అన్న అలా .. తమ్ముడు ఇలా .. కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సెపరేటు !
నల్గొండ జిల్లాలో బలమైన నాయకులు ఎవరంటే చప్పున గుర్తొచ్చే పేర్లు కోమటిరెడ్డి బ్రదర్స్ వే
రాజగోపాల్ కెరీర్లో కొద్దికాలం మినహాయిస్తే అన్నదమ్ముల రాజకీయ ప్రస్థానం అంతా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతోనే పెనవేసుకుపోయింది
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే నల్గొండ నియోజక వర్గం నుంచి ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ , తెలంగాణలోనూ మంత్రి పదవులు నిర్వహించారు
ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా , ఎమ్మెల్సీ గా , ఎమ్మెల్యే గా పదవులు నిర్వహించారు
ఈయన కూడా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ 2022 లో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల తన పొలిటికల్ కెరీర్ ను గందరగోళం చేసుకున్నాడు
రాజగోపాల్ 2022 లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షం లో బీజేపీ లో చేరారు
తిరిగి 2023 లో బీజేపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు
అప్పటినుంచి ఆయన మంత్రి పదవి మీద గంపెడాశలు పెట్టుకున్నారు
కానీ క్యాబినెట్ కూర్పులో భాగంగా ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు
ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే సమీకరణాలు దెబ్బతింటాయని అధిష్టానం అప్పట్లో రాజగోపాల్ రెడ్డిని పక్కనబెట్టింది
అయితే విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూసిన రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైంది
దాంతో గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి తీరు మారింది
పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి వాఖ్యల పేపర్ కటింగులను ట్యాగ్ చేస్తూ ‘ తనకు తాను పదేళ్లు సీఎం అని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ నియమాలకు విరుద్ధం అని ట్వీటారు
మొన్న సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలను ఖండిస్తూ దుమారం లేపారు
ఈరోజు నేరుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బాణాలు సంధించారు
పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామని నమ్మించి తనను బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని విమర్శించారు
అలాగే భువనగిరిలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాట తప్పారని .. ఇక తనలో సహనం నశించిందని చెప్తూ త్వరలో తానేంటో చూపిస్తానని ఇందుకోసం ఎందాకైనా వెళ్తానని రేవంత్ మీద నిప్పులు చెరిగారు
ఇదిలా ఉండగా రాజగోపాల్ రెడ్డి అన్న మంత్రి కోమటిరెడ్డి మాత్రం తన మద్దతును సీఎం రేవంత్ కి బాహాటంగా తెలియచేసారు
నిన్న నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రేవంత్ కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇంకో పదేళ్లు నువ్వే మాకు సీఎం గా ఉండాలని ఓపెన్ గా చెప్పారు
కొద్దిసేపటి క్రితం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ రాజగోపాల్ కు మంత్రి పదవి విషయంలో హామీ ఇచ్చారని తనకు తెలియదని , ఆయనకు మంత్రి పదవి ఇచ్చే , ఇప్పించే అధికారం తన చేతుల్లో లేదని , అధిష్టానం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని చెప్తూ ఇందులో తన ప్రమేయం ఏమీ ఉండదని ‘ తమ్ముడికి సృష్టంగా చెప్పారు
దీనితో నల్గొండ రాజకీయాల్లో విచిత్రకరమైన పరిణామాలు ఏర్పడ్డాయి
అన్న సీఎంను సమర్థిస్తున్న సమయంలోనే తమ్ముడు రేవంత్ మీద నిప్పులు చెరుగుతున్నారు
ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా పార్టీలో అసమ్మతిని చాకచక్యంగా హ్యాండిల్ చేస్తూ వచ్చిన రేవంత్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే !
పరేష్ తుర్లపాటి