ఈ సినిమా చాలామంది చూసే ఉంటారు .. అలాగే కొంతమంది చూసి ఉండకపోవచ్చు కూడా.. అలా ఈ రోజుకీ ఈ మూవీ చూడని వారికోసం ఈ రివ్యూ . సమయం లేకనో , పబ్లిసిటీ లేకనో , మన దృష్టికి రాకనో కొన్ని మంచి సినిమాలను మిస్ అవుతూ ఉంటాం . ఓటిటీ ప్లాట్ ఫార్మ్ వచ్చిన తర్వాత అన్ని భాషల్లో కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి పడుతున్నాయి .
వీటిలో కొన్ని థియేటర్లలో రిలీజ్ కాగా మరికొన్ని నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అయినవి ఉన్నాయి . సాధారణంగా ఓటీటీల్లో చూసే ప్రేక్షకులు మాతృ భాషలో సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తారు . మరీ బాగుందని టాక్ వస్తే ఇతర భాషల్లో కూడా చూస్తారు .
ఇటీవల కాలంలో ఆ ఇతర భాషా మూవీల్లో మళయాళం సినిమాలు ఆదరణ పొందుతున్నాయి . అలా తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలై మంచి రేటింగ్ సాధించిన సినిమానే ఈ ఆండ్రాయిడ్ కట్టప్ప .
2020 లోనే ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 పేరుతో వచ్చిన ఈ మళయాళం మూవీ కేరళలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది . తర్వాత మళయాళం వెర్షన్ ప్రైమ్ ఓటిటీ లో కూడా రిలీజ్ చేసారు . ఇదే సినిమాని ఆండ్రాయిడ్ కట్టప్ప వెర్షన్ 5.25 పేరుతో తెలుగులో కూడా డబ్ చేసి ఆహా ఓటిటీ లో రిలీజ్ చేసారు .
డిజిటల్ ప్రపంచం వచ్చాక మానవ సంబంధాలు కూడా యాంత్రికం అయిపోతున్నాయనేది వాస్తవం.. మనుషులు మాట్లాడుకోవడం మానేసి చాట్ చేయడం మొదలుపెడుతున్న రోజులు వచ్చేసాయి . భవిష్యత్తు అంతా Ai దేనని , మానవ వనరుల స్థానంలో రోబోలు ప్రాముఖ్యం వహిస్తాయని ఐటి ఎనలిస్టులు ఇప్పుడు చెప్తున్నారు .
కానీ ఆరేళ్ళ క్రితమే ఈ దర్శకుడు ఇలాంటి పరిణామాలను ఊహించినట్టున్నాడు . రోబోలతో మనుషులు కనెక్ట్ అయితే మానవాళి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది సింపుల్గా సినిమా భాషలో చెప్పారు .
ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చెప్తే కంప్యూటర్ పరిజ్ఙానం లేని సామాన్యులకు అంతగా ఎక్కకపోవచ్చు . కానీ అదే విషయాన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చెప్తే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది . ఆండ్రాయిడ్ కుంజప్పలో దర్శకుడు చేసిన ప్రయోగం అదే .
ఇంతకీ ఈ ఆండ్రాయిడ్ కధేంటి ?
సినిమా ప్రారంభమే ఓ వృద్ధుడు తన రోబోకి కాఫీ ఆర్డర్ చేస్తాడు . రోబో కాఫీ ప్రిపేర్ చేసి ట్రే లో పెట్టుకుని ఆ వృద్ధుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి కప్ చేతికి అందిస్తుంది . ఇంతవరకు బాగానే ఉంది.. రోబో మెషిన్ మాదిరి కమాండ్ మేరకు పనిచేస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు . కానీ అదే కమాండ్ ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎదురయ్యేది దుష్ఫలితాలే.. ఈ సన్నివేశంలో జరిగింది అదే .
కాఫీ బాగాలేదని ఆ వృద్దుడికి కోపం వచ్చి కప్పుని విసిరి రోబో ముఖాన కొడతాడు . దాంతో రోబోకి కూడా కోపం వచ్చి ఆ వృద్దుడ్ని గొంతు పిసికి చంపుతుంది . ఈ ఒక్క సన్నివేశంతోనే రోబోలతో మానవాళికి కలిగే లాభాలు , ఎదురయ్యే దుష్ఫలితాలు దర్శకుడు క్లియర్ గా చెప్పాడు .
దానికి కొనసాగింపుగా మనల్ని కథలోకి తీసుకెళ్తాడు .
కేరళలోని ఓ పల్లెటూరులో భాస్కరన్ (సూరజ్ వెంజరమూడ్) అనే చాదస్తపు వృద్ధుడు తన కొడుకు సుబ్రహ్మణ్యం తో ( సౌబిన్ సాహిర్ ) కలిసి నివసిస్తూ ఉంటాడు . ఈ భాస్కరన్ కి అసలే చాదస్తం ఎక్కువ.. పైగా పాత కాలం మనిషి. ఇంట్లో మిక్సీలు , గ్రైండర్లు , స్మార్ట్ ఫోనులు లాంటివి ఏవీ వాడటం రాదు .
ఇతడి కొడుకు సుబ్రహ్మణ్యం మాత్రం నేటి తరం మనిషి.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు . కానీ తండ్రి చాదస్తం వల్ల అతడు ఏ ఉద్యోగంలోనూ సెటిల్ కాలేకపోతాడు . కొడుకు ఎక్కడ ఉద్యోగంలో చేరినా ఏదో కారణాలు చెప్పి తనవద్దకు పిలిపించుకుంటూ ఉంటాడు .
కొడుక్కేమో మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో సెటిల్ అవ్వాలని కోరిక .. కానీ తండ్రి ఆరోగ్యం దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతాడు . అప్పటికీ తండ్రి కోసం సహాయకులుగా నర్సులను , వంట మనుషులను కూడా పెడతాడు . కానీ భాస్కరన్ చాదస్తానికి జడిసి వాళ్ళు పని మానేసి వెళ్ళిపోతారు .
ఇదే సమయంలో కొడుక్కి రష్యాలో రోబోలు తయారుచేసే కంపెనీలో ఉద్యోగం వస్తుంది . విదేశాలకు వెళ్లినా తండ్రి క్షేమం గురించిన ఆలోచనలతో అతడు ఒక ఆలోచన చేస్తాడు . అదే ఆండ్రాయిడ్ కుంజప్పన్ . పల్లెటూరిలో చేదోడువాదోడుగా ఉంటూ సాయం చేసేందుకు ఓ రోబోని తయారుచేసి తండ్రికి అప్పచెప్పి సుబ్రహ్మణ్యం తిరిగి రష్యా వెళ్ళిపోతాడు .
మొదట్లో రోబో రాకను వ్యతిరేకించిన భాస్కరన్ క్రమక్రమంగా దానితో ఎలా కనెక్ట్ అవుతాడు ? రోబో రాక తండ్రీ , కొడుకుల సంబంధాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది ? ఆ పల్లెటూరిలో రోబో రాకతో ఎలాంటి పరిణామాలు సంభవించాయి ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది .
ఎలా ఉంది ?
ఆండ్రాయిడ్ కుంజప్పన్ అంటే ఇదేదో కంప్యూటర్ లాంగ్వేజ్ మీద తీసిన సినిమా అనుకునేరు.. అదేమీ కాదు .
మానవ సంబంధాల మీద టెక్నాలజీ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ? హ్యూమన్ రిలేషన్స్ ని రోబోలు భర్తీ చేయగలవా ? ఇప్పటికే యాంత్రిక జీవనం అనుభవిస్తున్న మానవాళికి రోబోల రాక మంచి చేస్తుందా ? కీడు చేస్తుందా ? లాంటి రకరకాల ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు దొరుకుతాయి .
తండ్రీ , కొడుకుల మధ్య అనుబంధాన్ని సున్నితంగా చూపిస్తూనే మరో కోణం కూడా ఆవిష్కరించారు . కొడుకు చెయ్యాల్సిన పని రోబో చేస్తుందా ? రోబో చేస్తున్న పనులను కొడుకు చేయగలడా ? అని ఒక సన్నివేశంలో ఆలోచన రేకెత్తిస్తారు .
వృద్దాప్యంలో ఒంటరితనంతో బాధపడే వారు తమకు ఏదైనా ఆసరా దొరుకుతుందేమో అని తపన పడే సన్నివేశాలను హృద్యంగా చూపించారు . నిజంగా ఒక్కోసారి భాష్కరానికి కుంజప్పన్ ( రోబో ) చేస్తున్న సేవలు చూస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్క వృద్ధులకూ ఇటువంటి రోబోలు అవసరమేమో అనిపిస్తుంది .
టెక్నాలజీ అసలేమాత్రం తెలియని భాస్కరన్ లాంటి చాదస్తుడు కూడా రోబో సాయంతో చిన్న చిన్న సాంకేతిక విషయాలను తెలుసుకోవడమే కాకుండా ఆఖరికి ఆ రోబోతో ఎంతలా కనెక్ట్ అవుతాడంటే కుంజప్పన్ ను తన కొడుకులా భావించుకుంటాడు .
కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మూవీలో నిజమైన తండ్రీ కొడుకులు భాస్కరన్ , సుబ్రమణ్యాలా ? లేకపోతే భాస్కరన్ , కుంజప్పన్ లా ( రోబో ) అనిపిస్తుంది . కొడుకు స్థానంలో భాస్కరన్ రోబోతో కనెక్ట్ అవడం హృద్యంగా చూపించారు .
అలా అని కొడుకేమీ తండ్రిని గాలికి వదిలేసిన దుర్మార్గుడు కాదు.. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి అనుబంధం ఉంటుంది. ఉద్యోగ రీత్యా కొడుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో భాస్కరన్ కూడా కొడుకును ఇబ్బంది పెట్టకుండా రోబోతో కనెక్ట్ అయ్యాడా అనిపిస్తుంది .
అలా అని కుంజప్పన్ సీరియస్ సినిమా కాదు.. హాయిగా నవ్వుకోవడానికి సన్నివేశాలు ఉంటాయి.. క్లైమాక్స్ సన్నివేశం మాత్రం ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుంది .
ఎవరెలా చేసారు ?
ఎవరెలా చేసారంటే ఇద్దరి గురించే చెప్పుకోవాలి .. ఎందుకంటే ఈ సినిమా మొత్తం తండ్రీ ,కొడుకుల చుట్టూనే నడుస్తుంది .
మధ్యలో రోబో కూడా ఉంది కానీ ముందుగా చెప్పుకోవాల్సింది భాస్కరన్ గా నటించిన సూరజ్ వెంజరమూడ్ అండ్ సుబ్రహ్మణ్యం గా నటించిన సౌబిన్ సాహిర్ ల నటన గురించే చెప్పుకోవాలి
ఈ సినిమా కోసం ఇద్దరూ పోటీ పడి నటించారు
ఇద్దరిలో ఏ ఒక్కరికీ తక్కువ మార్కులు వేయలేము.
వృద్ధ తండ్రిగా బాడీ లాంగ్వేజ్ లో కానీ , డైలాగ్ డెలివరీలో కానీ , ఎక్స్ప్రెషన్స్ లో కానీ సూరజ్ నూరు శాతం పాత్రకు న్యాయం చేసాడు . అలాగే వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తండ్రికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని పరితపించే కొడుకుగా , మరోపక్క కెరీర్ కోసం తపనపడే యువకుడిగా సౌబిన్ సాహిర్ అత్యుత్తమ నటన ప్రదర్శించాడు .
సాంకేతికత :
బిజుబల్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది .
కేరళ ప్రకృతి అందాలను , భాస్కరన్ ఉంటున్న పల్లె పరిసరాలను , వర్షం సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ అందంగా తెరకెక్కించారు.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
యాంత్రిక జీవనంలో మానవ సంబంధాలపై రోబోల ప్రభావం గురించి దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింటును ఎమోషనల్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు.
విశ్లేషణ
ఓ పల్లెటూరు , ఓ చాదస్తపు తండ్రి , కెరీర్ కోసం ఆ తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్లలేక మధనపడే కొడుకు , వీళ్ళ జీవితాల్లోకి రోబో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనతో తీసిన సినిమా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది . ఉన్న ఊరిని వదిలి రాలేక ఒంటరి వృద్దులు పడే ఇబ్బందులు ,అలాగే అమ్మానాన్నలను విడిచి వెళ్లలేక తప్పనిసరై కెరీర్ కోసం అమెరికా వెళ్లి సెటిలైపోయిన కొడుకులను , కూతుళ్లను ఇప్పటికీ నిజ జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం . ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే తమ జీవితాన్నే పోలి ఉందని కొందరైనా అనుకుంటారు . మూవీలో ఎక్కడా అసభ్యతా , అశ్లీల సన్నివేశాలు లేవు కాబట్టి ఇంట్లోనే హాయిగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు
నటీనటులు : సూరజ్ వెంజమూడ్ , సౌబిన్ సాహిర్
దర్శకత్వం : రతీష్
విడుదల : ప్రైమ్ అండ్ ఆహా ఓటిటీ
రేటింగ్ : 3 / 5
