Home » సరైన టైటిల్ పెట్టడంలోనే తప్పటడుగు పడింది ..ఇంక సినిమా సంగతి ఎలా ఉంటుంది ?- పరాశక్తి మూవీ రివ్యూ

సరైన టైటిల్ పెట్టడంలోనే తప్పటడుగు పడింది ..ఇంక సినిమా సంగతి ఎలా ఉంటుంది ?- పరాశక్తి మూవీ రివ్యూ

Spread the love

ఏ మూవీ విజయానికైనా టైటిల్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది

ఆడియన్సుని థియేటర్లకు రప్పించాలంటే మూవీ టైటిల్ కూడా అట్రాక్టీవ్ గా ఉండాలి

దానికి తోడు మూవీ పోస్టర్ డిజైన్ కూడా సినిమా కథను రిఫ్లెక్ట్ చేసేదిగా ఉండాలి

అంతేకానీ సినిమాకి సంబంధం లేని టైటిల్ పెడితే మొదట్లోనే దెబ్బ కొడుతోంది

ఫ్యామిలీ సినిమా అనిచెప్పి అర్ధరాత్రి అడవిలో ఆడ దయ్యం అనే టైటిల్ పెడితే ఇదేదో హర్రర్ మూవీ అనుకుంటారు

టైటిల్ని నమ్ముకుని థియేటర్లకు వెళ్లిన ఫ్యామిలీ ఆడియన్స్ హర్ట్ అయి దర్శకుడి కోసం అడవుల్లో గాలిస్తారు

అలా ఈ తమిళ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు

 అరుంధతి , ఆది పరాశక్తి ,అమ్మోరు  ఇత్యాది టైటిల్స్ తో తీసిన దైవానికి , దుష్ట శక్తుల మధ్య జరిగిన పోరాట కధలను ఇప్పటికే మనం చాలా మూవీల్లో చూసేసాం

గబుక్కున ఈ టైటిల్ చూసి ఈ మూవీకూడా ఆ కోవలోనిదేనేమో అన్న అనుమానం వచ్చింది

కానీ పోస్టర్ చూస్తే ఇదేదో  సాంఘిక స్టోరీ ఫ్లాష్ బ్యాక్  అని అర్థమైంది

సరే ఏదైతే అదయ్యిందిలే ఓటిటీ లోకి వచ్చింది కాబట్టి ఓ లుక్కేస్తే పోలా అని లుక్కడం జరిగింది

అయితే ఈ లుక్ వేయడం వెనుక ఇంకో ప్రధాన కారణం కూడా ఉంది

ఒక్కోసారి ఒక్కో నటుడి ఒక్కో సినిమా చూసి అనుకోకుండా మనం కనెక్ట్ అయిపోతాం

అలాగే శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ చూసి ఈ అరవ హీరోకి  బాగా కనెక్ట్ కావడం జరిగింది 

అమరన్ మూవీలో శివ కార్తికేయన్ పెర్ఫార్మన్స్ మైండ్ బ్లోయింగ్

ఇతను నిజంగా ఆర్మీలో పనిచేసాడా అనిపించింది

అంత సహజంగా , అంత డిసిప్లీన్డ్ గా నటించాడు

సినిమాలో మనకు ఎక్కడా శివ కార్తికేయన్ కనిపించడు

యుద్ధ రంగంలో కదం తొక్కుతున్న ఆర్మీ మేజర్ మాత్రమే కనిపిస్తాడు

మూవీ కోసం అతడు ఆర్మీ అధికారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాడా అనిపించింది

వాడుకోవాలే కానీ ఇతడిలో చక్కటి నటుడు ఉన్నాడు

కానీ పరాశక్తి చూసిన తర్వాత ఇతడ్ని సరిగా వాడుకోలేకపోయారని అర్థమైంది

ఇప్పుడు పరాశక్తి కధేంటో చూద్దాం

ఈ మూవీలో కథను 1950 – 60   ల నాడు తమిళనాడులో  జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నారు

అప్పట్లో దేశ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం హిందీ పత్రికలలోనే  ప్రకటనలు ఇచ్చేవారు

ఈ ప్రకటనలు కేవలం హిందీలోనే వెలువడుతుండటంతో అసంతృప్తికి గురైన తమిళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు

నిజానికి ఇది కథ కాదు

తమిళనాడులో నిజంగా జరిగిన సంఘటనలే

అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు  చేసారు

ఈ ఉద్యమంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు

ఒకరకంగా చెప్పుకోవాలంటే ఇది గతాన్ని తవ్వుకోవడమే

సరే మళ్ళీ మూవీ విషయానికి వస్తే ,

ఈ ఆందోళనలలో భాగంగా చెల్లయ్యన్ ( శివకార్తికేయన్ ) ఆధ్వర్యంలో కొంతమంది ఓ రైలుకి నిప్పు కూడా పెడతారు

కొన్నాళ్ళకు చెల్లయ్యన్ కూడా రైల్వేలోనే ఉద్యోగంలో చేరతాడు

రైలు ఇంజిన్ లో బొగ్గు వేసే పనిలో కుదురుకుంటాడు

ఈ క్రమంలో అతడు రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం వస్తుంది

ఆ ఉద్యమంలో చెల్లయ్యన్ తమ్ముడు చిన్న దురై ( అధర్వ మురళి ) చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు

మధ్యలో ఉద్యమాన్ని అణచివేయడానికి తిరునాథన్ ( రవి మోహన్ ) అనే పోలీస్ అధికారి ప్రయత్నిస్తూ ఉంటాడు

అయితే అనుకోకుండా  ఉద్యమం పట్ల చెల్లయ్యన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు

తమ్ముడ్ని కూడా ఉద్యమంలో పాల్గొనవద్దని చెప్తాడు

అకస్మాత్తుగా చెల్లయ్యన్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంటాడు ?

తమ్ముడ్ని ఉద్యమంలోకి వెళ్ళొద్దని ఎందుకు కోరతాడు ?

ఉద్యమ కాలంలో చెల్లయ్యన్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి ?  అనేవి మిగిలిన కథనంలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

సినిమా చూసిన తర్వాత  అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయించడం ఎందుకు అనిపించింది కానీ ఈ మూవీ విడుదల సమయంలో తమిళనాడులో జరిగిన నిరసనలు గమనించిన తర్వాత మూవీ తీయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు కూడా ఉన్నాయని అనిపించింది

దానికి తోడు ప్రముఖ సినీ నటుడు , రాజ్యసభ సభ్యుడు కమలహాసన్ కూడా తన అఫీషియల్ ఎంపీ లెటర్ హెడ్ మీద పరాశక్తి రివ్యూ రాసి విడుదల చేయడంలో ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని అర్థమైంది

కమల్ మాములుగా మూవీని అప్రిషియేట్  చేస్తూ ట్వీట్ పెట్టుంటే రొటీన్ అయ్యేది

కానీ ఆయన ఈ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ  రాజకీయ కోణంలో హైలెట్ చేయడంతో అసలు ఉద్దేశ్యాలు అర్థమయ్యాయి

కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ ను రాజకీయకంగా దెబ్బ కొట్టడానికి మండలాధీశుడు సినిమా తీసినట్టు పరాశక్తి మూవీ కూడా ఎవరి మీదనో వదిలిన బాణం అని తెలిసిపోతుంది

ఎందుకంటే కమల్ సైతం ఈ మూవీని డీఎంకే కూటమి విజయంగా అభివర్ణించడంతో ఇందులోని పొలిటికల్ యాస్పెక్ట్ బయటపడిపోయింది

నిజానికి ఇటీవల కాలంలో కూడా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దేశమంతటా హిందీ భాషను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే

ఈ ప్రయత్నాన్ని అందరికన్నా ముందుగా తమిళనాడులో డీఎంకే పార్టీ వ్యతిరేకించింది

నిరసనలు , ఆందోళనల ద్వారా తమ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది

ఈ నేపథ్యంలో హిందీ భాషకు వ్యతిరేకంగా నాటి సంఘటనలను తవ్వుతూ పరాశక్తి మూవీ తీయడానికి ఏర్పాట్లు జరిగాయి

స్టోరీ వినగానే అసలు విషయం పసిగట్టాడేమో  దుల్కర్ సల్మాన్ ఈ మూవీకి సైన్ చేయడానికి రిజెక్ట్ చేసాడు

అలా ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేసిన కధే శివకార్తికేయన్ దగ్గరికి వచ్చి ఓకే అయ్యింది

ఈ సినిమాకి చక్కటి నటుడు శివ ఎలా ఓకే చేసాడో కానీ విడుదల కాకముందే వివాదాల్లో చిక్కుకుంది

సెన్సార్ నిబంధనలతో ఆలస్యం అయిన సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి తమిళనాడులో థియేటర్లలో రిలీజ్ అయ్యింది

ఏపీలో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ సంక్రాంతికి నాలుగైదు తెలుగు సినిమాలు ఉండటంతో వాయిదా పడింది

అయినా కథామూలాలు తమిళులకు సంబంధించింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సినిమా పట్ల పెద్ద ఇంట్రెస్ట్ రాదు అనుకున్నారేమో ఏమిటో తెలుగు వారిని కూడా కథలో ఇరికించే ప్రయత్నాలు చేసారు కానీ మూవీలో మనకు తమిళ నేటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది 

సరే ఎలాగైతేనేమి చివరికి నిన్న జీ 5 ఓటిటీ లో నేరుగా తెలుగులో కూడా రిలీజ్ చేసారు

ఊహించినట్టుగానే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు

దీనంతటికీ మూలం కథనంలో పట్టు లేకపోవడమే

కేవలం హిందీ భాషకు వ్యతిరేకంగా గతంలో జరిగిన ఉద్యమాల ఆధారంగా కథ రాసుకోవడంతో మూవీ మొత్తం తిప్పి తిప్పి ఆ ఒక్క పాయింటునే హైలెట్ చేద్దామనుకున్నారు కానీ అది కూడా సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారు

ఉద్యమ కారణాలు , ఉద్యమ తీరును ప్రభావంతంగా తెరకెక్కించలేకపోయారు

ఉద్యమ కథలో ఇరికించిన లవ్ స్టోరీ అతకలేదు

ఆ పోలీసాయనకు ఉద్యమం అంటే అంత వ్యతిరేకత ఎందుకో అనేది సరైన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

 హిందీ భాషకు వ్యతిరేకంగా అన్నదమ్ములు చేసిన పోరాటంలో భావోద్వేగ సన్నివేశాలు , ఎమోషనల్ టచ్ సన్నివేశాలు వీక్ గా ఉన్నాయి  

ఎవరెలా చేసారు ? 

ఈ మూవీకి అంతోఇంతో బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే శివకార్తికేయన్ వల్లనే

పైపెచ్చు తమిళనాడులో ఇతడి నటనను అగ్ర నటులు సైతం ప్రశంసలు కురిపించారు కాబట్టి అందులో ఎటువంటి మైనస్ లేదు

షరామామూలుగా శివకార్తికేయన్ నటన బాగుంది

కానీ ఎంత అతడి నటన బాగుంటే మాత్రం కథనంలో దమ్ము లేకపోతే ఎవరేం చేయగలరు ?

ఇతడి తరువాత తిరునాథన్ అనే పోలీస్ అధికారి పాత్రలో నటించిన రవి మోహన్ నటన బావుంది

పోలీస్ అధికారి అయినా నెగిటివ్ షేడ్ కు ప్రాధాన్యత ఉండటంతో రవి మోహన్ కు మంచి పాత్ర దక్కింది 

ఇక హీరోయిన్ శ్రీలీల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు

హీరో కోసం తోడుగా తీసుకొచ్చి పెట్టినట్టున్నారు

చిన్న దురై పాత్రలో అధర్వ మురళి నటన పర్లేదు

బాహుబలి భల్లాలదేవుడు దగ్గుబాటి రానా కూడా అతిధి పాత్రలో మెరుస్తాడు

ఓవరాల్ గా ఈ మూవీలో  నటీనటుల పనితీరుకన్నా దర్శకత్వ వైఫల్యం స్పృష్టంగా కనిపిస్తుంది

సాంకేతికత:

కథాకాలం 1950 – 60 ల మధ్య అని చెప్పుకున్నాం కదా

ఇలాంటి కధలకు నేటి నేటివిటీ చూపిస్తే బొక్కబోర్లా పడతాయి

అదృష్టవశాత్తు ఈ మూవీలో ఆ జాగ్రత్తలు కొద్దిగా తీసుకున్నారు

అప్పటి కాలానికే సంబందించిన నేటివిటీని చూపించడంలో సినిమాటోగ్రఫీ రవి చంద్రన్ కొంతవరకు సఫలీకృతం అయ్యారు 

నేపధ్య సంగీతం పర్లేదు

నిర్మాణ విలువలు సంతృప్తికరంగా లేవు

విశ్లేషణ :

ఏ  నటుడికైనా  గత సినిమాల్లో నటనే భవిష్యత్ సినిమాలకు పునాదిరాయి అవుతుంది

శివకార్తికేయన్ కూడా చక్కటి నటుడిగా అమరన్ మూవీలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు . ఆ ఒపీనియన్ తోనే ఇటువంటి హీరోల సినిమాలు కొన్ని చూస్తాం . కానీ గతంలో చూసిన సినిమా స్థాయిలో అదే హీరో నటన లేకపోతే డిజప్పాయింట్ అవుతాం . పరాశక్తి మూవీలో జరిగింది అదే . ఎక్కువ ఊహించుకుంటే చాలామంది డిజప్పాయింట్ అవుతారు . పోనీ హీరో సంగతి ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ ఉంటే మనం కొంతవరకు సరిపెట్టుకోవచ్చు . ఇందులో అది కూడా లేదు

నటీనటులు :   శివకార్తికేయన్ , శ్రీలీల , రవి మోహన్ , అధర్వ మురళి తదితరులు

దర్శకత్వం : సుధా కొంగర

విడుదల : 7-2-2026  ( జీ 5 ఓటిటీ )

రేటింగ్ : 2 / 5


Spread the love

One thought on “సరైన టైటిల్ పెట్టడంలోనే తప్పటడుగు పడింది ..ఇంక సినిమా సంగతి ఎలా ఉంటుంది ?- పరాశక్తి మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!