1980 లలో పింగళి దశరథ రామ్ మొదలెట్టిన ఎన్కౌంటర్ మ్యాగజైన్ వంద కాపీలతో మొదలై చిరకాలంలోనే 5 లక్షల కాపీల సర్క్యులేషన్ కు చేరింది
సర్క్క్యులేషన్ తో పాటు అతనికి శత్రువులు కూడా పెరిగారు
ఆ రాజకీయ పార్టీ .. ఈ రాజకీయ పార్టీ అని లేదు
తప్పు దొరికితే ఎంతటి నాయకుడైనా ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ లోకి ఎక్కాల్సిందే
దీనితో అన్ని పార్టీల్లో అతడికి శత్రువులు పెరిగిపోయారు
ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో రాతలు ఆపేయాలని ఓ రాజకీయ పార్టీ నాయకులు అతడి ఇంటికొచ్చి 6 లక్షల రూపాయలు క్యాష్ బల్ల మీద పెడితే తీసుకోకుండా విసిరికొట్టాడు
ఓ మాజీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి బ్రహ్మాండమైన ‘ ఆఫర్ ను ‘ ఇస్తే కాలి గోటితో తిరస్కరించాడు
ఆ డబ్బులు తీసుకుని ఉంటేనో .. ఆ మాజీ ముఖ్యమంత్రి ఆఫర్ కు ఒప్పుకుంటేనో దశరథ రామ్ జీవితం వేరుగా ఉండేది
29 ఏళ్లకే ముగిసిపోయేది కాదు
చాలామందికి దశరథ రామ్ రాసే భాష మీద అభ్యంతరాలు ఉన్నాయి
నాక్కూడా అనిపించేది కానీ జర్నలిస్టులమని చెప్పుకుంటూ సంస్కార వంతమైన భాష వాడుతూ ఎర్నలిస్టుల అవతారం ఎత్తిన కొంతమందిని చూసిన తర్వాత భాష విషయం ఎలా ఉన్నా రూపాయికి ఆశించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన దశరథ రామ్ లో గొప్ప జర్నలిస్ట్ కనిపించాడు
ఏదో ఒక రాజకీయ పార్టీ పాదాల ముందు అతడు సాష్టాంగ పడి ఉంటే రిక్షాలో బదులు ఖరీదైన కార్లలో తిరిగేవాడు
ఏదో ఒక పార్టీకి గట్టిగా బాకా ఊదితే ఓ న్యూస్ ఛానెల్ కి సీఈఓ అయ్యవాడేమో
ఏదో ఒక అధికార పార్టీ నాయకుడి బూట్లు నాకితే మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో ప్రభుత్వ భత్యాలు తీసుకుంటూ దర్జాగా బతికేసేవాడేమో
అధికార పార్టీ సలహాదారుడిగానో , ప్రభుత్వ సలహాదారుడిగానో లక్షల్లో భత్యాలు తీసుకుంటూ విలాసవంతమైన భోగాలు అనుభవించేవాడేమో
నేటి కొంతమంది ఎర్నలిస్టుల మాదిరి అవేమీ చేయడం రాని అర్భక జర్నలిస్ట్ పింగళి దశరథ రామ్
నాలుగు రాతలు రాసుకుంటూ పోయాడే కానీ నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే ఆలోచన చేయలేకపోయిన ఆవేశపరుడు దశరథ రామ్
పోనీ తాతలు , తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయా ? అంటే అవీ లేవు
జాతీయ పతాక రూపశిల్పి ఈయన తాత పింగళి వెంకయ్య గారే ఆర్థిక ఇబ్బందులతో పాకలో దుర్భర జీవనం గడిపారు
దశరథ రామ్ తండ్రి , పింగళి వెంకయ్య గారి చిన్న కొడుకు అయిన చలపతి రావు గారు కూడా దేశం మీద పిచ్చి ప్రేమతో సైన్యంలో చేరి అక్కడే అసువులు బాసారు
అందరూ దేశ భక్తులే
దేశం కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఉన్నవాళ్లే
అలాగే పిన్న వయసులోనే దశరథ రామ్ మీద జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం పడింది
ఇందిర విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ఆందోళన చేసి జైలుకి కూడా వెళ్ళాడు
అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో ఓ హోటల్లో వెయిటర్ గా కొంతకాలం పనిచేసాడు
కానీ అతడిలోని మనిషి సంతృప్తి చెందలేదు
ఆ సమయంలో వినుకొండ నాగరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న కాగడా మ్యాగజైన్ దశరథ రామ్ దృష్టిని ఆకర్శించింది
వెంటనే అక్కడ జేరిపోయాడు
కాగడా ఎక్కువగా సినిమా గాసిప్స్ రాసేది
కానీ రాజకీయ నాయకుల అవినీతిని ఎండగట్టడమే దశరథ రామ్ టార్గెట్ అవడంతో అక్కడ్నుంచి బయటికి వచ్చి ఎన్కౌంటర్ మ్యాగజైన్ పెట్టాడు
అప్పట్లో ఎన్కౌంటర్ మ్యాగజైన్ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది
ఎన్కౌంటర్ మ్యాగజైన్ సంచిక మార్కెట్లోకి వస్తుందంటే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి
పింగళి దశరథ రామ్ జీవితంలో ఆఖరి రోజు
ఆ రోజు అక్టోబర్ 21 , 1985 వ సంవత్సరం సాయంత్రం
వేరే ఊరి నుంచి వచ్చిన మిత్రుడిని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వస్తానని సత్యనారాయణ పురంలోని ఇంటినుంచి బయలుదేరాడు పింగళి దశరథ రామ్
ఆ రోజే చివరి రోజని ఆ క్షణాన అతడికి తెలియదు
యధాప్రకారంగా తాను ఎప్పుడూ వెళ్లే రిక్షాలోనే బస్ స్టాండుకి వెళ్లి మిత్రుడికి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు
రాత్రి 7. 30 – 8 గంటల మధ్యలో రిక్షా సత్యనారాయణ పురంలోని గిరి వీధి మలుపుకు రాగానే అప్పటికే చీకట్లో మాటువేసి ఉన్న నలుగురు ఆగంతకులు దశరథ రామ్ ను అటకాయించి ఒకటి కాదు రెండు కాదు కత్తితో ఆ బక్క ప్రాణిని 22 పోట్లు పొడిచారు
యెంత వేగంగా పొడిచారో అంతే వేగంగా చీకట్లో మాయమైపోయారు
క్షణాల్లో వార్త ఊరంతా తెలిసిపోయింది
నెత్తురోడుతున్న దశరథ రామ్ ను అదే రిక్షాలో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు
గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్సు వచ్చేసరికి దశరథ రామ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి
ఆ రకంగా ఎన్కౌంటర్ పింగళి దశరథ రామ్ జీవితం 29 ఏళ్లకే ముగిసిపోయింది !
(ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు )
