మొన్న జులై 25 , 2025 న తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసారు
అనంతరం పత్రాల మీద సంతకం పెడుతున్నప్పుడు తనకి తల్లితండ్రులు శ్రీనివాస అయ్యంగార్ , రాజ్యలక్ష్మిలు గుర్తుకొచ్చారని చెప్పాడు
అలా గుర్తుకురావడం వెనుక ఓ కారణం కూడా ఉందని చెప్పాడు
అదేంటో తెలుసుకునేముందు ఒకసారి రీల్ వెనక్కి తిప్పుదాం !
కొంతమంది సినిమా నటుల్నిఫ్లాష్ బ్యాక్ కోసం కదిలిస్తే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననో , ఐఏఎస్ , ఐపీఎస్ కాబోయి హీరో అయ్యాననో చెప్పడం మనం గతంలో చాలా చూసాం
ఈ ప్రకటనలకు హీరో రాజశేఖర్ కు మినహాయింపు ఉంది
ఎందుకంటే ఈయన మాత్రం డాక్టర్ అయి మరీ హీరో అయ్యాడు
నందమూరి తారక రామారావు అయితే తల్లితండ్రుల కోరిక మేరకు బుద్దిగా చదువుకుని సబ్ రిజిస్ట్రార్ గా ప్రభుత్వ కొలువు సంపాదించుని ఆ తర్వాతనే సినిమాల్లోకి వచ్చారు
చాలామంది యాక్టర్ల జీవితాల్లో తల్లితండ్రుల ప్రభావమో , సినిమాలపై తమకున్న ప్యాషన్ ప్రభావమో ఉండి వారిని ఆయా రంగాల వైపు నడిపించింది
ఏఎన్ఆర్ , కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబు , చిరంజీవులు సినిమా మీద ప్యాషన్ తోనే చిత్ర రంగానికి వచ్చి స్థిరపడిపోయారు
ఇప్పుడు కమల్ హాసన్ విషయానికి వద్దాం
భారతీయ సినీ పరిశ్రమలో అభిమానులచే ఉలగనాయగన్ గా పిలుచుకోబడుతున్న కమల్ ఒక్క నటనలోనే కాదు , రచన , నృత్యాలు , గానం , దర్శకత్వం , నిర్మాణ రంగాల్లో కూడా పట్టు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు పొందాడు
తమిళ్ , తెలుగు ,మలయాళం , హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ దశాబ్దాలుగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు
71 ఏళ్ళ వయసులో కూడా అలుపెరగక ఇప్పటికీ కీ రోల్స్ లో నటిస్తూనే ఉన్నాడు
అయితే ఈ మధ్య తమిళనాడులో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి కమల్ హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు
పార్టీ పెట్టిన తర్వాత కూడా విక్రమ్ , ధగ్ ఆఫ్ లైఫ్ తదితర సినిమాల్లో నటించాడు
ఈ పరిణామాల మధ్య గత జులై లో కమల్ రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు
ఆ క్షణాన ఆయనకు తల్లితండ్రులు గుర్తుకొచ్చారు
అలా గుర్తుకురావడానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్పాడు కదా
అదేంటంటే ,
కమల్ హాసన్ తల్లికి చిన్నప్పట్నుంచి తన కొడుకుని ప్రభుత్వ ఉద్యోగంలో చూసుకోవాలని కోరిక
ఈయనకేమో చదువులు అంతంత మాత్రం
కనీసం పదో తరగతి పాసయితే రైల్వేలో కానీ , ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కుదురుకోవచ్చని తల్లి పోరు పెడుతూ ఉండేది
కానీ ఈ హీరోగారు మాత్రం పదో తరగతి డ్రాపవుట్ తో బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు
సినిమాల మీద ఇష్టంతో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు
మెల్లిగా ఓ నృత్య దర్శకుడి దగ్గర సహాయకుడి పోస్ట్ వచ్చింది
సినిమాల్లో హీరో , హీరోయిన్లు డ్యూయెట్లు పాడుకునేటప్పుడు వేయాల్సిన స్టెప్పులను నేర్పటం ఈయన పని
తర్వాత కాలంలో ఇదే అసిస్టెంట్ చిత్ర పరిశ్రమలో ఎదిగి టాప్ హీరో అయ్యాడనుకోండి
ఎంత పెద్ద హీరో అయినప్పటికీ తల్లి కోరికను తీర్చలేదనే గిల్టీ కమల్ ను వెంటాడుతూనే ఉంది
రాజ్యసభ సభ్యుడిగా రాజ్యాంగబద్ధ పదవికి ప్రమాణం చేయడం ద్వారా ఆఖరికి 71 ఏళ్ళ వయసులో తన తల్లి కోరికను నెరవేర్చినట్టు ఇటీవల కమల్ ఎమోషన్ అయ్యాడు
దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కెరీర్ తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందని , ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడంతో తన తల్లి చిన్ననాటి కోరికను నెరవేర్చడమే కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని అన్నాడు
సినిమాల్లో రిటైర్మెంట్ గురించి ఇంకా నిర్ణయించుకోలేదని చెప్తూ , తన సేవలు ఇక చాలు అని చెప్పాల్సింది ఇండస్ట్రీ కాదు ప్రేక్షకులే అని చెప్పారు
ప్రేక్షకులు నిర్ణయించిన రోజున మాత్రమే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు
అయినా ఇటీవల విడుదలైన నా సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పుడు రిటైర్ అవుదామని అనుకున్నాను కానీ మిత్రుల ప్రోద్బలంతో కొనసాగుతున్నానని చెప్పారు
ప్రస్తుతం కమల్ హాసన్ రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా నిర్మించే పనుల్లో ఉన్నాడు
కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ పై విషయాలను పంచుకున్నాడు !
