కలంకావల్ లో సీరియల్ కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తుంటాడు ?- మూవీ రివ్యూ

Spread the love

కొంతమంది హీరోలు కెరీర్ మొదలునుంచి ఎదుగుతున్న క్రమంలో ఒక ఇమేజ్ చట్రంలో కూరుకుపోతారు .

ఫలానా హీరో కామెడీ పాత్రలే చేయగలడు
యాక్షన్ థ్రిల్లర్ పాత్రలే చేయగలడు
డాన్సులు చేయగలడు
ఫైటింగులు చేయగలడు
ఇలా వారికి తెలియకుండానే ఒక ఇమేజ్ చట్రంలో కొనసాగుతూ ఉంటారు .

కానీ కొంతమంది మాత్రమే అలాంటి ఇమేజ్ చట్రం జోలికి పోకుండా ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోగలరు . అటువంటివారిలో మమ్ముట్టి ఒకరు . ఈ మళయాళ నటుడ్ని మన చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాం . ఒక సినిమాలో ఫక్తు ఫ్యామిలీ మ్యాన్ మాదిరి కనిపిస్తాడు . ఇంకో సినిమాలో నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడు .

ఒక సినిమాలో కామెడీ టైమింగ్ తో నవ్విస్తే , ఇంకో సినిమాలో యాక్షన్ థ్రిల్లర్ తో మెప్పిస్తాడు . ఒకటా రెండా ఇప్పటికి నాలుగు వందలకుపైన సినిమాల్లో నటించాడు . ప్రతి సినిమాలో తనకిచ్చిన పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని నటిస్తాడు . కేవలం హీరో ఇమేజ్ కే పరిమితం అవకుండా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు .

అంతెందుకు తనకిచ్చిన గే పాత్రను కూడా ఒప్పుకుని చేసాడు . ఇంకో హీరో అయితే ఈ వయసులో అటువంటి పాత్ర చేయడానికి సాహసించడేమో? కానీ మమ్ముట్టి అటువంటి సంకోచాలను పక్కనబెట్టి పాత్ర ఏదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని పరకాయ ప్రవేశం చేస్తానని చెప్పి నటించి చూపాడు .

ఇప్పుడు అదే మమ్ముట్టి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మళయాళ సీమలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు . కలంకావల్ కేరళలో విడుదలై 80 కోట్లకు పైగా వసూలు చేసి పరుగులు పెడుతుంది . తాజాగా మూడురోజుల క్రితం నుంచి ఓటిటి ప్లాట్ఫార్మ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది .

ఇంతకీ కధేంటి ?

కేరళ , తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ఒంటరి మహిళలు కనిపించకుండా పోతుంటారు
ఎంత గాలించినా మాయమైన మహిళల ఆచూకీ దొరకదు . ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేసారా ? అంటే అదీ కాదు.. మరి ఉన్నపళంగా గ్రామాల్లో కొంతమంది మహిళలు ఎందుకు కనిపించకుండా పోతున్నారు ? కనీసం వారి శవాలు కూడా దొరక్కపోవడంతో పోలీసులు తలపట్టుకుంటారు .

ఈ క్రమంలో ఈ మిస్టరీని ఛేదించటానికి ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ( వినాయకన్) ను నియమిస్తారు . కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ గుడ్లగూబ అనే పేరుతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు . అతని ఇన్వెస్టిగేషన్ డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్ స్టాన్లీ దాస్ (మమ్ముట్టి ) పేరు బయటకు వస్తుంది .

కానీ స్టాన్లీ దాస్ పేరు అయితే బయటికి వస్తుంది కానీ అతడే ఈ మహిళల అదృశ్యం వెనుక ఉన్న అసలు సూత్రధారి అనటానికి తగిన ఆధారాలు ఏమీ దొరకవు . ఎందుకంటే స్టాన్లీ దాస్ నడవడిక మీద ఎవరికీ అనుమానం రాదు.. పైకి చాలా మంచివాడిలా కనిపిస్తాడు .

అయినా సరే మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడంతో ఒకటొకటిగా షాకింగ్ విషయాలు బయటపడుతూ ఉంటాయి . ఈ క్రమంలో స్టాన్లీ దాస్ ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకుని లోబరుచుకుని అదే రోజు వారిని హత్యలు చేస్తున్నాడనే భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటాడు .

అయితే స్టాన్లీ దాసే ఈ హత్యలు చేస్తున్నాడని నిరూపించటానికి ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తాడు ? అసలు ఈ స్టాన్లీ దాస్ ఎవరు ?

అతడు సైకో కిల్లర్ గా ఎందుకు మారతాడు ? అనేవి మిగతా కధనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

అసలే సైకో కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. పైగా నెగిటివ్ షేడ్ లో మమ్ముట్టి నటన కలిపి సినిమాపై అంచనాలు పెంచాయి . ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నిజానికి ఇలాంటి సైకో కిల్లర్ నేపధ్యం ఉన్న సినిమా ఇదే మొదటిది కాదు.. గతంలో చాలా సినిమాలు వచ్చాయి .

అంతెందుకు ఎప్పుడో వచ్చిన కమల్ హాసన్ ఎర్ర గులాబీ మూవీది కూడా ఇలాంటి కధే
ఇందులో అతడు కూడా సీరియల్ కిల్లర్ అన్నమాట . హీరో కమల్ హాసన్ ఒంటరి మహిళలను మోసం చేసి లోబరుచుకుని హత్య చేసి సమాధుల మీద ఎర్ర గులాబీ పెడుతుంటాడు . ఆఖరికి హీరోయిన్ శ్రీదేవి కమల్ హాసన్ నిజ స్వరూపం తెలుసుకుని బయటపడుతుంది.. అప్పట్లోనే ఈ సినిమా బాగా ఆడింది .

ఇలాంటి సినిమాల్లో దేనిదారి దానిదే .. ఎవడెంత టెంపో మెయింటైన్ చేస్తే వాడే కింగ్ . ఇలాంటి కధలకు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ ఉన్న ఉంటే అంత కిక్కిస్తుంది . సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అపరాధ పరిశోధనలు కొనసాగుతూ ఉండాలి .

మధ్య మధ్యలో ఊహించని ట్విస్టులు ఉండాలి.. మిస్టరీలో చిక్కుముడులు వీడుతున్నట్టే ఉండాలి . చివరిదాకా అదే టెంపోలో సినిమా నడిపించాలి.. అప్పుడు కదా సినిమా పేలేది .

ఇటువంటి స్క్రీన్ ప్లే లో మళయాళ దర్శకులు ఆరితేరిపోయారు . కధనంలో ఎక్కడా సస్పెన్స్ తగ్గనీయకుండా గ్రిప్పింగ్ గా తీయడం అనేది వాళ్ళు బాగా వంటపట్టించుకునేశారు . దర్శకుడు చివరిదాకా మమ్ముట్టి పాత్రను దాచిపెట్టకుండా సినిమా ప్రారంభంలోనే అతడు ఓ మహిళను హత్య చేసే సన్నివేశంతో మొదలుపెట్టాడు .

ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్టే కధకు ప్రాణం పోసింది . వరుస హత్యలు జరుగుతున్నాయి..
హంతకుడు ఎవరో తెలుసు ? కానీ అతడే హత్యలు చేస్తున్నాడని ప్రూవ్ చేయడం ఎలా ? ఇలా పాత డిటెక్టివ్ కధల్లో అపరాధ పరిశోధన మాదిరి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది .

కధనంలో హంతకుడు కనిపిస్తుంటాడు.. పోలీసులు కనిపిస్తుంటారు.. కానీ చివరివరకు మిస్టరీ తేలదు . ఆ మధ్య నిజ జీవితంలో ఒక సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ ” మాములు నేరగాళ్లతో పోలిస్తే సైకో కిల్లర్లలో తెలివితేటలు ఎక్కువుంటాయని చెప్పారు . చట్టానికి దొరక్కుండా హత్యలు చేస్తూ డిపార్టుమెంటుని ముప్పతిప్పలు పెట్టడంలో ఈ సైకో కిల్లర్లే ముందు ఉంటారని” ఆయన చెప్పారు .

ఆయన చెప్పింది నిజమే ,

ఈ సినిమా కూడా కేరళలో నిజ జీవితంలో జరిగిన ఓ సైకో కిల్లర్ సీరియల్ మర్డర్స్ కేసు ఆధారంగా తీసిందే . అయితే దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచాడు.
ఈ సినిమాకి సరైన దర్శకత్వమే ప్లస్ అవుతుంది .

క్లుప్తంగా చెప్పాలంటే చట్టానికి దొరక్కుండా తెలివిగా స్టాన్లీ దాస్ చేసే వరుస హత్యలు ఒకవైపు , ఎలాగైనా తగిన ఆధారాలు సంపాదించి హంతకుడ్ని చట్టానికి పట్టించటానికి పోలీసులు చేసే పరిశోధనలు మరొకవైపు , మొదటినుంచి చివరివరకు కధనాన్ని అత్యంత గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు .

ఎవరెవరు ఎలా చేసారు ?

ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో మమ్ముట్టి ని తీసుకోవాలన్న దర్శకుడి నిర్ణయం సరైనదే . ఇంకో హీరో ఈ స్థాయిలో చేసేవారో లేదో తెలియదు కానీ మమ్ముట్టి పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . సైకో కిల్లర్ అంటే ముఖం మీద గాటు , క్రూరమైన చూపులు , హావభావాలు కాదు.. పైకి సాధారణ ఫ్యామిలీ మ్యాన్ మాదిరి నవ్వుతూ , మంచిగా ఉంటూ అంతర్ముఖంలో అత్యంత దుర్మార్గాన్ని ప్రదర్శించడమే అసలు సిసలైన సైకో లక్షణాలు . అటువంటి హావభావాలు పలికించడంలో మమ్ముట్టి నూరు శాతం సక్సెస్ అయ్యాడు .

వెండి తెర మీద సైకో కిల్లర్ హత్యలు చూస్తుంటే వామ్మో స్టాన్లీ దాస్ ఇలాంటివాడా ? అనిపిస్తుంది . ఆ పాత్ర మీద కోపం వస్తుంది , అసహ్యం వేస్తుంది , భయం వేస్తుంది , ఆశ్చర్యం వేస్తుంది . అంతే సినిమాలో మనకు స్టాన్లీ దాస్ మాత్రమే కనిపిస్తాడు.. మమ్ముట్టి అస్సలు కనిపించడు .

ఇక రెండో క్యారక్టర్ గురించి చెప్పుకోవాలంటే వినాయకన్ గురించి చెప్పుకోవాలి . జైలర్లో వర్మ పాత్ర పోషించిన వినాయకన్ ఇందులో ఇన్స్పెక్టర్ జయకృష్ణన్ పేరుతో ప్రదర్శించిన నటన మాములు స్థాయిలో లేదు . ఈయన నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మనిషా ? అని అనిపిస్తుంది . ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిట్యుయేషన్ కు తగ్గట్టుగా హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు .

సినిమా విజయానికి ఈ ఇద్దరే మెయిన్ పిల్లర్స్
వీళ్ళని జాగ్రత్తగా వాడుకుని దర్శకుడు జితిన్ కే జోష్ చక్కటి ఔట్పుట్ రాబట్టుకున్నాడు .

సాంకేతికత :

ఇలాంటి సినిమాలకు సినిమాటోగ్రఫీ , బీజీఎమ్ ప్రముఖ పాత్రలు పోషిస్తాయి
ఆ రెండిటిలో మంచి మార్కులే పడతాయి
ముజీబ్ మజీద్ అందించిన బీజీఎమ్ బాగుంది .

విశ్లేషణ :

ముందే చెప్పినట్టు ఇదే జానర్లో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ దేని దారి దానిదే . సస్పెన్స్ థ్రిల్లర్ కథనాలను ప్రెజెంట్ చేసేటప్పుడు ఎవరెంత గ్రిప్పింగ్ గా తీయగలరు అనేదానిమీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది . సైకో కిల్లర్ కథ కాబట్టి ఈ జానర్లో సినిమాలు చూడటానికి ఇష్టపడేవారు నిక్షేపంగా చూడొచ్చు . పైగా సాధారణంగా ఇటువంటి జానర్లో చూపించే మోతాదుని మించిన అశ్లీల సన్నివేశాలు లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సోని లివ్ లో చూడొచ్చు .

నటీనటులు : మమ్ముట్టి , వినాయకన్ తదితరులు
దర్శకత్వం : జితిన్ కే జోష్
విడుదల : 16-01-2026 ( సోని లివ్ )
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!