ఇదేంటి టైటిల్ చూసి మురారి ప్లేసులో కొత్తగా ఈ శర్వానందు ఎక్కడ్నుంచి వచ్చాడు ? అనుకుంటున్నారా ?
ఉంది .. దానికో కారణం ఉంది
1990 లలో నారీ నారీ నడుమ మురారి పేరుతో ఇరువురు భామలతో అగచాట్లు పడ్డ బాలయ్య గుర్తున్నాడా ?
అగచాట్లు పడితే పడ్డాడు కానీ అప్పట్లోనే బాలయ్య హిట్టు కొట్టాడు
ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తూ చక్కటి పాటలతో అదరగొట్టేసాడు
ఇదిగో ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్తో శర్వానందు ఇరువురు భామలనేసుకుని పండక్కి దిగాడు
తన మూవీ పేరు వాడుకున్నందుకు బాలయ్య దబిడిదిబిడి చేస్తాడేమో అని అందరూ భయపడితే , అలాంటిదేమీ లేకుండా ఆయన శర్వానంద్ కు బెస్ట్ విషెస్ చెప్పి దీవించడంతో టైటిల్ సుఖాంతం అయ్యింది
“ఆ రోజుల్లో నేనూ , శోభన్ బాబు , వెంకటేష్ లాంటివాళ్ళం ఇద్దరితో ఎలాగోలా మ్యానేజ్ చేసి బయటపడ్డాం .. కానీ ఇప్పుడలా కాదే ? ఈ రోజుల్లో ఒక్కళ్లని మ్యానేజ్ చేయడమే కష్టం .. అలాంటిది ఇద్దర్ని మ్యానేజ్ చేయడమంటే బహు కష్టం సుమీ .. పైగా ఈ కుర్రాడు శర్వానంద్ ఫీల్డుకి కొత్త ..ఎలా లాక్కొస్తావో ? ఏంటో ? జాగ్రత్త ” అని బాలయ్య దర్శక అబ్బరాజుకి హితబోధ చేయడంతో ,
“మీరేం వర్రీ కాకండి సార్ ! కథను ఎప్పుడు మలుపు తిప్పాలో , ఎలాంటి మలుపు తిప్పాలో నాకొదిలెయ్యండి .. శర్వానంద్ తో సంక్రాతి పండక్కి సర్వానందం చేయించే బాధ్యత నాది..”అని లైట్సాన్ అన్నారు దర్శకుల వారు
ఇదిగో అప్పుడు లైట్స్ ఆన్ చేస్తే ఇప్పుడు పండక్కి మనముందుకు వచ్చారు
మరి ఈ శర్వానంద నారీ నారీ నడుమ మురారి కధేంటో చూద్దామా ?
కధేంటంటే ?
సినిమా మొదలవడమే హీరో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో మొదలౌతుంది
ఆ సీన్ చూడగానే మనకేం అర్ధమౌతుంది ?
ఓహో ! హీరో గారు ఎవరో పల్లవి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు .. ఈ పెళ్ళికి అమ్మాయి తరపు పెద్దలు ఒప్పుకోకపోవడంతో సదరు హీరో ఆ అమ్మాయిని లేపుకుపోయి గుళ్లో పెళ్లిచేసుకుంటాడు అనుకుంటాం
అంతేకదా ?
మనం అనుకోవడమేంటి ఆటో నడిపే సత్య కూడా అదే అనుకుంటాడు
కానీ అమ్మాయి కిడ్నాప్ వెనుకున్న అసలు కథ వేరు
దర్శకుడు ప్రారంభంలోనే మనకు ట్విస్ట్ ఇవ్వడంతో సినిమా మొదలౌతుంది
సరే ఆ సన్నివేశాల గురించి తర్వాత మాట్లాడుకుందాం
ముందు కధేంటో కొంచం క్లుప్తంగా చెప్పుకుందాం
బీటెక్ చేసి ఆర్కిటెక్ట్ గా పనిచేసే గౌతమ్ ( శర్వానంద్ ) నిత్యతో (సాక్షి వైద్యతో ) ప్రేమలో పడతాడు
తమ ప్రేమ విషయం నిత్య తండ్రి రామలింగం ( సంపత్ రాజ్ ) తో చెప్పడంతో కథ మొదలౌతుంది
అయితే వీరి ప్రేమకు ముందు ఒప్పుకోని రామలింగం తర్వాత కూతురి కోసం అంగీకరించి పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే జరగాలని కండిషన్ పెడతాడు
ఈ కండిషన్ కు ఒప్పుకున్న గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ లో రిజిస్టర్ ఆఫీస్ అధికారి సత్యమూర్తి తో ( సునీల్ ) జరిగిన గొడవతో చిక్కుల్లో పడతాడు
ప్రస్తుతానికి వస్తే నిత్యతో తన పెళ్లి ఆ సత్యమూర్తి చేతిలోనే ఉండటంతో గౌతమ్ ట్రబుల్లో పడతాడు
ఇంతకీ గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
సత్యమూర్తితో గౌతమ్ కున్న గొడవేంటి ?
మొదట్లో గౌతమ్ కిడ్నాప్ చేసిన పల్లవి ఎవరు ?
గౌతమ్ గతంలో అతడి జీవితంలో ప్రవేశించిన దియా ( సంయుక్త ) ఎవరు ? లాంటి ప్రశ్నలకు మిగిలిన కథలో సమాధానాలు తెలుస్తాయి
మూవీ ఎలా ఉందంటే ?
ఒక్క వాక్యంలో చెప్పాలంటే సర్వానందం
నారీ నారీ నడుమ కథలతో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి
రింగ్ శోభన్ బాబువి అయితే దాదాపు ఆయన సినిమాలన్నీ ఇవే బాపతు
ఒక హీరోయిన్ ఊటీలో , ఇంకో హీరోయిన్ విశాఖలో
ఈ ఇద్దరితో క్లైమాక్స్ వరకు ఆయన పడే తంటాలతో కధలు సాగేవి
కాకపోతే ఈ కధల్లో కామెడీ జానర్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్లు ఎక్కువగా వాడేసేవారు
అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్సుకి శోభన్ బాబు కనెక్ట్ అయిన విధంగా మరే హీరో కనెక్ట్ కాలేదేమో ?
మళ్ళీ ఇన్నాళ్లకు ఆ లోటు శర్వానంద్ తీరుస్తున్నాడు
మహానుభావుడు వంటి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్సుకు ఇతడు బాగా కనెక్ట్ అయ్యాడు
తాజాగా నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్ కు మంచి పాత్ర పడింది
టైటిల్ చూడగానే ఇదేదో శోభన్ బాబు పాత సినిమాల టైపే అన్న అంచనాకు రాకూడదు
ఈ సినిమాలో సీరియస్ పాయింటుని కామెడీగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు
ఒకళ్ళతో ప్రేమ , మరొకరితో పెళ్లి వంటి పాత రొటీన్ రొడ్డకొట్టుడు కథ జోలికి వెళ్ళలేదు
ఇద్దరితో పెళ్లిళ్లు అయిన హీరో అగచాట్లనే సీరియస్ టచ్ లేకుండా కామెడీగా చూపించాడు
కథకు ప్రధానమైన బలం ఇదే
సినిమా ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు థియేటర్కొచ్చిన ప్రేక్షకులను నవ్వించటమే పనిగా దర్శకుడు సన్నివేశాలను పేర్చుకుంటూ పోయాడు
ఒక్క క్లైమాక్సులో ఆ కొద్దిసేపు చూపించిన ఎమోషనల్ టచ్ మినహా మిగిలినదంతా నాన్ స్టాప్ ఎంటెర్టైనరే
అన్నట్టు శ్రీవిష్ణు నటించిన సామజవరగమన మూవీ చూసారు కదా ?
ఆ మూవీ దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకి కూడా దర్శకుడు
అదీ అంతే మొదటినుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైనర్ మూవీ
కాకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి కొన్ని పోలికలు ఉన్నాయి
అందులో వీకే నరేష్ ఏజ్ వచ్చినా నిత్య విద్యార్థిగా పరీక్షలు రాస్తుంటాడు
ఇందులో 60 ఏజ్ వచ్చినా 25 ఏళ్ళ అమ్మాయిని నిత్య పెళ్ళికొడుకు మాదిరి రెండో పెళ్లి చేసుకున్న పాత్రలో కనిపిస్తాడు
అక్కడా నరేష్ డామినేషనే.. ఇక్కడా నరేష్ డామినేషనే
రెండుచోట్ల టన్నుల నవ్వులు పంచింది నరేషే
కాకపోతే వెన్నెల కిషోర్ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న పాత్రలో అక్కడ నటించినంతగా ఇక్కడ గురుభక్తి ఉన్న పాత్రలో మెప్పించలేకపోయాడు
అక్కడ కథలో హీరోయిన్ హీరోని అన్నయ్యా అని పిలవాల్సిన సందర్భం వస్తుంది
ఇక్కడ వీకే నరేష్ తనకన్నా వయసులో చిన్నవాళ్లు అయిన అత్తమామలను అత్తయ్య , మామయ్య అని పిలవాల్సి వస్తుంది
ఆ సినిమాలో నటించిన శ్రీవిష్ణు ను ఈ సినిమా క్లైమాక్సులో వాడుకున్నాడు
టోటల్గా ఆ సినిమా థీమ్ ఈ సినిమా థీమ్ వేరు అయినప్పటికీ అందులో నటించిన నటీనటులకు దర్శకుడు ఇందులో కూడా అవకాశమిచ్చి డిఫరెంట్ ఔట్పుట్ రాబట్టుకున్నాడు
హాస్యాన్ని పండించటంలో రెండు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి
గతంలో జంధ్యాల , ఈవీవీ తదితర దర్శకులు వరుస సినిమాలతో హాస్యాన్ని పండించారు
ఆ కోవలోకే ఈ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా వస్తున్నారు
కామెడీ జానర్లో సరైన పంచులు పడితే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోతాయి
ఈ సినిమాలో అటువంటి పంచులు బాగా పడ్డాయి
సెకండాఫ్ తో పోలిస్తే ఫస్టాఫ్ లో కామెడీ పంచులు ఎక్కువ
సెకండాఫ్ లో దియా ఫ్లాష్ బ్యాక్ తో అసలు కథలోకి వస్తాం
కథలోకి వచ్చినా కామెడీ ట్రాక్ దారితప్పకుండా దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది
కానీ క్లైమాక్స్ ఎపిసోడ్లలో దర్శకుడు కొద్దిగా తడబడినట్టు కనిపించింది
ఆఖర్లో ఎండింగ్ సీన్లో శర్వానంద్ , నిత్య రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిచేసుకునే టైములో అతడు సంతకం పెట్టకుండా గిల్టీ ఫీలింగ్ తో వెళ్ళిపోతాడు
మళ్ళీ ఆ సీరియస్నెస్ ని పోగొట్టడానికి మూడు నెలలు , ఆరునెలలు , రెండేళ్లు అంటూ కాలచక్రం గిర్రున తిప్పి వారి పెళ్ళికి పచ్చజెండా ఊపుతారు
రెండేళ్ల సాగదీతతో ఇచ్చిన ఈ ఎండింగ్ అంత జస్టిఫికేషన్ గా అనిపించదు
ఇంకోటి దియా తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ కూతురితో మాట్లాడుతూ గౌతమ్ మంచివాడు తన ఈగోవల్లనే అతడు దూరమయ్యాడు అని చెప్తాడు
దాంతో ఆమె రియలైజ్ అవుతుంది
ఇదేదో నిత్య తండ్రి రామలింగంతో చెప్పి ఆయన రియలైజ్ అయినట్టుగా చూపించి ఉంటే ముగింపు బాగుండేది
ఎవరెవరు ఎలా చేసారు ?
ఈ సినిమాని వీకే నరేష్ క్యారక్టర్ లేకుండా చూస్తే ఏమౌతుంది ?
మనకు అంతగా నప్పదు
కారణం క్యారక్టర్ అటువంటిది
సరే ఈయన గురించి చెప్పుకునేముందు హీరో శర్వానంద్ గురించి కూడా చెప్పుకుందాం
ఈ జెనెరేషన్లో ఫ్యామిలీ ఆడియన్సుకు సరిగ్గా కనెక్ట్ అయ్యే నటుడు శర్వానంద్
అవసరమైతే సీరియస్ పాత్రల్లోనూ మెప్పించగలడు , ఇంకా అవసరమైతే కామెడీ టైమింగ్ లోనూ మెప్పించగలడు
బిటెక్ చదివే కుర్రాడిగా రఫ్ క్యారక్టర్లోనూ , చదువు పూర్తయి ఆర్కిటెక్ట్ జాబ్ చేసే యూత్ క్యారక్టర్లోనూ చక్కగా ఒదిగిపోయాడు
క్యారక్టర్కు తగిన హావభావాలను ప్రదర్శించాడు
కాకపోతే ఎందుకో ఈ సినిమాలో శర్వానంద్ కొద్దిగా సన్నబడినట్టు ఉన్నాడు
అయినా గ్లామరేమీ తగ్గలేదనుకోండి
60 ఏళ్ళు వచ్చిన తండ్రి జల్సారాయుడి మాదిరి రెండో పెళ్ళిచేసుకుని రెండోసారి తండ్రి అవడం , అదే సమయంలో తన పెళ్ళికి మాత్రం సినిమా కష్టాలు రావడంతో సతమతమయ్యే పాత్రలో బాగా రాణించాడు
ఇప్పుడు కార్తీక్ గురించి చెప్పుకుందాం
కార్తీక్ అంటే ఎవరో అనుకుంటున్నారా ?
కార్తీక్ అలియాస్ వీకే నరేష్
నారీ నారీ నడుమ మురారికి నవ్వులు పంచిన మెయిన్ పిల్లర్
60 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళ వయసున్న అమ్మాయిని కొడుకు సాయంతో లేపుకొచ్చి గుళ్లో పెళ్ళిచేసుకుని మూడు నెలలకు తండ్రి అయిన అభినవ మన్మధుడు
తనకన్నా చిన్నవయసు ఉన్న అత్తమ్మని అత్తయ్యా అని పిలుస్తుంటే ఆమెకు మండి ” నన్నలా పిలవకు .. నేన్నీకు అత్తయ్యనేంటి ? ఎవరైనా చూస్తే నువ్వు నాకు మామయ్య అనుకుంటారు ” అని విసుక్కుంటుంది
అయినా నరేష్ అవేమీ పట్టించుకోకుండా అత్తయ్యా అని పిలుస్తుండటంతో థియేటర్లో నవ్వులు పూస్తాయి
ప్రాణప్రదంగా ప్రేమించే పడుచు పెళ్ళాం కొడుకు కారణంగా విడాకులకు అప్లై చేయడంతో నరేష్ పడే వేదన కడు నవ్వులతో చూపించాడు
కోర్ట్ సన్నివేశంలో అయితే చొక్కా విప్పి మరీ తన విశ్వ రూపాన్ని చూపించి నవ్వించాడు
ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ వీకే నరేష్
ఇక ఇద్దరు హీరోయిన్లు సాక్షి వైద్య , సంయుక్త లలో సంయుక్త నటనకే మార్కులు పడతాయి
సాక్షి వైద్య సన్నివేశాలకు తగిన హావభావాలను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి
పల్లవి గా బిగ్ బాస్ అమ్మాయి సిరి హనుమంతు బాగానే చేసింది
రామలింగం పాత్ర పోషించిన సంపత్ రాజ్ ది సీరియస్ క్యారక్టరో తెలీదు , కామెడీ పాత్రో తెలీదు
ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు
కానీ కామెడీకి తానే మెటీరియల్ అవుతాడు
అయితే పాత్ర స్వభావ రీత్యా సరిపోయాడు
ఈయన శిష్యుడు గుణశేఖర్ గా వెన్నెల కిషోర్ ఎంటర్ అవడంతో ఆడియన్స్ మరిన్ని నవ్వులు కురుస్తాయని ఆశించారు
కానీ వెన్నెల కిషోర్ నుంచి ఆశించిన స్థాయిలో ఔట్పుట్ రాలేదు
అతడ్ని జాగ్రత్తగా వాడుకుని ఉంటే వీకే నరేష్ కు పోటీగా మరిన్ని నవ్వుల టపాసులు పేలేవి
ఎంట్రీలో గురుభక్తి అంటూ గురువు సంపత్ రాజ్ కాళ్ళమీద పడి పాలాభిషేకం చేయడం , ఆ ఇంటి ఉప్పు తిన్నందుకు సింబాలిక్ గా ఉప్పు ప్యాకెట్లను తీసుకెళ్లడం వరకు కొంతవరకు కామెడీకి ఓకే
కానీ అదే పనిగా గురు పుత్రిక బర్త్ డే పార్టీకి కూడా పాల ప్యాకెట్ పట్టుకెళ్ళడం , సాల్ట్ బస్తా పట్టుకెళ్ళడం లాంటివి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి
సత్యమూర్తి అలియాస్ సునీల్
ఈ సునీల్ కామెడీ యాక్టర్గా ఉన్నప్పుడే బాగుండేది
కామెడీ పాత్రలు పోషిస్తూ సినిమాల్లో బిజీగా ఉన్న పీక్ టైం లో హీరో పాత్రలనీ , విలన్ పాత్రలనీ రకరకాల ప్రయోగాలు చేసి ఎటూ కాకుండాపోయాడు
ఈ సినిమాలో కూడా అంతే ,
సునీల్ ది సీరియస్ క్యారక్టరో , కామెడీ క్యారక్టరో తెలీదు
ఎప్పుడూ సీరియస్ గా ఉంటాడు
అన్ని సన్నివేశాల్లో కూడా సునీల్ హావభావాలు ఒకలాగే ఉంటాయి
సినిమాలో ఇతడి క్యారక్టరైజేషన్ మీద మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది
లవకుశ పాత్రలో నటించిన సత్య ఎప్పటిమాదిరే ఇందులో కూడా రెచ్చిపోయి నటించేసాడు
తనదైన మార్క్ కామెడీని బాగానే పండించాడు
క్లైమాక్సులో ఎంటరైన శ్రీవిష్ణు ఉన్న కాసేపు చక్కటి నటన ప్రదర్శించాడు
దియా తండ్రిగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ నటన పర్లేదు
సాంకేతికత :
సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపధ్య సంగీతం పర్లేదు
పాటలు చెప్పుకోదగినంతగా ఏమీ లేవు
సినిమాటోగ్రఫీ బాగానే ఉంది
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి
విశ్లేషణ :
టైటిల్ చూసి ఇదేదో పాత కాలపు రొడ్డకొట్టుడు సినిమా అనుకుంటే పులిహోరలో కాలేసినట్టే. సీరియస్ పాయింటుని కామెడీగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు . సంక్రాంతి పండక్కి సరదాగా థియేటరుకెళ్ళి కాసేపు నవ్వుకుని వద్దామనుకుంటే నారీ నారీ నడుమ మురారికి వెళ్ళండి. పొయ్యేదేమీ లేదు .. కూసిన్ని నవ్వులు మినహా !
నటీనటులు : శర్వానంద్ ,వీకే నరేష్ , సాక్షి వైద్య , సంయుక్త , సంపత్ రాజ్ , వెన్నెల కిషోర్ , సత్య తదితరులు
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు : అనిల్ సుంకర , రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : రామ్ అబ్బరాజు
విడుదల : 14 – 01 – 2026
రేటింగ్ : 3 / 5
