‘ మంచం పొత్తు ‘ అంటే ఏంటి మల్లన్నా?
ఏపీతో పోలిస్తే తెలంగాణాలో రాజకీయ నాయకులు మహిళల మీద వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం తక్కువే
ఇప్పుడు ఆ కొరత తీన్మార్ మల్లన్న తీర్చాడు
ఈ మధ్యనే ఏపీలో వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలు దుమారం లేపాయి
పర్యవసానంగా నల్లపురెడ్డి ఇంటిమీద మూక దాడులు జరిగాయి
ఈ దాడుల్లో ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది
ఈ వివాదం సద్దుమణగక ముందే తెలంగాణాలో మరో దుమారం చెలరేగింది
అదీ తీన్మార్ మల్లన్న రూపంలో
42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తూ తెలంగాణా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం దీనికి నేపథ్యం
తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం ప్రకటిస్తూ జనజాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బీసీ కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లి సంబురాలు చేసుకున్నారు
సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు అవసరమైనప్పుడు బీసీ నినాదం భుజాన వేసుకుని మోస్తాయని అందరికీ తెలిసిందే
ఈ ఓటు బ్యాంకు రాజకీయం ఎప్పటినుంచో నడుస్తుందే
తెలంగాణా రాష్ట్రం ఇస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామని టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు కూడా
కానీ అధికారం చేతిలోకి వచ్చాక కేసీఆరే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు..అది అసలు విషయం అనుకోండి
అలా తరతరాలుగా రాజకీయాలకూ.. బీసీ నినాదానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది
తాజాగా బిఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా కొత్తగా బీసీ నినాదం ఎత్తుకున్నారు
బీసీల అభ్యున్నతికి జనజాగృతి పనిచేస్తుందని బీసీ సంఘాలతో జరిగిన సమావేశాల్లో చెప్పారు
దానితో తెలంగాణాలో బీసీల తరపున మాట్లాడే కొత్త నాయకత్వం తయారవడం మొదలుపెట్టింది
ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన తెలంగాణా క్యాబినెట్ నిర్ణయానికి హర్షం ప్రకటిస్తూ కవిత సంబురాలు చేసుకున్నారు
సహజంగా ఈ సంబురాలు తీన్మార్ మల్లన్న కు నచ్చలేదు
అందుకు కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి
సరే నచ్చకపోతే నచ్చకపోయే ,
ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి
” కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే నువ్వు సంబురాలు చేసుడెంది?.. అసలు నీకూ బీసీలకు సంబంధం ఏమన్న ఉందా? కనీసం మాతో కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ ఉందా?” అని కవితను ఉద్దేశించి ఘాటు వాఖ్యలు చేశారు
మల్లన్న వాఖ్యలు విమర్శ స్థాయి దాటి వ్యక్తిగత దూషణ స్థాయికి చేరింది
ముఖ్యంగా ‘మంచం పొత్తు’ అనే మాట జనజాగృతి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది
పర్యవసానంగా తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద జనజాగృతి కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు
ఈ దాడులతో ఆత్మరక్షణ కోసం మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది
దాడుల తర్వాత తన వ్యాఖ్యలపై మల్లన్న మీడియాకు వివరణ ఇస్తూ ” కంచం పొత్తు అంటే కలిసి భోజనం చేయడం.. మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం” అనే కొత్త నిర్వచనాన్ని చెప్పారు
ఈ వివరణలో నిజానిజాలు ఎంత ఉందో తెలీదు కానీ ఒక మహిళ ను ఉద్దేశిస్తూ’ మంచం పొత్తు ‘ అనే మాట వాడటం ముమ్మాటికీ అభ్యంతరకరమైనదే
బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న వ్యక్తి మహిళలను ఉద్దేశిస్తూ వాఖ్యలు చేయదల్చుకుంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది
పదవి రీత్యా కానీ.. బీసీ నాయకత్వ రీత్యా కానీ సదరు వాఖ్యలు ఎంత మాత్రం సహేతుకం కావు
అలాగే మల్లన్న వ్యాఖ్యల లో అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలే కానీ వ్యక్తిగత దాడులకు పాల్పడటం జానజగృతికి కూడా సబబు కాదు!
పరేష్ తుర్లపాటి