ఎన్కౌంటర్ మ్యాగజైన్ ఎడిటర్ పింగళి దశరథ రామ్ తన మీద జరిగిన దాడుల నుంచి ఏ విధంగా తప్పించుకుని బయటపడ్డాడో మొదటి , రెండో భాగాల్లో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ ( ఆయనతో కలిసి పనిచేసారు ) ఇంకో ఉదంతం గురించి కూడా చెప్పారు ( ముందు రాసిన భాగాలు చదవని వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తాయి) .
గండిపేట పూజల గురించి కధనాల గురించి ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన తర్వాత దశరథ రామ్ జీవితం పూర్తి రిస్క్ లో పడింది . ఎటువంటి డొంక తిరుగుళ్ళు లేకుండా నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూనే కధనాలు రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది . ఈ కధనాలు సృష్టించిన సంచలనం కేవలం విజయవాడ వరకే పరిమితం కాలేదు . రాష్ట్రం మొత్తాన్ని ఒక ఊపు ఊపింది . ఎక్కడ చూసినా ఆ కధనాల గురించే చర్చ . ఒక్కసారిగా ఎన్కౌంటర్ మ్యాగజైన్ సర్క్యులేషన్ అమాంతంగా పెరిగిపోయింది . కొన్ని ఊళ్లలో మ్యాగజైన్ కాపీలు దొరకని పరిస్థితి ఏర్పడింది .
ఇక ఆ పార్టీలో అయితే పెద్ద చర్చే నడిచింది . అసలు ఎవరీ దశరథ రామ్ ? ఇతడి ఆఫీస్ ఎక్కడ ? మ్యాగజైన్ ఎక్కడ ప్రింట్ అవుతుంది ? నిండా ఇరవై ఐదేళ్లు కూడా లేని కుర్రాడు ఏకంగా సీఎం మీదే కధనాలు రాస్తాడా ? అదీ ఫోటోలతో సహా వేస్తాడా ? అసలు మూడో కంటికి కూడా తెలియని రహస్యాలు ఇతడికి ఎలా చేరుతున్నాయి ?ఇతడి సోర్స్ ఏంటి ? ఇతడి వెనుక ఎవరున్నారు ? ఇతడి ఆర్థిక పరిస్థితి ఏంటి ? తదితర వివరాలన్నీ వాకబు చేసారు .
ఆఖరికి తేలింది ఏంటంటే , ఆ కుర్రాడి వెనుక గాడ్ ఫాదర్ ఎవరూ లేరు . జేబులో పైసలు కూడా లేవు . ఉన్నది ఒకటే చేతిలో పెన్ను . అయినా సీఎం మీద నెగిటివ్ స్టోరీ రాయాలంటే మహామహులైన పత్రికాధిపతులే భయపడే రోజులు అవి . అలాంటిది ఒక కుర్రాడు నేరుగా సీఎం నే ఉద్దేశిస్తూ కధనాలు రాసేసాడు . దీంతో ఆ పార్టీకి చెందిన నాయకులు పింగళి దశరథ రామ్ గురించి గాలించడం మొదలుపెట్టారు .
ఓరోజు దశరథ రామ్ హైద్రాబాదులో పని ముగించుకుని విజయవాడ తిరిగి వస్తూ కోదాడలో మ్యాగజైన్ పని మీద ఆగారు . అక్కడ కూడా పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుదామని బస్ స్టాండ్ కు బయలుదేరారు . ఆయనను డ్రాప్ చేయడానికి స్థానిక ఏజెంట్ కూడా బస్ స్టాండ్ కు బయలుదేరాడు .
దారిలో మెయిన్ రోడ్ దగ్గర ఆగి ఇద్దరూ టీ తాగుతుండగా , విజయవాడ నుంచి హైద్రాబాదు వెళ్తున్న కారు వీళ్లకు కొద్ది ముందుగా వెళ్లి సడెన్గా ఆగింది. అందులోనుంచి ఒకడు దశరథ రామ్ ను చూసి ‘ రేయ్ ! వీడు ఇక్కడున్నాడు పట్టుకోండ్రా ‘ అంటూ కారును రివర్స్ గేరులో వెనక్కి తీసుకు రావడం మొదలుపెట్టారు.
అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు అవుతుందేమో . దశరథ రామ్ కు విషయం అర్థమైంది . ఆ కారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ బలమైన టిడిపి నాయకుడిది . అంతే , క్షణం ఆలస్యం చేయకుండా పరుగు లంఘించుకున్నాడు . వెనుక వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు .ఇదంతా నడిరోడ్డు మీద సినిమాలను తలదన్నేలా జరుగుతున్న సన్నివేశమే . వెనుక గుండాలు తరుముకుంటూ వస్తున్నారు . ప్రాణాలు కాపాడుకోవడానికి దశరథ రామ్ ముందుకు పరిగెడుతున్నాడు .
జనాలు చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కడూ ముందుకు రావడం లేదు . పరిగెత్తి పరిగెత్తి ఆయాసంతో దశరథ రామ్ చీకట్లో ఓ మూల నక్కాడు . వాళ్ళు అటూఇటూ చూస్తుండగానే తలకు తుండు చుట్టుకుని పక్కనే ఉన్న ఓ రిక్షా ఎక్కి తొక్కడం మొదలుపెట్టాడు . వెనక్కి చూడకుండా వేగంగా రిక్షా తొక్కుకుంటూ జగ్గయ్య పేటలో ఉన్న ఓ జర్నలిస్ట్ ఇంటికి పోయాడు .
ఈ దారిలో వాళ్ళు వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉండటం క్షేమం కాదని ఆ మిత్రుడు దశరథ రామ్ ను ఖమ్మం పంపించాడు . అలా ఖమ్మం చేరిన దశరథ రామ్ రెండ్రోజుల పాటు అక్కడే ఓ జర్నలిస్ట్ ఇంట్లో ఉండి తర్వాత మెల్లిగా విజయవాడ చేరుకున్నాడు . కోదాడలో కనుక దశరథ రామ్ దొరికుంటే అదే అతడి జీవితంలో ఆఖరి రోజు అయ్యుండేది .
అలాగే కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు మహామహులే కారంచేడు వెళ్ళడానికి భయపడ్డారు . కానీ దశరథ రామ్ కారంచేడు బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు. అప్పటి పరిస్థితులకు భయపడి ఎవరూ రాకపోవడంతో దశరథ రామ్ ఒక్కడే కారంచేడు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు .
కానీ అక్కడి దృశ్యాలను కవర్ చేయాలంటే తనదగ్గర మాములు కెమెరా కూడా లేదు. అప్పుడు తెలిసిన మిత్రుడి దగ్గర అప్పు చేసి వచ్చిన సొమ్ముతో వీడియో కెమెరా ఒకటి కొనుక్కుని ఒక్కడే కారంచేడు వెళ్ళాడు .
కారంచేడులో జరిగిన దమనకాండను మొత్తం వీడియో తీసి తన కెమెరాలో పెట్టుకున్నాడు మర్నాడు కారంచేడు మారణహోమం పేరిట ఎన్కౌంటర్ మ్యాగజైన్ లో ఓ ఆర్టికల్ రాసాడు. అంతేకాదు చీరాలలో జరగబోయే బహిరంగ సభ లో కారంచేడులో ఏం జరిగిందో వీడియోలతో సహా బయటపెడతాను అనడంతో కలకలం చెలరేగింది .
దానితో అటు కారంచేడు వాసులు , ఇటు పోలీసులు దశరథ రామ్ కోసం గాలించడం మొదలుపెట్టారు .అసలే సెన్సిటివ్ విషయం .. దానికితోడు దశరథ రామ్ తనదగ్గరున్న వీడియోలతో సహా ఆ దుర్ఘటనల వెనుక ఉన్నవారి బండారం బయటపెడతానని చెప్పడంతో చాలామంది ఉలిక్కిపడ్డారు . ఎలాగైనా దశరథ రామ్ చీరాల చేరకుండా ఆపాలని బయలుదేరారు . వీలయితే ఈలోపలే అతడ్ని తుదముట్టించాలని కిరాయి గుండాలు కాచుకుని కూర్చున్నారు .
అయినా దశరథ రామ్ తగ్గలేదు .. భయపడలేదు . మొండిగా కెమెరా తీసుకుని చీరాల వెళ్ళాడు . అక్కడ మఫ్టీ పోలీసులు దశరథ రామ్ దగ్గర్నుంచి కెమెరా లాక్కుని , అతడు అక్కడుండటం ప్రాణాలకు ప్రమాదం అని నచ్చచెప్పి వెనక్కి పంపేశారు . అలా కారంచేడు కధనాలు రాసినప్పుడు కూడా దశరథ రామ్ ప్రాణాలకు గండం ఏర్పడింది . అందులో కూడా ఆయన ప్రాణాలతో తప్పించుకుని బయటపడ్డాడు .
అప్పటినుంచి రోజు రోజుకీ దశరథ రామ్ కు శత్రువులు పెరిగిపోవడం మొదలైంది . అతడు ఎన్కౌంటర్ మ్యాగజైన్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకుల చీకటి బాగోతాలు గురించి వరుస కధనాలు రాసాడు . తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి టిడిపి అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే వరస . అన్నిటికన్నా ఏకంగా ఎన్టీఆర్ నే ఉద్దేశిస్తూ గండిపేట ఆశ్రమంలో శవపూజలు పేరిట కధనాలు ప్రచురించడంతో పింగళి దశరథ రామ్ ఎందరికో హిట్ లిస్ట్ అయ్యాడు .
పోనీ అలా అని దశరథ రామ్ బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం చేసి ఏమన్నా సంపాదించుకున్నాడా ? అంటే అదీ లేదు . ఓసారి ఓ రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది మనుషులు దశరథ రామ్ ఇంటికొచ్చి 6 లక్షలు బల్ల మీద పెట్టి ‘ ఈ డబ్బులు తీసుకుని రాయడం ఆపు ‘ అంటే ఈయన ఆ డబ్బులను వాళ్ళ ముఖాన విసిరికొట్టి బయటికి పొమ్మన్నాడు . ఆ రోజుల్లో 6 లక్షల రూపాయలు అంటే మాటలు కాదు .
అత్తింటి ఆరళ్లకు కోడలి బలి అనో , ప్రియుడితో లేచిపోయిన భార్య అనో , మూడు పెళ్లిళ్లు చేసుకున్న ముసలాడు అనో మాములు వార్తలు రాసుకుంటూ ఆ డబ్బులతో హాయిగా జీవితాన్ని లాగించేయొచ్చు . కానీ చేతిలోకి వచ్చిన 6 లక్షల రూపాయల సొమ్మును కూడా కాదనుకుని నా పధం ఎన్కౌంటరే అని ధృఢ నిశ్చయం తీసుకున్నాడు .
దశరథ రామ్ జేబులో డబ్బులు లేవు కానీ చేతిలో బలమైన కలం ఉంది . వెనుక ఎటువంటి అండ లేదు కానీ గుండె ధైర్యం ఉంది . ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ కలాన్నే నమ్ముకుని ముందుకెళదాం అనుకున్నాడు .
అవతలి వ్యక్తి ఎంతటి గొప్పవాడైనా తనకు వాళ్ళ అవినీతి గురించి సమాచారం వస్తే మాత్రం ఏ మాత్రం భయపడకుండా , వెనుకాముందు ఆలోచించకుండా కధనాలు రాసేవాడు . ఇటువంటి సంచలన కధనాలు రాయడం వల్ల పెరిగే మ్యాగజైన్ సర్క్యులేషన్ సంగతి ఏమో కానీ నూరు శాతం తన ప్రాణాలు రిస్కులో పడతాయని దశరథ రామ్ కు తెలుసు . అయినా అడుగు వెనక్కి వేయలేదు .
ఈ పరిస్థితుల్లో దశరథ రామ్ గురించి తెలుసుకున్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు అతడ్ని పిలిపించారు . నాదెండ్ల భాస్కర రావు దశరథ రామ్ ను పిలిపించి ఏం మాట్లాడారు ? దానికి దశరథ రామ్ ఇచ్చిన సమాధానం ఏంటి ?
అవన్నీ తరువాయి భాగంలో ,
(రిక్షా పిక్ కర్టెసీ: ఇంటర్నెట్)
చూస్తూనే ఉండండి రచ్చబండ కబుర్లు . (గూగుల్ సెర్చ్ లో రచ్చబండ కబుర్లు అని టైప్ చేస్తే సైట్ కనిపిస్తుంది) .
ఈ ఆర్టికల్ షేర్ చేద్దామనుకునేవారు ఇక్కడ కనిపించే వాట్సాప్ , ఫేస్ బుక్ ఐకాన్ల ద్వారా షేర్ చేయొచ్చు .
