హనుమాన్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు నటుడు తేజ సజ్జ . హనుమాన్ సినిమాకి ముందు అతడేదో జూనియర్ నటుడు అనుకున్నారు కానీ , ఆ సినిమా తర్వాత తేజ సజ్జాకు కూడా స్టార్ డమ్ వచ్చింది . మంచి కథతో పాటు , అతడ్ని వాడుకోవడం తెలిసిన దర్శకుడి చేతిలో సినిమా పడితే బొమ్మ హిట్ అవుతుందని హనుమాన్ నిరూపించింది . ఆ సినిమా ఇచ్చిన స్పూర్తితో తేజ సజ్జ మిరాయ్ అనే ఫాంటసీ మూవీతో మరో ప్రయోగం చేస్తూ మన ముందుకు వచ్చాడు .
ఫాంటసీ , జానపద జానర్ లో నడిచే సినిమాలకు బలమైన కథ కన్నా వెండితెర మీద ప్రేక్షకుల కళ్ళకు కట్టుకునేలా నడిపించగలిగే కధనం , విజువల్స్ , బీజీఎమ్ ల మీద శ్రద్ద పెడితే విజయం సాధించవచ్చని మిరాయ్ నిరూపించింది . మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా శ్రద్ద తీసుకున్నాడు. అవే ఈ సినిమాకి హైలెట్ . సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మిరాయ్ ఒక విజువల్ వండర్ .
ఈ విజువల్స్ ప్రక్రియ మొత్తం స్థానిక టీమ్ తో హైదరాబాద్ స్టూడియోలోనే పూర్తి చేయడం ఆశ్యర్యం కలిగిస్తుంది . విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి ఏ మాత్రం తగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతోనే అద్భుతాలు సాధించిన చిత్రం మిరాయ్ . ఇంతకుముందు చాలామంది అగ్ర దర్శకులు కూడా చిన్న చిన్న గ్రాఫిక్ వర్క్స్ విషయంలో కూడా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడేవారు . ఈ సినిమాలో విజువల్స్ చూసిన తర్వాత భవిష్యత్తులో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతోనే బ్రహ్మాండమైన ఫాంటసీ సినిమాలు తీయవచ్చని అర్ధమౌతుంది .ట్రైలర్లోనే మిరాయ్ ఫాంటసీ మూవీ అని ప్రమోషన్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి .దానికి తోడు మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ రోల్ లో నటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి .
మరి అందరి అంచనాలను అందుకునే విధంగా మిరాయ్ ఉందో? లేదో ? ఇప్పుడు చూద్దాం.
కధేంటంటే ?
ఇక కథ విషయానికి వస్తే , సినిమా ప్రారంభంలోనే అశోక చక్రవర్తి కాలంతో మొదలౌతుంది . కళింగ యుద్ధంలో ఆయన గెలిచినప్పటికీ లక్షలాది మంది సైనికులు మరణించడం అశోక చక్రవర్తిని బాధించింది . తనకున్న దైవశక్తి మానవాళిని రక్షించటానికి ఉపయోగపడాలే కానీ వినాశనానికి ఉపయోగపడకూడదు అని భావిస్తాడు .
దాంతో తనలో ఉన్న శక్తులను తొమ్మిది గ్రంధాల్లో నిక్షిప్తం చేసి వాటిని తొమ్మిదిమంది యోధుల చేతిలో పెట్టి భవిష్యత్తులో మానవాళి రక్షణ కోసం మాత్రమే ఈ గ్రంధాలను వాడమని చెప్తాడు .
అలా ఆ గ్రంధాలు ఒక తరం నుంచి మరో తరం యోధుల చేతుల్లోకి మారుతూ సురక్షితంగా ఉంటుంది . ప్రతి తరంలో ఎవరో ఒక యోధులు ఆ గ్రంధాలను పరిరక్షించే బాధ్యత తీసుకుంటారు . అలా 2000 వ సంవత్సరం నాటికీ తొమ్మిదో గ్రంధానికి అంబికా ( శ్రియ ) అనే యోధురాలు సంరక్షకురాలిగా ఉంటుంది . కానీ త్వరలో ఏదో కీడు ముంచుకురాబోతుందని ఆమెకు సంకేతాలు వస్తాయి . వెంటనే అంబిక తనకున్న దివ్యదృష్టితో ఈ గ్రంధాల భవిష్యత్తును చూస్తుంది .
దివ్యదృష్టిలో ఆమెకు మహావీర్ లామా ( మంచు మనోజ్ ) అనే దుర్మార్గుడు యోధులనుంచి గ్రంధాలను సొంతం చేసుకున్నట్టు కనిపిస్తుంది . దానితో ఆమె కలవరపడి హిమాలయాల్లో కైలాస పర్వత శిఖరాలకు చేరుకొని అగస్త్య మహామునిని సలహా అడుగుతుంది . ఆయన తన తపశ్శక్తితో జరగబోయే ప్రమాదాన్ని చూసి మహావీర్ నుంచి గ్రంధాలను కాపాడే యోధుడు నీ కడుపులోనే ఉన్నాడని , అయితే ఇందుకోసం నువ్వు బిడ్డను త్యాగం చేస్తే 24 సంవత్సరాల తర్వాత వాడే గ్రంధాలను మహావీర్ పరం కాకుండా కాపాడతాడని చెప్తాడు .
దాంతో అంబిక తనకు పుట్టిన బిడ్డను కాశీలో వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది . అలా ఆమె వదిలేసిన బిడ్డే వేద ( తేజ సజ్జా ) . సరిగ్గా అతడికి 24 ఏళ్ళు రాగానే అంబిక ఆశ్రమం నుంచి విభ ( రితికా నాయక్ ) వేదాను వెతుక్కుంటూ వెళ్లి జరిగిన వృత్తాంతం చెప్తుంది. దానితో వేద మహావీర్ నుంచి గ్రంధాలను కాపాడేందుకు మిరాయ్ కోసం బయలుదేరుతాడు.
మిరాయ్ అంటే త్రేతాయుగంలో రాముడి చేతిలో ఉండే కోదండం.
తన జన్మ వృత్తాంతం తెలుసుకున్న వేద ఆ గ్రంధాలను మహావీర్ నుంచి ఎలా కాపాడుకుంటాడు అనేదే మిగిలిన కథ
ఎలా ఉంది ?
ముందే చెప్పినట్టు ఇది ఫాంటసీ సినిమా కాబట్టి కల్పితాలు ఎక్కువగా ఉంటాయి . అశోక చక్రవర్తి తనకున్న దైవశక్తులను తొమ్మిది గ్రంధాల్లో నిక్షిప్తం చేసి తొమ్మిదిమంది యోధుల చేతిలో పెట్టడం అనే కాన్సెప్ట్ కల్పితమైనా సినిమాలో చూడటానికి బాగుంటుంది . రొటీన్ ఫాంటసీ మూవీ ఫార్ములా కాకుండా కొంచం డిఫరెంట్ గా ఉంది . తొమ్మిదో గ్రంధానికి సంరక్షకురాలిగా ఉన్న అంబిక తనకున్న దివ్యదృష్టితో మహావీర్ లామా నుంచి ముప్పు కనిపెడుతుందో అప్పుడే కథ అసలైన దారిలో పడుతుంది . మహావీర్ లామా పాత్రలో మంచు మనోజ్ ఎంటర్ అవడంతో కధనంలో వేగం పెరిగి క్యూరియాసిటీ కలుగుతుంది .
అంతకుముందు తేజ సజ్జతో చేయించిన కామెడీ కొంచం అతి అనిపిస్తుంది . హనుమాన్ మూవీలో కూడా ప్రారంభం ఇలాంటి కామెడీనే చేస్తాడు . ఎప్పుడైతే విభా కూడా వేదాని వెతుక్కుంటూ వెళ్లి అతడి జన్మ వృత్తాంతం చెప్తుందో అప్పటినుంచి కధలో సంఘర్షణ పెరుగుతుంది . అక్కడ్నుంచి వేదా మిరాయ్ కోసం వెతుక్కుంటూ బయలుదేరటం , అగస్త్య ముని అతడికి మార్గనిర్దేశం చేయడం ,లామా మనుషులు వేదా కోసం వెతకడం వంటి సన్నివేశాలతో థ్రిల్లింగ్ అనిపిస్తుంది . ముఖ్యంగా గరుడ పక్షి సన్నివేశంలో మాత్రం చూసే ప్రేక్షకులకు గూస్ బంప్స్ అవుతాయి . తేజా సజ్జకు పోటాపోటీగా ప్రతినాయకుడి పాత్రలో మంచు మనోజ్ నటించి మెప్పించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది .
ఎవరెలా చేసారు ?
ఈ సినిమాకి మొదటి హీరో విజువల్స్.. అటువంటి విజువల్స్ వండర్ సాధించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా హీరోనే .. ఆ తర్వాతనే మిగిలిన వారి గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా పక్షి సన్నివేశంలోనూ , త్రేతాయుగం రాముడి సన్నివేశాల్లోనూ విజువల్స్ ఎఫెక్ట్స్ భారీగా కనిపిస్తాయి. తక్కువ ఖర్చుతో అంత రిచ్ విజువల్స్ సాధించడం పూర్తిగా దర్శకుడి ప్రతిభే . ఇదే సినిమా రాజమౌళి చేతిలో పడితే బడ్జెట్ తో పాటు టైము కూడా భారీగానే ఖర్చయ్యేది . నిజం చెప్పాలంటే ఐదేళ్లు కష్టపడి ఎంతో ఖర్చుపెట్టి తీసిన భారీ గ్రాఫిక్స్ మూవీకి ఏ మాత్రం తీసిపోకుండా అంతకన్నా తక్కువ టైములో , అంతకన్నా తక్కువ ఖర్చుతో తీసిన మిరాయ్ అద్భుతంగా నిలిచిపోతుంది .
ఇక హీరో తేజ సజ్జా నట విశ్వ రూపాన్ని హనుమాన్ లో చూసాం . లక్కీ గా అతడికి మంచి కధలు పడుతున్నాయ్ . మిరాయ్ లో కూడా తేజ సజ్జకు పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర పడింది . అయితే హనుమాన్ లో అల్లరిచిల్లరిగా తిరిగే పాత్రలో మొదలైనట్టుగానే మిరాయ్ లో కూడా ప్రధమం లో అల్లరి పిల్లాడిగానే అతడి పాత్ర మొదలౌతుంది . ఎప్పుడైతే తన జన్మ వృత్తాంతం తెలుసుకుంటాడో అప్పుడే అతడిలోని హీరో బయటికి వస్తాడు . అక్కడ్నుంచి అతడి నటన గురించి చెప్పకూడదు .. చూడాల్సిందే .
విభ పాత్ర పోషించిన హీరోయిన్ రితికా నాయక్ నటన పర్లేదు .
వేద తల్లి అంబికా గా శ్రియకు బరువైన పాత్ర పడింది . ఎమోషన్స్ చక్కగా పండించింది.
ఈ సినిమాలో అంబికా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీయకు మంచి పాత్ర పడినట్టే లెక్క.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా మెరుస్తాడని సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ అతడు కేవలం బిగినింగ్ లో తన వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు .
ఇక చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ నటన గురించి . కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్య తిరిగి కొన్ని సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు మంచు మనోజ్. ఈ మధ్య విడుదలైన భైరవం లో నటించినప్పటికీ మనోజ్ కి చెప్పుకోదగ్గ మార్కులు పడలేదు. ఆ లోటు మిరాయ్ తో తీరిపోయింది . ఇకపై మంచు మనోజ్ గురించి చెప్పుకోవాలంటే మిరాయ్ కి ముందు , మిరాయ్ కి తర్వాత అని చెప్పుకుంటారు .
మిరాయ్ లో మహావీర్ గా నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో మంచు మనోజ్ జీవించేసాడు. ముఖంలో క్రూరత్వాన్ని , రౌద్రాన్ని పలికించడంలో మనోజ్ సక్సెస్ అయ్యాడు. అయితే మహావీర్ పాత్ర లో మనోజ్ ను ఇంకా శక్తిమంతంగా చూపించవచ్చు .. ఆ విషయంలో దర్శకుడు మనోజ్ ను పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది .
జగపతిబాబు తనదైన మార్క్ నటన ప్రదర్శించి మెప్పించాడు . ఇక వినోదం కోసం కిశోర్ తిరుమల , వెంకటేష్ మహాల సన్నివేశాలు జోరుగా సాగుతున్న కధకు స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డుపడినట్లు అనిపించింది . కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల కథ అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది .
గౌరీ హర సంగీతం బావుంది . దర్శకుడు కార్తీక్ క్లైమాక్స్ మీద ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది . బహుశా ఆ లోటు తీర్చడం కోసం పార్ట్ 2 తీస్తున్నట్టు ఉన్నారు .
మిరాయ్ పార్ట్ 2 లో రానా
‘ ఇంత మహిమాన్వితమైన ఆ తొమ్మిది గ్రంధాలు నాకు కావాల్సిందే’ అంటూ క్లైమాక్స్ లో రానా ఎంట్రీ ఇవ్వడం పార్ట్ 2 కూడా ఉందన్న విషయాన్ని తెలియచేస్తుంది . పార్ట్ 2 లో భళ్ళాలదేవుడు రానా ఎంట్రీ అయితే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. ఓవరాల్ గా ఫాంటసీ సినిమాలు ఇష్టపడేవారికి మిరాయ్ నచ్చుతుంది.
నటీనటులు : తేజ సజ్జా , మంచు మనోజ్ , రితికా నాయక్ , శ్రీయ శరన్ , జగపతి బాబు
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
సినిమాటోగ్రఫీ , దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
విడుదల : 12 -09 -2025
రేటింగ్ : 3.5 / 5
