కళ్ళు లేకపోయినా తనలో ఉన్న కళతోటి కన్నతల్లి సొంతింటి కల నెరవేర్చబోతున్న పలాస సింగర్ రాజు .. చనిపోయేలోపు చిరంజీవిని కలిసి ఆయన సినిమాలో పాట పాడాలని ఉంది !

Spread the love

కొందరు మనుషులు
వారిలో లోపాలు వెతుక్కుని
కుమిలిపోతారు

కానీ.. మరి కొందరు మనుషులు
తమలో లోపమనేదే లేదని
వారి కళతో ఈ సమాజానికి
కొత్త ప్రపంచాన్ని చూపుతారు..

అలాంటి మాణిక్యాల్లో
పలాస సింగర్ రాజు కూడా ఒకరు

ఆయన గొంతు కోటి రాగాలు పలికే
సన్నాయి అయితే
ఆయన శరీరం మాత్రం
ఓ అరుదైన వాయిద్య పరికరం

తెల్లారితే కోయిలతో
పోటీపడి పాడడం
పొద్దుగూకితే తన పాటలతో
పల్లెకి జోలపాడడం

ఇలా పాటలే జీవితం
పాటలే జీవన ప్రయాణానికి మార్గం
అని భావించే నిస్వార్థ జీవి

ఈ రోజు తన గొంతు
పల్లె నుంచి పట్నం వరకు
ప్రతి ఒక్కరికి వినిపించాడు..

బస్సులో సరదాగా పాడిన పాత వైరల్ అయి TSRTC ఎండీ సజ్జన్నార్ గారు
రాజుని తన ఇంటికి పిలిపించుకుని పాట పాడించుకుని ప్రోత్సహించే దాకా వెళ్ళింది

అంతేకాదు రాజుకి ఏ అవసరం వచ్చినా నేరుగా తనను కలవొచ్చని హామీ ఇచ్చి
రాజు పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు

దానితో రాజు జీవితం మారిపోయింది
యూ ట్యూబర్లు రాజు ఇంటికి క్యూ కట్టారు

సినీ డాన్స్ మాస్టర్ జాకీ రాజు పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో
సంగీత దర్శకుడు రఘు కుంచె దృష్టిలో పడ్డాడు

దానితో ఆయన సింగర్ రాజుకి తన పలాస 1978 లో టైటిల్ సాంగ్ పాడించారు
ఆ పాట సూపర్ హిట్ అయ్యింది

పుట్టుకతో అంధుడైన రాజు ఉండేది శంషాబాద్ మండలంలోని ఓ కుగ్రామం
తండ్రి రైతు కూలీ

2016 లో తండ్రి మరణించడంతో తల్లికి రాజే జీవనాధారం అయ్యాడు

కానీ అంధుడైన కొడుకుతో జీవితం ఎలా నెట్టుకురావాలా అని ఆమె భయపడేది

ఇల్లు చూస్తే నాలుగు మట్టి గోడలు పైన గాలికి ఎగిరిపోయే పెంకులు మినహా మరేమీ లేదు
వర్షం వస్తే ఎప్పుడు కూలిపోతుందో తెలీదు

ఇంటి కోసం ప్రభుత్వ సాయం కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగింది
కానీ ఫలితం లేకపోయింది

మరోపక్క కొడుకు చూస్తే ఇవేమీ పట్టకుండా
ఎప్పుడూ ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉండేవాడు

ఈ పాటల పిచ్చి వల్ల సాధించేది ఏముంటుంది అని ఆమె బాధ పడేది

దీనికి తోడు ఒకసారి రాజు తాను ఎస్పీ బాలు ను కలవాలని
అనుకుంటున్నట్టు చెప్పడంతో ఊళ్ళోవాళ్ళందరూ రాజుని పిచ్చొడ్ని చూసినట్టు చూసారు

అయినా రాజు సంకల్పం గట్టిది

నిరుత్సాహపడకుండా తల్లి సాయంతో పాడుతా తీయగా ప్రోగ్రాం కు వెళ్లి బాలుని కలిసాడు
రాజు పాట విని ఎస్పీ బాలు కూడా మెచ్చుకున్నాడు కానీ ఆ ప్రోగ్రాంలో రాజుకి అవకాశం రాలేదు

అయినా రాజు నిరుత్సాహపడలేదు
పాటలు పాడటం మానలేదు

ఏనాటికైనా గొప్ప సింగర్ కావాలనేది తన లక్ష్యమని ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాడు

చనిపోయేలోపు చిరంజీవి గారిని కలిసి ఆయన సినిమాలో
ఒక పాట పాడాలనేది తన కోరిక అని చెప్పాడు

చిన్న చిన్నసమస్యలకే జీవితాలను అంతం చేసుకుంటున్న మనుషులున్న రోజుల్లో
కళ్ళు లేకపోయినా ఒక అంధుడు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నమాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు

ఇదిలా ఉండగా తమ మట్టి ఇల్లు కూలిపోయేలోపు మంచి ఇల్లు కట్టుకోవాలని రాజు తల్లి కోరిక

ఎన్నో అభినందనలు
ఎన్నో సత్కారాలు అందుకున్న రాజు
చివరికి తన తల్లి కల నెరవేర్చబోతున్నాడు

పొద్దస్తమానం ఇంట్లో పాటలు పాడుకుంటూ కూర్చుంటాడని విసుక్కున్న తల్లికి
అదే పాటతో సంపాదించి చక్కటి ఇంటిని బహుమతిగా ఇవ్వబోతున్నాడు

కళ్ళు లేకపోయినా తనలో ఉన్నకళతోటి కన్నతల్లికి
ఒక మంచి ఇల్లు కట్టించబోతున్నాడు..

మనలో ఏదో లోపం ఉందని
భావించే ప్రతి ఒక్కరు
రాజు ని ఆదర్శంగా తీసుకుంటే
ఇక ఏ భయమూ లక్ష్యానికి అడ్డు రాదు

Anchor Sai


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!