సినిమాల్లో దర్శకులు ప్రధానంగా రెండు కేటగిరీలను నమ్ముకుంటారు
మొదటిది బలమైన కథ
రెండోది బలమైన కథనం
బలమైన కథ విషయానికి వస్తే
కొన్ని కథలు చదవటానికి బాగుంటాయి
కొన్ని కథలు చూడటానికి బాగుంటాయి
బాగున్న కథల్ని మరింత బాగుండేలా వెండి తెర మీద చూపించగలగడం ఒక ఆర్ట్
ఇక్కడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది
లేకపోతే కథ కంచికి వెళ్తుంది
ఎందుకంటే గతంలో సినిమాల కోసం ప్రముఖ రైటర్లు రాసిన నవలలు కూడా వెండి తెర మీదకు వచ్చేసరికి తేలిపోయాయి
రెండోది బలమైన కథనం
దీనికి కథతో పెద్దగా పనుండదు
ఆకట్టుకునే కథనమే సినిమాని నడిపిస్తుంది
కుంబలంగి నైట్స్ ఆ కోవకు సంబంధించిన సినిమానే
సినిమా చూస్తున ప్రేక్షకులకు అందులోని పాత్రలు నిజ జీవితంలో తాము చూసిన సంఘటనలకు దగ్గరగా ఉన్నాయనే ఫీలింగ్ వస్తే చాలు ..సగం విజయవంతమైనట్టే
అందులో నిత్య జీవితంలో మనకు ఎదురుపడే కొన్ని పాత్రలు చెరగని ముద్ర వేసుకుంటాయి
మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చూడండి.. ఛాయ్ అమ్మేవాళ్ళు , శనక్కాయలు అమ్మేవాళ్ళు తారసపడుతుంటారు
అలాగే సముద్ర ప్రాంతాలకు వెళ్తే చేపలు పట్టే జాలరులూ కనిపిస్తారు
వీళ్ళని మనం చూసేది కొద్దిసేపే అయినా ఎక్కడో మనసు పొరల్లో వీళ్ళ జీవితాల మీద ఆలోచన వస్తుంది
కుంబలంగి నైట్స్ సినిమా ఆసాంతం చూసిన తర్వాత సీట్లలోనుంచి లేస్తుంటే ఇప్పటిదాకా మనం చూసిన పాత్రలు నిజ జీవితంలో మనకు తారసపడినవారే కదా అనిపిస్తుంది
సినిమా చూడటం మొదలుపెట్టిన కాసేపటికి మనం థియేటర్లో ఉన్నామనో , ఇంట్లో ఓటిటీ లో చూస్తున్నామన్న సంగతో మర్చిపోతాం
కేరళలోని కుంబలంగి పల్లెకు వెళ్ళిపోతాం
ఆ పల్లెలో చేపలు పట్టుకునే నలుగురు అన్నదమ్ముల జీవితాల మధ్యలోకి దూరి తొంగి చూస్తాం
ఈ అన్నదమ్ములు మనముందే తాగుతారు ..కొట్టుకుంటారు ..విడిపోతారు ..అంతలోనే కలిసిపోతారు .. ఒకరినొకరు తోడుగా ఉంటారు
కుంబలంగిలో కాగడా పెట్టి వెతికినా ఎక్కడా నటులు కనిపించరు
సజీవ పాత్రలే కనిపిస్తాయి
అందుకే ఇదొక సజీవ దృశ్య కావ్యం
ఓ రెండు గంటల పాటు అలా కేరళ వెళ్లి హాయిగా కుంబలంగి అందాలను చూస్తూ ఆ నలుగురు అన్నదమ్ముల జీవితాల్లో ఏం జరిగిందో చూద్దాం పదండి
కుంబలంగి నైట్స్ కథ
కేరళలోని కోచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకో టూరిజం విలేజ్ కుంబలంగి
ఈ విలేజ్ శివార్లలో చెరువు వడ్డున ఉన్న పాడుబడ్డ ఇంట్లో చేపలు పట్టే మృత్య్సకారుల కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు నివాసం ఉంటారు
వీరిలో పెద్దవాడు సాజి ( సౌబిన్ సాహిర్ ) , ఇతని ముగ్గురు తమ్ముళ్లు బాబీ ( షేన్ నిగమ్ ) ,ఫ్రాంకిన్ (మాధ్యు థామస్ ) బోని (శ్రీనాథ్ బసి)
వీరిలో బోని విడిగా ఉంటాడు
మిగిలిన ముగ్గురు అన్నదమ్ములూ అదే ఇంట్లో ఉంటూ నిత్యం ఒకరితో ఒకరు గొడవలు పడుతుంటారు
ముఖ్యంగా సాజి , బాబీలు రోజూ తాగి గొడవలు పడుతూ ఉంటారు
హాస్టల్ నుంచి ఇంటికొస్తున ఫ్రాంకిన్ ను స్నేహితులు అడుగుతారు . విలేజ్ చూడటానికి తాము కూడా వస్తామని అంటే ఇంట్లో ఎవరికీ బాలేదని అబద్దం చెప్పి వారిని తీసుకురాకుండా ఒక్కడే వస్తాడు
దీనికి కారణం ఇంట్లో అన్నదమ్ముల గొడవలే
పేరుకి మృత్స్యకారులే కానీ నలుగురికీ సరైన పనీపాటలు లేవు
చెరువులో దొరికిన చేపలను పట్టుకుని వండుకోవడం , తాగడం , తినడం తప్ప వేరే పనేమీ లేదు
దీనికి తోడు ఇంట్లో ఆడ దిక్కు లేదు
ఇదిలా ఉండగా అదే విలేజిలో కొద్దిగా కలిగిన వారి ఇంటికి అల్లుడుగా షమ్మీ ( ఫాహద్ ఫాసిల్ ) వస్తాడు
ఇతడిదంతా పురుషహంకార ధోరణి
ఇంట్లో ఆడవాళ్లు తన మాటే వినాలనే అహంకారం ప్రదర్శిస్తుంటాడు
మామగారు లేకపోవడంతో అత్తా , భార్య , మరదలి మీద పెత్తనం అంతా అతడిదే
ఇలాంటి పరిస్థితుల్లో ఇతడి మరదలు బేబీని సాజి తమ్ముడు బాబీ ప్రేమిస్తాడు
మరి వీరి ప్రేమకు షమ్మీ ఒప్పుకుంటాడా ?
తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న సాజి ఏం చేస్తాడు ?
వీరి జీవితాల్లోకి ప్రవేశించిన ఆడవారి వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి ? అనేది మిగతా కధనంలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
కథ విన్నారుగా
ముందే చెప్పినట్టు ఇందులో కథ కన్నా కథనానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది
సాదాసీదా జాలరి కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇంట్లో ఆడ దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టారు
దొరికింది తెచ్చుకుని తినడం , తాగి తన్నుకోవడం , బారెడు పొద్దెక్కాక లేవడం ఇదే అన్నదమ్ముల నిత్యకృత్యం
అయినా వీళ్ళు తాగి తన్నుకోవడాలు చూస్తుంటే మనకు వల్గర్ గా అనిపించదు
ఎందుకంటే ఎంత తాగి తన్నుకున్నా అంతలోనే కలిసిపోతారు
ఒకరినొకరు అరుచుకోవడంలో అనుబంధం బయటపడుతుంది
చిన్నప్పుడు అన్నదమ్ములు అల్లరి చేయడం , గొడవ పడి తన్నుకోవడాలు చాలా ఇళ్లల్లో జరిగేదే
వీరి అల్లరి భరించలేక తల్లితండ్రుల్లో ఎవరో ఒకరు రంగంలోకి దిగి రాజీ చేయడం మనకి తెలిసిందే
కానీ అలా రాజీ చేసే పెద్దవాళ్ళు లేకపోతే ?
ఈ అన్నదమ్ముల సమస్య అదే
అందుకే కాసేపు గొడవ పడతారు .. అంతలోనే రాజీ పడతారు
సినిమాలో గుండెను తడిమే సన్నివేశాలు కొన్ని ఉంటాయి
అవే సినిమాకి ప్రాణం
తన కారణంగా స్నేహితుడు చనిపోవడంతో కడుపుతో ఉన్న స్నేహితుడి భార్య వద్దకు సాజి వెళ్లి తనను క్షమించమని కాళ్ళ మీద పడతాడు
అంతేకాదు స్నేహితుడి భార్యకు నైతికంగా అండగా నిలబడి హాస్పిటల్లో పురుడు పోయించి తల్లీ పిల్లలను కొంతకాలం తన ఇంటికి తీసుకొచ్చి సాయం చేస్తాడు
స్నేహితుడి మరణం కలచివేసి కన్నీరు ఇంకిపోయి తనకు బిగ్గరగా ఏడుపు కూడా రావడం లేదని ,డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించమని తమ్ముడ్ని అడుగుతాడు
చిన్నప్పుడే తండ్రి చనిపోవడం , తల్లి చర్చిలో కలిసిపోవడంతో తమ్ముళ్లను తానే పెంచుతున్నాని గతం గుర్తు చేసుకుంటూ డాక్టర్ ను పట్టుకుని సాజి బిగ్గరగా ఏడ్చిన దృశ్యం ప్రేక్షకుల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది
తమ్ముడు బేబీ అనే పిల్లను ప్రేమించాడని తెలిసి వారి ప్రేమకు అండగా నిలబడతానని మాటిచ్చి బేబీ బావ అయిన షమ్మీని కలిసి తన తమ్ముడి ప్రేమను అంగీకరించమని ప్రాధేయపడటం హృదయాలను టచ్ చేస్తుంది
తాగి తన్నులాడుకున్న అన్నదమ్ములు వీళ్లేనా ? అనిపిస్తుంది
అంతలోనే తమ్ముడి కోసం ఈ అన్న ఎంత బాధ్యత తీసుకున్నాడు ? అని మంచిగా అనిపిస్తుంది
కుంబలంగి నైట్స్ లో విభిన్న పాత్రలను పరిచయం చేసినా దర్శకుడు ప్రధానంగా రెండు విషయాలను చెప్పడం మీద దృష్టి పెట్టాడు
మొదటిది షమ్మీ పాత్ర ద్వారా పురుషాధిక్య అహంకారాన్ని పరిచయం చేసాడు
రెండోది అదే పురుషుల్లో స్త్రీలకు సమానంగా గౌరవం ఇచ్చే అన్నదమ్ముల పాత్రలను కూడా పరిచయం చేసాడు
పేరుకి పేదవాళ్ళు అయినా తన వల్ల స్నేహితుడు మరణించాడని తెలుసుకుని సాజి అతడి భార్య కాళ్ళమీద పడి క్షమాపణలు కోరడం , ఆమెకు అన్నదమ్ములు అండగా నిలబడటం , ప్రేమించిన ప్రియురాలి కోసం బాబీ తన జీవన శైలిని మార్చుకోవడం , ఆడ దిక్కులేని ఆ ఇంట్లో ఆడవాళ్ళకి అన్నదమ్ములు ఇచ్చిన గౌరవం రెండో కోణాన్ని ఆవిష్కరిస్తుంది
ఇంట్లో ఎంత తన్నుకున్నా బయటికొచ్చేసరికి తామంతా ఒకటేనని అన్నదమ్ములు బాబీ ప్రేమ విషయంలో నిరూపించుకుంటారు
కుంబలంగిలో అడుగుపెట్టినప్పటినుంచి ఎక్కడా మనకు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు
కళ్ళముందు జరుగుతున్న సంఘటనలే కనిపిస్తాయి
ఎవరెలా చేసారు ?
సినిమా మొత్తానికి ఓ పది , పన్నెండు క్యారెక్టర్లు ఉంటాయేమో
వారిలో మొదట చెప్పుకోవాల్సింది ఇద్దరినే
మొదటివాడు సౌబిన్ సాహిర్
ఇతడికి డైలాగులతో పని లేదు
ముఖంతోనే ఎటువంటి భావాలనైనా పలికిస్తాడు
సినిమాలో చేపలు పట్టుకునే సాజి కనిపిస్తాడే కానీ సౌబిన్ సాహిర్ ఎక్కడా కనిపించడు
పై చొక్కా లేకుండా లుంగీతో సరిగ్గా సెట్ అయ్యాడు
పొరపాట్న ఏ సన్నివేశంలో అయినా నటిస్తాడేమో అని చూస్తే మనకు నిరాశే ఎదురౌతుంది
అంతలా జీవించేసాడు
విరిగిపోయిన సోఫా మీద పడుకుని ఒక చేత్తో కొబ్బరి , మరొక చేత్తో బెల్లం ముక్క తినాలన్నా , తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడటం కోసం పెద్దమనిషి తరహాలో షమ్మీ చుట్టూ తిరగాలన్నా , మనసులోని దిగులును డాక్టర్ కు చెప్పుకుని ఏడవాలన్నా సౌబిన్ సాహిర్ కే సాధ్యమౌతుంది
ఇక రెండోవాడు ఫహద్ ఫాసిల్
ఇతడి గురించి ఈ సరికే చాలామందికి తెలిసి ఉంటుంది
ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు
సినిమా , సినిమాకి డిఫరెంట్ మానరిజంతో వస్తాడు
ఇందులో అద్దంలో చూస్తూ తన మీసాలను అటూఇటూ సవరించుకుంటూ ఐ యామ్ ఏ కంప్లీట్ మ్యాన్ ..రేమండ్స్ కంప్లీట్ మ్యాన్ అనుకుంటూ అర నవ్వును చిందించడం ఫాహద్ స్టైల్
ఫాహద్ కు కూడా పెద్ద పెద్ద బరువైన డైలాగులు ఏమీ ఉండవు
కళ్ళతోనే , అర నవ్వుతోనే రకరకాలుగా అనిపిస్తాడు
కాసేపు శాడిస్ట్ అనుకుంటాం ..కాసేపు సైకో అనుకుంటాం ..కాసేపు మరదలి బాధ్యత తీసుకున్న అన్న అనుకుంటాం
సౌబిన్ తో పోల్చుకుంటే తక్కువసేపే కన్పించినా , ఆ కాసేపట్లోనే ఫాహద్ ఫాసిల్ తన మార్క్ చూపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసేశాడు
వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సింది బేబీ పాత్ర పోషించిన అమ్మాయి గురించి
చాలా క్యూట్ గా ఉంది
కళ్ళతోనే భావాలు పలికించింది
బేబీని ప్రేమించిన బాబీని చూస్తుంటే ఒక్కోసారి మహేష్ బాబు గుర్తుకొస్తాడు
అంత బావున్నాడు
వీళ్ళే కాదు మిగిలిన క్యారెక్టర్లు కూడా అంతే
ఎవరి పరిధిలో వాళ్ళు న్యాయం చేసారు
సాంకేతికత :
సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే ముందు సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి
అసలే అందాలకు పుట్టిల్లు కేరళ
ఆ అందాలను కెమెరా పనితనంతో మరింత అందంగా కళ్ళకు కట్టారు
నది ఒడ్డున ఇల్లు , నదిలో చేపల పడవలు , వెన్నెల వెలుగుల్లో కుంబలంగి అందాలను శైజు ఖాలిద్ రమణీయంగా చిత్రీకరించారు
రొటీన్ సినిమాల్లో ఉన్నట్టు ఈ సినిమాలో డ్యూయెట్లు , ఐటెం సాంగులు గట్రా లేవు
చక్కటి బ్యాక్ డ్రాప్ సంగీతంతో కమ్మని పాటలు ఒకట్రెండు ఉన్నాయి
సుషీన్ శ్యామ్ అందించిన నేపధ్య సంగీతం బావుంది
ప్రథమ ప్రయత్నంలోనే దర్శకుడు మధు సి నారాయణన్ చక్కటి ఫీల్ గుడ్ మూవీని అందించారు
విశ్లేషణ :
మనం సినిమాలు చాలానే చూసి ఉంటాం . కానీ సజీవన చిత్రాలు కొన్నే చూసి ఉంటాం . వాటిలోకుంబ లంగి నైట్స్ ఒకటి . చూడటం మొదలుపెట్టిన కాసేపట్లోనే మనం కూడా కుంబలంగి విలేజిలో అడుగుపెట్టి అన్నదమ్ముల జీవితాలు దగ్గర్నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది . అనవసరమైన పాటలు లేవు , వెకిలి కామెడీ లేదు , మితిమీరిన వయొలెన్స్ , రొమాన్సులు అసలే లేవు . చేపలు పట్టుకునే సాధారణ అన్నదమ్ముల జీవితాల్లోకి మహిళలు ప్రవేశించిన తర్వాత వచ్చిన మార్పులను చాలా సహజంగా చూపించాడు .ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటిటీ లో ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు . కాకపోతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రైట్ మళయాళం వెర్షన్ లోనే సినిమాని చూడాల్సి ఉంటుంది . ఇలాంటి మంచి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది
నటీనటులు : సౌబిన్ సాహిర్ , ఫాహద్ ఫాసిల్ , షేన్ నిగమ్ , మాధ్యు థామస్ , శ్రీనాథ్ బసి , అన్నాబెన్ తదితరులు
సంగీతం : సుషీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : శైజు ఖలీద్
విడుదల : అమెజాన్ ప్రైమ్ ఓటిటీ
రేటింగ్ : 4 / 5
