యూపీఏ (ఇండి కూటమి) వైపు జగన్ అడుగులు పడుతున్నాయా ? నిజమేనా ? అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

Spread the love

నిన్న చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ కజిన్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక సోషల్ మీడియాలో సరికొత్త రాజకీయ చర్చకు నాంది పలికింది . విశేషం ఏంటంటే ఈ వివాహ వేడుకల్లోని దృశ్యాలను వైసీపీతో పాటు టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా ఫొటోలతో , కథనాలతో హోరెత్తించింది .

వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని ,తమిళ నటులు ,నాయకులూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను వైసిపి సోషల్ మీడియా వింగ్ ఇంటర్నెట్ లో పంచుకున్నారు .

మరోపక్క టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా వివాహ వేడుకల్లో జగన్ వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ కథనాలు అల్లింది . వాటిలో ప్రధానమైంది ఏంటంటే త్వరలో జగన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ( ఇండియా ) కూటమిలో చేరతారని , అందుకు ఈ వివాహ వేడుకలే వేదిక అయ్యిందని రాసుకొచ్చారు .

నాకు ఆశ్చర్యం వేసింది .. ఆ కథనాన్ని పోస్ట్ చేసింది కూడా టిడిపి సోషల్ మీడియా వింగ్ కు సంబంధించిన వ్యక్తి .. ఈ కథనం పై టిడిపి నాయకత్వం అధికారికంగా స్పందించకపోయినా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి కొంత ప్రాధాన్యత ఉంటుంది.

ఇంతకీ ఆ కథనం పూర్తి పాఠం ఏంటి ?
వైఎస్ జగన్ నిజంగానే యూపీఏ వైపు అడుగులు వేస్తారా ?
అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

చిన్న విశ్లేషణ చేసుకుందాం

వైఎస్ జగన్ పెద్దనాన్న జార్జిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి కొడుకు సాహిల్ రెడ్డి వివాహ వేడుకలు ఆదివారం నాడు చెన్నైలోని లీలా ప్యాలస్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది . ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరు అయ్యారు .

మరోపక్క ఈ వివాహ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు . రాజకీయ నాయకులతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు సూర్య , కార్తీ , విజయ్ వంటి నటులు కూడా హాజరయ్యారు .

అయితే ఈ వివాహ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు . తమిళ సినీ నటులు సూర్య , కార్తీ లు జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పలకరించారు . మరో తమిళ నటుడు , రాబోయే తమిళనాడు ఎన్నికల్లో తలపడటానికి సిద్ధం అవుతున్న టీవీకే అధ్యక్షుడు తలపతి విజయ్ అయితే జగన్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన పక్కనే కూర్చుని ముచ్చటించారు .

ఈ సమయంలో సహజంగా అందరి దృష్టి వీరిద్దరిపైననే పడుతుంది . అలా పడింది కూడా.. ఎందుకంటే విజయ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు . మరోపక్క ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ముందునుంచీ బీజేపీ కి వ్యతిరేకంగా ఉంది . ఇలాటి పరిస్థితుల్లో స్టాలిన్ ఈ వేడుకలో వైఎస్ జగన్ ను కలవడం రకరకాల ఊహాగానాలకు తెర తీసింది .

నిజానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జగన్ కు ఆత్మీయపూర్వకంగా నమస్కరించి పలకరించారు కానీ ఆయనతో విడిగా మాట్లాడినట్టు కనిపించలేదు . ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి .

వాటిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ,

ఇప్పటివరకు జగన్ పట్ల సానుకూల వైఖరి అవలంభించిన బీజేపీ కేంద్ర నాయకత్వం తిరుమల లడ్డూ వ్యవహారంలో యూ టర్న్ తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా టిడిపి , జనసేనలు చేస్తున్న ఆరోపణలను బాహాటంగా సమర్దిస్తుంది కాబట్టి వైఎస్ జగన్ కూడా మోడీకి , బీజేపీ కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని రాసారు .

అందులో భాగంగా వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే కు వ్యతిరేకంగా పనిచేస్తారని , జగన్ రాకకు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా ఓకే చెప్పేశారని రాసుకొచ్చారు . ఈ మొత్తం డీల్ తెరవెనుక ఉండి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నడిపించారని రాసారు .

టూకీగా ఆ కథనం సారాంశం ఇది

ఇప్పుడు వైఎస్ జగన్ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరడం ఎంతవరకు సాధ్యమౌతుందో విశ్లేషణ చేసుకుందాం

పై కథనం చదివినప్పుడు వైఎస్ జగన్ మొండితనం , పట్టుదల గురించి తెలిసినవాళ్లకు ఏమర్థమౌతుంది ? కొన్ని సందేహాలు వస్తాయి .

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సోనియా చెప్పినట్టు నడుచుకుని రాజీ పడి ఉంటే అతడి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేదో తెలీదు కానీ ఇప్పటికీ ఎదుర్కుంటున్న కేసులు ఉండేవి కావని ప్రతి ఒక్కరికి తెలుసు . షుమారు 18 నెలలు జైల్లోనే గడిపినప్పటికీ జగన్ కాంగ్రెస్ పార్టీతో కానీ , సోనియాతో కానీ రాజీ చేసుకుందామనే ఆలోచనే చేయలేదు .

సొంతంగా పార్టీ పెట్టుకుని తన బలం సరిపోతుందో లేదో తెలియకపోయినా ఎన్నికలకు మొండిగా ఒంటరిగానే వెళ్ళాడు కానీ పొత్తు ఆలోచనలు చేయలేదు . బీజేపీ తో పొత్తు లేకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలే మెయింటైన్ చేసారు .

గడిచిన ఎన్నికల్లో టిడిపి , జనసేన , బీజేపీ లు కూటమి కట్టినా పొత్తు ఆలోచన చేయలేదు . చేతిలో అధికారం జారిపోయినా బీజేపీ కేంద్ర నాయకత్వంతో తన సంబంధాలు కాపాడుకుంటూ వచ్చారు .

ఒకరకంగా చెప్పాలంటే గడిచిన ఎన్నికల ముందు వరకు బీజేపీ అగ్ర నాయకులు మోడీ , అమిత్ షా వంటి నాయకులతో చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ తోనే సంబంధాలు బాగుండేవి . ఒకానొక సమయంలో బీజేపీ తో చంద్రబాబు వైరం రాజకీయ వైరం నుంచి వ్యక్తిగత వైరంగా మారింది . మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీతో కూటమి కట్టి ప్రచారం చేయడం , తిరుపతి పర్యటనలో టిడిపి కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేయడం వంటి అంశాలు బాబును మోడీ , అమిత్ షా లకు దూరం చేసాయి .

దరిమిలా రాహుల్ కూటమి నుంచి బాబు బయటికి వచ్చినా బీజేపీ పెద్దలతో ఆయన సంబంధాలు మెరుగుపడలేదు . జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు ఒకానొక దశలో మోడీ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది . 2024 ఎన్నికలకు ముందువరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది .

మరోపక్క బీజేపీ వైఎస్సార్సీపీ ని తన రాజకీయ ప్రత్యర్థిగానే భావించింది తప్ప వైఎస్ జగన్ను వ్యక్తిగత శత్రువుగా భావించలేదు . అందుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో జగన్ సహకారం తీసుకుంది . జగన్ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ వచ్చారు .

కానీ గడిచిన ఎన్నికల నాటికి దక్షిణాదిన కూడా తమ జెండా ఎగరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది . ఉత్తరాదిన బలం పుంజుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల వైపు దృష్టి సారించింది.. వాటిలో ఏపీ కూడా ఒకటి .

అయినప్పటికీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఏపీలో అధికారంలోకి రావడం కష్టమన్న సంగతి బీజేపీ కి కూడా తెలుసు . సొంతంగా అధికారంలోకి రాకపోయినా ఏపీలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని బీజేపీ భావించింది .

సరిగ్గా ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రూపంలో గేమ్ ఛేంజర్ ఎంటర్ అయ్యాడు . అది కూడా వైసిపి ప్రభుత్వం బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో బయటపడింది . అప్పుడే పొత్తు నిర్ణయాలకు అంకురార్పణ జరిగింది .

నిజానికి బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నారా లోకేష్ ,పురంధరేశ్వరిని వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినప్పటికీ ఆయన నుంచి బాబుకు అనుకూలంగా ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు .

ఈ పరిస్థితుల్లో టిడిపితో జనసేన పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించారు . ఆయన ప్రకటించడమే కాదు కూటమిలో జత కట్టడానికి బీజేపీ ని కూడా ఒప్పించారు .

ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు . పర్యవసానంగా అధికారం కోల్పోయి కేవలం 11 స్థానాలకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది . అయినా కూడా జగన్ కు వచ్చిన 40 శాతం ఓటింగ్ సంగతి ప్రత్యర్థి పార్టీలు మర్చిపోలేదు . ఆ 40 శాతం ఓటింగును తగ్గించటానికి తిరుమల లడ్డూ అంశం ప్రధాన అస్త్రమైంది . ప్రస్తుతం ఆ అంశం మీదే ఇరు పార్టీలు హోరాహోరీగా ఆరోపణలు చేసుకుంటున్నాయి .

ఈ పరిస్థితుల్లో జగన్ మోడీని కాదని రాహుల్ గాంధీతో డీల్ కుదుర్చుకుంటాడా ? తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా నిలిచిన సోనియాతోను , ఆవిడ పార్టీతోనూ జగన్ ఏవిధంగా పొత్తు పెట్టుకుంటాడు? అసలు మోడీతో విడిపోయేంత గొడవలు జగన్ కు ఏమున్నాయి ? లడ్డూ వివాదంలో కూడా బీజేపీ నాయకులు , వి హెచ్ పి నాయకుల నుంచి విమర్శలు వచ్చాయేమో కానీ నేరుగా మోడీ కానీ , అమిత్ షా కానీ విమర్శలు చేసారా ? బీజేపీ ని కాదని పక్క రాష్ట్రానికి పోయి మరీ జగన్ డీఎంకే అండ్ కో కు అనుకూలంగా ప్రచారం చేసి సాధించేది ఏముంటుంది ? ఇండియా కూటమిలో చేరడం వల్ల జగన్ కు వచ్చే అదనపు రాజకీయ మైలేజీ ఏముంటుంది? కాంగ్రెస్ తో కలవాలంటే ముందు చెల్లిని ఒప్పించాలని , రాజీ చేసుకోవాలని జగన్ కు తెలీదా ? ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఫలితాలను చూసిన జగన్ ఏ రకంగా ఆ కూటమితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటాడు ?

ఇప్పటికే లడ్డూ వివాదంలో విమర్శలు ఎదుర్కుంటున్న జగన్ హిందూ మత విశ్వాసాలను బహిరంగంగా విమర్శించిన స్టాలిన్ కూటమితో ఎలా పొత్తు పెట్టుకుంటారు ? పెళ్ళిలో కొందరు నాయకులు క్యాజువల్ గా కలిసినంతమాత్రాన జగన్ అర్దాంతరంగా తన పొలిటికల్ స్ట్రాటజీలు మార్చుకుంటాడా ?

నా విశ్లేషణ ప్రకారం జగన్ యూపీఏ కూటమిలోకి వెళ్తాడని అనుకోవడం లేదు . దయచేసి ఈ ఆర్టికల్ జగన్ కు అనుకూలంగానో , చంద్రబాబుకు వ్యతిరేకంగానో రాసినట్టు భావించకండి .

చెన్నైలో జరిగిన వివాహ వేడుకల్లో కొంతమంది తమిళ నాయకులు కలవడంతో జగన్ త్వరలో యూపీఏ లో చేరతారు అనే ఊహాగానాలతో సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చను చూసిన తర్వాత నా విశ్లేషణను తెలియచేసాను . అలా అని ఈ విశ్లేషణ లో తెలియచేసిన ప్రకారమే రాజకీయాలు నడుస్తాయనే నియమం ఏమీ లేదు .

కాకపోతే ఇప్పటిదాకా పొత్తుల విషయంలో జగన్ అనుసరించిన తీరును గమనిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏతో పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని అనిపిస్తుంది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!