80 వ దశకంలో ఎన్కౌంటర్ మ్యాగజైన్ గురించి తెలియని వారు దాదాపు లేరు
వంద కాపీలతో మొదలైన సర్క్యులేషన్ కొద్ది కాలంలోనే 5 లక్షల కాపీలకు చేరుకుంది
ఆ రోజుల్లో అతి తక్కువ టైం లో ఇంత సర్క్యులేషన్ చేరుకుని ఎన్కౌంటర్ మ్యాగజైన్ రికార్డు సృష్టించింది
ఒకానొక టైం లో మార్కెట్లో కాపీలు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయి సాయంత్రానికి దొరకని పరిస్థితి ఉండేది
ఈ ఎన్కౌంటర్ మ్యాగజైన్ కు ఎడిటర్ 26 ఏళ్ళ పింగళి దశరధ రామ్ ( ఆయన 23 ఏళ్లకే మ్యాగజైన్ మొదలుపెట్టారు )
అప్పట్లో ఎన్కౌంటర్ సంచిక మార్కెట్లోకి వస్తుందంటే రాజకీయ నాయకులు చలి జ్వరం వచ్చినట్టు ఒణికిపోయేవాళ్లు
తమ చీకటి పనులను దశరధ రామ్ ఎక్కడ వెలుగులోకి తెస్తాడో అనుకుని వేగుల ద్వారా సంచికలు తెప్పించుకుని మరీ చూసేవాళ్ళు
ఆ పార్టీ , ఈ పార్టీ అని లేదు
రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా తప్పులు చేస్తే ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ లో ఫోటో ప్రింట్ పడాల్సిందే
దీనితో ఆయనకు శత్రువులు పెరిగిపోయారు
ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు పింగళి దశరధ రామ్ తో తన అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా రచ్చబండ కబుర్లతో పంచుకున్నారు
” పింగళి దశరధ రామ్ కు చావంటే భయం లేదు .. ఏ నాటికైనా తనని చంపేస్తారని తెలుసు.. అయినా రాయటం మాత్రం ఆపనని చెప్పేవాడు.. ఓ రోజు తెనాలిలో నరబలి జరిగిందన్న వార్త దశరధ రామ్ కు తెలిసింది .. వెంటనే విషయమేంటో కనుక్కుందామని నన్ను కూడా రమ్మన్నాడు .. దశరధ రామ్ .. నేనూ కలిసి బండి మీద తెనాలి వెళ్లాం .. అక్కడ పన్నెండేళ్ల తన పిల్లవాడిని థియేటర్లో నరబలి ఇచ్చారని ఒకామె ఏడుస్తూ దశరధ రామ్ కు చెప్పింది .. కానీ ఈ విషయం ఎక్కడా బయటికి రాలేదు .. లోకల్ రిపోర్టర్ ఒకడికి తెలిసి న్యూస్ రాసి పేపర్ కి పంపిస్తే ఆ థియేటర్ ఓ రాజకీయ పార్టీకి చెందిన పెద్దోళ్ళకు సంబంధించింది.. నువ్వు కల్పించుకోకు .. అని చెత్తబుట్టలో పారేశాడని ఆమె చెప్పింది
వెంటనే దశరధ రామ్ తనదైన శైలిలో థియేటర్లో ఎంక్వైరీ చేస్తే నరబలి జరిగిందనేది వాస్తవం అని తెలిసింది
అక్కడే కావాల్సిన ఫోటోలూ , అవీ తీసుకుని విజయవాడ వచ్చి తెనాలి థియేటర్లో నరబలి .. దగ్గరుండి చేయించిన కాంగ్రెస్ నాయకుడు అని ఓ ఆర్టికల్ రాసి ఫోటోలతో సహా కవర్ పేజీ లో వేసి కాపీలు తెనాలి పంపించాడు
కానీ ఎన్కౌంటర్ కాపీలను కొంతమంది దుండగులు కాల్చి వేశారన్న వార్త తెలుసుకుని నేనూ , దశరధ రామ్ మూడు వేల కాపీలు తీసుకుని తెనాలి వెళ్లాం .. కానీ అక్కడ బస్ స్టాండ్ స్టాల్ లో రెగ్యులర్ గా ఎన్కౌంటర్ మ్యాగజైన్ అమ్మే వ్యక్తి కాపీలను పెట్టలేనని భయంతో చేతులెత్తేశాడు. అప్పుడు దశరధ రామ్ రిక్షాలో ఆ కాపీలు వేసుకుని షాప్ టు షాప్ తిరిగి పెట్టించాడు
ఈలోపు ఈ వార్త తెలిసి ఆ నాయకుడి తాలూకూ మనుషులు ఆయుధాలతో జీపులో వచ్చారు
వెంటనే జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన నేను దశరధ రామ్ ను బండి మీద ఎక్కించుకుని వాయు వేగంతో విజయవాడ వైపు పోనిచ్చాను
అయినా దుండగులు వదల్లేదు
ఎలాగైనా దశరధ రామ్ ను పట్టుకోవాలని జీపులో వెంబడించారు
బండి నడుపుతున్న నాకైతే అదే ఆఖరి రోజు అనిపించింది
ప్రాణ భయంతో బండి వేగం మరింత పెంచా
ఊరి పేరు సరిగా గుర్తుకు రావడం లేదు .. దేవర పల్లి అనుకుంటా .. తెనాలి పొలిమేరలు దాటిన తర్వాత వస్తుంది
అక్కడ రైల్ వే లెవెల్ క్రాసింగ్ గేట్ ఉంది
సరిగ్గా మేము ట్రాక్ క్రాస్ చేసాము
గేట్ వేశారు
అక్కడికి దగ్గర్లోనే ఉన్న చార్వాక రామకృష్ణ ఆశ్రమంలోకి దూరాము
ఈ ఆశ్రమం గోరా స్పూర్తితో రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారని అంటారు
“మీకేం పర్లేదు .. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు .. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చే సాహసం ఎవరూ చేయలేరు” అని ఆయన అభయమిచ్చారు
ఆయన చెప్పింది నిజమే అనిపించింది
కారణాలు తెలీదు కానీ మేము ఆశ్రమంలోకి వెళ్లడం చూసిన జీపులోని వ్యక్తులు ఎందుకో తిరిగి వెనక్కి వెళ్లిపోవడం కనిపించింది
దాంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడే రెండ్రోజుల పాటు ఉండి విజయవాడ చేరుకున్నాం “
“ఇదిలా ఉండగా కొడుకును నరబలి ఇవ్వడంతో దిక్కులేనిది అయిన ఆ తల్లిని ఎవరూ పట్టించుకోక వదిలేస్తే దశరధ రామ్ విజయవాడ తన ఇంటికి తీసుకొచ్చి చాలారోజుల పాటు సొంత డబ్బులతో పోషించాడు .. ఇక్కడ సొంత డబ్బులు అనేకన్నా అప్పు చేసి అనడం కరెక్ట్ ఏమో ? ఎందుకంటె ఆ రోజుల్లో దశరధ రామ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు” అని చెప్పారు
ఇదే కాదు ఇలాంటి ఇంకో రెండు మూడు సంఘటనలు కూడా జరిగాయి
అని అవి కూడా చెప్పారు
అవన్నీ తరువాయి భాగంలో ,
ఇంకా ఉంది
