కాళేశ్వరం అవకతవకలకు కేసీఆరే బాధ్యుడా ? కమిషన్ నివేదికలో ఏముంది ? వాట్ నెక్స్ట్ ?
15 నెలలపాటు 115 మంది అధికార అనధికారులను విచారించి ఎట్టకేలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి నివేదికను నాలుగు రోజుల క్రితం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సమర్పించింది
రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రధాన కార్యదర్శికి అందించారు
తదుపరి తెలంగాణా క్యాబినెట్ ఈరోజు మధ్యాహ్నం సమావేశమై కాళేశ్వరం నివేదిక గురించి చర్చించింది
కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో న్యాయ పరమైన అంశాలను చర్చించేందుకు రెండు రోజుల క్రితం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫార్మ్ హౌస్ లో పార్టీ నేతలు కేటీఆర్ , హరీష్ రావు తదితరులతో సమావేశం అయ్యారు
ఈరోజు కమిషన్ నివేదిక గురించి క్యాబినెట్ చర్చిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మరోసారి పార్టీనేతలతో సమావేశం అయ్యారు
ఇదిలా ఉండగా కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు
మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ఆమోదించినట్టు చెప్పారు
తదుపరి ఈ నివేదిక ప్రతులను అన్ని రాజకీయ పార్టీలకు , ప్రజా ప్రతినిధులకు అందచేసి దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశం మీద సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పారు
త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కమిషన్ నివేదికపై చర్చిస్తామని కూడా ఆయన చెప్పారు
ఈ నివేదిక రాజకీయ పార్టీ కానీ , ప్రభుత్వం కానీ ఇచ్చినది కాదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి , సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన విశ్రాంత న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక
15 నెలలపాటు 115 మంది సాక్షులను విచారించిన అనంతరం ఇచ్చిన నివేదిక అని రేవంత్ చెప్పారు
ఇకపై ఏం జరగబోతుంది ?
మీడియాకు లీక్ అయిన నివేదిక ప్రకారం కాళేశ్వరం అవకతవకలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రులు హరీష్ రావు , ఈటెల రాజేంద్ర ప్రసాద్ లను బాధ్యులను చేస్తూ కమిషన్ సృష్టంగా పేర్కొంది
వీరిపై తదుపరి చర్యలకు కమిషన్ సిఫార్స్ చేసింది
ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలపై చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు
అసెంబ్లీలో చర్చించిన తర్వాత సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ?
నివేదికలోని అంశాలను సభ ఆమోదిస్తూ కేసీఆర్ తదితరులపై అవినీతి , ప్రజా ధనం దుర్వినియోగం , వంటి నేరాలకు క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ తీర్మానం రూపొందించవచ్చు
సభ తీర్మానాన్ని న్యాయస్థానానికి పంపి చట్టపరమైన చర్యలను కోరవచ్చు
లేదా ప్రభుత్వమే నేరుగా కేసులు బనాయించి అరెస్టులు చేయవచ్చు
ప్రభుత్వ చర్యలను ఎదుర్కోవడానికి కేసీఆర్ ముందున్న మార్గాలేంటి ?
జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై న్యాయ పోరాటం చేయడం మినహా కేసీఆర్ కు మరో మార్గం లేదు
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వెళ్లి చర్చలో పాల్గొనే అవకాశం తక్కువ
పార్టీ నేతలతో అసెంబ్లీలో చర్చకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేయవచ్చు
కమిషన్ నివేదిక రాజకీయ ప్రేరేపిత కక్ష పూరిత చర్య అని ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయవచ్చు కానీ ఆ వాదనకు ప్రజలు ఎంతవరకు కన్విన్స్ అవుతారో చూడాలి
ఎందుకంటే సీఎం రేవంత్ కూడా ఈ నివేదిక తమ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన నివేదిక కాదని ఇప్పటికే సృష్టం చేసారు
కాళేశ్వరం అవకతవకలను నిర్దారిస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక కాబట్టి దానికి కొంత విశ్వసనీయత ఉంటుంది
ఏదిఏమైనా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో కేసీఆర్ కు ముందుముందు న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు !
పరేష్ తుర్లపాటి