక్కువ రేటింగ్ ఇచ్చి తన సినిమాకి తక్కువ రేటింగ్ ఇవ్వడమేంటని ఆ వెబ్ సైట్ మీద ఆయన ఫైర్ అయ్యారు
ఇంతవరకు ఓకే
ఓ వెబ్ సైట్ ఈయన సినిమా మీద రివ్యూ రాసి పూర్ రేటింగ్ ఇచ్చింది
దానికి కౌంటర్ గా తన సినిమా గొప్పది కాబట్టి ఆ వెబ్ సైట్ ఇచ్చిన రేటింగ్ చెల్లదని విమర్శిస్తే విషయం అంత కాంట్రావర్సీ అయ్యేది కాదు
ఆ లిమిట్ క్రాస్ చేసి పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ మీద ఆ వెబ్ సైట్ ని , దాని నిర్వాహకుడిని బండ బూతులు తిట్టడంతో అసలు సినిమా కన్నా ఈ వివాదం సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయ్యింది
నా సినిమాకి పూర్ రేటింగ్ ఇచ్చిన ఆ వెబ్ సైట్ ని తొక్కేస్తా .. దాని ఓనర్ అంతు చూస్తా అంటూ ఓ నాలుగు పదునైన నాటు బూతులు ప్రయోగించడంతో ఆ నిర్మాత మీద నెటిజన్లకు సింపతీ పోయి ఎదురు దాడికి దిగారు
కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతదీ డబ్బులే
పెంచిన రేట్లకు టికెట్లు కొనుక్కుని సినిమా చూసే ప్రేక్షకుడిదీ డబ్బులే
సోషల్ మీడియా లేని కాలంలో మౌత్ పబ్లిసిటీ ఆధారంగా సినిమా టాక్ తెలుసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు
కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేక్షకులకు మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడే అవసరం లేకుండా పోయింది
సినిమా బావుందో లేదో మొదటి షో లోనే రివ్యూలు బయటికి వస్తున్నాయి
డిజిటల్ యుగంలో ప్రేక్షకులు రివ్యూలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారనేది వాస్తవం
అందుకే కృష్ణ వంశీ వంటి టాప్ డైరెక్టర్ కూడా తన సినిమా రంగ స్థలం ప్రివ్యూకి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న కొంతమందిని పిలిచి మరీ చూపించాడు
అయితే ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి
రివ్యూ అనేది మొదటి రెండు రోజుల కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందేమో కానీ సినిమా సూపర్ అని రివ్యూ రాసినా బాగోపోతే థియేటర్కెళ్లిన ప్రేక్షకుడు అక్కడే చెప్పేస్తున్నాడు
అలాగే సినిమా అస్సలు బాలేదని పూర్ రేటింగ్ ఇచ్చినా కూడా బావుంటే దాని కలెక్షన్స్ ను ఎవరూ ఆపలేరు
ఇదే అసలు వాస్తవం
ఇక ఆ కె ర్యాంప్ నిర్మాత పాజిటివ్ రివ్యూలు రాయడానికి కొన్ని సైట్లు రేట్లు పెట్టాయని ఆరోపించారు
కేవలం డబ్బులిచ్చి రివ్యూలు రాయడం వల్లనే సినిమాలు ఆడతాయంటే అన్ని నిర్మాణ సంస్థలు ఎప్పుడో అవే బాట పట్టేవి
ఒకవేళ డబ్బులు తీసుకుని ఎవరైనా పాజిటివ్ రివ్యూలు రాస్తే ఆ సైట్ మీద ప్రేక్షకులకి విశ్వసనీయత పోతుంది
రెండోసారి ఆ సైట్ లో రివ్యూలు చూడరు
వెండి తెర మీది సినిమాని చూసి నిజాయితీగా ఉన్నదున్నట్టుగా రివ్యూ రాయగలుగుతేనే ప్రేక్షకుల నమ్మకాన్ని పొందగలుగుతాయి
అసలు విషయం తీసే సినిమాలో దమ్ము ఉండాలి
దమ్ము అంటే చార్మినార్ సిగరెట్లు అనుకునేరు
మంచి కథా బలం , చక్కటి నిర్మాణ విలువలు ఉండాలి
అలంటి సినిమాలను ప్రేక్షకులు నెత్తినబెట్టుకుని చూస్తారు
వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ తారాగణంతో , భారీ పబ్లిసిటీ ఇచ్చిన కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి
ఎటువంటి పబ్లిసిటీ లేకుండా లో బడ్జెట్లో చక్కటి కధా బలంతో తీసిన కొన్ని చిన్న సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి
ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే తత్త్వం బోధపడుతుంది
అంతేకానీ చెప్పుతో కొట్టుకుని ఏడుస్తేనో , తొక్కేస్తా .. పాతేస్తా అని బూతులు ఎత్తుకుంటేనో సినిమాలు ఆడవు !
