తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది పద్మశ్రీ కోట గారు !
కోట శ్రీనివాసరావు .. కొన్నేళ్లుగా వెండి తెర మీద ఈ టైటిల్ పడకుండా తెలుగు సినిమాలు దాదాపు లేవనే చెప్పొచ్చు !
కొన్ని పాత్రలు అయితే ఏకంగా ఆయనకోసమే సృష్టించబడ్డాయి
విలనిజం .. కామెడీ .. క్యారక్టర్ .. అలా తనకిచ్చిన పాత్ర ఏదైనా సరే అందులో జీవించి కోట మార్క్ అంటే ఏంటో చూపించి ప్రేక్షకులనుంచి వంద శాతం మార్కులు పొందారు కోట శ్రీనివాసరావు గారు
ఆ హావభావాలు .. ఆ డైలాగ్ డెలివరీ .. విభిన్న పాత్రల్లో మెప్పించడం మరే నటుడికీ సాధ్యం కానిది
కేవలం కోట మాత్రమే చేయగలరు
అదీ కోట మార్క్ అంటే
దాదాపు 750 సినిమాల్లో నటించి ఎన్నో పాత్రలకు జీవం పోసి పద్మశ్రీతో సహా పురష్కారాలు ,సన్మానాలూ , అవార్డులూ ఎన్నో సాధించి 83 ఏళ్ళ వయసులో వయోభారంతో ఈరోజు ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు కోట
సాధారణంగా ఏ నటుడైనా కెమెరా ముందు నటించి దర్శకుడి మెప్పును పొందుతారు
కానీ కోట విలక్షణ నటుడు .. ఆయన కెమెరా ముందు నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు
మనం సినిమాలో ఏదైనా పాత్రను చూసి భావోద్వేగంతో కంట తడి పెట్టినా ,
విలనిజం పాత్రను చూసి పళ్ళు పటపటా కొరుకుతూ వీడి దుర్మార్గం తగలెయ్య .. వీడ్ని ఏసెయ్యాలి అన్నంత ఆవేశం వచ్చినా ,
మన టెన్షన్లు అన్నీ మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకున్నా ,
అది నటుడి గొప్పతనమే
అటువంటి గొప్ప నటుడు కోట
కోట గురించి చెప్పుకోవాలంటే కేవలం సినీ నటుడిగా మాత్రమే చెప్పుకుంటే సరిపోదు
రాజకీయాల్లో చేరి 1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయి చట్ట సభల్లో ప్రవేశించిన నేపధ్యం కూడా ఆయనకు ఉంది
ఆ రకంగా ఆయన మాజీ శాసన సభ్యుడు కూడా
కోట జీవితం గురించి చెప్పుకోవాలంటే ఎస్వీ రంగారావు మాదిరే ఈయనకు కూడా చిన్నప్పటినుంచి నాటకాలంటే పిచ్చి
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు చిన్నప్పటినుంచి నాటకాలు వేస్తూ పెరిగారు
చదువు పూర్తి కాగానే స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం కూడా వచ్చింది
అయితే ఆయన ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లోనే అనుకోకుండా ఆయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది
గతంలో ఆయన నటించిన ప్రాణం ఖరీదు నాటకాన్ని చూసిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్ దాన్ని సినిమాగా తియ్యాలనుకున్నాడు
అందుకని ఆ నాటకంలో నటించిన వాళ్లనే తన సినిమాకు తీసుకోవాలనుకున్నాడు
ఆ విధంగా 1978-79 లో కోట కు ప్రాణం ఖరీదు సినిమాలో మొదటి అవకాశం వచ్చింది
ఆ తర్వాత కోట కి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు
ముఖ్యంగా అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్ర కోట కు పేరు తెచ్చిపెట్టింది
2015 లో భారత ప్రభుత్వం కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురష్కారం ప్రకటించి సత్కరించింది
అంతేనా సినిమాల్లో కోట శ్రీనివాసరావుకు మాత్రమే ప్రత్యేకమైన ఊతపదం లాంటి డైలాగులు కొన్ని ఉన్నాయి
ఆ డైలాగులు ఎంతలా పేలాయంటే కొన్నేళ్లపాటు మీమర్స్ అవే ఉత పదాలు వాడుకునేంత
వాటిలో ‘ ఈడెవడ్రా బాబూ ‘
‘ నాకేంటి .. అహ .. నాకేంటి అంట ‘
‘ మరదేనమ్మా నా స్పెషలు ‘
‘ అయ్యా నరకాసుర ‘
అంటే .. నాన్నా .. అదీ ‘
‘ గిదైతే నేను ఖండిస్తున్నా ‘
ఇంకా కొన్ని పాపులర్ అయ్యాయి
అలా తనకు ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించి పరిపూర్ణత పొందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు ( 83 ) ఈ రోజు తుది శ్వాస విడిచారు !
ఒక ఘంటసాల , ఒక రామారావు , ఒక రంగారావు , ఒక నాగేశ్వరరావు ఎలా తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత గుర్తుండి గుర్తుంది పోతారో అలాగే కోట శ్రీనివాసరావు కూడా . శ్రద్ధాంజలి .