నిన్న 28-09-2025 న మొదటి భాగంలో పింగళి దశరధ రామ్ తెనాలి అటాక్ నుంచి ఎలా బయటపడ్డాడో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ అటువంటి ఇంకో ఉదంతం గురించి చెప్పారు
అది ఆయన మాటల్లోనే ,
తెనాలి అటాక్ నుంచి తప్పించుకున్న తర్వాత నాలో భయం పెరిగిపోయింది.. అనవసరంగా లైఫ్ రిస్క్ తీసుకుంటున్నామా ? అనిపించింది
అదే విషయం రామ్ తో చెప్పా
అతడు చిన్నగా నవ్వి ” ఇప్పుడో , అప్పుడో ,ఎప్పుడో ” అని సీరియస్ గా తీసుకోలేదు
ఇది జరిగిన రెండ్రోజులకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దశరధ రామ్ ఇంటికి కొంతమంది వచ్చారు
ఆ టైం లో నేను , దశరధ రామ్ ఇంట్లోనే ఏదో ఆర్టికల్ రాసుకుంటున్నాం
కిటికీలోనుంచి దశరధ్ చూసి ” ఆ సన్నాసులు ఇక్కడికి కూడా వచ్చినట్టున్నారు .. విషయమేంటో కనుక్కో ” అన్నాడు
నేను గేటు తీసుకుని బయటికి వాళ్ళ దగ్గరికి వెళ్లి ” ఎవరు కావాలి ?” అనడిగా
“రామన్న ?” అన్నాడు వాళ్లలో ఒకడు
ధైర్యం చేసి “నేనే .. విషయమేంటో చెప్పండి ? అన్నా
చివరికి వాళ్ళు ఎన్కౌంటర్ మ్యాగజైన్ ఏజెన్సీ తీసుకోవడం గురించి కైకలూరు నుంచి వచ్చారని తెలిసి ఊపిరి పీల్చుకున్నా అని తన అనుభవాల గురించి చెప్పారు
ఆయన మాటలకూ అడ్డొస్తూ ,
” మరి ఆ తర్వాత మీకు బెదిరింపులు ఏమీ రాలేదా ?” అనడిగా
” ఎందుకు రాలేదు ? చాలా జరిగాయి .. చెప్తా .. “అని చెప్పడం మొదలుపెట్టారు
అప్పటినుంచి దశరధ రామ్ తన ఐడెంటిటీ బయటపెట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు
వార్తా సేకరణలో బయటి వ్యక్తులను కలిసినప్పుడు తన పేరు కుమార్ అనో , సునీల్ అనో చెప్పి పరిచయం చేసుకునేవాడు
పింగళి దశరధ రామ్ మా ఎడిటర్ అని ఆయనే చెప్పేవాడు
సాధ్యమైనంత వరకు తన ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు
ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఆర్టికల్ మాత్రం దశరధ రామే రాసేవాడు
అయితే తనేం రాసింది మూడో కంటికి కూడా తెలీదు .. ఆఖరికి నాక్కూడా
గవర్నర్ పేటలో చందన బ్రదర్స్ పక్కనే సన్నటి సందులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది
మాములుగా ఇంగ్లీషులో వచ్చిన ఆర్టికల్స్ కొన్ని తెలుగులో ట్రాన్స్ లేట్ చేసి నేను కధనాలు రాసేవాడిని
వాటిల్ని అయినంతవరకు ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చేయమనేవాడు
అన్ని పేజీలు ప్రింట్ అయిన తర్వాత తను రాసిన ఆర్టికల్స్ స్వయంగా తానే వెళ్లి ప్రెస్సులో ఇచ్చేవాడు
దానితో బుక్ బయటికి వస్తే కానీ దశరధ రామ్ ఏం రాశాడో ఎవరికీ తెలిసేది కాదు
ఇదిలా ఉండగా ఓ రోజు సాయంత్రం ఆర్టికల్స్ రాయడం అయిపోయిన తర్వాత దశరధ రామ్ నన్ను పిలిచి ” రాత్రి రెండు గంటలకు మనం రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి .. బండేసుకుని రా అన్నా ” అన్నాడు
సాధారణంగా దశరధ రామ్ బయటికి వెళ్లాలంటే ఆయన ఉంటున్న వీధిలోనే ఉండే ముసలాయన రిక్షాలోనే వెళ్తాడు
బండి కావలసినప్పుడు మాత్రం నన్ను అడుగుతాడు
సరే అని రాత్రి రెండు గంటలకు బండి మీద రామ్ ను ఎక్కించుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళా
లోపలికెళ్లిన తర్వాత ప్లాట్ ఫార్మ్ ఆ చివర ఓ మూల వెలుతురు లేని చోట బెంచీలో కూర్చోబెట్టాడు
ట్రైన్ లో ఎవరినన్నా రిసీవ్ చేసుకోవాలంటే కోచ్ లు ఆగే చోట ఉండాలి కదా ?
ఇలా మూల చీకట్లో కూర్చుంటే ఎవడన్నా పొడిచి పారిపోయినా దిక్కూ దివాణం ఉండదు.. తెనాలి సంఘటన తర్వాత నాలో భయం ఎక్కువైంది .. యెంత జర్నలిస్టునైనా నేనూ మనిషినే కదా అనుకుంటూ ,
” రామ్ ! ట్రైన్ వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ ఇస్తున్నారు .. ఏ కోచో చెప్తే అక్కడికే వెళదాం ” అన్నా
” వద్దు .. మనం కలవాల్సిన మనిషి ఇక్కడికే వస్తాడు ” అని సైలెంటుగా కూర్చుండిపోయాడు
చూస్తుండగానే ట్రైన్ ప్లాట్ ఫార్మ్ మీదకు వచ్చింది
చూస్తే కొద్ది దూరంలో తెల్లటి లాల్చీ , పైజామా వేసుకున్న వ్యక్తి మావైపే వస్తున్నాడు
ఆయన రావడం రావడం” డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి చూసుకో ” అంటూ యేవో కొన్ని కాగితాలూ , ఫోటోలు దశరధ రామ్ చేతిలో పెట్టి వడివడిగా వెళ్ళిపోయాడు
అంతా క్షణాల్లో జరిగిపోయింది
అంతకన్నా పెద్దగా మాటల్లేవు
చీకట్లో లీలగా ఆయన ముఖం చూసి ఉలిక్కిపడ్డా
ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో పని చేసి ఆ మధ్యనే క్యాబినెట్ నుంచి తొలగించబడ్డ మాజీ మంత్రి
దశరధ రామ్ నిశ్శబ్దంగా ఆ కాగితాలు జేబులో పెట్టుకుని వెల్దామా ? అన్నాడు
అంతే , అంతకుమించి నాక్కూడా ఏమీ చెప్పలేదు
కానీ ఆ కాగితాలు రాష్ట్రంలోనే పెను సంచలనాలకు నాంది అవుతాయని అప్పటిదాకా నాక్కూడా తెలీదు
ఫలితం
గండికోట ఆశ్రమంలో ఎన్టీఆర్ శవ పూజలు అనే బై లైన్ తో ఎన్కౌంటర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఆర్టికల్ వచ్చింది
ఈ మ్యాగజైన్ మార్కెట్లోకి రాగానే టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి
అప్పటికే ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కవర్ పేజీ ఆర్టికల్ రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి
జరగబోయే పరిణామాలకు సిద్ధపడాలి
ఆ మ్యాగజైన్ సంచిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత నేను రామ్ తో చెప్పా
“పోనీ కొన్నాళ్ళు పోలీసుల ఎస్కార్ట్ అడుగుదామా ? ” అని
“ప్రభుత్వమే వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఈ పోలీసులు మాత్రం ఏం చేస్తారు .. వదిలేయన్నా ? “
మళ్ళీ అతడే “నీకంతగా రిస్క్ అనుకుంటే హాయిగా మాములు న్యూస్ పేపర్లో చేరిపోయి హాయిహా టైం కు శాలరీ తీసుకో అన్నా ? ” అన్నాడు
దశరధ రామ్ లో నాకు నచ్చిన గుణం ఇదే
మంచో చెడో నమ్మిన దాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్కచేయకుండా ఆచరిస్తాడు
నిజానికి నాకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా దశరధ రామ్ కు లేదు
అయినా దశరధ రామ్ లోని కాంఫిడెన్స్ , భావజాలం నచ్చి అతడి ఆఫీసులో పనిచేసేవాడిని
ఎప్పుడైనా ఏజెంట్ల నుంచి కలెక్షన్స్ వస్తే “ఇదిగో ఈ డబ్బులు ఉంచు ” అని తనే నా చేతిలో ఎంతో కొంత పెట్టేవాడు
ఆ తర్వాత నేను వేరే పేపర్ కి మారాను
కానీ దశరధ రామ్ తో టచ్ లోనే ఉన్నాను
ఓ రోజు దశరధ రామ్ నన్ను పిలిపించి ” మహానాడు జరుగుతుంది కదా .. వస్తావా ? సీఎం ను కలిసి ఇంటర్వ్యూ అడుగుదాం ” అన్నాడు
నాకు మతిపోయింది
“రామ్ తెలిసే మాట్లాడుతున్నావా ? సీఎం ను కలవడం సంగతి అటుంచు ? నిన్నెవరన్నా గుర్తుపడితే దారిలోనే వేసేస్తారు .. వెళ్లొద్దు ” అని హెచ్చరికగా చెప్పాను
సర్లే అని నన్ను పంపించేశాడు
ఆ తర్వాత తెలిసింది
దశరధ రామ్ కెమెరా పట్టుకుని సీఎం ఎన్టీఆర్ బస చేసిన సిద్దార్థ కాలేజీ కుటీరానికి ఒక్కడే బయలుదేరి వెళ్లాడని
కుటీరం దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకుంటుండగా స్థానిక టిడిపి నాయకుడు దశరధ రామ్ ను గుర్తుపట్టి ” ఎన్కౌంటర్ దశరధ రామ్ వీడే .. వేసేయండ్రా ” అనడంతో కొంతమంది అనుచరులు పొలోమంటూ దశరధ రామ్ ను పట్టుకోవడానికి ముందుకురికారు
ఈ హడావుడి చూసి మిగిలిన జనం కూడా దశరధ రామ్ ను పట్టుకోవడానికి ముందుకురికారు
అప్పుడు ఎన్టీఆర్ మీటింగ్ ప్రెస్ కవరేజ్ కి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర రావు గారు తనదగ్గరున్న లైసెన్సుడు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరపడంతో జనాలు చెల్లా చెదురు అయ్యారు
ఈ గ్యాప్ లో కొంతమంది పాత్రికేయులు దశరధ రామ్ ను అక్కడ్నుంచి క్షేమంగా తప్పించారు
ఆలా దశరధ రామ్ కు రెండో ప్రాణ గండం కూడా తప్పింది అని చెప్పారు
ఇంకా ఉంది
అవన్నీ తరువాయి భాగంలో ,
నోట్ : ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ బుక్ , వాట్సాప్ ఐకాన్ ల ద్వారా షేర్ చేసుకోవచ్చు
