మొట్టమొదటిసారిగా మళయాళ నటుడు సౌబిన్ సాహిర్ నట విశ్వరూపం మమ్ముంజల్ బాయ్స్ లో చూసా
ఆ మూవీలో సొరంగంలో పడిపోయిన తన స్నేహితుడ్ని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి కాపాడతాడు
అందులో అతడి ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇతడు నటిస్తున్నాడు అని ఎక్కడా అనిపించదు
జీవించేస్తున్నాడు అనిపిస్తుంది
తర్వాత రజనీకాంత్ కూలీ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో కూడా అదే పెర్ఫార్మన్స్ చూపించాడు
అప్పుడే అనుకున్నా
ఇతగాడిలో మ్యాటర్ ఉందని
ఎప్పటికైనా మంచి క్యారక్టర్ యాక్టర్ గా మళయాళంలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ కు కూడా ఎదుగుతాడు అనిపించింది
అందువలన జీ 5 ఓటిటీ లో సౌబిన్ సాహిర్ నటించిన పాతిరాత్రి మూవీ స్ట్రీమింగ్ అవుతుందని తెలిసి ఓ లుక్కేసా
పాతిరాత్రి అంటే తెలుగులో అర్ధరాత్రి అని అర్థమట
సినిమా టైటిల్ అర్ధరాత్రి అని పెట్టాడు కాబట్టి కథకు ఆ అర్ధరాత్రి జరిగిన సంఘటనే కీలకం అన్న విషయం మనకు అర్థమైపోతుంది
అర్ధరాత్రి , చీకటి లాంటి టైటిల్స్ చూసినప్పుడు దయ్యం సినిమానేమో అన్న అనుమానం వస్తుంది
నేను కూడా అలాగే అనుకున్నా
కానీ డిస్క్రిప్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ అని త్యాగడంతో దీని సంగతేంటో చూద్దామని పాతిరాత్రిలోకి వెళ్ళా
అందులో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మళయాళం వారు సినిమాలు బాగా తీస్తారని మార్కెట్లో ఓ పేరు కూడా ఉంది కదా
మరి ఈ మళయాళం సినిమా కూడా ఆ కోవలోనే ఉందా ? లేదా ?
అలాగే సౌబిన్ సాహిర్ తన గత సినిమాల్లాగే ఇందులో కూడా మెప్పించాడో ? లేదో చూద్దాం
కధేంటంటే ?
కథ మొత్తం ఓ అర్ధరాత్రి జరిగిన సంఘటన చుట్టూనే తిరుగుతుంది
టైటిల్ పాతిరాత్రి అని పెట్టారుగా
అందువలన సినిమా బిగినింగే అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ తో మొదలౌతుంది
ఆ కుర్రాళ్లలో ఒకడు యూరినల్స్ కి వెళ్ళినప్పుడు చీకట్లో దయ్యం లాంటి ఆకారం కనిపిస్తుంది
దాంతో ఆ కుర్రాడు షాక్ అవుతాడు
మూవీలో అసలు కథకు ఈ సంఘటనే మూలం
కట్ చేస్తే ,
కేరళలో ఓ పోలీస్ స్టేషన్లో ఎస్సై జాన్సీ (నవ్య నాయర్ ) పనిచేస్తూ ఉంటుంది
అదే స్టేషన్లో కానిస్టేబుల్ గా హరీష్ ( సౌబిన్ సాహిర్ ) పనిచేస్తూ ఉంటాడు
అయితే ఇద్దరూ పనిచేసేది ఒకే స్టేషన్లో అయినప్పటికీ వృత్తిపరమైన ఈగోల వల్ల ఒకరంటే మరొకరికి పడదు
అయినా కలిసి పని చేస్తూ ఉంటారు
ఈ పరిస్థితుల్లో ఓ రాత్రి ఈ ఇద్దరూ జీపులో నైట్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన దట్టమైన చెట్లమధ్య చీకట్లో ఓ కారు కనిపిస్తుంది
దాంతో అక్కడేదో జరుగుతుందని అనుమానం వచ్చి కానిస్టేబుల్ హరీష్ కారు దగ్గరికి వెళ్తాడు
సరిగ్గా అదే సమయంలో అక్కడ అకస్మాత్తుగా వీరు ఊహించని సంఘటన జరుగుతుంది
ఆ సంఘటనే కథకు మూలం
ఆ సంఘటన తో వారి వృత్తి జీవితాలు సస్పెన్షన్ లో పడతాయి
ఇంతకీ అక్కడేం జరుగుతుంది ?
ఆ సంఘటనకూ , వీరి ఉద్యోగాలకు సంబంధం ఏంటి ?
తమకు తెలియకుండానే అనుకోని నేరంలో ఇరుక్కున్న ఎస్సై జాన్సీ , కానిస్టేబుల్ హరీష్ లు ఈ కేసునుంచి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
ఎలా ఉంది ?
ముందే చెప్పినట్టు సినిమా ప్రారంభమే దయ్యం స్టోరీ అనుకునేలా సన్నివేశం ఉంటుంది
కానీ కాసేపు చూస్తే కానీ ఇది దయ్యం స్టోరీ కాదు క్రైమ్ స్టోరీ అని అర్ధమౌతుంది
దానికి తోడు మొదట్లో కథ నెమ్మదిగా సాగుతుంది
ఎస్సై జాన్సీ అండ్ కానిస్టేబుల్ హరీష్ లు పెట్రోలింగ్ కి వెళ్ళినప్పుడు కానీ అసలు కథ మొదలవ్వదు
హరీష్ కు , అతడి భార్యకు పడకపోవడం , విడాకులకు అప్లై చేయడం
అలాగే ఎస్సై జాన్సీ భర్తకు మానసికంగా సరిగా లేకపోవడం వంటి సన్నివేశాలు స్టోరీ సాగతీతకు పనికొస్తాయి కానీ కథకు పెద్దగా అవసరం లేదు
బహుశా ఈ ఇద్దరి వృత్తిపరమైన జీవితాలను చూపిస్తూనే వారి వ్యక్తిగత జీవితాలను కూడా చూపించాలని దర్శకుల వారి ఆలోచనేమో ?
ఇక ఎప్పుడైతే డిఎస్పీ సురేష్ కుమార్ ఈ ఇద్దర్నీ సస్పెండ్ చేస్తాడో ? అప్పుడే అతడు విలనని ఎవరికైనా అర్థమైపోతుంది
సాధారణంగా మళయాళం సినిమాల్లో అసలు విలన్ ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ లో ఉంచి క్లైమాక్సులో రివీల్ చేస్తారు
మరీ కూతురి కోసం హత్య చేస్తే ఇంకో దృశ్యం మూవీ అవుతుందనుకున్నారో ఏమో క్లైమాక్సులో అసలు హంతకులు ఎవరనేది రివీల్ చేసారు
అన్నిటికన్నా అస్సలు అర్ధం కాని విషయం అర్ధరాత్రి మాములు ఆడపిల్లను చూసి ఆ కుర్రాడు దయ్యమని భావించి అంతలా ఎందుకు ఝడుసుకున్నాడో మరి ?
సాధారణంగా ఏ కేసునైనా పోలీసులు దర్యాప్తు చేస్తారు
కానీ ఇందులో సస్పెండైన పోలీసులే కేసును దర్యాప్తు చేసి అసలు నేరస్తులను కనుక్కుంటారు
బహుశా నేరం వారి మీద మోపబడింది కాబట్టి అనుకోవాలి
అయితే దర్యాప్తులో పోలీసుల పాత్రను కూడా మరింత పవర్ఫుల్ గా చూపించి ఉండాల్సింది
ఈ సినిమాకి పెద్ద ఖర్చు కూడా అయ్యుండదు
కథ మొత్తం ఎసై జాన్సీ , కానిస్టేబుల్ హరీష్ ల చుట్టూనే తిరుగుతుంది
ఎక్కువ భాగం పోలీస్ స్టేషన్ సెట్టింగులోనే నడిపించేసారు
కథ కోసం ఎంచుకున్న పాయింట్ కూడా కొత్తదేమీ కాదు
గతంలో చాలా సినిమాల్లో చూసిందే
ప్రేక్షకుడు ఎగ్జైట్ అయ్యే విధంగా ఇదే కథను దర్శకుడు స్క్రీన్ ప్లే లో మలిచి ఉంటే బావుండేది
అయినప్పటికీ ఎందుచేతనో ఈ మూవీ మళయాళంలో మంచి టాక్ తెచ్చుకుందట ?
ఎవరెలా చేసారు ?
ఇందులో రెండే రెండు పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి
వారిలో కానిస్టేబుల్ పాత్ర పోషించిన సౌబిన్ సాహిర్ ఒకరు కాగా , ఎస్సై జాన్సీ పాత్ర పోషించిన నవ్యా నాయర్ మరొకరు
వీరిలో సౌబిన్ నటన గురించి వంక పెట్టాల్సింది ఏమీ లేదు
ఎప్పటిలానే బాగా చేసాడు
ఇంకా చెప్పాలంటే దర్శకురాలు అతడిలోని నటనను పూర్తిగా రాబట్టుకోలేకపోయింది
నవ్యా నాయర్ కూడా పాత్ర పరిధిలో నటించి మెప్పించారు
మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో పురు వంటి వైవిధ్యమైన సినిమా తీసిన మహిళా దర్శకురాలు రతీనా ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడంతో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి
కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ ఆ అంచనాలు అందుకోలేదేమో అనిపిస్తుంది
సాంకేతికత
ఇలాంటి సినిమాలకు సాంకేతికత గురించి చెప్పుకోవాలంటే బీజీఎమ్ , సినిమాటోగ్రఫీ ప్రాధాన్యత వహిస్తాయి
ఆ పరంగా బీజీఎమ్ బాగానే ఉంది
చీకట్లో దృశ్యాలను చిత్రీకరించాలంటే విజువల్స్ బాగుండాలి
అడవిలో దృశ్యాలను నేటివిటీ చెడకుండా బాగానే చూపించారు
విశ్లేషణ :
ఇటీవల మళయాళంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ మూవీలతో పోలిస్తే పాతిరాత్రి యావరేజ్ మాత్రమే అనిపిస్తుంది . అదేమీ పట్టించుకోకుండా రెండు గంటలపాటు ఇంట్లోనే ఓటిటీ లో ఓ క్రైమ్ స్టోరీ చూద్దామనుకునేవారికి ఈ మూవీ నిరాశపరచదు. కాకపోతే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మళయాళం ఆడియోలోనే చూడాలి
నటీనటులు : సౌబిన్ సాహిర్ , నవ్యా నాయర్ తదితరులు
దర్శకత్వం : రతీనా పిటి
విడుదల : 20-2-2026 ( జీ 5 ఓటిటీ )
రేటింగ్ : 2.5 / 5
