Home » బాల్కనీ .. బాల్కనీ .. వెయ్యి రూపాయలు .. OVER GAIN (OG )

బాల్కనీ .. బాల్కనీ .. వెయ్యి రూపాయలు .. OVER GAIN (OG )

Spread the love

బాల్కనీ .. బాల్కనీ .. వెయ్యి రూపాయలు .. OVER GAIN (OG )

ఒకప్పుడు థియేటర్ బుకింగ్ కౌంటర్ల దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్మడం చట్టరీత్యా నేరం అనే బోర్డులు ఉండేవి

అప్పట్లో అభిమానుల బలహీనతలను కొందరు బ్లాక్ మార్కెటీర్లు ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకునేవారు

ఈ దందాలో కొంతమంది థియేటర్ ఓనర్లు కూడా చేతులు కలిపిన సందర్భాలు ఉన్నాయి

అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళ హడావుడి ఎక్కువగా ఉండేది

నేల టికెట్టు వంద , బాల్కనీ రెండొందలు అంటూ టికెట్ దొరకని ప్రేక్షకుల దగ్గరకొచ్చి మెల్లిగా చెప్పేవాళ్ళు

తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి ఆటను చూడకపోతే ప్రాణాలు పోతాయ్ అనుకునేవాళ్లు డబ్బులకోసం చూడకుండా ఎక్కువ రేట్ పెట్టి టికెట్ కొని థియేటర్లో ఈలలు , కేకలతో ఇండియా కప్ గెల్చినంతగా సంబరాలు చేసుకునేవాళ్ళు

ఇవన్నీ ఒకప్పుడు
ఇప్పుడంతా ఆన్ లైన్ వచ్చేసింది

బ్లాక్ లో టికెట్లు అమ్మే బాధ్యతను బడాబాబులు నెత్తిన వేసుకున్నారు

మొదటి రోజు కలెక్షన్లతో తమ పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ వచ్చేయాలని , మొదటి వారం కలెక్షన్స్ తో పెట్టుబడికి రెండింతలు లాభాలు వచ్చేయాలని , మూడో వారం ఓటీటీ లో రిలీజ్ అయి బోనస్ రావాలని కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలు మొదలెట్టారు

అదే పెంచిన రేటుకు టికెట్లు అమ్ముకోవడం

ఆగండాగండి ,

అధిక ధరకు టికెట్లు అమ్మడం నేరం అని మొదట్లో చెప్పారు కదా అంటారా ?

ఏమీ కాదు

ఎందుకంటే టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముకోమని సాక్ష్యాత్తు ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది

అది కూడా కాస్తో కూస్తో కాదు
ఏకంగా వెయ్యి రూపాయలకు అమ్ముకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది

ఎస్ .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా బెనిఫిట్ షో కు టికెట్ వెయ్యి రూపాయలకు అమ్ముకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

అంతేనా , సినిమా రిలీజ్ అయిన తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే 125 రూపాయలు , ముల్టీప్లెక్స్ అయితే 150 రూపాయలు పెంచి అమ్ముకోవచ్చని అనుమతులు ఇచ్చింది

కాబట్టి ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లు కొనడం నేరం కాదు కాబట్టి అభిమాన నటుడి సినిమా కోసం ఈ మాత్రం త్యాగాలు చేయడానికి అభిమానులు సిద్ధంగా ఉండండి

ముగింపు : టికెట్ రేట్ల పెంపుదలలో ఏ నటుడిపైనైనా సామాన్యుడి అభిప్రాయం ఇలాగే ఉంటుంది .. అలాంటిది పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి నిర్ణయాలను బహుశా ఆయన అభిమానులు కూడా సమర్దించరేమో ? ఎందుకంటే ఆయన సినిమా మొదటి రోజున చూసే జాబితాలో ముందుగా ఆయన అభిమానులే ఉంటారు ? అంతిమంగా టికెట్ రేట్ల పెంపు భారం వారి మీదే పడుతుంది . అవినీతి రహిత రాజకీయాల దిశగా ఏపీని సరికొత్త బంగారు లోకంలోకి తీసుకెళ్తారనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఫక్తు రాజకీయ నాయకుడిగా మారి తన సినిమాకు పెంచిన రేట్లకు అనుమతులు ఇవ్వడం రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలనుకున్న ఆయన ఆశలకు , ఆశయాలకు ఆదిలోనే హంసపాదు వంటిది టికెట్ రేట్ల పెంపు వ్యవహారం

పవన్ కళ్యాణ్ గారూ , ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుని రాగ ద్వేషాలకు , పక్షపాతాలకు మీ దగ్గర తావు లేదని గట్టి సందేశం ఇవ్వండి
మీ సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పెట్టి కొనలేని మీ అభిమానులు సంతోషిస్తారు !


Spread the love

One thought on “బాల్కనీ .. బాల్కనీ .. వెయ్యి రూపాయలు .. OVER GAIN (OG )

  1. చాలా దారుణం. మన చిన్నప్పుడు బ్లాకులో టికెట్ అమ్మిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రతి ఒక్కరు వాళ్ళని దొంగలుగా, మన రక్తం పీల్చే కిరాతకులుగా చూసేవారు.
    ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయాలా అరెస్ట్?
    అసెంబ్లీ సాక్షిగా ఉత్తర ప్రగల్భాలు పలికిన రేవంత్ , సినిమా వాళ్ళు దాసోహం అనగానే ఎలా మాట మార్చాడు అందరం చూసాము.
    పవన్ కళ్యాణ్ ఎన్ని నీతులు చెప్పినా తన సినిమాలకి డబ్బులు రాకపోతే తనకి సినిమాలు రావని, అభిమానులని కూడా త్యాగం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *