ఇవాళ కూడా రేడియో ఎందుకు. పెద్దాడు టేప్ రికార్డర్ ,క్యాసెట్లు తెచ్చాడు కదా, విష్ణుసహస్రం పెట్టండి నేను వీణ వాయిస్తాను అంది తాతయ్య తో నాయనమ్మ..
నాన్న తెచ్చిన టేప్ రికార్డర్ లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి విష్ణుసహస్రం పెట్టగానే నాయనమ్మ కూడా వీణ వాయించింది సుబ్బలక్ష్మి గారి స్వరానికి తగినట్టు.
రోజుకొకసారి అనుకుంటా ఇప్పటికీ… అప్పట్లో నాయనమ్మ కి మంచి సపోర్ట్ ఇచ్చుంటే చాలా గొప్ప వీణ విద్వాంసురాలు అయ్యేది అని.
ఎమ్మెస్ గారికి, ఎం ఎల్ వసంతకుమారి గారికి వీరాభిమాని మా నాయనమ్మ..
మా నాయనమ్మ తండ్రి ఎమ్మెస్ గారిమీద అభిమానం తో ఈవిడకి సుబ్బలక్ష్మి అని పేరు పెట్టారు.అలా అఫిషియల్ గా నేను సుబ్బలక్ష్మి గారి మనవరాలిని.
మా అందరికీ వీళ్ళ విశేషాలు ఒకటికి రెండు సార్లు చెప్తుంటే “ద్విభాష్యం” వారి ఆడపడుచు కదా అందుకే అన్నీ రెండేసార్లు చెప్తుంది అని తాతయ్య నవ్వుతూ అనేవాడు..
,……….
టెలిఫోన్ ని కనిపెట్టిన అలెగ్జాడర్ గ్రాహం బెల్ భార్యకి వినికిడి శక్తి లేదు.మాట్లాడటం రావాలంటే ముందు వినపడటం మొదలవ్వాలి
అలా ఆమెకు మాటలు నేర్పే పట్టుదల, అవిరామ కృషి లో భాగమే ఈ టెలిఫోన్ ఆవిష్కరణ కూడా ..
అయితే ఈ గ్రాహం బెల్ ఏం చేసారంటే ..చూపు వినికిడి శక్తి లేని హెలెన్ కెల్లర్ ని అంధులకు విద్య నేర్పే “పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్” (బోస్టన్) లో చేర్చమని కెల్లర్ తండ్రి కి సలహా ఇచ్చారు.
అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన “హెలెన్ కెల్లర్” స్వతహాగా తెలివైన వ్యక్తి కావడం తో బ్రెయిలీ నేర్చుకుని 19 ఏళ్ళకే బి ఏ పట్టా కూడా తీసుకున్నారు.
చూపు, వినికిడిశక్తి లేని హెలెన్ కెల్లర్ మాట్లాడటం నేర్చుకోవడానికి చాలా సాధన చేశారు
ఎలా అంటే ..మనం మాట్లాడేటప్పుడు మన గొంతు దగ్గర
వైబ్రేషన్స్ ఉంటాయి ..అలా ఎవరు మాట్లాడుతుంటే వాళ్ల గొంతుదగ్గర తన చేతిని పెట్టి …గొంతుదగ్గర కదలికల ని బట్టి వాళ్ళు మాట్లాడేది నేర్చుకుని తర్వాతిరోజుల్లో పెద్ద వక్తగా కూడా పేరు తెచ్చుకున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెలెన్ కెల్లెర్
ఈ హెలెన్ కెల్లర్ కి ..మన సంగీత సరస్వతి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వినాలని కోరిక
సుబ్బలక్ష్మి గారితో చెప్తే ఆవిడ సరేననడం తో “భజగోవిందం,భావము లోన బాహ్యము నందున గోవింద గోవింద …” అని సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే తన చేతిని సుబ్బలక్ష్మిగారి గొంతుదగ్గరపెట్టి ..పాట ని అర్ధం చేసుకుంటూ లక్ష్మిగారు పాడటం పూర్తయ్యేసరికి ఆవిడ గళ మాధుర్యానికి కళ్ళలోనీళ్ళతో అలా ఉండిపోయారట హెలెన్ కెల్లర్.
.నాకు వచ్చిన పురస్కారాలకంటే కూడా హెలెన్ కెల్లర్ ఆనందించడమే ఎక్కువ సంతోషాన్నిచ్చిందని అన్నారు ఎం ఎస్ సుబ్బలక్ష్మి
అలాగే ఒకసారి ఎం ఎస్ సుబ్బలక్ష్మిగారు కచేరి చేసి వెళిపోతుంటే ఒక పెద్దావిడ గేట్ బయట ఈవిడని కలవాలని గొడవపడుతుంటే …ఆ పెద్దావిడని లోపలకి పిలిచి ఏం జరిగిందని అడిగారు
ఆ పెద్దావిడ…నేను మీ కచేరీ చూద్దామని పదిమైళ్ళు నడుచుకుని వచ్చాను కచేరీ అయిపోయిందని తెలిసింది,కనీసం ఒకసారి చూడనివ్వండని అడుగుతున్నాను అని అంటే, ఆవిడ్ని కూర్చోపెట్టి ముందు భోజనం పెట్టి ఆ తర్వాత “ఎందరో మహానుభావులు” అనే త్యాగారాజస్వామి పంచరత్న కీర్తనని పాడి వినిపించారు
“గొప్పవాళ్ళు అయ్యేది గొప్ప ప్రవర్తనతోనే.. “
భారతరత్న సుబ్బులక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం ఒకటి చాలు మనకి అనుకుంటా నేను
“పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ ।
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాఽపారే పాహి మురారే
భజ గోవిందం భజ గోవిందం ..”.అంటూ ఎంత చక్కగా పాడారు మహానుభావురాలు
సంగీత సరస్వతి సుబ్బలక్ష్మిగారికి 🙏🙏🙏
ఇవాళసుబ్బలక్ష్మిగారిజయంతి
Vydehi Murty
