పింగళి దశరథ రామ్ తన మీద జరిగిన దాడుల నుంచి ఏ విధంగా తప్పించుకుని బయటపడ్డాడో మొదటి , రెండో భాగాల్లో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ ఇంకో ఉదంతం గురించి కూడా చెప్పారు ( ఆ భాగాలు చదవని వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తాయి)
అదేంటో ఆయన మాటల్లోనే ,
” ఓరోజు దశరథ రామ్ హైద్రాబాదులో పని ముగించుకుని విజయవాడ తిరిగి వస్తూ కోదాడలో మ్యాగజైన్ పని మీద ఆగారు
అక్కడ కూడా పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుదామని బస్ స్టాండ్ కు బయలుదేరారు . ఆయనను డ్రాప్ చేయడానికి స్థానిక ఏజెంట్ కూడా బస్ స్టాండ్ కు బయలుదేరాడు .
దారిలో మెయిన్ రోడ్ దగ్గర ఆగి ఇద్దరూ టీ తాగుతుండగా , విజయవాడ నుంచి హైద్రాబాదు వెళ్తున్న కారు వీళ్లకు కొద్ది ముందుగా వెళ్లి సడెన్గా ఆగింది.
అందులోనుంచి ఒకడు దశరథ రామ్ ను చూసి ‘ రేయ్ ! వీడు ఇక్కడున్నాడు పట్టుకోండ్రా ‘ అంటూ కారును రివర్స్ గేరులో వెనక్కి తీసుకు రావడం మొదలుపెట్టారు
అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు అవుతుందేమో
దశరథ రామ్ కు విషయం అర్థమైంది
ఆ కారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ బలమైన టిడిపి నాయకుడిది
అంతే , క్షణం ఆలస్యం చేయకుండా పరుగు లంఘించుకున్నాడు
వెనుక వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు
జనాలు చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కడూ ముందుకు రావడం లేదు
దశరథ రామ్ చీకట్లో ఓ మూల నక్కాడు
వాళ్ళు అటూఇటూ చూస్తుండగానే తలకు తుండు చుట్టుకుని పక్కనే ఉన్న ఓ రిక్షా ఎక్కి తొక్కడం మొదలుపెట్టాడు
వెనక్కి చూడకుండా వేగంగా రిక్షా తొక్కుకుంటూ జగ్గయ్య పేటలో ఉన్న ఓ జర్నలిస్ట్ ఇంటికి పోయాడు
ఈ దారిలో వాళ్ళు వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉండటం క్షేమం కాదని ఆ మిత్రుడు దశరథ రామ్ ను ఖమ్మం పంపించాడు
అలా ఖమ్మం చేరిన దశరథ రామ్ రెండ్రోజుల పాటు అక్కడే ఓ జర్నలిస్ట్ ఇంట్లో ఉండి తర్వాత మెల్లిగా విజయవాడ చేరుకున్నాడు
కోదాడలో కనుక దశరథ రామ్ దొరికుంటే అదే అతడి ఆఖరి రోజు అయ్యుండేది
అలాగే కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు మహామహులే కారంచేడు వెళ్ళడానికి భయపడ్డారు
కానీ దశరథ రామ్ కారంచేడు బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు
అప్పటి పరిస్థితులకు భయపడి ఎవరూ రాకపోవడంతో దశరథ రామ్ ఒక్కడే కారంచేడు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు
కానీ అక్కడి దృశ్యాలను కవర్ చేయాలంటే తనదగ్గర మాములు కెమెరా కూడా లేదు
అప్పుడు అప్పు చేసి వచ్చిన సొమ్ముతో వీడియో కెమెరా ఒకటి కొని ఒక్కడే కారంచేడు వెళ్ళాడు
కారంచేడులో జరిగిన దమనకాండను మొత్తం వీడియో తీసి తన కెమెరాలో పెట్టుకున్నాడు
మర్నాడు కారంచేడు మారణహోమం పేరిట ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో ఓ ఆర్టికల్ రాసాడు
అంతేకాదు చీరాలలో బహిరంగ సభ లో కారంచేడులో ఏం జరిగిందో వీడియోలతో సహా బయటపెడతాను అనడంతో కలకలం చెలరేగింది
దానితో అటు కారంచేడు వాసులు , ఇటు పోలీసులు దశరథ రామ్ కోసం గాలించడం మొదలుపెట్టారు
అయినా దశరథ రామ్ మొండిగా కెమెరా తీసుకుని చీరాల వెళ్ళాడు
అక్కడ మఫ్టీ పోలీసులు దశరథ రామ్ దగ్గర్నుంచి కెమెరా లాక్కుని , అతడు అక్కడుండటం ప్రాణాలకు ప్రమాదం అని నచ్చచెప్పి వెనక్కి పంపేశారు
అలా కారంచేడు కధనాలు రాసినప్పుడు కూడా దశరథ రామ్ ప్రాణాలకు గండం ఏర్పడింది
అందులో కూడా తప్పించుకుని బయటపడ్డాడు
దీనితో రోజు రోజుకీ దశరథ రామ్ కు శత్రువులు పెరిగిపోవడం మొదలైంది
అతడు ఎన్కౌంటర్ మ్యాగజైన్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకుల చీకటి బాగోతాలు గురించి వరుస కధనాలు రాసాడు
తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి టిడిపి అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే వరస
అన్నిటికన్నా ఏకంగా ఎన్టీఆర్ నే ఉద్దేశిస్తూ గండిపేట ఆశ్రమంలో శవపూజలు పేరిట కధనాలు ప్రచురించడంతో పింగళి దశరథ రామ్ ఎందరికో హిట్ లిస్ట్ అయ్యాడు
పోనీ అలా అని దశరథ రామ్ బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం చేసి ఏమన్నా సంపాదించుకున్నాడా ? అంటే అదీ లేదు
ఓసారి ఓ రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది మనుషులు దశరథ రామ్ ఇంటికొచ్చి 6 లక్షలు బల్ల మీద పెట్టి ‘ ఈ డబ్బులు తీసుకుని రాయడం ఆపు ‘ అంటే ఈయన ఆ డబ్బులను వాళ్ళ ముఖాన విసిరికొట్టి బయటికి పొమ్మన్నాడు
ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు అంటే మాటలు కాదు
అత్తింటి ఆరళ్లకు కోడలి బలి అనో , ప్రియుడితో లేచిపోయిన భార్య అనో , మూడు పెళ్లిళ్లు చేసుకున్న ముసలాడు అనో మాములు వార్తలు రాసుకుంటూ జీవితాన్ని లాగించేయొచ్చు
కానీ చేతిలోకి వచ్చిన 6 లక్షల రూపాయల సొమ్మును కూడా కాదనుకుని నా పధం ఎన్కౌంటరే అని ధృఢ నిశ్చయం తీసుకున్నాడు
జేబులో డబ్బులు లేవు కానీ చేతిలో బలమైన కలం ఉంది
ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ కలాన్నే నమ్ముకుని ముందుకెళదాం అనుకున్నాడు
ఈ పరిస్థితుల్లో దశరథ రామ్ గురించి తెలుసుకున్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు అతడ్ని పిలిపించారు
నాదెండ్ల భాస్కర రావు దశరథ రామ్ ను పిలిపించి ఏం మాట్లాడారు ?
దానికి దశరథ రామ్ ఇచ్చిన సమాధానం ఏంటి ?
అవన్నీ తరువాయి భాగంలో
(రిక్షా పిక్ కర్టెసీ: ఇంటర్నెట్)
చూస్తూనే ఉండండి రచ్చబండ కబుర్లు . (గూగుల్ సెర్చ్ లో రచ్చబండ కబుర్లు టైపు చేస్తే సైట్ కనిపిస్తుంది)
ఈ ఆర్టికల్ షేర్ చేద్దామనుకునేవారు ఇక్కడ కనిపించే వాట్సాప్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు
