కన్యాకుమారి సింపుల్ లవ్ స్టోరీ
ఈ తరహా కధలు ఇంతకుముందు కూడా వచ్చాయి
ఏ దర్శకుడు అయినా సరే లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా తీద్దామనుకున్నప్పుడు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది
ఈ చిత్ర దర్శకుడు సృజన్ అట్టాడ కూడా అటువంటి జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాడు
రొటీన్ లవ్ స్టోరీనే అయినా ఫ్రెష్ ఫీల్ చెడకుండా తీసాడు
ఇక కథ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పెంటపాడుకు చెందిన తిరుపతి (శ్రీ చరణ్ రాచకొండ ) కన్యాకుమారి ( గీత్ షైనీ ) ఒకే స్కూల్లో సహా విద్యార్థులు . స్కూల్ రోజులనుంచి తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం . అయితే వ్యవసాయం మీద మక్కువతో తిరుపతి చదువు మానేసి పొలం బాట పడతాడు . బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలనే ఆశయంతో కన్యాకుమారి చదువును కొనసాగిస్తుంది
దీంతో ఇద్దరి మధ్య కొన్నాళ్ళు బ్రేక్ వస్తుంది
తిరిగి ఓ స్నేహితుడి సాయంతో ఇద్దరూ కలుసుకోగలుగుతారు
అప్పుడు తిరుపతి తన ప్రేమ గురించి కన్యాకుమారి చెప్తాడు
కానీ వ్యవసాయం చేసుకుంటున్న తిరుపతిని మొదట కన్యాకుమారి కూడా ఇష్టపడదు
ఆమె ధ్యాసంతా బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలని .. అలాగే సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అబ్బాయిని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటుంది
ఈ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పై చదువులు చదివించలేనని కన్యాకుమారి తండ్రి చేతులు ఎత్తేయడంతో చివరికి ఆమె ఓ బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా చేరుతుంది
కన్యాకుమారి జాబ్ చేసుకునే అబ్బాయినే చేసుకుంటానని చెప్పడంతో తిరుపతి కూడా ఆమె కోసం అదే షాపులో ఉద్యోగంలో చేరతాడు
తిరుపతి విషయంలో కన్యాకుమారి ఇష్టపడుతున్న సమయంలో ఆమెను పై చదువులు చదవటానికి డబ్బులు ఇచ్చి సిటీకి వెళ్ళమంటాడు తండ్రి
ఈ పరిస్థితుల్లో తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తిరుపతిని వదిలిపెట్టి కన్యాకుమారి సిటీకి వెళ్ళిపోతుంది
ఆమె ఆశయం కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు తిరుపతి
సిటీ వెళ్లిన కన్యాకుమారి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయి తన కలను నెరవేర్చుకుంటుందా ?
వ్యవసాయం మీద ప్యాషన్ ఉన్న తిరుపతి తన లక్ష్యాన్ని సాధించుకుంటాడా ?
లక్ష్య సాధన కోసం విడిపోయిన ఈ ప్రేమికులు తిరిగి కలుసుకుంటారా ? అనేది మిగతా కథ
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాలో ఎవరెలా చేసారని చెప్పుకోవాలంటే ముందుగా కన్యాకుమారి ( గీత్ షైనీ ) పేరే చెప్పుకోవాలి
శ్రీకాకుళం యాసలో చక్కటి హావభావాలు ప్రదర్శించడంలో గీత్ షైనీ కి పూర్తీ మార్కులు పడతాయి
తనకప్పగించిన పాత్రను చాలా ఈజ్ తో చేసింది
పల్లెటూరి అమ్మాయిగానూ , సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలోనూ రెండు రకాల పాత్రలోనూ ఒదిగిపోయింది
ముఖంలో హావభావాలు పలికించడంలో కానీ , డైలాగ్ డెలివరీ లో కానీ చక్కటి పెర్ఫార్మన్స్ చూపించింది
దర్శకుడు ఎక్స్పోజింగ్ జోలికి వెళ్లకుండా గీత్ షైనీ ని స్క్రీన్ మీద చక్కగా ప్రెజెంట్ చేసాడు
ముఖ్యంగా తిరుపతిని చూస్తూ ‘ ఎల్లహే ‘ అని ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బావుంటుంది
తిరుపతిని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు కూడా తన్నుకొస్తున్న దుఃఖం తో అతడ్ని చూస్తూ ‘ ఎల్లేహే ‘ అని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం టచ్ చేస్తుంది
ఇక తిరుపతిగా వేసిన శ్రీ చరణ్ రాచకొండ రైతు పాత్ర పోషించాడు కాబట్టి డీ గ్లామర్ లోనే చూపించారు
పల్లెటూరి రైతు గెటప్లో లుంగీ , చొక్కాతో కనిపిస్తాడు
ఈ గెటప్ వరకు ఓకే కానీ అదేదో అపరిచితుడు సినిమాలో లా ముఖం మీదకు వేలాడే జుట్టు ఎందుకు పెట్టారో తెలీదు
ముఖంలో హావభావాలు పలికించడం ఇంప్రూవ్ చేసుకోవాలి
సినిమా అంతా పల్లెటూరి నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి కెమెరా మరింత పనితనం చూపించి ఉండాల్సింది
పొద్దస్తమానూ పొలం గట్టునే కాకుండా పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా అందమైన దృశ్యాలను కెమెరాలో బందించి ఉంటె మరింత బాగుండేది
పాటలు , సంగీతం పర్లేదు
కథ ప్రారంభంలోనూ , క్లైమాక్సులోనూ కొంత కామెడీ ట్రాక్ ను చూపిస్తారు
సినిమా మొత్తం ఎక్కువ భాగం హీరో , హీరోయిన్లే కనిపిస్తారు
కధలో భాగంగా మధ్య మధ్యలో కొంత కామెడీ ట్రాక్ ను జొప్పించి ఉంటె బాగుండేది
సెకండాఫ్ లో కొంత ల్యాగ్ తగ్గించి ఉండాల్సింది
జీవితంలో తమ ప్యాషన్లను సాధించుకోవడానికి ప్రేమలు అడ్డం రాకూడదని , అవి సాధించుకుంటూనే ప్రేమలను గెలుచుకోవాలని ఓ చక్కటి సందేశంతో లవ్ స్టోరీని ముగించాడు దర్శకుడు
ప్రస్తుతం ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది
రేటింగ్ : 2. 5 / 5
పరేష్ తుర్లపాటి
