Home » మెస్సి – రేవంత్ ల ఆట – ఒక పరిశీలన!

మెస్సి – రేవంత్ ల ఆట – ఒక పరిశీలన!

Spread the love

ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా శనివారం నాడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడిన సంగతి అందరికీ తెలిసిందే

టీవీలలో మ్యాచ్ చూస్తున్నప్పుడు కొన్ని దృశ్యాలు నన్ను ఆకర్శించాయి

అవేంటంటే ,

1 .ఒక ఫుట్ బాల్ – ఒక మెస్సి

ఫుట్ బాల్ ఆటకు అమెరికాలో అత్యంత క్రేజ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు .
మన దేశంలో మాత్రం ముందు నుంచీ క్రికెట్ ఆటకు అభిమానులు ఎక్కువ . అలాంటిది మన దేశంలో కూడా ఫుట్ బాల్ ఆటకు , అందులోనా దిగ్గజ ఆటగాడు మెస్సికి ఉన్న ఆదరణ , అభిమానం ఏమాత్రం తక్కువ లేదని ఉప్పల్ స్టేడియం నిరూపించింది

మ్యాచ్ ప్రారంభానికి ముందే షుమారు నలభై వేలమంది ఫుట్ బాల్ క్రీడా లవర్స్ తో స్టేడియం సందడి చేసింది

మెస్సి స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు అభిమానుల మెస్సి , మెస్సి అనే నినాదాలతో దద్దరిల్లిపోయింది
చేతిలో ఉన్న జెండాలు , జెర్సీలు ఊపుతూ ఆయనకి జేజేలు పలికారు

అభిమానుల ఆదరణ చూసిన ఆయన ముఖంలో సంతోషం స్పృష్టంగా కనిపించింది

2 మ్యాచ్ ప్రారంభానికి ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు లోగో పోస్టర్లను పట్టుకుని మీడియా ముందు గ్రౌండ్లో ఫోటోలు దిగారు

3 .రేవంత్ రెడ్డి ఎంట్రీ

ముఖ్యమంత్రే క్రీడాకారుడిగా గ్రౌండ్లో బరిలోకి దిగటం బహుశా అరుదైన దృశ్యమేమో

సాధారణంగా సీఎం పదవి హోదా దృష్ట్యా కొంత గంభీరత ప్రతి నాయకుడు పాటించేదే

కానీ సీఎం రేవంత్ రెడ్డి కాసేపు తన హోదాను మర్చిపోయి ప్రొఫెషనల్ క్రీడాకారుడు అవతారంలోకి పరకాయ ప్రవేశం చేసారు

ఎగ్జిబిషన్ మ్యాచ్ లంటే అంత సీరియస్ గేమ్ కాకపోయినప్పటికీ రేవంత్ బిజీ షెడ్యూల్ లో కూడా పక్కా ప్రొఫెషనల్ ఆటగాడి మాదిరి గత పదిహేను రోజుల నుంచి నెట్ ప్రాక్టీస్ చేసారు

ఆటను తమాషాగా కొనసాగించకుండా ఉత్కంఠత రేకెత్తించే విధంగా మలచడంలో సీఎం సక్సెస్ అయ్యారు

ఆయన అనుకున్నట్టుగానే మ్యాచ్ కు రావాల్సిన హైప్ వచ్చింది

స్టేడియానికి మిగిలిన ప్లేయర్ల మాదిరి జెర్సీ , ట్రాక్ షూస్ లతో సీఎం రావడంతో జోష్ వచ్చింది

పరిగెత్తుకుంటూ స్టేడియంలోకి ఎంటర్ అయిన రేవంత్ ఎంతో శిక్షణ పొందిన ఆటగాడి మాదిరి గ్రౌండ్లో కసరత్తులు చేయడం చూపరులను ఆకర్శించింది

అప్పటికే లీడ్ లో ఉన్న టీమ్ తరపున ఆడుతూ మొదటి గోల్ కొట్టడంతో ఆటలో ఉత్సాహం పెరిగింది

4 .మనవడిని కూడా ఆడించిన రేవంత్

గ్రౌండ్లో మెస్సి ఇతర క్రీడాకారులకు ఆటలో టిప్స్ నేర్పిస్తున్న సమయంలో ఎవరో జెర్సీలో ఉన్న రేవంత్ మనవడిని తీసుకురావడంతో సీఎం తన మనవడితో కూడా కాసేపు ఫుట్ బాల్ ఆడించడం స్పెషల్ అట్రాక్షన్ లా అనిపించింది

5 .మెస్సి ఎంట్రీ

ఈ దశలో మెస్సి స్టేడియంలోకి ఎంటర్ అవడంతో నినాదాలతో హోరెత్తిపోయింది
ఆయన రాకతో అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకర్షణీయంగా కనిపించింది

కానీ ఎందుకో ఈయన జెర్సీ వేసుకోకుండానే బరిలోకి దిగాడు

తర్వాత అపర్ణ టీమ్ తరపున కొద్దిసేపు ఆడాడు
అప్పటికే సీఎం టీమ్ 3-0 రేషియోలో ఆధిక్యతలో ఉంది
అంతిమంగా రేవంత్ సింగరేణి ఆర్ఆర్ టీమ్ నే విజయం వరించింది

మెస్సి గ్రీన్ టీ షర్ట్ , ట్రాక్ ప్యాంట్ లోనే స్టేడియం మొత్తం కలియతిరిగాడు

అభిమానులను ఉత్సాహపరచటానికి పలుమార్లు బంతిని స్టాండ్ వైపు కాలితో హిట్ చేసి ఉత్సాహపరిచాడు

మరోవైపు జూనియర్ క్రీడాకారులకు ఆటలో టిప్స్ చెప్తూ ఎంకరేజ్ చేసాడు

ఈయన గ్రౌండ్లో కలియతిరుగుతున్నప్పుడు రేవంత్ కూడా ఆయన తో పాటే తిరిగారు

కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్లనో ఏంటో తెలీదు కానీ మెస్సి సీఎం తో పెద్దగా కలివిడిగా మాట్లాడలేదు

పైపెచ్చు తనదోవన తను స్టేడియంలో రౌండ్స్ వేసేశాడు

ఈయన రౌండ్స్ వేస్తున్న సమయంలోనే ప్లేయర్లు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు

స్థానిక కోచ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫుట్ బాల్ మీద మెస్సి ఆటోగ్రాఫ్ పెట్టించుకోవడంతో మిగిలిన వాళ్ళు కూడా వెంటపడ్డారు

ఆయన ఒకరిద్దరికి ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చినా , సీఎం సైగ చేసి మిగిలిన ప్లేయర్లను వెనక్కి వెళ్ళమని కసురుకోవడంతో ఆ ప్రహసనానికి అంతటితో బ్రేక్ పడింది

ఆఖర్లో మెస్సి తాను వేసుకునే టెన్ నంబర్ జెర్సీలను రాహుల్ గాంధీకి , రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చాడు

6 మెస్సి సెక్యూరిటీ

కోల్ కతా సంఘటన నేపథ్యంలో మెస్సి సొంత సెక్యూరిటీ నీడలా ఆయన్ను వెంటాడటం కనిపించింది

సీఎం సెక్యూరిటీ కూడా లైన్ బయటే ఆగిపోయినప్పటికీ మెస్సి సొంత సెక్యూరిటీ మాత్రం ఆంక్షలను లెక్కచేయకుండా మైదానంలో కూడా ఆయనను ఫాలో అయ్యారు

పీఎం ఎస్పీజీ సెక్యూరిటీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలతో డేగలా ఫాలో అవుతున్నమెస్సి సొంత సెక్యూరిటీని చూస్తే మనకు హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి

అవును మరి .. ఈయన అందరిలా సాధారణ ప్లేయర్ కాడు. ఫిఫా వరల్డ్ కప్ సాధించిన అంతర్జాతీయ దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు . మెస్సికి ప్రపంచంలో అభిమానులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమంది ఉన్నారు . అతని ఆట సంగతి అలా ఉంచండి . మూడు వేల కోట్ల ఆస్తిపరుడికి ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఎలా ?

7 రాహుల్ గాంధీ ఎంట్రీ

టీపీసీసీ అధ్యక్షుడు ముఖేష్ గౌడ్ వెంటరాగా ఉప్పల్ స్టేడియంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ భార్య ఎదురేగి స్వాగతం పలికారు

రాహుల్ ఎప్పటిలానే సింపుల్ గా టీ షర్ట్ , ట్రాక్ ప్యాంటులో వచ్చారు

మ్యాచ్ అయిపోయిన తర్వాత బహుమతి ప్రధానానికి ఆయన్ని కూడా గ్రౌండ్లోకి ఆహ్వానించారు

క్రీడాకారులకు ఆయనచేత మెమెంటోలు ఇప్పిద్దామని రేవంత్ ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్ చిరునవ్వుతో ఆయన్ని వారిస్తూ మీరే ఇవ్వండి అని సైగలు చేయడం కనిపించింది

ఈ కార్యక్రమం ఆసాంతం రాహుల్ ఓపిగ్గా , ఉత్సాహంగా కనిపించారు

అప్పటిదాకా సీఎం తో కూడా పెద్దగా మాట్లాడని మెస్సి రాహుల్ పక్కన చేరగానే కబుర్లు మొదలెట్టడం ఆశ్చర్యం కలిగించింది

రాహుల్ క్యాజువల్ గా ఒకటి రెండు సమాధానాలు చెప్పినప్పటికీ మెస్సి ఆయనతో సంభాషణలు పొడిగించటానికే ఇష్టపడ్డాడు

దీనికి కూడా ఒక కారణం ఉంది

మెస్సికి స్పానిష్ లో మాట్లాడటం తప్ప ఇంకో భాష రాదు . ఇంగ్లీష్ కొద్దిగా అర్ధం చేసుకోగలడు కానీ తిరిగి సమాధానం ఇవ్వలేడు
అందుకే ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు

రాహుల్ కి స్పానిష్ భాషలో కూడా ప్రవేశం ఉండటంతో తన మనసులోని గోడు ఆయనకి చెప్పుకున్నాడు

మెస్సితో కన్వర్సేషన్ బాగా జరగడంతో రాహుల్ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోలు పంచుకున్నాడు

8 .ప్రధాని రాహుల్ గాంధీ

మెమెంటో ప్రధానం తర్వాత మెస్సి స్పానిష్ భాషలో మాట్లాడుతూ తెలంగాణా ప్రజలకు , సీఎం రేవంత్ కి , రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియచేసాడు

ఆయన సందేశం అనువాదం చేస్తున్న అనువాదకురాలు పొరపాటున ప్రధాని రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు అని మైకులో చెప్పేసింది

ఇదే సందర్భంలో మన ఆర్గనైజర్ ఒకావిడ అతిగా హడావుడి చేయడంతో సీఎం ఆమె వంక చూస్తూ తగ్గు తగ్గు అన్నట్టుగా విసుక్కోవడం కనిపించింది

9 .తెలంగాణ పోలీస్ సెక్యూరిటీ

ముందు రోజు కోల్ కతాలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో తెలంగాణా పోలీస్ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేసింది
ఈవెంట్ మొత్తం ఎక్కడా చిన్న అపశృతి లేకుండా సాఫీగా జరగడంలో తెలంగాణ పోలీస్ కృషి అభినందనీయం

10 .మెస్సితో ఫోటో దిగాలంటే పది లక్షలు

ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన ఈవెంట్ లో పంటికింది రాయిలా ఫోటోకి పది లక్షలు ఎపిసోడ్ తగుల్తుంది

మెస్సితో ఫోటో దిగలనుకునేవారు పది లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించడం నవ్వుల పాలైంది

చాలామంది ai ద్వారా మెస్సితో తమ సెల్ఫీ ఫోటో సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంతోటిదానికి పది లక్షలు ఆముదం అవసరమా అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు

కానీ షుమారు 60 మందికి పైగా హైదరాబాద్ వాసులు ఆయనతో సెల్ఫీ కోసం పది లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిసాక కొంతమంది అవాక్కయ్యారు

దీన్నే వేలం వెర్రి అంటారు కదా ?

11 .ఇంతకీ ఈ మెస్సి గొప్పతనం ఏంటి ?

ఫుట్ బాల్ క్రీడాకారుడు కావడమే మెస్సి గొప్పతనమా ?
ప్రపంచ కప్ గెలవడమే గౌరవ చిహ్నమా ?

ఇలాంటి లెక్కలు చూసుకుంటే గతంలో చాలామంది క్రీడాకారులు కూడా ఇవన్నీ ఎప్పుడో సాధించేసారు

మరి ఈయనకే ఎందుకింత క్రేజు ?

ఎక్కడో సంగతి పక్కనబెట్టండి
ఇండియాలో కూడా అడుగడుగునా అభిమానులు హారతులు పడుతున్నారు

క్రీడాప్రపంచానికి మెస్సి ఇచ్చిన సందేశం ఏంటి ?

ఇచ్చాడు .. అలాంటి ఇలాంటి మాములు సందేశం కాదు

ప్రతి ఒక్క క్రీడాకారుడు గురుపెట్టుకోవాల్సిన జీవిత పాఠం బోధించాడు

కొంతమంది పుట్టుకతోనే కారణ జన్ములు అవుతారు
ఎస్పీ బాలు గారు పాట కోసమే పుట్టినట్టు మెస్సి ఫుట్ బాల్ ఆడటం కోసమే పుట్టాడు

ఆట కోసం చిన్నప్పట్నుంచి మైదానానికి వెళ్లడం , ప్రాక్టీస్ చేయడం ,ఒకటే ధ్యేయం తో కష్టపడ్డాడు

అతడికి ఫుట్ బాల్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదు
చదువు ఎప్పుడో అటకెక్కింది

అయితే మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే మెస్సి పొట్టిగా ఉండేవాడు
దీంతో సాటి క్రీడాకారులు అతడ్ని పొట్టివాడని హేళన చేయడం మొదలుపెట్టారు

ఈ పరిస్థితుల్లో అతడి పదకొండవ ఏట హార్మోన్ గ్రోత్ డిసీస్ అనే రోగం బారిన పడ్డాడు
ఈ వ్యాధి వచ్చినవారిలో ఎదుగుదల ఆగిపోతుంది

దాంతో అతడి తల్లితండ్రులు డాక్టర్లను సంప్రదిస్తే ప్రతి రాత్రి రెండు కాళ్ళకు ఇండియన్ కరెన్సీలో షుమారు 90 వేల రూపాయల ఖరీదు చేసే ఇంజెక్షన్లు చేయాలని చెప్పారు

కొద్దికాలం ఇంజెక్షన్లు చేయించిన తర్వాత ఆర్థిక భారంతో వాళ్ళు కూడా చేతులెత్తేశారు

సరిగ్గా ఈ సమయంలో మెస్సిలోని టాలెంట్ ను గుర్తించిన ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ తమ క్లబ్ లో చోటివ్వడమే కాకుండా అతడి వైద్యానికి అయ్యే ఖర్చు భరించటానికి ముందుకు వచ్చింది

దాంతో అతడి కుటుంబం స్పెయిన్ కు షిఫ్ట్ అయ్యింది
అక్కడ్నుంచి మెస్సి వెనుతిరిగి చూసుకునే అవసరం లేకపోయింది

ఫిఫా వరల్డ్ కప్ లక్ష్యాన్ని 2022 లో సాధించాడు

చూసారుగా మెస్సి జీవన విధానం

కష్టాలు వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా లక్ష్యం వైపు సాగిపోయాడు
నేడు ప్రపంచ విజేత అయ్యాడు

అన్నట్టు ఈ మెస్సికి తల్లి అంటే విపరీతమైన ప్రేమ
అందుకే తన ఎడమ భుజం మీద ఆమె టాటూ వేయించుకున్నాడు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!