Home » మోడీ మాటే మంత్రమో .. ఇజ్రాయిల్ పార్లమెంటులో ‘నమో’ స్తుతి !

మోడీ మాటే మంత్రమో .. ఇజ్రాయిల్ పార్లమెంటులో ‘నమో’ స్తుతి !

Spread the love

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం నిన్న ఇజ్రాయిల్ చేరుకున్నారు

విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు సతీ సమేతంగా స్వాగతం పలికారు

వీటిలో కొన్ని దృశ్యాలు నన్ను ఆకర్శించాయి
నా పరిశీలనలో ఆకట్టుకున్న దృశ్యాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం

విశ్లేషణ

1 ) ఇజ్రాయిల్ ప్రధాని ఘనస్వాగతం

సాధారణంగా ఇతర దేశాల ప్రధానులు పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయా దేశాల ప్రధానులు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతారు . ఈ స్వాగత ప్రోటోకాల్లో ఎక్కువగా ఇరు దేశాల నేతల షేక్ హ్యాండ్ తో మొదలౌతాయి . కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు , భారత ప్రధాని మోడీలు పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు . ఆ పలకరింపుల్లో దౌత్య సంబంధాలను మించిన ఆత్మీయ బంధం కనిపిస్తుంది

2 ) సేమ్ పించ్

మోడీని రిసీవ్ చేసుకోవడానికి నెతాన్యాహుతో పాటు ఆయన సతీమణి కూడా కాషాయ రంగు దుస్తులతో విమానాశ్రయానికి వచ్చారు. సినిమా హీరోని దగ్గర్నుంచి చూడగానే అభిమాని ఎలా సంబరపడిపోతాడో ఆవిడ మోడీని చూడగానే అలా సంబరపడిపోయింది . వెల్ కమ్ ఇజ్రాయిల్ అన్న చిన్నమాటతో ముగించకుండా మోడీతో మరికొంచం మాట్లాడటానికి ప్రయత్నించింది . ఈ మధ్యలో నెతన్యాహు కల్పించుకుంటూ మోడీ జేబుకున్న కాషాయ రంగు రిబ్బన్ ను చూపిస్తూ తన భార్య కూడా కాషాయ రంగు దుస్తులనే వేసుకుంది సేమ్ పించ్ అన్నట్టుగా ఏదో చెప్పడం కనిపించింది . ఆయన మాటలకు మోడీ బిగ్గరగా నవ్వేశారు . అనంతరం ఇజ్రాయిల్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు

3 ) ఇజ్రాయిల్ పార్లమెంటులో మోడీ స్పీచ్

ఇజ్రాయిల్ పార్లమెంటులో ప్రసంగించే అరుదైన గౌరవం మోడీకి దక్కింది . ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న మొదటి భారత ప్రధానిగా మోడీ పేరు రికార్డులకెక్కింది
ఇదిలా ఉండగా జాతీయ , అంతర్జాతీయ వేదికల మీద అనర్గళంగా తడుముకోకుండా ,కాగితం చూడకుండా ప్రసంగిస్తారు అనే సంగతి అందరికీ తెలిసిందే
మోడీ ప్రసంగం శైలి మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేసారు కూడా
ఆయన టెలీ ప్రాంప్టర్ వాడుతారనీ , అందుచేతనే కాగితాలు చదవకుండా ఎన్ని నిమిషాలైనా మాట్లాడగలరని విమర్శలు ఉన్నాయి
స్టూడియోలలో అయితే అటువంటివి కొంతవరకు సాధ్యం అవ్వోచ్చేమో కానీ బహిరంగ వేదికల మీద ఎలా సాధ్యం అవుతుంది ?
ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలీదు కానీ మోడీ ధారణ శక్తి అమోఘం
చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా , ఎటువంటి తడబాటు లేకుండా , తడుముకోకుండా అంకెలతో సహా చెప్పడం గొప్ప విషయమే
పార్లమెంటు ప్రసంగంలో కూడా ఆ దేశాన్ని భారత్ అధికారికంగా ఎప్పుడు గుర్తించింది , ఇజ్రాయిల్ మీద హమాస్ ఏ రోజు దాడి చేసింది , ముంబైలో ఉగ్రవాదులు ఏ రోజు అటాక్ చేసారు అనేది తారీఖులతో సహా స్పృష్టంగా చెప్పారు
అంతర్జాతీయ సమాజంలో ఎదగాలనుకుంటున్న నాయకుడికి ఈ మాత్రం ధారణశక్తి అవసరం

4 ) మోడీ స్పీచ్ కి నిలబడి చప్పట్లు కొట్టిన సభ్యులు

ఇజ్రాయిల్ ను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రోజునే నేను పుట్టాను అని చెప్పడంతో హాల్లో చప్పట్లు మారుమోగిపోయాయి . హమాస్ దాడుల వల్ల ఇజ్రాయిల్ పౌరులు అనుభవించిన బాధ తనకు తెలుసనీ , ఎందుకంటే ముంబై దాడుల్లో తమ పౌరులు కూడా టెర్రరిజంతో ఇటువంటి బాధలే పడ్డారని చెప్తూ , ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ ఇజ్రాయిల్ కు అన్ని విధాలా అండగా ఉంటుంది , ఇందులో రెండో మాటకు తావు లేదు అని అన్నప్పుడు సభ్యులు అందరూ లేచి నిలబడి మోడీ , మోడీ అంటూ చప్పట్లు కొట్టారు . ఇది మిత్ర దేశం పార్లమెంటులో భారత ప్రధాని పొందిన ఇంకో అరుదైన గౌరవం . ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయిల్ కి స్నేహ హస్తం అందించిన భారత ప్రధానికి కృతజ్ఞతలు చెప్తూ స్పీకర్ ఆ దేశ అత్యున్నత పురష్కార మెడల్ తో సత్కరించారు

5 ) ఇజ్రాయిల్ ప్రతిపక్షాలు వాకౌట్ ..కానీ మోడీ మీద కోపంతో కాదు

సభ ప్రారంభానికి ముందే ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత లిపిడ్ మాట్లాడుతూ సభలో భారత ప్రధాని ప్రసంగానికి సంబందించిన కార్యక్రమానికి నెతన్యాహు ప్రభుత్వం సభ్యులకు ముందస్తుగా సరైన సమాచారం అందించలేదని , సాక్ష్యాత్తు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తికి కూడా ఇన్విటేషన్ అందలేదని చెప్తూ , నిరసనగా నెతన్యాహు ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు . అదే సమయంలో ఇజ్రాయిల్ దేశానికి భారత ప్రభుత్వం అందిస్తున్న స్నేహ సంబంధాలకు , మద్దతుకు గౌరవ సూచకంగా మోడీ ప్రసంగించేటప్పుడు సభకు వస్తామని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు
తిరిగి మోడీ ప్రసంగం ప్రారంభం అయ్యే సమయానికి సభకు హాజరు అయి ఆయన ప్రసంగానికి చప్పట్లు కొట్టారు . సొంత దేశంలో రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ విషయాలను అంతవరకే పరిమితం చేసి మిత్ర దేశ ప్రధానికి గౌరవం అందించి బాసటగా నిలబడ ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత పరిణితి మెచ్చుకోదగిన విధంగా ఉంది . అంతేకాదు మోడీ ప్రసంగం పూర్తి అయినవెంటనే ఆయన వేదిక వద్దకు వెళ్లి మోడీకి కరచాలనం చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు

6 ) మోడీ తో సెల్ఫీల కోసం ఎగబడిన సభ్యులు

స్పీచ్ ముగియగానే ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్ తో కలిసి మోడీ ఆయన ఛాంబర్ కు వెళ్ళాలి. స్పీకర్ కూడా ఆయన్ని తన ఛాంబర్ కు తీసుకెళ్లడానికి దారి చూపించారు
కానీ మోడీ మాత్రం చిరునవ్వుతో అలా కాదు .. ఇలా వెళ్లి సభ్యులను పలకరించి వెళ్దాం అంటూ పోడియం దిగి సభ్యుల వైపు వెళ్లారు
మోడీ తమ దగ్గరికి వస్తాడని ఊహించని పార్లమెంట్ సభ్యులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి సెల్ఫీల కోసం ఒక్కసారిగా మోడీని చుట్టుముట్టారు
మోడీ చిరునవ్వుతో ఓపిగ్గా ప్రతి ఒక్కరితో సెల్ఫీ దిగారు
అయితే ఈ జనంలోనుంచి ఓ వృద్ధ పార్లమెంటేరియన్ వణుకుతున్న చేతులతో మోడీతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాడు
కానీ ఆయన చేతులు ఒణుకుతుండటంతో సాధ్యం కాలేదు
అది గమనించిన మోడీ ఆయన దగ్గరనుంచి మొబైల్ తీసుకుని సెల్ఫీ క్లిక్ మనిపించారు

7 ) అక్కడ ఫ్రెండు .. ఇక్కడ సోదరుడు

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రధాని మోడీని తనకు అత్యంత సన్నిహితుడైన స్నేహితునిగా అభివర్ణిస్తారు . ఇదే విషయాన్నీ ట్రంప్ అనేక అంతర్జాతీయ వేదికల్లో చెప్తూ వస్తున్నారు . ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్తూ ఉంటారు . కానీ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఇంకో అడుగు ముందుకువేసి మోడీ నాకు సోదరుడిలాంటి వారని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు

8 ) ఐ లవ్ ఇండియా పాట పాడిన దివ్యాంగురాలు

ఇజ్రాయిల్ పార్లమెంటులో మోడీ ప్రసంగం ముగియగానే ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమంలో ఓ దివ్యాంగురాలు ఐ లవ్ ఇండియా అనే పాట పడటంతో మోడీ చలించిపోయారు . ఇదే కార్యక్రమంలో కేరళం ప్రత్యేక నృత్య రూపకం కూడా ప్రదర్శించారు . సాధారణంగా ఇతర దేశాల అతిధులు వచ్చినప్పుడు తమ దేశ సంస్కృతీ , సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు . కానీ మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయ కేరళం నృత్య రూపకం హైలెట్ అయ్యింది

9 ) ఒకే కారులో మోడీ మరియు నెతన్యాహు

మీరు గమనించారా ?
ఈ మధ్య ప్రధాని విదేశాలకు వెళ్లినా , ఇతర దేశ నేతలు భారత్ వచ్చినా మోడీ వారితో కలిసి ఒకే కారులో ప్రయాణించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు
ఇది మోడీ మార్క్ స్టైల్
సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల అధినేతలు ఎవరికి వారు తమకు కేటాయించిన ప్రత్యేక వాహనాల్లోనే ప్రయాణించాలి
కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచమంతా ఇదే ప్రోటోకాల్ నడిచింది
కానీ మొట్టమొదటిసారిగా మోడీ ఈ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు
గతంలో అరబ్ యువరాజుతోనూ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోనూ , ఫ్రాన్స్ అధ్యక్షుడితోనూ మోడీ ఒకే కారులో ప్రయాణించి కొత్త రికార్డ్ సృష్టించారు
తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహుతో కలిసి పార్లమెంట్ నుంచి టెక్నాలజీ ఎగ్జిబిషన్ వరకు మోడీ ఒకే కారులో వెళ్లారు
ఈ విషయాన్ని ఆయన X (ట్విట్టర్ ) వేదికగా పంచుకున్నారు

10 ) సోషల్ మీడియాలో నంబర్ వన్

ప్రపంచ దేశాధినేతలతో పోలిస్తే మోడీ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు . తనకు సంభందించిన స్వదేశీ , విదేశీ కార్యక్రమాలు ఏమున్నా సరే ఆయన వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటారు . సోషల్ మీడియాలో మోడీకి ఉన్న ఫాలోవర్స్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు . తాజాగా సోషల్ మీడియాలో ఇతర దేశాధినేతలతో పోలిస్తే మోడీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు .ఆయన ఫాలోవర్స్ సంఖ్య వంద మిలియన్లను దాటిపోయింది

ముగింపు

పై పరిణామాలను గమనిస్తే రెండు విషయాలు అర్ధమౌతున్నాయి
అంతర్జాతీయంగా భారత్ బలమైన దేశంగా ఎదుగుతుంది
వ్యక్తిగతంగా మోడీ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు
దౌత్యపరమైన సంబంధాల్లో ప్రపంచానికి మోడీ తనదైన మార్క్ చూపిస్తున్నాడు
ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం


Spread the love

2 thoughts on “మోడీ మాటే మంత్రమో .. ఇజ్రాయిల్ పార్లమెంటులో ‘నమో’ స్తుతి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!