శనివారం తెల్లవారు ఝామున హైదరాబాద్ శివారు మొయినాబాద్ లో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫార్మ్ హౌస్ లో పార్టీ జరిగింది
ఈ పార్టీ ఏర్పాటు చేసింది కూడా ఆయనే అంటున్నారు
ఏపీ ,తెలంగాణాలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ఈ పార్టీలో పాల్గొన్నారు
వీరిలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నియోజకవర్గానికి చెందిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ (టిడిపి ) కూడా ఉన్నారు
సమాచారం అందుకున్న ఈగిల్ టీమ్ తెల్లవారు ఝామున ఫార్మ్ హౌస్ మీద రైడ్ చేసినప్పుడు లోపలినుంచి కొంతమంది పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారు
సరే ఎలాగోలా పోలీసులు లోపలికి ప్రవేశించి పదకొండు మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది
ఆ ఆరుగురిలో మన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , ప్రస్తుత ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లు కూడా ఉన్నారు
మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంపీకి చేసిన యూరిన్ టెస్టుల్లో మొదట నెగిటివ్ రావడంతో అనుమానపడిన పోలీసులు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తే అందులో పాజిటివ్ వచ్చింది
గౌరవ ఎంపీగారు యూరిన్ బదులు వాటర్ ఇచ్చారని తర్వాత తెలిసింది
సరే ఎంతైనా ఆయన మన గౌరవ ఎంపీగారు కాబట్టి ప్రజా సమస్యల మీద పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది కాబట్టి సింపుల్ గా స్టేషన్ బెయిల్ తీసుకుని బయటపడ్డారు
ఇదీ మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వార్త
ఇప్పుడు ఫార్మ్ హౌస్ లో జరిగిన పరిణామాల మీద చిన్న విశ్లేషణ చేసుకుందాం
సమాధానం రావాల్సిన కొన్ని ప్రశ్నలు ??
స్టేషన్ బెయిల్ తీసుకున్న ఎంపీగారు ఒక వీడియోలో తాను ఎటువంటి తప్పు చేయలేదనీ , స్నేహితులు పార్టీకి పిలిస్తే వెళ్లానని అంటున్నారు
సరే నిజంగానే ఎంపీగారు చెప్పినట్టు ఆయనకేమీ తెలీదు అనే అనుకుందాం
ఫార్మ్ హౌస్ లో మందు ,మగువ ,డ్రగ్స్ తో సంబంధం లేకుండా సంప్రదాయంగానే పార్టీ జరుగుతున్నట్టయితే తెల్లవారు ఝామున పోలీసులు రైడ్ చేసినప్పుడు లోపలినుంచి కొందరు ఎందుకు కాల్పులు జరిపారు ?
అక్కడ నిజంగానే ఇల్లీగల్ అక్టీవిటీస్ ఏమీ జరగనప్పుడు పోలీసుల మీద కాల్పులు జరపాల్సిన అవసరం ఏంటి ?
అందులోనూ చట్టసభల్లో మన ప్రతినిధిగా ఉన్న ఎంపీగారు ఈ ఘటనను ఎందుకు అడ్డుకోలేదు ?
గతంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఈ కాల్పులు జరిపారన్నది నిజమేనా ?
ఎంపీగారు నిజంగా ఏ తప్పూ చేయనప్పుడు యూరిన్ టెస్టులో వాటర్ కలపాల్సిన అవసరం ఎందుకొచ్చింది ?
బ్లడ్ టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ ఎలా వచ్చింది ?
అవన్నీ వదిలిపెట్టేయండి
ఆయన డ్రగ్స్ తీసుకోలేదు అనుకుందాం
సే నో టు డ్రగ్స్ స్లోగన్ తో అధికారికంగా ప్రభుత్వం తరపున క్యాంపైన్ చేసిన ఎంపీగారు డ్రగ్ పార్టీలో ఎలా పాల్గొన్నారు ?
పార్టీలో దొరికిన కొకైన్ అబద్దం చెప్పదుగా ?
పార్టీలో డ్రగ్ వాడుతున్నారని తెలుసుకున్న తర్వాతైనా ఆయన వెళ్ళిపోవాలి కదా ?
మరి తెల్లవారు ఝామున పోలీసులు వచ్చేవరకు ఆయన పార్టీలోనే ఎందుకున్నారు ?
చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయడం ఎంత నేరమో ? చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం కూడా అంతే నేరమని ఎంపీగారికి తెలుసు కదా ?
సమాజంలో ఏ బాధ్యత లేని ఆవారాగాళ్ళు ఇల్లీగల్ అక్టీవిటీస్ కు పాల్పడితే ,వారి సంగతి చట్టం చూసుకుంటుంది
కానీ చట్టాల్ని తయారుచేసే ప్రతినిధులే ఇలాంటివి చూసి మౌనంగా ఉన్నా , ప్రత్యక్షంగా కానీ ,పరోక్షంగా కానీ మద్దతు ఇస్తే , నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది
రాజకీయాల్లో ఇలాంటివి మాములే అని తేలిగ్గా సరిపెట్టుకోవచ్చేమో కానీ బాధ్యత కలిగిన పౌర సమాజం మాత్రం ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు
రాజకీయనాయకులు వల్లె వేసే సిద్దాంతాలు ప్రజలను వెర్రి వాళ్ళను చేయడానికే కానీ వాళ్ళ స్వప్రయోజనాలను వదులుకోవడానికి కాదు
అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగోళ్ల మధ్యలో రాజకీయ స్వప్రయోజనాల కోసం విద్వేషాలు రగిలించి తమ పబ్బం గడుపుకుంటున్న కొందరు రాజకీయ నాయకుల గురించి మనకి తెలిసిందే
అధికారం కోసం ఆంధ్రోళ్లు ,తెలంగాణోళ్లు అని విడగొట్టి మాట్లాడే కొంతమంది రాజకీయ నాయకులు చీకట్లో కలుసుకునే సన్నివేశాలకు చక్కటి ఉదాహరణ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ సంఘటన
ఈ పార్టీ అరేంజ్ చేసిందేమో కరడుగట్టిన తెలంగాణా వాదం వినిపించే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
కానీ ఆయన పిలిచిందేమో సిద్ధాంతపరంగా తాము రోజూ విమర్శించే ఆంధ్రోళ్ళను
అందులోనూ మాములు ఆంధ్రోడు కాదు
అధికార పక్షం ఎంపీ కూడా
అంటే వీళ్ళు చెప్పే విభజన వితండ వాదం అన్నదమ్ముల్లా ఉండే తెలుగు ప్రజలకే కానీ వీరికి కాదు
తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభజన రేఖ గీసి మంటలు పెట్టి వీళ్ళు మాత్రం చలి కాచుకుంటూ ఉంటారు
ఇక్కడి వాడు అక్కడ వ్యాపారాలు చేస్తాడు
అలాగే అక్కడివాడు ఇక్కడ వ్యాపారాలు చేస్తాడు ,ఆస్తులు సంపాదించుకుంటాడు
రాజకీయ పార్టీలు వేరైనా , సిద్దాంతాలు వేరైనా స్వప్రయోజనాల విషయంలో ఒక్కటే అయిపోతారు
వ్యాపార భాగస్వాములు అవుతారు
మనం ఎగతాళి చేసిన ఆంధ్రోడే తెలంగాణా తలసాని ఇంటల్లుడు అవ్వొచ్చు
రాకపోకలు సాగించొచ్చు
ప్రైవేట్ రాజకీయాలు చేయొచ్చు
కానీ ప్రజలు మాత్రం విధ్వేషాలతో విడిపోయి కొట్టుకుంటూ ఉండాలి ?
బ్రిటిష్ వాళ్ళు మనకి నేర్పి పోయిన డివైడ్ అండ్ రూల్ ఫార్ములా ఇదే కదా ?
ఆంధ్రా ,తెలంగాణా రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఉమ్మడి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ? ఎంతమందికి బంధుత్వాలు ఉన్నాయి ? అనేది ఆర్టీఐ ద్వారా లెక్కలు తీస్తే బోలెడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి
అంతెందుకు ?
ఇప్పుడంటే మొయినాబాద్ ఫార్మ్ హౌస్ సంఘటన వెలుగులోకి వచ్చింది కానీ గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని జరగలేదు ?
ఇప్పటికీ వీకెండ్ పార్టీల్లో కలుసుకుంటున్న ఆంధ్రా ,తెలంగాణా రాజకీయ నాయకులు ఎంతమంది లేరు ?
ఇదొక ఖరీదైన గేమ్
టూ సైడ్స్ సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు ?
ఎవడికి ఎప్పుడు గుర్తుకొస్తే ఆ ట్యాగ్ లైన్ బయటికి తీస్తారు
అంతిమంగా సెంటిమెంట్ వాదంలో సమిధలు అవుతుంది ప్రజలే
సరే ఈ సంగతి అలా ఉంచుదాం
డ్రగ్స్ బెడద అరికట్టడానికి ఇప్పటిదాకా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం
ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిజాయితీతో ప్రయత్నాలు చేసాయి
డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చేసాయి
దీనికోసం ప్రత్యేకంగా ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్సుమెంట్ ( ఈగిల్ ) పేరిట ప్రత్యేక డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేసాయి
అయితే ఏపీలో గంజాయి బెడద ఎక్కువగా ఉండగా , తెలంగాణాలో డ్రగ్స్ విస్తరించడం మొదలుపెట్టాయి
ఈ విషయాలను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి , చంద్రబాబులు సీరియస్ గా తీసుకున్నారు
ఏపీని గంజాయి రహిత రాష్టంగా తీర్చిదిద్దటం కోసం డ్రోన్ పోలీసింగ్ కూడా చేపట్టారు
ఈ ప్రయోగం కొంతవరకు సత్ఫాలితాలను ఇచ్చింది
అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చడం మీద దృష్టి పెట్టారు
అందుకు అనుగుణంగా సినీ ఇండస్ట్రీ పెద్దల ద్వారా యాంటీ డ్రగ్ క్యాంపైన్ కూడా నిర్వహించారు
దీంతో చాలావరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది
కఠినమైన చట్టాల వల్ల గతంలో మాదిరి విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై చేయడానికి డ్రగ్స్ పెడ్లర్స్ కూడా భయపడుతున్నారు
అలాగే ఇప్పటివరకు చాలామంది పెడ్లర్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపింది
బయటివారినైతే కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ బాధ్యత మర్చిన సెలెబ్రిటీలను ,విఐపి లను , కంట్రోల్ చేయలేకపోతున్నాం
మన సమాజంలో అంతోఇంతో పేరున్న బాధ్యత కలిగిన వ్యక్తులు ,సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం విచారకరం
ఇలా ఎందుకు జరుగుతుంది ?
పదవుల రీత్యా కానీ ,సమాజంలో తమకున్న పేరు ప్రతిష్టలు ,ఆస్తులు అంతస్తుల దృష్ట్యా కానీ ఇలాంటి కేసులు తమనేమీ చేయలేవనే ధీమా కొంతమందిలో ఉంది
అదే ఈ చీకటి పార్టీలకు మూలం
గతంలో హైదరాబాదులో పూరి జగన్నాథ్ , రవితేజ , నవదీప్ ,వరుణ్ ,ఛార్మి ,ముమైత్ ఖాన్ వంటి కొంతమంది సినీ దర్శకులను ,నటీనటులను రోజుకొకరిని పిలిపించి డ్రగ్స్ కేసులో విచారించారు .గుర్తుందా ?
అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది
ఎంత సంచలనం సృష్టించింది అంటే మీడియాలో రోజు వార్తలు అవే అయ్యాయి
అకున్ సభర్వాల్ అనే ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి స్వయంగా ఈ కేసును హ్యాండిల్ చేసారు
నిజానికి ఇది చాలా గట్టి కేసు
డ్రగ్స్ వాడకం ఖరీదైన వ్యవహారం కాబట్టి సామాన్యులు దీని జోలికెళ్ళే అవకాశాలు తక్కువే
కానీ మనీని మంచినీళ్లలా ఖర్చు చేసే బడాబాబులకు ఈ ఖర్చు ఒక లెక్కా ?
పై స్థాయిలోనే దీని వాడకం ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం
అక్కడే దీని వాడకం మీద నిఘా పెట్టి అరికట్టాలి
ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కరెక్ట్ స్ట్రాటజీ అప్లై చేసింది
ఖరీదైన పబ్బుల మీద ,శివారు ఫార్మ్ హౌస్ లలో జరిగే రేవ్ పార్టీల మీద నిఘా పెట్టింది
దాంతో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి
డ్రగ్స్ వాడకంలో సినీ రంగానికి చెందినవారితో పాటు ,కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు గుర్తించింది
కానీ వారిని విచారించడం ఎలా ?
సినీ రంగానికి చెందిన వారు కావడంతో అభిమాన సంఘాల బెడద ఉంటుంది
వీళ్ళని విచారణ పేరుతో స్టేషన్లకు రప్పిస్తే ఫాన్స్ నిరసనలు చేపట్టే అవకాశం ఉంది
అయినా కేసీఆర్ ప్రభుత్వం తలొగ్గలేదు
నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారికి ఈ కేసును అప్పగించింది
దురదృష్టవశాత్తు ఆ కేసు ఏమీ తేలకుండానే ముగిసింది
అప్పుడే ఆ కేసులో కఠిన చర్యలు తీసుకుని ఉంటే డ్రగ్స్ జోలికి వెళ్లాలంటే మిగిలిన సెలెబ్రిటీలు భయపడేవారు
కేసులు ,విచారణలు ,ఆర్భాటం ,మీడియా హడావుడి మినహా ఆ కేసులో తేలింది ఏమీ లేదు
ఆ మధ్య హైద్రాబాదు శివారు రిసార్ట్స్ లో తెలంగాణా సింగర్ బర్త్ డే పార్టీలో ఫారిన్ లిక్కర్ దొరకడం ,పోలీస్ కేసులు అవడం లాంటి కొంత హడావుడి నడిచింది
గతంతో పోలిస్తే రేవ్ పార్టీలు చాలామటుకు తగ్గినా ఇప్పటికీ అడపాదడపా కొన్ని జరుగుతూనే ఉన్నాయి
ప్రభుత్వాలు ఏం చేయాలి ?
ఇలాంటి కేసుల్లో దొరికినవాళ్లు ఎంత పెద్దవాళ్ళు అయినా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉపేక్షించరాదు
రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి
కానీ దురదృష్టవశాత్తు అటువంటి చర్యలు జరగడం లేదు
గతంలో ఏపీలో ఓ పార్టీకి చెందిన ఎంపీ నగ్నంగా వెకిలి వీడియోలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా అంతర్గత విచారణ పేరుతో ఆ పార్టీ నాయకత్వం అతడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు
అలాగే ఈ మధ్య కాలంలోనే ఏపీలో ఓ ఎమ్మెల్యే అవివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని వీడియోలలో దొరికినా అంతర్గత విచారణల పేరుతో కాలయాపన చేస్తూ అధినాయకత్వం అతడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు
తాజాగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ విషయంలో కూడా అదే జరుగుతుంది
ఎంపీగారి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ,అంతర్గత విచారణకు ఆదేశించడం రొటీన్ గా జరిగే వ్యవహారమే
అదే జరిగింది కూడా
కానీ అసలు జరగాల్సింది ఏంటి ?
సాధ్యమైనంత త్వరగా వారి మీద అంతర్గత విచారణ చేసి చర్యలు తీసుకోవడం , అప్పటిదాకా తాత్కాలికంగా పార్టీనుంచి సస్పెండ్ చేయడం లాంటివి చేయాలి కదా ?
కానీ చేయరు
ఒక సభ్యుడ్ని పార్టీనుంచి బయటికి పంపడం అంటే సంఖ్యాపరంగా ఎంతో విలువైన ఒక సీటును కోల్పోయినట్టే
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తమ సిట్టింగ్ స్థానాలను వదులుకోవడానికి సిద్దపడదు
అందుకే అంతర్గత విచారణలు చేస్తున్నాం అనే కంటితుడుపు ప్రకటనలు చేస్తుంది
అంతిమంగా ఏం జరుగుతుంది ?
నాలుగు రోజులాగితే ఈ విషయం మరుగునపడి పోతుంది
మళ్ళీ కొత్త కేసు తగులుకుంటే ఈ కేసు విషయం శాశ్వతంగా మర్చిపోతారు
ఈలోపు ఈ సంఘటనను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ప్రత్యర్థి పార్టీలు బిజీగా ఉంటాయి
ప్రస్తుతం జరుగుతుంది ఇదే
అలా జరగకూడదు అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రులు , పార్టీ అధినాయకులే
అదీ సంగతి
