పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని తనదైన శైలిలో అభినయించి, ప్రేక్షకుల మెప్పు పొందిన విలక్షణ నట దిగ్గజం గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ఆయన కెరీర్ బిగినింగ్ లో ఎంతో ఆదుకున్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు
ఒక దశలో వేషాలు లేక గుమ్మడి మద్రాసు నుంచి ఇంటికి వెళ్ళిపోతానంటే వారించి ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య లో ప్రధాన పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్
ఆ తర్వాత తీసిన తోడుదొంగలు సినిమాలో తనతో సమాన ప్రాధాన్యం కలిగిన పాత్రను గుమ్మడికి ఇచ్చి ప్రోత్సహించారు.
ఇక అప్పటినుంచి నటునిగా గుమ్మడి ఎదుగుదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో వేషాలు ఆయనకు వచ్చేలా చేశారు ఎన్టీఆర్
గుంటూరులో ఎన్టీఆర్, గుమ్మడి ఏకకాలంలో చదువుకున్నప్పటికీ వారికి పరిచయం లేకపోవడం నిజంగా విచిత్రమే.
గుమ్మడి గారి కంటే రెండేళ్లముందు చిత్ర రంగంలోకి ప్రవేశించారు ఎన్టీఆర్ . గుమ్మడి పనిచేసే ప్రొడక్షన్ ఆఫీసుకు ఎదురుగా ఉండే గదిలోనే ఆయన ఉండేవారు. విజయాసంస్థలో హీరోగా పని చేస్తున్న రామారావు గారు ఎదుటిగదిలోనే ఉంటున్నారని తెలిసి తనే వెళ్లి పరిచయం చేసుకున్నారు గుమ్మడి.
అప్పటి నుండి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
చెన్నై టి.నగర్ నుంచి మౌంట్రోడ్ జంక్షన్ వరకూ వాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడిచివెళ్లి బిస్కెట్లు తిని, టీ తాగిన సందర్భాలు ఎన్నో…
చెన్నైలో తన కుటుంబం స్థిరపడేవరకూ తరచు రామారావు గారితో కలిసి భోజనం చేసేవారు గుమ్మడి. భవిష్యత్ గురించి ఇద్దరూ చర్చించుకుంటుండేవారు
ఎన్టీ రామారావు, గుమ్మడి కలిసి ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ కాంబినేషన్ గురించి చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే చిత్రం మహామంత్రి తిమ్మరుసు.
విచిత్రం ఏమిటంటే వయసులో రామారావు గారి కంటే చిన్నవాడయినా ఆయనకు తండ్రిగా, అన్నగా, మామగా ఎన్నో సినిమాల్లో నటించారు గుమ్మడి
అలాగే రాజమకుటం, వీర చిత్రాల్లో ఎన్టీఆర్ ని ఎదుర్కొనే విలన్ గా దీటైన పాత్రలు పోషించారు గుమ్మడి.
మధ్యలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఎన్టీఆర్, గుమ్మడి నాలుగైదు ఏళ్లపాటు కలిసి ఏ చిత్రంలో నటించకపోయినా తర్వాత మబ్బులు తొలగిపోయి మళ్లీ మిత్రులయ్యారు
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో వశిష్ఠుడు పాత్రను గుమ్మడితో వేయించారు ఎన్టీఆర్
తను పోషించిన పాత్రల్లో ఇదొక విశిష్టమైన వేషమని గుమ్మడి చెప్పేవారు
అలా తొలినాళ్లలో ఎన్టీఆర్ తనకు చేసిన సాయాన్ని గుమ్మడి మర్చిపోలేదు
బతికున్న రోజుల్లో అనేక వేదికలలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు !
విశ్వ టాకీస్