Home » తనని చంపేస్తారని ఎన్కౌంటర్ మ్యాగజైన్ పింగళి దశరధ రామ్ కు ముందే తెలుసా ?

తనని చంపేస్తారని ఎన్కౌంటర్ మ్యాగజైన్ పింగళి దశరధ రామ్ కు ముందే తెలుసా ?

Spread the love

80 వ దశకంలో ఎన్కౌంటర్ మ్యాగజైన్ గురించి తెలియని వారు దాదాపు లేరు . వంద కాపీలతో మొదలైన సర్క్యులేషన్ కొద్ది కాలంలోనే 5 లక్షల కాపీలకు చేరుకుంది . ఆ రోజుల్లో అతి తక్కువ టైంలో ఇంత సర్క్యులేషన్ చేరుకుని ఎన్కౌంటర్ మ్యాగజైన్ రికార్డు సృష్టించింది . ఒకానొక టైం లో మార్కెట్లో కాపీలు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయి సాయంత్రానికి దొరకని పరిస్థితి ఉండేది . కొంతమందైతే పొరుగూర్లకు పోయి మరీ ఎన్కౌంటర్ మ్యాగజైన్ కొనుక్కుని మరీ చదివేవాళ్ళు . ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు , యువకులు ఈ మ్యాగజైన్ చదవడం కోసం ఎగబడేవారు .

ఈ ఎన్కౌంటర్ మ్యాగజైన్ కు 26 ఏళ్ళ పింగళి దశరధ రామ్ ఎడిటర్ ( ఆయన 23 ఏళ్లకే మ్యాగజైన్ మొదలుపెట్టారు ) . మ్యాగజైన్ మొదలుపెట్టిన మూడేళ్లకే సంచలనాలు సృష్టించటం అప్పట్లో రికార్డ్ . ఈ మ్యాగజైన్ సాదాసీదా కాలక్షేపం కోసం చదువుకునే మ్యాగజైన్ కాదు . పేరులోనే ఎన్కౌంటర్ ఉంది చూసారా ? అసలు ఆ టైటిల్ లోనే ఒక వైబ్ ఉంది . తన ఆశయాలకు తగిన పేరే మ్యాగజైన్ కు పెట్టుకున్నాడు పింగళి దశరథ రామ్ .

అప్పట్లో ఎన్కౌంటర్ సంచిక మార్కెట్లోకి వస్తుందంటే రాజకీయ నాయకులు చలి జ్వరం వచ్చినట్టు ఒణికిపోయేవాళ్లు . తమ చీకటి పనులను దశరధ రామ్ ఎక్కడ వెలుగులోకి తెస్తాడో అనుకుని వేగుల ద్వారా సంచికలు తెప్పించుకుని మరీ చూసేవాళ్ళు .రీడర్ల కన్నా అవినీతి రాజకీయ నాయకులు ఎన్కౌంటర్ మ్యాగజైన్ ముందు తెప్పించుకుని చదవడం అప్పట్లో విశేషం . సాధారణ న్యూస్ పేపర్లు , మ్యాగజైన్లు కనిపెట్టని ఎన్నో విషయాలను తన కలం ద్వారా అందరికన్నా ముందు వెలుగులోకి తెచ్చి చీకటి నేతల గుండెల్లో గుబులు పుట్టించేవాడు .

ఆ పార్టీ , ఈ పార్టీ అని లేదు . రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా తప్పులు చేస్తే ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ లో ఫోటో ప్రింట్ పడాల్సిందే . భయాలకు అతీతంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలను ధైర్యంగా మ్యాగజైన్ కు ఎక్కించేవాడు .

దీనితో ఆయనకు శత్రువులు పెరిగిపోయారు . తలపండిన చాలామంది సీనియర్లు మౌనంగా ఉన్న రోజుల్లో ఓ కుర్రాడు తన కాలంతో ఉవ్వెత్తున దూసుకొచ్చాడు . ఆ రోజుల్లో పత్రిక నడపడం అంటే మాటలు కాదు . మాములు పత్రికలు నడపాలంటేనే ఆర్థికంగా తట్టుకునే స్థితిలో ఉండాలి . అలాంటిది ఎన్కౌంటర్ లాంటి మ్యాగజైన్ నడపాలంటే ఆర్థిక వనరులతో పాటు అంగ బలం కూడా ఉండాలి . కానీ దశరథ రామ్ దగ్గర పత్రిక నడపటం సంగతి అటుంచితే కనీసం ఒక మ్యాగజైన్ కొనడానికి కూడా డబ్బుల్లేవ్ . అప్పులతోనే ఇంట్లోని చిన్న గదిలో మ్యాగజైన్ ప్రారంభించాడు . ఇక అంగబలం అంటారా ? చేతిలో పెన్ను తప్ప మరేమీ లేదు . తోడుగా సహచరిణి సుశీల గారు ఉన్నారు .

ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు పింగళి దశరధ రామ్ తో తన అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా రచ్చబండ కబుర్లతో పంచుకున్నారు .

” పింగళి దశరధ రామ్ కు చావంటే భయం లేదు .. ఏ నాటికైనా తనని చంపేస్తారని తెలుసు.. అయినా రాయటం మాత్రం ఆపనని చెప్పేవాడు.. ఓ రోజు తెనాలిలో నరబలి జరిగిందన్న వార్త దశరధ రామ్ కు తెలిసింది .. వెంటనే విషయమేంటో కనుక్కుందామని నన్ను కూడా రమ్మన్నాడు .. దశరధ రామ్ .. నేనూ కలిసి బండి మీద తెనాలి వెళ్లాం .. అక్కడ పన్నెండేళ్ల తన పిల్లవాడిని థియేటర్లో నరబలి ఇచ్చారని ఒకామె ఏడుస్తూ దశరధ రామ్ కు చెప్పింది .. కానీ ఈ విషయం ఎక్కడా బయటికి రాలేదు .. లోకల్ రిపోర్టర్ ఒకడికి తెలిసి న్యూస్ రాసి పేపర్ కి పంపిస్తే ఆ థియేటర్ ఓ రాజకీయ పార్టీకి చెందిన పెద్దోళ్ళకు సంబంధించింది.. నువ్వు కల్పించుకోకు ..” అని చెత్తబుట్టలో పారేశాడని ఆమె చెప్పింది .

వెంటనే దశరధ రామ్ తనదైన శైలిలో థియేటర్లో ఎంక్వైరీ చేస్తే నరబలి జరిగిందనేది వాస్తవం అని తెలిసింది .

అక్కడే కావాల్సిన ఫోటోలూ , అవీ తీసుకుని విజయవాడ వచ్చి తెనాలి థియేటర్లో నరబలి .. దగ్గరుండి చేయించిన కాంగ్రెస్ నాయకుడు అని ఓ ఆర్టికల్ రాసి ఫోటోలతో సహా కవర్ పేజీ లో వేసి కాపీలు తెనాలి పంపించాడు . అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. మరే స్థానిక పేపర్లో రాని వార్త ఒక్క ఎన్కౌంటర్ లోనే వచ్చింది . ఒక్కసారిగా అందరి దృష్టి ఎన్కౌంటర్ మ్యాగజైన్ మీద పడింది . ఈ విషయం తెనాలి నుంచి హైద్రాబాదులోని అసలైన నాయకుడికి చేరింది . వెంటనే ఆయన మనుషులు రంగంలోకి దిగారు . అప్పటికప్పుడు తెనాలి బుక్ స్టాళ్లలో ఉన్న మ్యాగజైన్ కాపీలను తగలబెట్టేశారు .

ఎన్కౌంటర్ కాపీలను కొంతమంది దుండగులు కాల్చి వేశారన్న వార్త తెలుసుకుని నేనూ , దశరధ రామ్ మూడు వేల కాపీలు తీసుకుని తెనాలి వెళ్లాం .. కానీ అక్కడ బస్ స్టాండ్ స్టాల్ లో రెగ్యులర్ గా ఎన్కౌంటర్ మ్యాగజైన్ అమ్మే వ్యక్తి కాపీలను పెట్టలేనని ప్రాణ భయంతో చేతులెత్తేశాడు. అప్పుడు దశరధ రామ్ రిక్షాలో ఆ కాపీలు వేసుకుని షాప్ టు షాప్ తిరిగి పెట్టించాడు .

ఈలోపు ఈ వార్త తెలిసి ఆ నాయకుడి తాలూకూ మనుషులు ఆయుధాలతో జీపులో వచ్చారు. వెంటనే జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన నేను దశరధ రామ్ ను బండి మీద ఎక్కించుకుని వాయువేగంతో విజయవాడ వైపు పోనిచ్చాను . అయినా దుండగులు వదల్లేదు. ఎలాగైనా దశరధ రామ్ ను పట్టుకోవాలని జీపులో వెంబడించారు .

బండి నడుపుతున్న నాకైతే అదే ఆఖరి రోజు అనిపించింది . ప్రాణ భయంతో బండి వేగం మరింత పెంచా . ఊరి పేరు సరిగా గుర్తుకు రావడం లేదు .. దేవర పల్లి అనుకుంటా .. తెనాలి పొలిమేరలు దాటిన తర్వాత వస్తుంది . అక్కడ రైల్ వే లెవెల్ క్రాసింగ్ గేట్ ఉంది .

సరిగ్గా మేము ట్రాక్ క్రాస్ చేసాము . గేట్ వేశారు .ఇదంతా అదేదో సినిమాలో సన్నివేశంలా జరిగిపోయింది . వెంటనే అక్కడికి దగ్గర్లోనే ఉన్న చార్వాక రామకృష్ణ ఆశ్రమంలోకి దూరాము. ఈ ఆశ్రమం గోరా స్పూర్తితో రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారని అంటారు .

“మీకేం పర్లేదు .. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు .. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చే సాహసం ఎవరూ చేయలేరు” అని ఆయన అభయమిచ్చారు.

ఆయన చెప్పింది నిజమే అని మాకు తర్వాత తెలిసింది . కారణాలు తెలీదు కానీ మేము ఆశ్రమంలోకి వెళ్లడం చూసిన జీపులోని వ్యక్తులు ఎందుకో తిరిగి వెనక్కి వెళ్లిపోవడం కనిపించింది . దాంతో బతుకు జీవుడా అనుకుంటూ అక్కడే రెండ్రోజుల పాటు ఉండి విజయవాడ చేరుకున్నాం “

“ఇదిలా ఉండగా కొడుకును నరబలి ఇవ్వడంతో దిక్కులేనిది అయి రోడ్డున పడింది . ఎంతమందికి చెప్పుకున్నా ఆమె గోడు వినే నాధుడు లేడు . అప్పటికి ఆమె ప్రభుత్వ పెద్దలను , పోలీసులను కలిసి సాయం కోసం అర్ధించింది . ఏ ఒక్కరూ ఆమెను కనికరించలేదు . పైపెచ్చు సాక్ష్యము చెప్పకుండా ఆమెను బెదిరించేవారు . ఆ తల్లిని ఎవరూ పట్టించుకోక వదిలేస్తే దశరధ రామ్ విజయవాడలోని తన ఇంటికి తీసుకొచ్చి చాలారోజుల పాటు సొంత డబ్బులతో పోషించాడు .. ఇక్కడ సొంత డబ్బులు అనేకన్నా అప్పు చేసి అనడం కరెక్ట్ ఏమో ? ఎందుకంటే ఆ రోజుల్లో దశరధ రామ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.. ఇదే విషయం చాలామంది అతడికి చెప్పి చూసారు . నీ పరిస్థితే అంతంత మాత్రం ఉంది . ఇప్పుడు ఆమెను కూడా పోషించాలంటే నీ అప్పుల జాబితా అమాంతం పెరిగిపోతుంది ..ఆమె సంగతి పోలీసులు చూసుకుంటారు వదిలేయ్ అని చెప్పినా దశరథ రామ్ వినిపించుకోలేదు . కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడుతా .. అప్పటివరకు ఇక్కడే ఉంటుంది . అప్పోసప్పో భరించటానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు .

అప్పుడు నాకు అనిపించింది . దశరథ రామ్ కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు . నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే ఒక గొప్ప మానవతావాది అని . ఈరోజుల్లో అన్ని వసతులు ఉంటేనే కష్టాల్లో ఉన్నోళ్లకి చేయూతనివ్వడానికి చాలామంది ఆలోచిస్తారు . అలాంటిది తనకే తినటానికి లేకపోయినా ఇంకో తల్లికి కొడుకు అయి తినిపించాడు . అది కదా మానవత్వం అంటే అనిపించింది .

ఇదే కాదు ఇలాంటి ఇంకో రెండు మూడు సంఘటనలు కూడా జరిగాయి
అని అవి కూడా చెప్పారు .

అవన్నీ తరువాయి భాగంలో ,
ఇంకా ఉంది .


Spread the love

2 thoughts on “తనని చంపేస్తారని ఎన్కౌంటర్ మ్యాగజైన్ పింగళి దశరధ రామ్ కు ముందే తెలుసా ?

  1. 23సంవత్సరాల వయసులో ఒక పత్రిక నడపడం అంటే మాటలు కాదు.ఈరోజు రోడ్లమ్మట రికామీగా తిరుగుతున్న యువత దశరదరాం గారిని చదివి ఎంతో నేర్చుకోవాలి.
    ఎన్కౌంటర్ లాంటి పత్రికలు చదివి ఆరోజు యువకులు గా ఉన్న మేము కనీసం అవినీతి పరులు ఎవరో తెలుసుకుని రాజకీయాలలో ఎలా స్టాండ్ తీసుకోవాలో అర్థం అయేది. మీరు కూడా వారితో పనిచేశారు అని తెలిసి మాకు గర్వం గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!