Home » రెండేళ్లుగా ఆక్టివ్ రాజకీయాలు చేయకుండా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ అకస్మాత్తుగా జనంలోకి రావడం వెనుక కారణాలు ఏంటి ?

రెండేళ్లుగా ఆక్టివ్ రాజకీయాలు చేయకుండా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ అకస్మాత్తుగా జనంలోకి రావడం వెనుక కారణాలు ఏంటి ?

Spread the love

తెలంగాణాలో ఓటమి తర్వాత ఈ రెండేళ్లలో అరుదుగా మినహా కేసిఆర్ ఫార్మ్ హౌస్ విడిచిపెట్టి పార్టీ కార్యక్రమాలకు రాలేదు

కానీ ఆదివారం అకస్మాత్తుగా ఆయన తెలంగాణా భవన్ కు వచ్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు

ఇప్పటిదాకా ఒక లెక్క , ఇకపై ఒక లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
ఇకపై జనంలో ఉంటానని ప్రకటించారు

కేసిఆర్ లో అకస్మాత్తుగా ఈ మార్పు రావడానికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషణ చేసుకుందాం

రాజకీయాల్లో పటిష్టమైన వ్యూహకర్తగా కేసీఆర్ కు మంచి పేరుంది
అందుకే దశాబ్దాల తరబడి మహామహులు సాధించలేని ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సాధించారు

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది
డెబ్భైయ్యవ దశకంలో చాలామందికి రాజకీయ పునరావాసం కల్పించిన పార్టీ కాంగ్రెసే
మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదన్ మోహన్ ను తన గురువుగా భావించి ఆయన తరపున పనిచేసాడు
తరువాయి కాలంలో తన గురువు మీదే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు

83 లో ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందులో చేరాడు
1985 లో తెలుగుదేశం పార్టీ తరపున సిద్ధిపేట నుంచి పోటీ చేసిమొదటిసారి శాసన సభలో అడుగుపెట్టారు
ఆ తర్వాత 87 -88 లో కేసీఆర్ కు క్యాబినెట్లో బెర్త్ దొరికింది

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో ఈయన గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ
మిగిలిన మంత్రుల మాదిరి క్యాబినెట్లో కేసీఆర్ కూడా ఒక మంత్రి అంతే
అంతకుమించి ప్రత్యేక ఐడెంటిటీ ఏమీ లేదు

1983 – 84 ఎన్టీఆర్ మొదటి క్యాబినెట్లో అసలు కేసీఆర్ లేడు
రెండోసారి ఏర్పడిన క్యాబినెట్లో మాత్రమే కేసీఆర్ కు చోటు దక్కింది
ఆ క్యాబినెట్లో కూడా ఆయన జూనియర్ కోటాలోనే గుర్తించబడ్డాడు

ఇంకోరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ క్యాబినెట్లో ప్రాధాన్యతా క్రమంలో చంద్రబాబు , దగ్గుబాటి వెంకటేశ్వర రావు ,యనమల రామకృష్ణుడు , పూసపాటి అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ మంత్రులు ముందు వరుసలో ఉంటే , చివరి వరుసలో కేసీఆర్ తదితరులు ఉండేవారు

అప్పటికి కేసీఆర్ లో ప్రత్యేక తెలంగాణా ఊసులు లేవు
సమైక్య రాష్ట్రంలో మంత్రిగా తన పనులు తాను చేసుకుంటూ పోయాడు

1999 లో చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో బయటికి వచ్చేసారు
2001 లో టిడిపికి , శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణా నినాదంతో టీఆరెస్ పార్టీని స్థాపించాడు

ఒకపక్కన ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూనే కేంద్రంలో కూడా తన గళాన్ని వినిపించడానికి కరీమ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు

అప్పట్లో యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చి కేసీఆర్ కేంద్రమంత్రి కూడా అయ్యారు
తర్వాత రెండేళ్లలోనే తన పదవులకు రాజీనామా చేసి తిరిగి తెలంగాణాలో ఆక్టివ్ ఉద్యమాలు చేసాడు

2009 డిసెంబరులో నిరాహార దీక్షకు కూర్చుని కేంద్రంతో ప్రత్యేక తెలంగాణా కు ఓకే చెప్పించుకున్నారు

2014 లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసారు

2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు

అలా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ 2023 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు

గజ్వేల్ , కామారెడ్డిల నుంచి పోటీ చేసిన కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు

తెలంగాణకు శాశ్వత ముఖ్యమంత్రిగా తననితాను ప్రకటించుకున్న కేసీఆర్ ఓడిపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ?

రెండోసారి కూడా తనని ముఖ్యమంత్రి పదవి వరించడంతో కేసీఆర్ దృష్టిజాతీయ రాజకీయాలవైపు మళ్లింది

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికట్టి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసాడు

ఇంతవరకు బాగానే ఉంది

కానీ అంతటి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ ఉత్సాహంలో , ఉద్రేకంలో అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడు

తెలంగాణాలో ప్రజలు తనకు పట్టంకట్టింది ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని చూసే అన్న సంగతి మర్చిపోయాడు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ప్రాంతీయభావంతో నిండిఉన్న పార్టీపేరు పనికిరాదని భావించాడు

అందుకే పార్టీ పేరులో తెలంగాణాని తీసేసి భారత్ ను చేర్చాడు

కానీ తన నిర్ణయం పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఆ క్షణాన ఆయన ఊహించలేకపోయారు

ఎప్పుడైతే పార్టీ పేరులో తెలంగాణాని తీసేసాడో అప్పుడే ప్రజలు తెలంగాణ నుంచి ఆయన్ని తీసేసారు

దీంతో కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది

కొండనాలుక్కి మందు వేస్తె ఉన్న నాలుక ఊడినట్టు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అత్యాశతో ఆయన చేసిన ఆలోచన వల్ల , దేశం సంగతి అటుంచితే తెలంగాణాలో కూడా గెలవలేకపోయాడు

ఈ పరిణామాలు కేసీఆర్ ఊహించనివి
ఘోర ఓటమితో కేసీఆర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారు

దాంతో తాత్కాలికంగా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఎర్రవల్లిలోని తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు

ఎంతలా అంటే తొలినాళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ సైతం ప్రకటనలు చేస్తూ ప్రతిపక్ష నాయకుడిగా సభకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కేసీఆర్ కి పదేపదే విజ్ఞాపనలు చేసేంతదాకా వెళ్ళింది

అయినా కేసీఆర్ లో చలనం లేదు

అసెంబ్లీకి తప్పనిసరి హాజరు నిబంధన ఉండటంతో ఒకసారి మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు

ఇంకోసారి వరంగల్ సభకు బయటికి వచ్చారు
మిగిలిన రెండుమూడు సార్లు హెల్త్ చెకప్ ల కోసం బయటికి వచ్చారు మినహా ఫార్మ్ హౌస్ గడప దాటలేదు

కేసీఆర్ రాజకీయ వైరాగ్యానికి కారణాలు ఏంటి ?

కేసీఆర్ మంచి వ్యూహకర్త అని జనాలు నమ్మడమే కాదు ఆయన కూడా నమ్ముతారు

తన వ్యూహం ఫలించే తెలంగాణా దక్కినప్పుడు అదే వ్యూహంతో ముందుకెళితే భారత్ ఎందుకు దక్కదు ? అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఆలోచన చేసారు ఆయన

దానికి తగ్గట్టుగానే కేసీఆర్ మాట్లాడేవారు

అనేక సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించారు
సరే , రాజకీయాల్లో విమర్శలు ఎటూ ఉండేవే . కానీ కేసీఆర్ ఒక దశలో ఆ లిమిట్ దాటేసి మోడీ బోడి అంటూ వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు

రాజకీయాల్లో మరింత దూకుడు పెంచారు
దేశ రాజకీయాలను మలుపు తిప్పుతానని చెప్తూ రాష్ట్రాలు తిరిగారు

ఎందుకైనా మంచిదని ఇతర ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ తో ఆచితూచి వ్యవహరించాయి
కర్ణాటక నుంచి ఒక్క కుమార స్వామి మినహా ఇంకెవరూ ఆక్టివ్ సపోర్ట్ ఇచ్చినట్టు కనిపించలేదు

మోడీని ఢీకొట్టడం మహామహులకే సాధ్యం కావడం లేదు
కేసిఆర్ కన్నా ముందే గతంలో అన్ని పార్టీలు కూటమి కట్టి ప్రయతించినప్పటికీ మోడీని ఓడించలేకపోయారు

అప్పుడైనా కేసీఆర్ పునరాలోచించుకుంటే పరిస్థితి ఎట్లా ఉండేదో తెలీదు కానీ ముందువెనుకలు చూసుకోకుండా దూకుడుగా వెళ్లిపోయారు

ఫలితం తెలంగాణలోనే ఘోర ఓటమి
దరిమిలా కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలుపాలవడం ఆయన్ని మానసికంగా కృంగదీసింది

ఒకపక్కన పార్టీ ఓటమి , ఇంకోపక్కన బిడ్డ జైలుకెళ్లడంతో ఆయనపై ముప్పేట దాడి చేసినట్లయింది

ఈ పరిస్థితుల్లో కిందపడి తుంటి ఫ్రాక్చర్ అవడంతో బయట కదల్లేని పరిస్థితులు వచ్చి ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయారు
దాంతో ఆయనకి రాజకీయ వైరాగ్యం వచ్చింది

కవిత ఎపిసోడ్

బీజేపీ మీద కేసీఆర్ దూకుడు తగ్గటానికి కవిత ఎపిసోడ్ కూడా ఒక కారణం

ఒకప్పుడు మోడీ మీద , బీజేపీ మీద ఒంటికాలుమీద లేచిన కేసిఆర్ ఓటమి తర్వాత మౌనవ్రతం పాటించడం వెనుక కవిత ఉదంతం కూడా ఉంది

ఆఖరికి కవిత కూడా బీజేపీ మీద ఎందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని తండ్రికి లేఖ రాసేదాకా వెళ్ళింది

అయినా కేసిఆర్ నోరు విప్పలేదు
దరిమిలా కవిత పార్టీనుంచి బయటికి వచ్చేసి సొంత కుంపటి పెట్టుకుంది

ఇది కూడా కేసిఆర్ వ్యూహమేనా ?

కేసిఆర్ ను కాదని కవిత బయటికి రావడం చాలామంది ఊహించలేకపొతున్నారు

కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులలో మాత్రం ఇదంతా కేసిఆర్ వ్యూహం అనే అనుమానాలు కూడా ఉన్నాయి

కేసిఆర్ గతంలోలాగా బీజేపీ మీద దూకుడుగా వెళ్లాలంటే కవిత ఇష్యూ ఆయనకి పంటికింది రాయిలా తగులుతుంది

కవిత వల్ల ఆయనకి రెండు రకాల అప్రతిష్ఠలు వచ్చాయి

లిక్కర్ స్కాం లో అవినీతికి పాల్పడిందని ఆమె మీద కేసులు నమోదు అవడంతో తండ్రిగా తనకు అప్రతిష్ట రావడం అటుంచి పార్టీ పరంగా కూడా కేసిఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి

దాంతో బీజేపీతో రాజకీయ పోరాటానికి సిద్దమైనప్పుడల్లా వాళ్ళు లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న కూతురి చిట్టా బయటికి తీస్తున్నారు

కేసిఆర్ కూతురిగా కవిత పేరు చెప్పుకున్నన్నాళ్లు ఆయనకి ఈ ఇబ్బందులు తప్పవు

అదే కూతురితో తండ్రికి కుటుంబ బాంధవ్యాలు లేవని తెలిసినప్పుడు శత్రువుల టార్గెట్ కూడా మారుతుంది
దృష్టి కవిత మీదనుంచి ఇంకోవైపు మళ్లుతుంది

ఈ వ్యూహంలో భాగంగానే కవిత తాత్కాలికంగా బయటికి వచ్చి ఉంటుందనే అనుమానాలు కూడా కొన్ని పార్టీ వర్గాల్లో ఉన్నాయి

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసిఆర్ ఇప్పుడెందుకు బయటికి వస్తున్నారు ?

ఇందాక కేసిఆర్ రాజకీయ వైరాగ్యం గురించి చెప్పుకున్నాం కదా
అందులో కూడా ఒక వ్యూహం ఉందని టాకు

కేసిఆర్ అంతిమ గోల్ ఏంటి ?
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం

ఎప్పట్నుంచో ఈ ఆలోచన ఉందికాబట్టి ప్రధాని మోడీని కూడా తన బిడ్డను ఆశీర్వదించమని అడిగారు కదా

అంతా సక్రమంగా జరిగిఉంటే 2023 లో కేటీఆర్ ను తెలంగాణా సీఎం చేసి తాను దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఢిల్లీలో సెటిలైపోదామని కేసిఆర్ భావించారు
భావించడమే కాదు , ఢిల్లీలో బ్రహ్మాండమైన పార్టీ ఆఫీసును కూడా కట్టుకున్నారు

ఫలితాలు తారుమారు అయి కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే మిగిలిపోవడంతో ఆయన మరింత నిరాశలో మునిగిపోయాడు

అయినా కేసిఆర్ లోని నాయకుడు మేలుకునే ఉన్నాడు
ఈ దశలో ఆయన కేటీఆర్ నాయకత్వానికి ఒక పరీక్ష పెట్టారు

ఓటమి తర్వాత పార్టీ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ మీదే పెట్టి బిఆర్ఎస్ ను తిరిగి గెలిపించే టాస్క్ కూడా అప్పగించారు

కేటీఆర్ కూడా అదెంత పనిలే అనుకున్నారు

మొదట్లో అంతర్గత తగాదాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరునెలల్లోనే కూలిపోయి ఎన్నికలు వస్తాయని భావించారు

ఆరునెలలు పోయి రెండేళ్లు అవుతున్నా రేవంత్ ప్రభుత్వం అంగుళం కూడా కదలకపోవడంతో ఉప ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు

పార్టీకి కంచుకోటలా ఉన్న జూబిలీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఓడిపోవడంతో ఖంగు తిన్నారు

అక్కడా పరాభవమే ఎదురవడంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదాం అనుకున్నారు

ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో కేటీఆర్ నాయకత్వ సామర్థ్యం పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకత్వానికి అర్థమైపోయింది

వాళ్ళకే కాదు కేటీఆర్ కు కూడా అసలు విషయం అర్థమైంది

రెండేళ్లుగా దాదాపు ప్రతి ఎన్నికలో ఓటమి ఎదురవుతూ ఉందంటే అది నాయకత్వ లోపంగానే భావిస్తారు
ఇదే ఏ జాతీయపార్టీలోనో అయితే పదవి ఎప్పుడో పోయేది

దాంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మునిగిపోతున్న నావలా ఉన్న పార్టీని రక్షించి ఒడ్డున చేర్చగల నాయకత్వ సామర్థ్యం బిఆర్ఎస్ లో ఒక్క కేసిఆర్ కు మినహా మరెవరికీ లేవని అందరికీ అర్థమైంది

దాంతో ఆరోగ్యం సహకరించినా , సహకరించకపోయినా ప్రజల్లోకి కేసిఆర్ రంగప్రవేశం అనివార్యమైపోయింది

కేసిఆర్ వస్తే ఏమౌతుంది ?

నిస్తేజంగా ఉన్న పార్టీకి ఖచ్చితంగా జవసత్వాలు వస్తాయి
ద్వితీయశ్రేణి నాయకత్వంలో కూడా జోష్ వస్తుంది

కేసిఆర్ నాయకత్వ సామర్థ్యం , అనుభవం పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి

నిద్రాణంగా ఉన్న కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి కదనరంగం వైపు నడిపించడం కేసిఆర్ కు తెలుసు

జాతీయ రాజకీయాల సంగతి ఏమో కానీ తెలంగాణాలో తిరిగి పాత సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ప్రజల్లో కదలికలు తీసుకురాగలడు

అందుకే నిజంగా అన్నాడో , కాకతాళీయంగా అన్నాడో తెలీదు కానీ మొన్నటి మీటింగులో కేసిఆర్ తమ పార్టీపేరును టీఆరెస్ అనే పలికారు

ఒకరకంగా బిఆర్ఎస్ శ్రేణులు అందరూ కేటీఆర్ నాయకత్వంకన్నా ఇప్పటికీ కేసిఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు

చూద్దాం
కేసిఆర్ రాకతో తెలంగాణా రాజకీయాలు ఏ రకమైన మలుపు తీసుకుంటాయో చూద్దాం !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!